రైల్వే ఛార్జీలు: మంచి రోజులా, ముంచే రోజులా?


Railway fare hike

‘మంచి రోజులు ముందున్నాయి’ అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ప్రధాని మోడి, అధికారంలోకి వచ్చాక, ‘ముందుంది ముసళ్ళ పండగ’ అని చాటుతున్నారు. సరుకు రవాణా ఛార్జీలతో పాటు ప్రయాణీకుల ఛార్జీలు కూడా వడ్డించిన మోడి ప్రభుత్వం ‘కఠిన నిర్ణయాలకు’ అర్ధం ఏమిటో చెప్పేశారు. రెండేళ్ల క్రితం రైలు సరుకు రవాణా ఛార్జీలు పెంచినపుడు అప్పటి ప్రధానికి లేఖ రాసి నిరసించిన మోడి ఇప్పుడు ఎవరి లేఖకు లొంగుతారు?

ప్రయాణీకులపై 14.2 శాతం ఛార్జీల మోత మోగించిన మోడి ప్రభుత్వం సరుకు రవాణా ఛార్జీలను 6.5 శాతం పెంచేసింది. మరి కొద్ది రోజుల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా, పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండానే రైల్వే ఛార్జీలు పెంచడాన్ని మోడి ఎలా సమర్ధించుకుంటారు?

2012లో మన్మోహన్/కాంగ్రెస్/యు.పి.ఏ-II ప్రభుత్వం కూడా ఇదే తరహాలో బడ్జెట్ లో కాకుండా, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారం ముందు రవాణా రైల్వే ఛార్జీలు పెంచినప్పుడు మోడి కేంద్రంపై విరుచుకుపడ్డారు. పార్లమెంటు ప్రాముఖ్యాన్ని దిగజార్చారని మండి పడ్డారు. అదే మోడి ప్రధాని అయ్యాక అదే తరహాలో పార్లమెంటు ప్రాముఖ్యాన్ని, అధికారాలను దిగజార్చుతూ బడ్జెట్ కు ముందు ఛార్జీలు పెంచడం బట్టి ఆయన చెప్పిన ‘మంచి రోజులు’ కాంగ్రెస్ పాలనలో కంటే భిన్నంగా ఉండవని స్పష్టం అవుతోంది.

ది హిందు కధనం బట్టి యు.పి.ఏ ప్రభుత్వం హయాంలోనే, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కూడా, రైల్వే ఛార్జీలు పెంచే ప్రయత్నం జరిగింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే (మే 20) ఛార్జీలు పెంచే నిర్ణయం జరగడంతో అమలును నిలిపివేశారని తెలుస్తోంది. సదరు నిర్ణయాన్ని మోడి ప్రభుత్వం కాస్త సమయం తీసుకుని అమలు చేస్తారని రైల్వే అధికారులు భావించగా అసలు బడ్జెట్ కంటే ముందే పెంచడంతో ఆ అధికారులు అవాక్కు అయ్యారుట.

రైల్వే మంత్రి సదానంద గౌడ నిన్ననే ఛార్జీల పెంపు విషయంపై మాట్లాడుతూ ఇంకా కొన్ని చర్చలు జరగాల్సి ఉందని అధికారులకు చెప్పారుట. ఇంతలోనే ఛార్జీల పెంపు అమలులోకి రావడంతో మోడి ప్రభుత్వ ఉద్దేశ్యాలు వారికి బాగా అర్ధం అయ్యాయి. బహుశా ఇక జనానికే అర్ధం కావలసి ఉంది.

నిన్నటి వరకూ ప్రయాణ ఛార్జీల కంటే సరుకు రవాణా ఛార్జీల పైనే రైల్వేలకు ఎక్కువ లాభాలు వస్తుండేవిట. తాజా పెంపుతో ఇక నుండి ప్రజా రవాణా నుండి ఎక్కువ లాభాలు వస్తాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న భయంతో యు.పి.ఏ ప్రభుత్వం ప్రయాణ రైల్వే ఛార్జీల పెంపుదల నుండి దూరంగా ఉంటూ వచ్చింది. మోడి ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టిన మెజారిటీ వల్ల కొత్త ప్రభుత్వానికి అలాంటి భయం లేకుండా పోయిందని భావించాలా? ప్రజలు అత్యధిక మెజారిటీ అందిస్తే అది కాస్తా ప్రజలను ఇంకాస్త గట్టిగా మోదడానికి అనుమతిగా పాలకులు భావిస్తారని ప్రజలు నేర్వవలసిన గుణపాఠం కాబోలు!

2012లో మన్మోహన్ ప్రభుత్వం హయాంలో ఇదే తరహాలో దొంగ చాటుగా రైల్వే సరుకు రవాణా ఛార్జీలు పెంచారు. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. వారం రోజుల్లో రైల్వే బడ్జెట్ పెట్టుకుని అకస్మాత్తుగా ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎమొచ్చిందని ఆయన లేఖలో ప్రశ్నించారు. బడ్జెట్ కు ముందే పెంచడం ద్వారా పార్లమెంటు అధికారాలను యు.పి.ఏ ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. గుజరాత్ కు బొగ్గు గనులు దగ్గరలో లేవనీ చాలా దూరం నుండి తెచ్చుకోవాలనీ, రవాణా ఛార్జీల పెంపుదల వలన వేల కోట్ల భారం తమ రాష్ట్రంపై పడుతుందనీ ఆయన లేఖలో వివరించారు.

ఆనాడు మోడి ఏవైతే విమర్శలు చేశారో సరిగ్గా అవే విమర్శలకు అవకాశం ఇస్తూ మోడి ప్రభుత్వం రైలు ఛార్జీలు పెంచింది. మరో కొద్ది రోజుల్లో రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంది. బడ్జెట్ లో ఛార్జీల పెంపు ప్రతిపాదించడానికి బదులు ముందే పెంచారు. రవాణా చార్జీలతో పాటు, యు.పి.ఏ ప్రభుత్వం వెనుకాడిన ప్రయాణ ఛార్జీలు కూడా పెంచారు. యు.పి.ఏ ప్రభుత్వంతో పాటు పోయిన చెడ్డ రోజులు, మోడి ప్రభుత్వంతో పాటు వచ్చిన మంచి రోజులు… ఇవేనా? గతంలో తానే కేంద్రాన్ని విమర్శించినట్లుగా మోడి కూడా పార్లమెంటును విశ్వాశంలోకి తీసుకోకుండా, దాని అధికారాన్ని దిగజార్చడానికి ఎందుకు పూనుకున్నట్లు?

నరేంద్ర మోడి గారి పేరుతో ఉన్న వెబ్ సైట్ ఆనాటి ఛార్జీల పెంపుదల గురించి ప్రచురించిన మోడి డిమాండ్లను ఈ కింది లింక్ లో చూడవచ్చు.

Immediately withdraw 20% railway freight hike imposed before rail budget: CM to PM

మోడి లేఖ ప్రకారం 20 శాతం రవాణా చార్జీల పెంపుదల వల్ల బొగ్గు, ధాన్యాలు, ఎరువులు తదితర సరుకుల రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. 2006 లో ఒకసారి రవాణా ఛార్జీలు పెంచినందుకే గుజరాత్ పైన మార్చి 2012 వరకూ 19,000 కోట్ల రూపాయల భారం పడింది. తాజా పెంపకం సరుకు రవాణాను 6.5 శాతం ప్రియం చేస్తే, ప్రజా రవాణాను 14.2 శాతం ప్రియం చేస్తుంది. ఆ లెక్కన గుజరాత్ వెళ్ళే సరుకులపైనే కాకుండా గుజరాత్ ప్రజలపైన కూడా భారం పడుతుంది. ఇప్పుడు మోడి దేశానికి ప్రధాని కాబట్టి ఈ లెక్కలను అన్నీ రాష్ట్రాలకూ వేయాలి. అంత భారీ పెరుగుదలను మోడి ఎలా సమర్ధించుకుంటారు?

“ఆర్ధిక వ్యవస్ధ బాగుపడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు” అని చెప్పడం ద్వారా మోడి నిజానికి చార్జీల పెంపకానికి ముందే తగిన సమర్ధనను జారీ చేశారు. అలాగయితే యు.పి.ఏ ప్రభుత్వాన్ని మాత్రం ఎందుకు విమర్శించాలి? కఠిన నిర్ణయాలు కేవలం ఎన్.డి.ఏ కి మాత్రమే న్యాయమైనవా? యు.పి.ఏ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే అవి న్యాయబద్ధం కావా?

వాస్తవం ఏమిటంటే యు.పి.ఏ, ఎన్.డి.ఏ లు ఒకే తానులో ముక్కలు. వారి తగాదా అంతా అధికారం కోసమే తప్ప ఆర్ధిక విధానాలపై కాదు. ప్రజలపై మోడడానికి ఇరు పక్షాల్లో ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే ఆయా సందర్భాలను బట్టి ఒక్కో పక్షం ఒక్కో కారణం చెప్పి సమర్ధించుకుంటుంది. ప్రజల తరపున నిర్ణయాలను తీసుకుని, ఆ నిర్ణయాలను సమర్ధించుకునే పక్షాలను ఎంచుకోవడమే ప్రజలు చేయవలసిన పని. ఆ పక్షం ఎన్.డి.ఏ కాదు అని చెప్పడానికి తాజా నిర్ణయం ఒక ఉదాహరణ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ!

 

2 thoughts on “రైల్వే ఛార్జీలు: మంచి రోజులా, ముంచే రోజులా?

  1. అవును విశేఖర్ గారు . రైలు ఛార్జీలు పెరిగితే కేవలం అంతటితోనే ఆగదు. సరకురవాణా ఛార్జీలు పెరిగాయని సరకుల ధరలు కూడా పెరుగుతాయి.
    త్వరలోనే గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయట. అది కూడా ప్రతినెలా కొంచెం కొంచెం పెంచుతూనే ఉంటారట.
    అలాగే యూరియా ధరలు కూడా పెరగనున్నాయి. సిమెంట్ ధరలు కూడా పెరిగాయి. ఇంకా పెరుగుతాయట.
    ఇలా సరకుల ధరల పెరిగితే మళ్లీ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఆర్.బీ.ఐ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ కఠిన పరిస్థితులు ఎదుర్కోవడానికి మోడీ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.

    ఈ రకంగా ఇదో విషవలయం లాగా కనిపిస్తోంది. అంతిమంగా కంపెనీలకు లాభాల పంట పండడం మాత్రం ఖాయం. మోడీ ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తాయంటే ఏమిటో అనుకున్నాం. ఆ మంచి రోజులు కంపెనీలకు. వ్యాపార వర్గాలకన్నమాట.

  2. వంతెనలూ, సొరంగాలూ లేకుండా ఒక కిలో మీతర్ రైల్వే వెయ్యడానికి కోటి రూపాయలు ఖర్చవుతుంది. 5 రూ, 10 రూ ధర చేసే తికెత్‌లు అమ్మితే రైల్వేలకి ఏదీ రాదు. గతంలో UPA రైలు చార్జిలు పెంచినప్పుడు విమర్శించిన మోదీకి ప్రధాన మంత్రైన తరువాత తెలిసింది “అమెరికా తుమ్మితే జలుబు చేసే భారత ఆర్థిక వ్యవస్థకి 5 రూ, 10 రూ తికెత్‌ల వ్యాపారం గిట్టుబాటు కాదని”. ఒక సాధారణ రాష్ట్రమైన గుజరాత్‌లో లేని అభివృద్ధిని ఉన్నట్టు చూపించి మోదీ అనే …..ని (edit) ఇంద్రప్రస్థ సింహాసనం ఎక్కించిన మన TV చానెల్‌ల నిర్వాహకుల్ని పట్టుకుని తన్నాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s