“యెస్, సర్…”
“గవర్నర్లు…”
“ఎన్.జి.ఓ లు…”
“… ఇంకా, హిందీలో రాయాలి!”
“మరిన్ని స్టిక్-ఆన్ నోట్ లా, సర్?”
“గరిష్ట (సు)పరిపాలన కోసం కాసిన్ని చిన్న చిన్న సవరణలు… అంతే…”
***
ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికల నినాదాల్లో ‘సుపరిపాలన’ (Good Governance) ఒకటి. యు.పి.ఏ ప్రభుత్వం మా చెడ్డదనీ తాను ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆయన ప్రచారం చేశారు. గుజరాత్ ప్రజలకు రుచి చూపించిన సుపరిపాలన దేశానికంతటికి పరిచయం చేసేందుకు తాను ఆత్రంగా ఉన్నానని ఆయన వివిధ వేదికలపై చెప్పారు.
సుపరిపాలన ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో భారత దేశ ప్రజలకు ఇంకా తెలియదు. స్వతంత్రం వచ్చిందని చెప్పినప్పటి నుండి పాలకులు చెప్పిందే ప్రజాస్వామ్యం. మంచి పాలన అయినా, చెడ్డ పాలన అయినా వారు చెప్పిందే. చైనా, రష్యాలను దుష్ట రాజ్యాలుగా ముద్రవేసి రాక్షసీకరించిన నేపధ్యంలో సోషలిస్టు పాలన ఎలా ఉంటుందో తెలుసుకునే భాగ్యం కూడా భారత ప్రజలకు దక్కలేదు. ఆ మాటకొస్తే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ఏ దేశంలోనూ అలాంటి ప్రజాస్వామిక పాలన ఎలా ఉంటుందో అక్కడికి జనానికి తెలిసే అవకాశం రాలేదు.
ఈ నేపధ్యంలో ‘సుపరిపాలన’ను హామీ ఇచ్చి అధికారం చేపట్టిన నరేంద్ర మోడి వచ్చీ రావడంతోనే విదేశాలకు తరలించిన నల్లడబ్బును వెనక్కి తేవడం కోసం అంటూ అట్టహాసంగా ఒక కమిటీ ప్రకటించేసి ‘చూసారా, సుపరిపాలన అంటే, ఇదే’ అన్నట్లుగా ఫోజు పెట్టారు. కమిటీ అయితే వేశారు గానీ అది ఎలా పని చేస్తుందో, ఏ పని చేస్తుందో వివరాలు ఇంతవరకు లేవు.
అసలు కమిటీ అవసరం ఏమిటన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. స్విట్జర్లాండ్ లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే కొన్ని ఖాతాల వివరాలు యు.పి.ఏ ప్రభుత్వానికి పంపాయి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా వరుసగా జరిగిన జి20 కూటమి సమావేశాలు అంగీకరించిన అంశాల్లో పన్నుల ఎగవేతకు సహకరించే రహస్య బ్యాంకింగ్ వ్యవస్ధలను నిర్మూలించడం కూడా ఒకటి. ఈ ఒప్పందం మేరకు స్విట్జర్లాండ్ ఒక జాబితాను పంపితే దాన్ని ఇంతవరకు వెల్లడి చేసింది లేదు. యు.పి.ఏ తీరుపై విమర్శలు గుప్పించిన బి.జె.పి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కాబట్టి సదరు జాబితాను ప్రజల ముందు ఉంచడానికి మోడి ప్రభుత్వానికి ఇపుడున్న అడ్డంకి ఏమిటి?
మనీ లాండరింగ్ వ్యతిరేక చట్టాల పేరుతోనూ, విదేశీ మారక ద్రవ్య చట్టం పేరుతోనూ అనేక చట్టాలు భారత ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి. ఈ చట్టాల ద్వారా విదేశాలకు అక్రమ డబ్బు తరలి వెళ్లకుండా అడ్డుకోవడం కష్టం ఏమీ కాదు. కావలసిందల్లా ఈ చట్టాలను అమలు చేసే చిత్తశుద్ధి మాత్రమే. ఆ చిత్త శుద్ధి తమకు లేదని మోడి ప్రభుత్వం కమిటీ నియామకం ద్వారా స్పష్టం చేయలేదా? ఉన్న చట్టాలను వినియోగించి చర్యలు తీసుకోవడం మానేసి కొత్త కమిటీలు నియమించి ‘మమ’ అనిపించుకుంటే అది సుపరిపాలన అవుతుందా?
‘సుపరిపాలన’ పేరుతో మోడి పైపై చర్యలకు పాల్పడుతోందని ఈ కార్టూన్ సూచిస్తోంది. సుపరిపాలన అంటే పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య సంబంధాలకు సంబంధించినది కాదు. అది ప్రజలకు సంబంధించినది. (ఒక విధంగా ప్రతిపక్షం కూడా పాలనా చర్యల్లో నిమగ్నమై ఉంటుంది.) ప్రజలకు సుఖ శాంతులు అందించే విధంగా సాగే పాలనే సుపరిపాలన. కానీ మోడి ప్రభుత్వంలోని వివిధ మంత్రులు సాగిస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న చర్యలు సుపరిపాలన అంటే పాలక పక్షానికి సుఖమైన పాలన అన్నట్లుగా ఉంటోంది.
గత ప్రభుత్వం నియమించిన గవర్నర్ లు కొనసాగితే నేటి ప్రభుత్వానికి వచ్చే సమస్య ఏమిటిట, తాను కూడా రాజకీయ నియామకాలకు పూనుకోవాలని భావిస్తే తప్ప? ప్రభుత్వేతర సంస్ధలు ప్రభుత్వ చర్యలను విమర్శించడానికి తద్వారా పాలనను గాడిలో పెట్టడానికీ, ప్రజల తరపున మాట్లాడడానికీ ఉద్దేశించినవని కొందరు నిపుణులు చెప్పబోతారు. అనగా ప్రజల ప్రయోజనాలకు దూరంగా ప్రభుత్వాలు వెళ్ళినపుడు ఎన్.జి.ఓ లు పూనుకుని దానిని సవరిస్తాయని వారి అంతరార్ధం. అలాంటి ఎన్.జి.ఓ లలో కొన్నింటిని టార్గెట్ చెయ్యడం ద్వారా మోడి ప్రభుత్వం తన సుపరిపాలన వాగ్దానానికి మంగళం పాడుతోందని లేదా ‘ఎన్.జి.ఓ ల కట్టడి’ని వాస్తవ సుపరిపాలనలో భాగంగా చూపుతోందని కార్టూన్ సూచిస్తోంది.
సుపరిపాలన అంశాల్లో ఒకటిగా హిందీ వినియోగాన్ని కేంద్రం ముందుకు తెస్తోంది. అసలు విషయాలు వదిలేసి కొసరు విషయాలతో వార్తలను, వాతావరణాన్ని నింపేయడం ద్వారా అసలు సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలకు అర్ధం కాకుండా చేస్తే ఇక సుపరిపాలన అన్న సమస్యే పాలకులకు ఉండబోదు. కాసిన్ని చిన్న చిన్న పనుల స్ధాయికి సుపరిపాలనను కుదించి వేస్తే ఇక చేయదలుచుకున్నది దర్జాగా చేసుకుపోవచ్చు. ఈ కార్టూన్ అంతరార్ధం అదే. ఆ గోడకు అంటించిన రెండు పలకలు మోడి ‘మోజెస్’ అవతారంలో తెచ్చిన ‘టెన్ కమాండ్ మెంట్స్’ ఫలకాలు.
స్టిక్ ఒన్ నోట్ మీదే పాలనావిధానాల సమగ్ర స్వరూపం తేటతెల్లమవుతుంది.