ఎన్.జి.ఓలు vis-a-vis మోడి -కార్టూన్


NGOs

“… ఆ, అవే, మనకి అనుకూలంగా తిరగడం లేదు చూశావా, అక్కడికి పద…”

***

ఎన్.జి.ఓ లు మరొకసారి చర్చనీయాంశం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గూఢచార సంస్ధ ‘ఇంటలిజెన్స్ బ్యూరో’ (ఐ.బి), అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ సంస్ధగా చెప్పుకునే గ్రీన్ పీస్ కీ, ఇంకా ఇతర సంస్ధలకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రికి నివేదిక ఇవ్వడంతో తాజాగా ఎన్.జి.ఓలపై చర్చ నడుస్తోంది. గ్రీన్ పీస్ తదితర ఎన్.జి.ఓల కార్యకలాపాలు భారత దేశ అభివృద్ధికి ఆటంకంగా మారాయన్నది సదరు నివేదిక సారాంశం.

ఈ విషయాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వెలుగులోకి తేవడంతో కలకలం మొదలయింది. మోడి అభిమానులు, వ్యతిరేకులు, వివిధ ఎన్.జి.ఓ సంస్ధలు ఈ వార్తపై స్పందించడం ప్రారంభించారు. వామపక్ష ఉదారవాద భావాలు వ్యక్తం చేస్తూనే మోడికి అనుకూలంగా ప్రచారం చేసి పెట్టడంలో పేరు గాంచిన మధు కీష్వర్ కూడా జొరబడడంతో చర్చ రసకందాయంలో పడినట్లయింది.

ఫోర్బ్స్ పత్రిక ప్రకారం విదేశీ నిధులతో నడిచే ఎన్.జి.ఓ లు (ప్రభుత్వేతర సంస్ధలు) భారత దేశ ఆర్ధికాభివృద్ధికి ఆటంకంగా మారాయని ఐ.బి. నివేదిక సమర్పించింది. ఈ నివేదిక పాత ప్రభుత్వం కోసం తయారు చేశారా లేక కొత్త ప్రభుత్వం కోసమా అన్నది తెలియలేదు. కానీ ఆ పేరుతో నయా ఉదారవాద నూతన ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలను సైతం విదేశీ ఎన్.జి.ఓ లు రేపిన ఉద్యమాలుగా చెప్పి అణచివేసేందుకు తగిన ప్రాతిపదికను ఐ.బి. నివేదిక ఏర్పాటు చేసింది. 

గత నాలుగయిదు దశాబ్దాలుగా పశ్చిమ దేశాల నిధులతో నడిచే ఎన్.జి.ఓ లు మూడో ప్రపంచ దేశాల్లో పుట్ట గొడుగుల్లా వెలిశాయి. సామ్రాజ్యవాద అమెరికా, యూరోపియన్ దేశాలు ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ తదితర అంతర్జాతీయ కాబూలీవాలాల ద్వారా పేద, వర్ధమాన దేశాలపై రుద్దుతున్న ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల్లో పెల్లుబుకే నిరసనలను జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసి ఎటువంటి ఫలితమూ రాకుండా ముగించడం ఈ ఎన్.జి.ఓ లకు అప్పగించబడిన పని. 1990ల్లో గోదావరి, తెలంగాణ జిల్లాల్లో ఏజన్సీ ప్రాంతాల్లో పని చేసిన శక్తి, దక్షిణ కోస్తా జిల్లాల్లో పని చేసిన ఆసిస్ట్ తదితర సంస్ధల నుండి అంతర్జాతీయ స్ధాయిలో పని చేసే గ్రీన్ పీస్ వరకూ ఈ కోవలోని సంస్ధలే.

తమిళనాడులో కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు ఉద్యమించినపుడు వారి ఉద్యమానికి స్కాండినేవియన్ దేశాల నిధులు అందుతున్నాయని అప్పటి ప్రధాని మన్మోహన్ ఆరోపించారు. ఆరోపణలు రుజువు చేయాలని ఉద్యమ నేత ఉదయ కుమార్ సవాలు చేసినప్పటికీ ప్రధాని స్పందించలేదు. కానీ ఉద్యమానికి వచ్చిన అంతర్జాతీయ మద్దతును అందకుండా జేయడంలో యు.పి.ఏ ప్రభుత్వం సఫలం అయింది.

రష్యా సహాయంతో నిర్మించిన కూడంకుళం కర్మాగారాన్ని అడ్డుకోవడానికి పశ్చిమ దేశాలే ఈ ఆందోళనలకు ప్రోత్సహించాయని ఆరోపణలు వచ్చినా, వాటిని రుజువు చేసినవారు లేరు. కానీ ఆ పేరుతో అణు కర్మాగారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలపై మూకుమ్మడి నిర్బంధాన్ని ప్రయోగించి అణచివేయగలిగారు.

ఒరిస్సాలో దక్షిణ కొరియా ఉక్కు కంపెనీ పోస్కో తలపెట్టిన ఉక్కు కర్మాగానికి వ్యతిరేకంగా అక్కడి గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వారి తమలపాకు తోటలను లాక్కుని విదేశీ కంపెనీలకు అప్పగించడం వలన తమ ఉపాధి పోతుందని ఎంతగా మొరపెట్టుకున్నా ఆలకించినవారు లేరు. పోస్కో వ్యతిరేక ఉద్యమానికి ఎన్.జి.ఓ ల మద్దతు ఉన్నదన్న ఆరోపణలతో గిరిజనులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. గూండాల చేత దాడులు చేయించి ఉద్యమ నాయకుల్లో కొందరిని బలి తీసుకోవడానికి సైతం వెనుదీయలేదు. పోస్కో వ్యతిరేక ఉద్యమానికి ఏ ఎన్.జి.ఓ మద్దతు ఇచ్చిందో చెప్పలేదు గానీ ఆ పేరుతో ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణచివేయడంలో ఒరిస్సా ప్రభుత్వం సఫలం అయింది.

ప్రజలలోని అసంతృప్తి నిర్దిష్ట కార్యాచరణ రూపంలోకి రాకుండా అడ్డుకుని కంపెనీలకు, ప్రభుత్వాలకు సమస్యలు లేకుండా చేయడం ఎన్.జి.ఓ ల పని. కానీ పై ఉదాహరణలు చూసినట్లయితే న్యాయమైన ఉద్యమాలను అప్రతిష్ట పాలు చేయడానికి సైతం ఎన్.జి.ఓ లు ప్రభుత్వాలు అక్కరకు వస్తున్నాయని అర్ధం అవుతోంది. తాజాగా ఐ.బి తయారు చేసిన నివేదిక, మోడి ప్రభుత్వానికి కావలసిన మందుగుండు సామాగ్రిని తయారు చేయడానికి ఉద్దేశించినదిగా కనిపిస్తోంది.

గ్రీన్ పీస్ సంస్ధ అది చెప్పుకునేటంత ఉదాత్తమైన లక్ష్యాలు కలిగినది కాదనడంలో సందేహమూ లేదు. కానీ అలాంటి సంస్ధలను అడ్డు పెట్టుకుని న్యాయమైన ప్రజా ఉద్యమాలను అణచివేయడమే అభ్యంతరకరం. 

తమ అభివృద్ధి ప్రణాళికలకు పర్యావరణ కాలుష్యం అనే ఆటంకాన్ని పశ్చిమ దేశాలు కల్పిస్తున్నాయని ఈ వివక్షను సహించేది లేదని చైనా, ఇండియా, మలేషియా తదితర దేశాల నేతృత్వంలో WTO వేదికలపై మూడో ప్రపంచ దేశాలు గళం విప్పుతూ వచ్చాయి. కానీ పర్యావరణ చర్చలు, దోహా రౌండ్ (WTO) చర్చలు రెండూ మూలనపడడంతో ఆ గళం కాస్తా మూతబడిపోయింది.

గత రెండు మూడు శతాబ్దాలుగా కర్బన ఉద్గారాలను వెలువరించే శక్తి వనరులను విస్తృతంగా వినియోగించి పర్యావరణ కాలుష్యంలో అత్యధిక భాగానికి కారణంగా నిలిచినవి పశ్చిమ దేశాలే. తాము కాస్త ఎదిగివచ్చి వనరుల వినియోగంలోకి దిగేసరికి భూతాపం పేరుతో అడ్డుకుంటున్నారని చైనా, ఇండియా తదితర దేశాలు వాదిస్తున్నాయి. ఈ వాదనలో నిజం లేకపోలేదు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అరికట్టే పేరుతో పర్యావరణ పరిరక్షణ అనే లక్ష్యం మాటున వర్ధమాన దేశాల అభివృద్ధి కార్యకలాపాలను అడ్డుకోవడానికి గ్రీన్ పీస్ లాంటి సంస్ధలను పశ్చిమ దేశాలు నెలకొల్పాయన్నది బహిరంగ రహస్యం.

కానీ చైనా, ఇండియా లాంటి దేశాల పాలకులు చెప్పే అభివృద్ధి కూడా ఆ దేశాల ప్రజలకు అందుబాటులో లేకపోవడం అసలు విషయం. దానితో సామ్రాజ్యవాద దేశాల కుట్రలు, కుయుక్తులను ఎదుర్కొంటున్నట్లు కనిపించే పాలకులకు మద్దతు ఇవ్వాలా లేక ప్రజలకు అందుబాటులో లేని అభివృద్ధి లేకపోతే మాత్రం ఏమిటన్న ధర్మ సంకటం ప్రజలకు ఎదురవుతోంది. సమాజాలలోని విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ పురోగమనం సాధించకుండా స్తంభనకు గురయినప్పుడు ఇలాంటి సంకటం తప్పదు. ఆయా సందర్భాలను బట్టి స్పందింస్తూ ఉద్యమాల నిర్మాణానికి పూనుకోవడమే ప్రజలు చేయగలిగిన పని.

ఈ నేపధ్యంలో ఎన్.జి.ఓ లకు విదేశీ నిధులు అందడం గురించి ఐ.బి ద్వారా కేంద్ర ప్రారంభించిన చర్చలో ఒక పక్షం తీసుకోవలసిన అగత్యం ఏమీ లేదు. భూ సంస్కరణలు, నిరుద్యోగం, ఉపాధి, ఆహార భద్రత తదితర మౌలిక సమస్యలపైనా, వాటి పరిష్కారాలపైనా జరగవలసిన చర్చను ఇలాంటి అసందర్భ చర్చల మీదికి మళ్లించకుండా జనం జాగ్రత్త వహించాలి.

మొత్తం ఎన్.జి.ఓ ల పని తీరును సమీక్షించి ఒక విధానం చేపట్టడం కాకుండా, ప్రధాని నరేంద్ర మోడి తాము అమలు చేయదలుచుకున్న విధానాలకు ఆటంకం అనుకునే ఎన్.జి.ఓ లను లక్ష్యంగా పెట్టుకున్నారని ఈ కార్టూన్ సూచిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునే గ్రీన్ పీస్ ను ఐ.బి ఆక్షేపించిన నేపధ్యంలో అనుకూలంగా లేని ఎన్.జి.ఓ లకు గాలి మరలను ప్రతిబింబంగా కార్టూనిస్టు చూపారు. ప్రధాని ధరించిన కత్తి, డాలు, ఆయన దూకుడు స్వారీ అన్నీ ఒకటి, రెండు ఎన్.జి.ఓ లను లక్ష్యంగా పెట్టుకుంటే ఒరిగేది ఏమీ లేదని కార్టూన్ సూచిస్తోంది.

5 thoughts on “ఎన్.జి.ఓలు vis-a-vis మోడి -కార్టూన్

 1. భారత ప్రజల స్వతంత్ర ఆకాంక్ష, హింసారూపంలోకి మళ్లకుండా…, తమతో చర్చలకే పరిమితమయ్యేలా చేసేందుకోసం, బ్రిటీష్ వారు కాంగ్రెస్ ను స్థాపించినట్లు…..అభివృద్ధి పేరుతో జరిగే తమ వ్యాపారానికి ఎటువంటి ఆటంకం రాకుండా ఆడే నాటకంలో ఎన్.జి.వో లు ఒక భాగమన్న మాట.
  కానీ ఇటువంటి వాటి వల్ల జనానికి కాస్త మంచి చేసే ఉద్దేశం ఉన్న ఎన్జీవోల పైన కూడా అనుమానాలు కలుగుతాయి.
  ఐతే విశేఖర్ గారు ఇక్కడో చిన్న సందేహం.
  మోడి ప్రభుత్వం అభివృద్దికి ( అంటే వ్యాపార వర్గాలకి) అనుకూలమనే వాదన ఉంది కదా…?
  ఈ ఎన్జీవోలు పనిచేసేది కూడా కంపెనీల ప్రయోజనాల కోసం ఐతే …
  మరి వీళ్ల మధ్య వైరుధ్యం రాకూడదు కదా.

 2. వి శేఖర్ గారు. పాపం, జనాలు తమకేదో మేలు చేస్తాడనుకొని మోడీ గారిని పీఠం ఎక్కిస్తే
  ఆయన తొలి పవర్ పంచ్ రైల్వే ఛార్జీల రూపంలో చూపించారు. అదీ ఎకాఎకీ పధ్నాలుగు శాతం పెంచారు.

 3. //మరి వీళ్ల మధ్య వైరుధ్యం రాకూడదు కదా.//
  అలా రాక పోతే పలానా అని తెలిసి పోదు చందు తులసి గారు?

 4. పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల మధ్య మార్కెట్ల కోసం వైరుధ్యాలు ఉన్నట్లే అవి పోషించే ఎన్.జి.ఓ ల మధ్య కూడా వైరుధ్యాలు ఉంటాయి. భారతీయ మార్కెట్ రష్యా వశం కాకుండా ఉండడానికి అమెరికా ప్రయత్నించినట్లే అమెరికా పోషించే ఎన్.జి.ఓ లూ ప్రయత్నిస్తాయి. అలాగే ఐరోపా, అమెరికాల మధ్యా, జపాన్-ఐరోపా, అమెరికా-జపాన్… ఇలా వివిధ, ప్రత్యేక వైరుధ్యాలు ఉనికిలో ఉంటాయి. ఈ వైరుధ్యాలు ఎన్.జి.ఓ ల మధ్య వైరం గానూ, కొన్ని ఎన్.జి.ఓ లపై ప్రభుత్వాల మండిపాటు గానూ, కొన్నింటికి ప్రోత్సాహంగానూ వ్యక్తం అవుతుంటాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s