మొండి వినికిడి సమస్యా? ఐతే బసవనగుడికి రండి!


బసవన గుడి అంటే దేవుడి గుడి కాదు. బెంగుళూరులో అదొక ఏరియా. ఈ ఏరియాలో అద్భుతమైన చెవి (ENT) డాక్టర్ ఉన్నారు. ఈ టపాని ఇప్పుడు ఆయన ఆసుపత్రిలోని ఓ రూమ్ నుండే రాస్తున్నాను. పెద్దగా ప్రచార పటాటోపం జోలికి పోని డాక్టర్ మహదేవయ్య ఈ ఆసుపత్రిలో ప్రధాన డాక్టర్. చాలా పెద్దాయన.

నాకు చిన్నప్పటి నుండి చెవి సమస్య ఉంది. గత పాతికేళ్ళ నుండి వినికిడి సమస్య కూడా ఉంది. ఈ పాతికేళ్లలో ఒకే స్ధాయిలో వినికిడి సమస్య లేదు. దాదాపు 1990 నుండి వినికిడి శక్తి తగ్గుతూ వచ్చింది.

గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, హైదరబాద్ లలో పేరు పొందిన డాక్టర్లకి నా చెవుల్ని చూపాను. వారంతా రకరకాల పరీక్షలు చేసి మీకు వినికిడి సమస్య ఉంది అని నిర్ధారించేవాళ్లు. (అసలందుకేగా నేను వారిని కలిసింది)

రెండు ఉక్కు బద్దలు ఒకవైపు కలిసి ఉండే ప్రాంగ్ (ద్విశూలం?)  ని పక్కన ఉన్న బల్లకో, కుర్చీకో, గోడకో కొట్టి రెండు చెవుల వద్దా పెట్టి వినపడుతుందా అని అడిగేవాళ్లు. ద్విశూలం రెండో చివరని నుదుటికి ఆనించి ఏ చెవులో వినపడుతుంది అనడిగేవాళ్లు. విచిత్రం ఏమిటంటే ఇలా ద్విశూలాన్ని నుదుటిపై ఆనించినపుడు ఆ కంపనం వినపడేది గాని వారు అడిగిన ‘ఏ చెవులో వినపడుతోంది?’ అన్న ప్రశ్నకు నావద్ద సమాధానం ఉండేది కాదు. ఎందుకంటే ఏ చెవి ద్వారా వినపడుతోందో నేనే నిర్ధారించుకోలేకపోయేవాడిని.

ఆ సంగతే వారికి చెబితే ‘అలా కాదు. మీరు సరిగ్గా చెప్పాలి’ అని గద్దించేవాళ్లు. గతంలో అయితే చిన్నవాడ్ని కాబట్టి రెండు చెవుల్లో ఒకటి చూపి అక్కడ వినపడుతోంది అన్నట్లు చెప్పేవాడ్ని. ఆ పరీక్ష నుండి అలా బయటపడేవాడిని. ఆ తర్వాత ఆడియో గ్రామ్ లు తీసేవాళ్ళు. దాని ఆధారంగా మీకు ఇంత శాతం వినికిడి శక్తి తగ్గిపోయింది అని ఒక గ్రాఫ్ లాంటిది చేత్తోనే గీసి (పాయింట్లు గుర్తించి వాటిని కలిపే పని పెట్టుకోకుండా) ఇచ్చేవాళ్లు.

ఇలాంటి ఆడియో గ్రాం ద్వారా నా వినికిడి శక్తి 35 శాతం నశించిందని 1991లో చెప్పారు 45 శాతం వరకు నశించిందని 1999లో చెప్పారు. హైద్రాబాద్ లో ఒక నిపుణులయిన డాక్టర్ ఉన్నారు కలవండని 1999లో మిత్రులు చెప్పగా కలిశాను. అక్కడ ఉన్నవన్నీ ఆటోమేటిక్ యంత్రాలు. ఆ యంత్రాలేమో 45-50 శాతం వరకు వినికిడి శక్తి నశించిందని చెప్పగా డాక్టర్ గారేమో ఇక తగ్గడమే గానీ పెరగడం ఉండదని తేల్చేశారు. చెవుల నుండి మెదడుకు శబ్ద జ్ఞానాన్ని మోసుకుపోయే నరాలు బలహీనపడ్డాయని ఇలాంటి లోపానికి వైద్యం లేనందున ఇక మెరుగుపడే అవకాశం లేదనీ చెప్పేశారు డాక్టర్లు.

వినికిడి లేనప్పుడు సమాజం నుండి ఎదురయ్యే అవహేళనలను చాలా భరించాల్సి ఉంటుంది. మనకు ఎవరితోనన్నా తగాదా వస్తే, మన వాదనకు సరిజోడు కాలేకపోతే మన వినికిడి జ్ఞానాన్ని పరోక్షంగా ఎత్తి చూపిస్తూ అవహేళన చేస్తారు. ఇలాంటి వాటిని భరించొచ్చు. కానీ ఈ లోపం వలన సమాజంలో ఒంటరిగా మిగలాల్సిన పరిస్ధితి వస్తుంది. అది మాత్రం చాలా బాధ కలిగిస్తుంది.

ఉదాహరణకి నలుగురము కూర్చొని మాట్లాడుకుంటే కాస్త వినిపిస్తుంది, కాస్త వినిపించదు. మనం రెట్టించి అడుగుతామ్. లేదా రెండోసారి, మూడోసారి చెప్పమని అడుగుతాం. కొందరు అర్ధం చేసుకుని తిరిగి చెబుతారు. మరికొందరు విసుక్కుంటూ ఆ చెప్పేవాళ్లని కూడా చెప్పనివ్వరు. ఆయనకి తర్వాత చెబుదువు గానీ ముందు నువ్వు కంటిన్యూ చెయ్యి అంటారు. కుటుంబంలో సమస్యలు వస్తే అన్నదమ్ములతో కూర్చుని చర్చించుకుంటామ్ కదా, అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ విధంగా విసుక్కోవడం పెరిగే కొద్దీ ఎందుకొచ్చిన గొడవలే అని గ్రూపు సంభాషణలకు దూరంగా ఉండిపోతాం.

ఇలాంటి ఒంటరితనంతో మా నాన్నగారు చాలా బాధపడ్డారు. వినికిడిలోపం వలన సమాజం నుండి సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం ఆగిపోతుంది. తాను చెప్పేది ఎవరూ పట్టించుకోనట్లు భావిస్తూ గట్టిగా అరిచి చెప్పేందుకు ప్రయత్నించేవారు. సమూహం దృష్టిని ఆకర్షించడానికి వివిధ ప్రయత్నాలు చేసేవాళ్ళు. ముసలి తనంలో ఆయనకి ఉన్న మరో సమస్య వలన తీవ్ర స్పందనలు చూపేవారు. తాను ఇంకా రెలెవెంట్ అని చెప్పేందుకు అనేక ప్రయత్నాలు చేసేవారు. ఆ ప్రయత్నాల్లో విఫలుడై చివరికి డాక్టర్ల చుట్టూ తిరిగారు. ‘ఇక మెరుగుపడే అవకాశం లేదు. అలా తిరగొద్దు’ అని నేను చెప్పేను. ఆయన వినికిడి లోపం ప్రభావం మా అమ్మగారి పైన బాగా పడేది. ఆమె ఎలాగో నెట్టుకుని వచ్చారు.

ఇదే పరిస్ధితి నాకు వస్తుందన్న భయం నిత్యం నన్ను వెంటాడుతూ ఉండేది. చెవిలో అమర్చుకునే ఎలక్ట్రానిక్ మిషన్ అమర్చుకుని నా లోపాన్ని అధిగమించాలని నేను ప్రయత్నించాను. కానీ అది వృధా అని త్వరలోనే తెలిసి వచ్చింది. ఎందుకు వృధా అంటే మన చెవి-మెదడుల సంబంధం యొక్క నిర్మాణం జీవంతో ఉంటుంది. ఎలాగంటే చెవి నుండి శబ్దాల్ని మోసుకుపోయే నరాలు ఒక విధమైన సెన్సార్స్ లా కూడా పని చేస్తాయి. మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వారి మాటలనే మెదడుకు ప్రధానంగా కొనిపోతాయి. ఇతర శబ్దాలను మినిమైజ్ చేస్తాయి. సమూహంలో ముగ్గురు, నలుగురు మాట్లాడుతున్నపుడు కూడా మనం ఎవరి మాటలనైతే వినాలనుకుంటామో ఆ మాటలనే మెదడుకి మోసుకెళ్తాయి.

కానీ ఎలక్ట్రానిక్ యంత్రాలు అలా కాదు. అది తాను వినే శబ్దాలనన్నింటినీ మెదడుకు పోయే నరానికి తాటిస్తాయి. దాంతో ఆఫీసులో కూర్చున్నా, బైట రోడ్డుపైన పోయే వాహనాల హారన్లని కూడా లోపలి/దగ్గరి శబ్దాల స్ధాయిలో వినిపిస్తాయి. దాంతో శబ్దాలు ఎక్కువైపోయి మనం వినాల్సిన శబ్దాల్ని కూడా వినలేకపోతాము. దానివల్ల చెవినొప్పి, తలనొప్పి వచ్చేవి. ఆ విధంగా ఒక సంవత్సరం వాడాక నేనిక మిషన్ల జోలికిపోలేదు. అలాగని మిషన్ల వల్ల బొత్తిగా ఉపయోగం లేదని చెప్పలేము. ఖరీదైన మిషన్ల జోలికి పోకుండా ప్రాధమిక స్ధాయి మిషన్ (జేబులో రిసీవర్, అక్కడి నుండి చెవికి వైర్ కనెక్షన్) వరకు అయితే బాగా ఉపయోగం ఉంటుంది. ఆ మిషన్ వల్ల మరో సమస్య! సాంస్కృతికంగా పదిమంది ముందు ఇన్ఫీరియర్ గా ఉన్న భావన వస్తుందని డాక్టర్లు, అనుభవజ్ఞులు చెబుతారు.

ఈ పరిస్ధితుల్లో నేను ఒక రెండేళ్ల క్రితం ఒక ఆడియో షాపుకి వెళ్ళాను. డస్క్ టాప్ కంప్యూటర్ కి స్పీకర్ కావాలని అక్కడికి వెళ్ళాను. ఆ షాపు యజమాని ఒక యువకుడు. ఎం.బి.ఏ పూర్తి చేసి ఫ్రెష్ గా ఉన్నారేమో నేను కొనబోయే ఆడియో సిస్టం గురించే కాకుండా ఆల్టర్నేటివ్ గా ఏవి కొనవచ్చో అన్నీ వివరంగా చెప్పారు. అలా చెప్పడానికి ముందు “మీకు ఓపిక ఉంటే వినడానికి నాకు అభ్యంతరం లేదు గానీ, మీకు అదనపు ఓపిక కూడా అవసరం అవుతుందేమో, ఆలోచించుకోండి” అని చెప్పాను. ఏమిటని అడిగితే నా వినికిడిలోపం గురించి చెప్పాను. అయినా ఆయన ఏమీ అన్యధా భావించకుండా తాను చెప్పాల్సింది, నా అనుమానాలతో సహా, మొత్తం స్వరం పెంచి మరీ చెప్పారు. అంతా అయ్యాక ఆయన నాకొక విలువైన సమాచారం ఇచ్చారు.

ఆ సమాచారమే ఈ డాక్టర్ మహాదేవయ్య గురించిన విషయం. తన తండ్రి గారికి ఏదో చెవి సమస్య వస్తే లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ల దగ్గరకు తిరిగినా ఏమీ గుణం కనిపించలేదట. ఇలాగే ఎవరో మిత్రుడు చెప్పగా మహాదేవయ్య గారిని కలిశారు. ఈ డాక్టర్ గారు ఆయన సమస్యను చిటికెలో పరిష్కారం చేశారట. ఆయనది వినికిడి సమస్య కాదు. ఒకానొక పనిలో ఉండగా యాదృచ్ఛికంగా ఏదో జరిగి చెవిలో ‘గుయ్’ మని శబ్దం వినబడడం మొదలయింది. దాన్ని పరిష్కరించడం ఎందరో డాక్టర్ల వల్ల కాలేదు.

ఈ సమాచారంతో నాకు ఆశ కలిగింది. కానీ నేను ధైర్యం చేయలేదు. నరం వీక్ అయ్యింది అన్నారు కదా, ఇక ఏ డాక్టర్ అయినా చేసేదేముంది అని నా అనుమానం. ఆ తర్వాత ఒకసారి డాక్టర్ మహాదేవయ్య గురించిన సమాచారం నెట్ లో దొరుకుందేమోనని వెతికాను. వెతకగా ఆయన పేరుతోనే వెబ్ సైట్ కనిపించింది. గత 20 యేళ్లలో ఆయన అనేక శస్త్ర చికిత్సా పద్ధతులు కనుగొన్నారని, స్వయంగా అనేక సూక్ష్మ శస్త్ర పరికరాలు కనుగొన్నారని అందులో చదివాను. ఆ సైట్ చూశాక నాకు అనుమానం నివృత్తి అయినట్లు అనిపించింది.  ప్రయత్న లోపం ఉండకూడదు కదా అని గత (మే) నెల 21 తేదీన బెంగుళూరు బయలుదేరాను.

డాక్టర్ ని కలిశాక ఆయన నన్ను చూసింది కేవలం ఒక నిమిషం మాత్రమే. ఆయనకి ముందు మరో డాక్టర్ పైన చెప్పిన పరీక్షలన్నీ చేశారు. ఆడియో గ్రాం కూడా తీశారు. అందులో నాకు 65 శాతం వినికిడి శక్తి లోపించిందని తెలిసింది.

అయితే ఈ ఆర్టికల్ రాయడానికి నన్ను పురికొల్పింది అది కాదు. డాక్టర్ చెప్పిన విషయాలు నాకు పరమాశ్చర్యాన్ని కలిగించాయి. సాధారణంగా మనిషి చెవిలో కర్ణ భేరికి ఆనుకుని మూడు ఎముకలు ఉంటాయి కదా, అందులో ఒకటి కనిపించడం లేదని చెప్పడంతో నేను హతాశుడిని అయ్యాను. అనగా మనిషికి 103 జతల ఎముకలు ఉండాల్సి ఉండగా నాకు మాత్రం 102 జతల ఎముకలు మాత్రమే ఉన్నాయన్నమాట! ఇదెలా సాధ్యం? ఒక ఎముక లేకపోయినా నాకు ఇన్నాళ్లూ ఎలా వినిపించింది? ఇదే ప్రశ్న డాక్టర్ గారిని అడిగాను.

ఆయనప్పుడు నా వంశ చరిత్ర బైటికి తీశారు. మా ఫాదర్ ద్వారా నాకు ఈ లోపం సంక్రమించింది అని చెప్పారు. ఆ కనపడని ఎముక, అసలుకే లేకుండా పోవడం కాదనీ, చెవిలో ఎక్కడో ఫిక్స్ అయి ఉండవచ్చని ఆయన చెప్పారు. ఫిక్స్ అవ్వడం అంటే పక్కన గొడకి అతుక్కుని పోయి శబ్దాలకు అనుగుణంగా కంపించలేకపోవడం అన్నమాట! అలా ఫిక్స్ అయిపోవడం వల్ల తాను కంపించగలిగినంతవరకూ శబ్దాల్ని నరానికి, మెదడుకి చేరవేస్తోంది. కంపించలేని పరిస్ధితి వచ్చినపుడు చడీ చప్పుడు లేకుండా ఉండిపోయింది.  పాపం దాని తప్పేమీ లేదు. వంశానుగత లోపం వలన వచ్చిన దాని నిస్సహాయ పరిస్ధితిని డాక్టర్లు కనిపెట్టకపోవడమే అసలు విషయం. నరం బలహీనపడడం అన్నది నిజం కాదు. అప్పటి డాక్టర్లకు ఈనాటి పరిజ్ఞానం లేదు. అందువల్ల లోపాన్ని నరం మీదికి నెట్టేశారు.

మరిదీన్ని సరిచేయవచ్చా అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం నన్ను భూమ్మీద నిలవనివ్వలేదు. అసలా ఎముక కనిపించకపోయినా లోపాన్ని సరిదిద్ద వచ్చని ఆయన చెప్పారు. డాక్టర్ గారి స్వరం అంత తియ్యనైనదేమీ కాదు. మృదు మధురం అంతకన్నా కాదు. అసలాయన మాటలు పూర్తిగా వినపడడం కూడా లేదు. అయినా ఆ నాలుగు ముక్కలు నా చెవికి ఎంత తియ్యగా, ఎంత విందుగా, ఎంత సంబరంగా, ఎంత లాలనగా, ఎంత జోలగా…. ఇంకా ఎంత ఇదిగా, ఎంత అదిగా వినిపించాయో చెప్పలేను.

చెవి ఓపెన్ చేసి లోపం ఏమిటో పరిశీలించి ఆ లోపాన్ని అక్కడే సరి చేస్తామని డాక్టర్ చెప్పారు. ఆ సంతోషంతో ఇంటికి వెళ్ళిన నేను ఈ పాతిక రోజులు యుగాల్లా గడిపి నిన్ననే బెంగుళూరు వచ్చాను.

నిన్న 3 గంటలకి ప్రారంభం అయిన శస్త్ర చికిత్స సాయంత్రం 5 గంటలకి పూర్తయింది. లోకల్ అనస్తీసియా మాత్రమే ఇవ్వడం వలన నాకు జరిగేది తెలుస్తూనే ఉంది. నేను కళ్ళు తెరుచుకుని ఉండడం చూసి ‘కళ్ళు మూసుకో’ అని డాక్టర్ గారు ఆంగ్లంలో గద్దించారు. మరో మాట చెప్పకుండా టప్పున మూసేశాను. ఒక డాక్టర్ చెవి లోపలా బైటా వరుసగా నాలుగైదు ఇంజెక్షన్లు చేసేసి స్పర్శ లేకుండా చేశారు. అనంతరం ఏవో క్లిప్పులు పెట్టి లోపలి చెవి కూడా బైటికి కనపడేలా చేసుకున్నారు. నా చెవి నిర్మాణం, లోపాలు అన్నింటినీ ఆయన తన పక్కన ఉన్న సహాయకులకు వివరిస్తుంటే నేనూ విన్నాను. నాకు వాటిలో కొన్ని మాత్రమే వినపడ్డాయి. విన్నవాటిలో కొన్ని మాత్రమే అర్ధం అయ్యాయి. కానీ ఆపరేషన్ అవుతుండగా మరో అరగంటలో అది ముగుస్తుంది అనగా సడెన్ గా నాకు అన్నీ శబ్దాలు వినపడడం మొదలయింది. దానితో నాకు అర్ధం అయిపోయింది. దాదాపు పాతిక సం.లుగా నేను ఎదుర్కొంటున్న సమస్యను ఈ పెద్దాయన చిన్న ముక్కేదో పెట్టి పరిష్కరించేశారని అర్ధం అయిపోయింది.

ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఆపరేషన్ బల్లపైనే, శస్త్ర చికిత్స గౌనులో ఉండగానే, ఇంకా అరగంట వ్యవహారం మిగిలి ఉండగానే నేను డాక్టర్ తో ముచ్చట్లు పెట్టాను. గదిలో ఎంతమంది మాట్లాడుతున్నారో వాళ్లందరి మాటలు వినిపిస్తున్నాయని చెప్పాను. ఆపరేషన్ ప్రారంభించినప్పుడు వినపడని గొంతులన్నీ ఇప్పుడు వినిపిస్తున్నాయని చెప్పాను. నా ఆనందాన్నంతా నా భాషాలంకారాలతో నింపి చెప్పాను. ఆయన పెద్దగా నవ్వుతూ, ఇప్పుడు మీ చెవి ఓపెన్ చేసి ఉంది. అందుకే వినిపిస్తున్నాయి. క్లోజ్ చేశాక ఆడియో గ్రాం మళ్ళీ చేస్తాం. అప్పుడు చెప్పండి. ఇప్పుడు కాదు” అని చెప్పారు. నేను మళ్ళీ టప్ మని నోరు మూసేశాను.

ఆపరేషన్ ధియేటర్ బయటకి రాంగానే నాకు మొదటిసారి రజాక్ కనిపించాడు. అతను నా ఫ్రెండ్. 500 కి.మీ దూరం కారు నడపడం మా ఆవిడ వల్ల కాదు కదా (నాకసలు డ్రైవింగ్ రాదు లెండి), అందుకని రజాక్ ని తోడు తెచ్చుకున్నాను. అతను కనపడగానే పళ్లన్నీ చూపిస్తూ, కళ్ళన్నీ వెలిగిస్తూ నిండుగా నవ్వాను. అతని సెల్యూట్ కి ప్రతి సెల్యూట్ చేశాను. ఆ తర్వాత మా ఆవిడ కనిపించింది. అన్నీ వినిపిస్తున్నాయి అని చెప్పాను. పిల్లలిద్దరికీ ఫోన్ చేసి చెప్పమమని చెప్పాను. తను కూడా నన్ను మించిన ఆనందంలో ఉందాయే. వెంటనే పిల్లలిద్దరికీ టపటపా ఫోన్ చేసి చెప్పింది. నేనే చెబుదాం అనుకుంటే డాక్టర్లు నన్ను కదలొద్దు అని చెప్పారు. ఆపరేషన్ చేసిన చెవిని పైకి పెట్టి పక్కకు ఒత్తిగిలి పడుకోమని చెబుతూ మరో రోజు వరకూ కదలొద్దని శాసించారు. అప్పటికీ ఒక మిత్రుడికి ఫోన్ చేసి రెండో చెవిని ఉపయోగిస్తూ ‘బ్లూ టూత్’ ద్వారా మాట్లాడాను. ఇది చూసి ఎక్కడినుండి వచ్చారో ఒక నర్స్ వచ్చి ‘డాక్టర్ ఏం చెప్పారు?’ అని గద్దిస్తూ ఓ క్లాస్ పీకారు. దాంతో ఇక ఎవ్వరితో మాట్లాడడం కుదర్లేదు.

అనస్తీషియా ఇవ్వడానికి పొడిచే ఇంజక్షన్లు తప్ప మరే నొప్పి నాకు తెలియలేదు. ఏదో ద్రావకాలు బుస్స్ అంటూ చల్లడం స్టీల్ పరికరాలతో మోదుతూ లోపలి చెవిని బైటికి తేవడం (ఇవి నా ఊహలే) శబ్దాలు తప్ప నాకు మరేమీ వినపడలేదు. బైటికి వచ్చాక మత్తుగా ఉండడం తప్ప మరేమీ నొప్పి అనిపించలేదు. ఆపరేషన్ చేసి ఇప్పటికీ 23 గంటలైంది అయినా ఇంకా నెప్పి తెలియడం లేదు. రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తామని చెబుతున్నారు. అంతవరకూ నా ఆనందాన్ని ఉగ్గబట్టుకోలేక ఈ టపా రాస్తున్నాను.

రెండో చెవికి కూడా ఆపరేషన్ చేయమని కోరాను. ఇంకో 6 నెలలు ఆగితే చేయొచ్చు అన్నారు. అప్పటివరకూ ఆగితే నా రెండు చెవులూ నా స్వాధీనంలో ఉంటాయి. మా నాన్న అనుభవించిన సామాజిక ఒంటరితనం, అవహేళన నా దరికి రాకుండా విష్ణు చక్రం వదిలిన డాక్టర్ మహాదేవయ్య గారికి కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలను? ఇక్కడ ఆసుపత్రి గొప్పతనం ఏమిటంటే పైపై పటాటోపాలు ఏవీ లేకపోవడం. ‘పెద్ద డాక్టర్ అన్నారు. ఇక్కడ చూస్తే అదేమీ కనపడ్డం లేదు’ అని రజాక్ అనడం బట్టే పరిస్ధితి గ్రహించవచ్చు.

డాక్టర్ మహాదేవయ్య గారి ఆసుపత్రి పేరు “బసవన గుడి ఇ.ఎన్.టి కేర్ సెంటర్.’ గుడి అంటే కొబ్బరి కాయ, శఠగోపం కాదనీ ఇలా అసలైన మానవ సేవ చేసేదే నిజమైన గుడి అనీ తెలుసుకునే అవగాహన సమాజంలో రావడానికి ఇంకెంత కాలం ఆగాలో మరి!

డాక్టర్ మహాదేవయ్య గారి క్లినిక్ వెబ్ సైట్ కోసం కింద లింక్ లోకి వెళ్ళండి.

బసవన గుడి ఇ.ఎన్.టి కేర్ సెంటర్

42 thoughts on “మొండి వినికిడి సమస్యా? ఐతే బసవనగుడికి రండి!

 1. పాతిక సంవత్సరాల సమస్యకు పరిష్కారం అంటే అది సామాన్యమైన విషయం కాదు.. ఆస్పత్రి గది నుంచే ఈ టపా రాయటం మీరెంతగా సంబరంతో ఉన్నారో చెప్తోంది. మీ సంతోషంలో నేనూ పాలుపంచుకుంటున్నాను!

  ఈ సమాచార యుగంలో కూడా డా. మహాదేవయ్య గారి ఆస్పత్రి గురించిన సమాచారం మాటల సందర్భంలో యాదృచ్ఛికంగా దొరకటం మాత్రం విచిత్రంగా ఉంది.

  వినికిడిపరంగా పెను సమస్య ఉన్నవారికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.

 2. కంగ్రాట్స్‌! శేఖర్‌ గారు, మీ పోష్టు చూసి మీతో పాటు మేము సంతోష పడకుండ ఉండలేక పోతున్నాం. మీ సమస్యేమిటో మాకు ముందు తెలియక పోయినా , మీ సంతోషాన్ని మా పాఠకులతో పంచు కోవటం ఆనంద దాయకంగా ఉంది.

 3. వేణు గారూ, వచ్చేశారా అప్పుడే?!

  అవును. చాలా చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడెప్పుడు ఆఫీసుకెళ్లి తలెగరేసుకుని తిరగాలా అనుంది.

  మీరన్నట్లు ఈ సమాచారం ఇంకెవరికన్నా ఉపయోగపడితే బాగుణ్ను.

 4. శుభాకాంక్షలు శేఖర్ గారు
  మీకు ఇటువంటి సమస్య ఉందని ఇప్పతి వరకు తెలియదు గాని
  ఈప్పుదు క్యుర్ అయ్యినందుకు చాలా చాల సంతోషంగా ఉంది .. మీ రెండో చెవి కూడ తొందరగా బాగుపడాలని కోరుకుంటున్నాను….

 5. నాగశ్రీనివాస గారు. ధన్యవాదాలు. మిత్రుల అభిమానం మన సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ‘సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుంది. దుఃఖాన్ని పంచుకుంటే తరుగుతుంది’ అన్నారు పెద్దలు. అది నిజమే సుమా.

 6. శేఖర్ గారు, మీకు నాకు ఏజ్ గాప్ చాలా ఉంది! కానీ,ఆత్మీయంగా అంత గాప్ అయితేమాత్రంలేదు! గత 15 మాసాలుగా మీటపాలు చదువుతూ మీకు దగ్గర అయ్యాను! మనలో(నాలో) ఉండేసహజ కుతూహలం కొద్దీ మీగురించి తెలుసుకోవాలనుకొనేవాడిని!కానీ, ఒక మంచి డాక్టర్ గురించి తెలియజేసే క్రమంలో మీ గురించి కొన్ని విషయాలు చెప్పారు!
  ఏదేమైనప్పటికీ,మీకు స్వస్థత చేకూరాలని కొరుకొంటూ,మీ శ్రేయొభిలాషి,,,,,,,
  ఓ పాఠకుడు.

 7. శేఖర్ గారు,

  మీకు హృదయపూర్వక అభినందనలు.

  చాలాకాలంగా గుంటూరు, హైదరాబాదుల్లో cochlear implants కూడా చక్కగా చేస్తున్నారు. ఈ సెంటర్లలో మీ సమస్యకి వైద్యం జరక్కపోవడం ఆశ్చర్యంగా వుంది.

  నాకు మీ ఇన్నాళ్ళ ఇబ్బందులు చదివి ఎంతగా బాధ కలిగిందో, మీ ఆపరేషన్ అనుభవాన్ని హాస్యభరితంగా రాయడాన్ని చదివి అంతగా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. మీరు రాజకీయ విషయాలు చక్కగా విశ్లేషిస్తారని తెలుసు గానీ.. మీ హాస్యచతురత మాత్రం నాకు కొత్త.

  నాకు Schizophrenia Bulletin లో పేషంట్ల అనుభవాలు, అభిప్రాయాలు చదవడం అలవాటే. కానీ – నేనెప్పుడూ ఇంత చక్కగా రాసిన అనుభవం చదవలేదు. మీరు ఈ పోస్టు రాసిన శైలి చాలా హృద్యంగా, ఆసక్తికరంగా వుంది.

  Once again my hearty congratulations to you.

 8. విశేఖర్ గారు,
  చాలా సంతోషంగా ఉంది. మీరు వ్రాసిన చాలా టపాల మీద స్పందిద్దాం అనుకున్నా కానీ వీలుకాలేదు. ఇప్పుడు మాత్రం మీ ఆనందాన్ని చూశాక ఖచ్చితంగా అభినందనలు తెలపాలనిపించింది.
  మీరు ఎప్పటికీ పూర్తి ఆరోగ్యంతో ఉండి ఈ అక్షర యజ్ఞాన్నీ నిరంతరం కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను.

 9. Thanks for sharing useful info. Finding a good Doctor is everything in curing chronic ailments. I wish my 25 yr old problem of SINUS headaches will also get cured by a good doctor. I tried Homoeo, allopathy, Ayurveda etc… and DNS surgery was also done in 2003. But the problem is not solved completely…(triggers even with little change to routine life, change in weather, heat, strain, travel, excessive talk). I have given-up many passions, hobbies (example: social service etc) in my life due to fear of sinus head-aches.
  WHAT IS BEST SOLUTION TO GET RID OF THIS?
  After reading your post, I am hopeful of finding a doctor who can cure me completely.

 10. మీకు శుభాకాంక్షలు. మీరు రాసింది చదువుతోంటే చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను మీతో పంచుకోగలిగినందుకు.

 11. అయ్యో నేను వేరే పనిలో ఉండి మీ టపా ఆలస్యంగా చూశాను. మీ వ్యక్తిగత సమస్యను మీ లోనే దాచుకోకుండా…దాన్ని కూడా నలుగురికి ఉపయోగపడే టపా రాయడం నిజంగా గ్రేట్ శేఖర్ గారు.
  నా ఫ్రెండ్ ఒకరు కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నాడు. బెంగళూరు పంపాల్సిందే.
  మొత్తానికి మీ దీర్ఘకాల సమస్య పరిష్కారమైనందుకు హ్యాపీ. త్వరలోనే ఆరోగ్యం కూడా కుదురుకోవాలని కోరుకుంటున్నాను. బాగా రెస్ట్ తీసుకోండి సార్.

 12. Hello Sekhargaru,
  Congratulations to you. Happy to know that your problem is resolved. I am a regular to your blog, but obviously never knew you had this issue. Hope you recover soon.
  Being on bed myself for some time, I know the excitement one will have when they regain what was lost! 🙂
  So happy days to you!
  Even my father has an ENT problem. Hope we can take him there atleast for a check up.

 13. మీరు చెప్పినట్టు ఎదైనా శ్రారీక సమస్య వున్నప్పుడు ఒంటరిగానే వుండవలసివస్తుంది ఒకరకంగా బాదాకరమైన విషయం మీకాసమస్య తొలగిపొయినందుకు సంతొషం.

 14. సుభాకాంక్షలు. ఎలాంటి సమస్య ఐనా పరిష్కారం ఉంటుంది అనే నమ్మకం కలుగుతుంది ఇలాంటివి చూసినపుడు. మీ సమస్య సాల్వ్ ఐనందుకు చాలా అనందం గా ఉంది.

 15. శేఖర్ గారు,

  నా పేరు అనంత్. నేను హైదరాబాదు లొ ఉంటున్నాను.

  నాకూ వినికిడి సమస్య ఉంది.

  అయితే నేను ప్రస్తుతానికి చెవిలో చిన్న యంత్రం వాడుతున్నను.

  మీ టపా చూచిన తరువాత నేను వెళ్ళి చూపించు కోవాలి అనుకుంటున్నాను, నా వయస్సు ౩౦ సం.

  చిన్న సమాచారం కావాలి, మీకు ఆపరేషన్ చేసినందుకు Hospital వాళ్ళు ఎంత charge చేసారు.

  నిజంగా మీ టపా చదివిన తరువాత నాకు చాలా ఆనందం కలిగింది.

  ప్రతీ మనిషికి చెవులు, కళ్ళు, అన్ని భాగాలు సక్రమంగా పని చేయాలి, ఏ ఒక్కటి సరిగ్గా పని చేయక పోయినా ఎంత భాదో అనుభవించేవారికి తెలుసు.

  మీ సమాచారం అందరికి చాలా విలువైనది. మీరు టపాలో ప్రచురించి చాలా మంచి పని చేసారు.

  మీ సమాధానం కోసం ఎదురు చూస్తువుంటాను.

 16. విశేఖర్ గారు,
  చాలా సంతోషంగా ఉంది.
  చాలా మంచి విషయాన్ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదములు.

  నాకు కొంచెం వినికిడి లోపం ఉంది. ప్రస్తుతానికి నేను చెవిలొ చిన్న యంత్రాన్ని వాడుతున్నాను.

  మీ టపా చదివి చాలా ఆంనందించాను.

  నేను వెళ్ళి చూపించుకుంటాను.

  Hospital వాళ్ళు మీకు ఎంత బిల్లు వేసారు!! దయ చేసి తెలియగలరు.

  ఈ క్రింద నా ఈ మైల్ పొందు పరచటమైనది.

  ఇక నుంచి ఇలాంటి విషయాలకు నేను నా బ్లాగ్ లో షేర్ చేద్దమనుకుంటున్నాను (అదీ మీ అనుమతితో!!)

 17. వైకల్యాన్ని జయించినందులకు అభినందనలు.
  మీ విజయాన్ని నా ఆప్తులతో పంచుకున్నాను . దయ చేసి మన తెలుగు దినపత్రికలకు ఈ విషయాన్నీ తెలియచెయగలరు.
  వాళ్ళు ఈ అద్భుత వైద్యుడికి ప్రాచుర్యం కల్పిస్తారు.

 18. డా. రమణ గారు, నాకు వేసింది cochlear implant కాదు. మధ్య చెవిలో తగిన విధంగా కంపించకుండా ఉండిపోయిన ఎముకను తొలగించి ఒక పిస్టన్ లాంటిది వేశారు. ఇంతకాలం నాకు సరైన డయాగ్నసిస్ జరగలేదు. బహుశా అందుకు తగిన పరికరాలు అభివృద్ధి కాలేదేమో. లోపమే సరిగ్గా కనిపెట్టనప్పుడు ఇక వైద్యం మాత్రం ఏం చేస్తారు?

  హాస్య చతురుత విషయంలో మీ ముందు నేనెంత చెప్పండి! క్లిష్టమైన విషయాన్ని ఆకట్టుకునేలా, బోర్ కొట్టకుండా చెప్పడంలో మీకు మీరే సాటి. ఆత్మీయ పలకరింపుకు ధన్యవాదాలు.

 19. సంజయ్ గారూ, మీ నాన్నగారిని తప్పకుండా తీసుకెళ్లండి. ఫలితం ఉంటుంది.

  రామ్మోహన్ గారూ, ధన్యవాదాలు.

  aaa గారూ, మీక్కూడా.

 20. అనంత్ గారూ, మీరు డాక్టర్ మహాదేవయ్య గారి దగ్గరకి వెళ్ళమని నా సలహా. యంత్రం అవసరం లేకుండా ఆయన చేయగలరు.

  నా దగ్గర కేవలం 35,000 మాత్రమే తీసుకున్నారు. ఆయన చేసిన క్లిష్టమైన ఆపరేషన్ కి అది చాలా తక్కువ. మన రాష్ట్రంలో నిలబెట్టి లక్షలు వసూలు చేస్తారు.

  విచిత్రం ఏమిటంటే ఆసుపత్రిలో వసతి సౌకర్యానికి డబ్బు తీసుకోలేదు. ఒకవేళ ఫీజులోనే కలిపి తీసుకున్నా అది ఇంకో గొప్ప విషయం. అలాగని వసతి సౌకర్యం నాసిరకం ఏమీ కాదు. నర్సుల కేరింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. దాదాపు అందరూ పెద్దవాళ్లే.

  నాకయితే డాక్టర్ దగ్గర వాణిజ్య దృక్పధం అన్నదే కనిపించలేదు. నాకు వచ్చిన ఫలితాన్ని బట్టి ఆయన తీసుకున్న డబ్బు చాలా తక్కువ.

  నా బ్లాగ్ ఆర్టికల్స్ ను మీరు నిస్సందేహంగా షేర్ చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరమూ లేదు.

 21. CM గారూ, గతంలో ఈనాడు వాళ్ళు ఓసారి ఈయన గురించి రాశారుట. అయితే అది బెంగుళూరు ఎడిషన్ లో అయి ఉండవచ్చు. మనకి తెలియదు గానీ మెడికల్ సర్కిల్ లో మహాదేవయ్య గారికి చాలా పేరుంది. ఏదో అసోసియేషన్ కి బాధ్యులుగా కూడా పని చేశారు.

 22. v శేఖర్ గారికి నమస్కారాలు .నెను మీ బ్లాగ్ ని రెగ్యులర్ గా ఫాల్లో అవుతాను ,మొన్న మీరు రాసిన బసవనగుడి గురించి చూసి చాల సంతోష పడ్డాను ,మా మిత్రుడు ఒకతనికి బైక్ ఆక్సిడెంట్ అయ్యి
  రెండు చెవులు వినబడ కుండ పోయాయి అందులో ఒక చెవి మెషిన్ పెట్టుకుంటే లీట గ వినిపిస్తుంది తనక మీరు రాసిన ఆర్టికల్ చుఇంచను తను ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లతాన్నాడు మీకు అ అబ్యంతరం లేకపోతె మీ ఈమెయిలు ఇద గని ఫోన్ నెంబర్ గని న మెయిల్ కి పంపగలరు
  ధన్యవాదాలు .

 23. నారాయణ గారూ నా ఈ మెయిల్ ఇదిగోండి: visekhar@teluguvartalu.com

  పైన ఆర్టికల్ చివరన డాక్టర్ గారి వెబ్ సైట్ కి లింక్ ఇచ్చాను. బహుశా మీ అనుమానాలు కొన్నింటికి అక్కడ సమాధానం దొరకవచ్చు. అది చూశాక ఇంకా అనుమానం ఉంటే నాకు మెయిల్ చేయండి. అవి కాకుండా ఇంకేమన్నా వివరాలు కావాలన్నా మెయిల్ చేయవచ్చు.

 24. అందరికి నమస్కారం 🙏
  పైన విశేఖర్ అన్నయ్య ది నాది ఒకే కథ.
  వాళ్ళ నాన్నలాగే మా నాన్నకు ప్రాబ్లమ్ ఉండేది కాని ఈమధ్యనే కాలం చేసారు తరువాత విశేఖర్ అన్నయ్య లాగే నాకు ఉంది వినికిడి ప్రాబ్లమ్. అందుకే అన్నయ్య ది నాది ఒకే కథ.ఆ బాధలు అవమానాలు అవకాశాలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందుకే నేను కూడ అన్నయ్య లాగా బెంగుళూరు వెళ్ళాలి అనుకుంటున్నాను.
  మాది సిరిసిల్ల తెలంగాణ
  నేను ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎన్ని డబ్బులు అవుతాయి చెప్పగలరు.
  నా సమస్య తీరితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో.
  ప్లీజ్ సలహా ఇవ్వండి
  మిమ్ములని ఎప్పుడు మరచిపోను… 🙏

 25. రాజ్ గారు డా. మహాదేవయ్య గారు చనిపోయారు. ఆయనతో పాటు పని చేసిన డాక్టర్లు ఆసుపత్రి నడుపుతున్నారు. వారి గురించి నాకు తెలియదు. మీకు వీలు కుదిరినప్పుడు వెళ్లొచ్చు. ముందు ఫోన్ చేసి అప్పోయింట్మెంట్ తీసుకోండి. పైన ఇచ్చిన లింక్ లో అడ్రస్, ఫోన్ ఉన్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s