మోడీ పైనే బాబు ఎన్నికల హామీల భారం! -కార్టూన్


Babu promises

ఎన్నికల గెలుపు తాలూకు మత్తు నాయకులను ఇప్పుడిప్పుడే వదులుతున్నట్లుంది! కేంద్రంలో బి.జె.పి/మోడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం సాధించిన విజయాలు మోడి, చంద్రబాబు నాయుడుల చలవే అని పత్రికలు ఘోషిస్తున్నాయి. మోడీయే లేకపోతే బి.జె.పికి ఈ గెలుపు దక్కి ఉండేది కాదని మామూలుగా మోడిని విమర్శించే పత్రికలు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నాయి.

మోడి గాలి తుఫానులా తాకి కాంగ్రెస్ ని ఊడలతో సహా పెరిగివేసిందని, చంద్రబాబు పడిన పాదయాత్ర కష్టం టి.డి.పి ని తిరిగి అధికారంలోకి తెచ్చిందని అక్కడ ఆయనను, ఇక్కడ ఈయనను పత్రికలు వేనోళ్ల కీర్తిస్తున్నాయి. 

విజయోత్సవాలు పూర్తయ్యి, మంత్రివర్గాలు ఏర్పాటు చేసుకుని ఓసారి పాలనా పగ్గాలను చేపడితే గానీ అసలు సత్తా ఏమిటో తెలిసిరాదు. మోడి, బాబులు ఇచ్చిన వాగ్దానాలను వాస్తవంగా ఏ విధంగా అమలు చేస్తారన్నది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఈ ఆసక్తి తమ భవిష్యత్తును కంగాళీ చెయ్యకుండా నేతలిద్దరూ అప్పుడే పరిశీలకుల, ప్రజల ముందరి  కాళ్ళకు బంధం వేసే పనిలో పడిపోయినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ సాగించిన పదేళ్ళ పాలన నుండి అత్యంత బలహీన ఆర్ధిక వ్యవస్ధ తమకు సంక్రమించిందని మోడి, జైట్లీ తదితరులు ప్రకటిస్తుండగా రాష్ట్రంలో బాబు కూడా దాదాపు అదే వాదన చేస్తున్నారు. కాకపోతే బాబు తన వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలను రాష్ట్ర విభజన పైకి నెట్టేస్తున్నారు. విభజన వల్ల ఆర్ధిక వనరులు చాలావరకు ఖాళీ అయ్యాయని, ఏమి పెట్టి ప్రభుత్వాన్ని నడపాలో తెలియడం లేదని బాబు వాపోతున్నారు.

చంద్రబాబు నాయుడు గారు తాను చాలా ముందు చూపుతోనే ఎన్.డి.ఏ తో దోస్తీ కట్టానని చెబుతున్నారు. కొత్త రాష్ట్ర నిర్మాణానికి, మరీ ముఖ్యంగా హైదారాబాద్ ను తలదన్నే రాజధాని నిర్మాణానానికి పూనుకోవాలంటే తాను మాత్రమే సరైన వ్యక్తిని అని ఆయన మొదటి నుండి చెప్పుకున్నారు. ది హిందూ లాంటి పత్రికల ఎడిటోరియల్స్ కూడా ఎన్.డి.ఏ తో దోస్తీ కట్టడంలో బాబు ముందు చూపును గుర్తిస్తూ సంపాదకీయాలు రాశాయి. కేంద్ర ప్రభుత్వంతో తగవు పడకుండా, వీలయితే స్నేహం చేసయినా సరే రాష్ట్రానికి కావలసిన నిధులు తేవడమే ఈ ముందు చూపులోని అంతరార్ధం అని దాదాపు అందరూ ఏకాభిప్రాయంలో ఉన్నారు.

మోడి-బాబు దోస్తీ, రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణానికి ఏ విధంగా అక్కరకు వస్తుందో చూడాల్సిన విషయం. కొత్త రాష్ట్ర నిర్మాణంతో పాటు తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నా బాబుకు కేంద్రం సాయం తప్పనిసరి. రైతుల ఋణ మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ ల దస్త్రాలపై ప్రమాణ స్వీకారం రోజే సంతకం చేస్తామన్న బాబు తీరా చూస్తే ఋణ మాఫీపై ఓ కమిటీ వేసి ప్రస్తుతానికి దానితో సరిపెట్టుకోమంటున్నారు. విమర్శలు వచ్చాక ‘ఋణ మాఫీ నా సంతకంతో అయ్యేది కాదు. దానికి ఆర్.బి.ఐ ఒప్పుకోవాలి’ అని ఇప్పుడు చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు గారు ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు? ఆర్.బి.ఐ, కేంద్రంలతో సంప్రదించి ఋణ మాఫీ చేయిస్తానన్నా కాస్త ఆమోదయోగ్యంగా ఉండేది. కానీ ప్రమాణం రోజే సంతకం చేసి హామీ నెరవేరుస్తానని చెప్పి ఇప్పుడు ‘నా సంతకంతో అయిద్దా?’ అని ప్రశ్నించడం ఎలా అర్ధం చేసుకోవాలి? ‘ఓట్ల కోసం సవాలక్షా చెబుతారు, అన్నీ అవుతాయా?’ అని టి.డి.పి అభిమాన ‘జనం’ సైతం తమ నేతను వెనకేసుకు రావడం తీవ్ర అభ్యంతరకరం.

ఢిల్లీ మద్దతు లేనిదే బాబు హామీలు నెరవేరడం సాధ్యం కాదనీ, ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తన వాగ్దానాల భారాన్ని కూడా మోసుకుని వెళ్లాల్సి వస్తుందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. గత కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర హోదా, తద్వారా వచ్చే పన్నుల రాయితీలు రాబట్టుకోవాలన్నా, ఆర్.బి.ఐ ని ఒప్పించి ఋణ మాఫీ హామీ నెరవేర్చాలన్నా చంద్రబాబుకు కేంద్రం మద్దతు తప్పనిసరి. అయితే ఈ హామీలను నెరవేర్చడంలో మనకి చెప్పని షరతులు ఎన్ని ఉంటాయన్నదే అసలు చూడాల్సిన విషయం. రైతులకు నిజంగానే ఉపశమనం ఇచ్చేలా హామీ నెరవేర్చుతారో లేక “పంచపాడవులంటే మంచం కోళ్లలాగా ముగ్గురు” అంటారో కొన్ని నెలలు ఆగితే గానీ తెలియదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s