కఠిన నిర్ణయాలు తప్పవు -మోడి


Modi in Goa

అనేశారు! ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి ఆ కాస్త మాటా అనేశారు. ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టాలంటే కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోడి స్పష్టం చేశారు. మోడీని, బి.జె.పినీ అదే పనిగా పొగుడుకుంటే ఏమీ ఒరగదనీ అసలు పనిలోకి దిగితే కొన్ని సెక్షన్ల ప్రజలకు కష్టం తప్పదని ఆయన ఉన్న మాట చెప్పేశారు. అధికార పీఠాన్ని అధిష్టించి నెల కూడా కాలేదు, అప్పుడే కఠిన చర్యలు అంటున్నారు మోడి.

“ఆర్ధిక క్రమశిక్షణ తెచ్చుకోవాలంటే రాబోయే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో కఠిన నిర్ణయాలు, గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా దేశం యొక్క ఆత్మ విశ్వాసం పునరుజ్జీవింపజేసుకుని మరింతగా పెంచుకోవచ్చు” అని పనాజి (గోవా) లో బి.జె.పి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మోడీ అన్నారు.

తన కఠిన చర్యలకు బాధ్యతను మోడి కాంగ్రెస్ పై నెట్టేరు. గత ప్రభుత్వం చేసిన పాపాలు తనకు ఖాళీ ఆర్ధిక వ్యవస్ధను ఇచ్చాయని ఆయన చెప్పుకున్నారు. “గత ప్రభుత్వం ఏమీ వదిలి వెళ్లని పరిస్ధితుల్లో నేను దేశం పగ్గాలను చేపట్టాను. వారు ప్రతిదీ ఖాళీచేసి వెళ్లారు. దేశ ఆర్ధిక ఆరోగ్యం అధః పాతాళంలో ఉంది” అని మోడి వివరించారు. తాను తీసుకోబోయే కఠిన చర్యలు ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉండబోవని అసలు గుట్టు విప్పారు.

“దేశం నాకు అందజేసిన గాఢమైన ప్రేమాభిమానాలను నా చర్యలు గాయపరుస్తాయని నాకు తెలుసు. కానీ ఈ చర్యలు దేశ ఆర్ధిక ఆరోగ్యాన్ని తిరిగి తెస్తాయని దేశ ప్రజలు తెలుసుకున్నపుడు నేను మళ్ళీ ఆ ప్రేమాభిమానాలను పొందగలను” అని మోడి అన్నారు.

జ్ఞాపకశక్తి ఇంకా పెద్దగా నశించనివారికి ఈ మాటలు బహుశా ఎప్పుడో ఎక్కడో విన్నట్లు అనిపించాలి. 1991లో పి.వి.నరసింహరావు-మన్మోహన్ సింగ్ ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ప్రధాని సరిగ్గా ఇవే మాటలు చెప్పారు. ప్రజలు కష్టాలు భరించడానికి సిద్ధం కావాలన్నారు. త్యాగాలు చేయాలీ అన్నారు. అప్పుల్లో మునిగాము, ఖజానా ఖాళీ అయింది అన్నారు. రూపాయి విలువ తెగ్గోసుకోవాలి అన్నారు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల ముందు దేహి ఆనక తప్పదు అన్నారు. చివరిగా నూతన ఆర్ధిక విధానాల అవసరం ఉంది అని చెప్పారు.

ఏమిటా నూతన ఆర్ధిక విధానాలు? LPG! అంటే గ్యాస్? అవును మరియూ కాదు. 

LPG అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్! అనగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఈ విధానాలు అమలు చేస్తే దేశం పరుగులు పెట్టుద్ది అన్నారు, 21వ శతాబ్దం రావడానికి ముందే అందులోకి వెళ్లిపోతాం అన్నారు. అదంతా ఒట్టి గ్యాస్ అని జనానికి తెలిసేలోపు LPG బండి స్ధిరంగా పరుగు పెట్టడం మొదలయింది. ఆ పేరుతో జాతర మొదలు పెట్టారు. ప్రభుత్వ కంపెనీలని అంతర్జాతీయ విపణిలో బేరం పెట్టారు. లాభాలు వచ్చే కంపెనీల్లో కూడా వాటాల అమ్మకం మొదలు పెట్టారు. నవరత్నాలను కాపాడుతాం అన్నారు గానీ, ఆ తర్వాత వాటినీ అమ్మకానికి పెట్టారు.

ఫలితంగా లక్షల ఉద్యోగాలు రద్దైపోయాయి. రిటైర్మెంట్ ఖాళీల్ని భర్తీ చెయ్యడం మానేశారు. ప్రభుత్వరంగం పైన ఆధారపడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లక్షల్లో మూతపడిపోయాయి. ప్రజా పంపిణీ వ్యవస్ధను తూట్లు పొడుస్తూ వచ్చారు. నీటి వనరుల్ని బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పి తాగు నీటిని కూడా కొనుక్కునే స్ధితికి తెచ్చారు. కాంట్రాక్టీకరణ వేగవంతం చేసి వేతనాలను కిందికి నెట్టేశారు. వ్యవసాయ సరుకుల (inputs) ధరలు పైకి ఎగబాకాయి. దేశీయ వంగడాల స్ధానంలో బి.టి వంగడాలు ఆక్రమించేశాయి. ఉత్పత్తి పెంచాం అన్నారు గానీ అవి జనానికి అందుబాటులో లేకుండా పోయాయి. మార్కెట్ లో ధరల్లేక రైతులు దివాళా తీయగా దళారీలు కోట్లు గడిస్తూనే ఉన్నారు.

అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు కోరినట్లుగానే లక్షల మంది రైతులు త్యాగాలు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగం పెరిగింది. స్వయం ఉపాధిపై ఆధారపడడం పెరిగింది. కానీ అంబానీలు ఫోర్బ్స్ జాబితాలో చేరారు. పదివేల కోట్ల ఆస్తులున్న టాటా, బిర్లా, కిర్లోస్కర్, సింఘానియా తదితర కుటుంబాలు లక్షల కోట్లు గడించాయి. జనాలు త్యాగాలు చేస్తే ధనికులు సూపర్ ధనికులయ్యారు.

నూతన ఆర్ధిక విధానాలను ఆహ్వానించడం ద్వారా ప్రజలు కష్టాలు, త్యాగాలకు ఓర్చితే సుందరమైన భవిష్యత్తు ముందుంది అని చెప్పిన పి.వి-మన్మోహన్ ల కబుర్లు -మన్మోహన్ ప్రధాన మంత్రిరికం సాక్షిగా, వాజ్ పేయి-ఎన్.డి.ఏ పాలనలోని ‘వెలుగుల’ సాక్షిగా- ఒట్టి గ్యాస్ అని తేలిపోయింది. 20 యేళ్ళ LPG అమలు తర్వాత కూడా బడ్జెట్ లోటు అలాగే ఉంది. చెల్లింపుల సంక్షోభం గురించి గత ప్రధాని మన్మోహన్ వాపోయిన చరిత్ర నిన్నటిదే. రూపాయి విలువ మళ్ళీ దిగజారి డాలర్ = రు. 60 దగ్గర ఊగిసలాడుతోంది. మరి ప్రజలు చేసిన కష్టాలు, త్యాగాల ఫలితం వారికి ఎప్పుడు దక్కుతుంది? చెప్పడానికి పి.వి లేరు గాని, ఆయనకు ఊతం ఇచ్చిన మన్మోహన్ ఉన్నారు. వారి విధానాలను కొనసాగించిన వాజ్ పేయి, అద్వానీలు ఉన్నారు. వారి శిష్యులు ఉన్నారు.

విచిత్రంగా వాజ్ పేయి, అద్వానీల శిష్యులు నరేంద్ర మోడి మళ్ళీ కష్టాలు భరించాలి తప్పదు అంటున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటాను అంటున్నారు. “ఈ కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడదు. అవసరం అయిన చోట చర్యలు తీసుకోవాల్సిందే” అంటున్నారు. కేవలం ఒకటి, రెండేళ్లు ఓపిక పట్టండి అంటున్నారు. ‘ఈ ఒకటి, రెండేళ్లలో మీకు నాపైన కోపం వస్తుంది గానీ ఆ తర్వాత మీరే ప్రేమ కురిపిస్తారు’ అని నమ్మబలుకుతున్నారు. నమ్మాలా? పి.వి, మన్మోహన్, వి.పి.సింగ్, దేవేగౌడ, గుజ్రాల్, వాజ్ పేయి, అద్వానీ, సోనియా ఇత్యాదులంతా 20 యేళ్లలో చేయలేనిది మోడి ఒకటి, రెండేళ్లలో చేసేస్తారా?

‘గుజరాత్ మోడల్ ని చూడండి, నన్ను చూడండి. ఆ తర్వాత ఓటు వేయండి’ అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన నరేంద్ర మోడి గారు, ఈ కఠిన నిర్ణయాల సంగతి ఎప్పుడన్నా చెప్పారా? దేశ ఆర్ధిక పరిస్ధితి బాగోలేదన్న సంగతి ప్రధాని పీఠం కూర్చున్నాక గానీ తెలియలేదా?

ఇంతకీ గుజరాత్ లో ఎన్ని కఠిన చర్యలు తీసుకుని, ఎన్ని సెక్షన్ల ప్రజలను కష్టపెట్టి కార్పొరేట్ల చేత మోడి శభాష్ అనిపించుకున్నారు? గుజరాత్ మోడల్ లో ఈ విధంగా ‘కొన్ని సెక్షన్లను కష్టపెట్టే కఠిన నిర్ణయాలు’ ఉన్నట్లు ఎందుకు చెప్పలేదు? మోడి పాలన ఏయే సెక్షన్లను కష్టపెట్టనుందో ఆయనింకా చెప్పలేదు.  ప్రధాని మోడి చెప్పకపోయినా ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన గుజరాత్ లో పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ సెక్షన్లు ఏవో తెలియకపోదు. బహుళజాతి కంపెనీల కోసం భూములు కోల్పోయిన రైతులు, ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు, మత కొట్లాటలు, దాడులు రెచ్చగొట్టడం వల్ల భయం భయంగా బతుకుతున్న మైనారిటీలు… ఈ సెక్షన్లేనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పే సెక్షన్లు?

One thought on “కఠిన నిర్ణయాలు తప్పవు -మోడి

  1. ప్రభుత్వం లో లేనప్పుడు ఈ వాస్తవాలు ఎవన్నా తెలుస్తాయా ఎమిటండి? అప్పుడు కజాన నిండుకుందా లేక నిండుగా ఉందా ? అని మన్‌ మోహన్‌ గారికి తెలుస్తుంది గానీ, ఇప్పుడు మన ఏలిన వారికి తెలుసా ఏమన్ననా? తీరా సూస్తే మన్‌ మొహన్‌ కజానా అంత కాలీ చేసి పాయా మన ఏలిన వారు ఊహించారా ఏమన్ననా?
    ఇపుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పక అబద్దాలు చెపుతారా ఏమిటండీ? మీరు మరీనూ! అబద్దాలు చెపితే ఓట్లు ఏసిన జనాలు ఏమనుకుంటారు? ఏడిసి ఫొరూ! అందు వల్ల మీ లాంటీ వాల్లు విమర్శిస్తారనే నిలకడగా నిజం చెబుతున్నారు ఏలిన వారు. జనాన్ని నయాన్నో భయాన్నో వప్పించాలిగా? మీరు ఇంతోటిది రాద్దాంతం చెయ్య కండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s