అమెరికన్ ఉబర్ ఆప్ పై ఐరోపా టాక్సీ డ్రైవర్ల సమ్మె పోరు


అమెరికాకు చెందిన ‘ఉబర్’ కంపెనీ తయారు చేసిన మొబైల్ ఫోన్ అప్లికేషన్ పై యూరోపియన్ దేశాల టాక్సీ డ్రైవర్లు యుద్ధం ప్రకటించారు. ఈ అప్లికేషన్ తమ పొట్ట కొడుతోందని వారు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఎంతగా మొరపెట్టుకున్నా తమ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ఉబర్ మొబైల్ అప్లికేషన్ కు వ్యతిరేకంగా బుధవారం (జూన్ 11) సమ్మె పాటించారు. ఈ సమ్మెతో ఐరోపా దేశాల ప్రధాన నగరాల్లో వీధులు స్తంభించిపోయాయని రాయిటర్స్, బి.బి.సి, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు తెలియజేశాయి.

ఉబర్ అనేది అమెరికాకు చెందిన ఒక రవాణా నెట్ వర్క్ సాఫ్ట్ వేర్ కంపెనీ. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరం నుండి పని చేసే ఈ కంపెనీ 2009లో స్ధాపించారు. ఉబర్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా కారు/టాక్సీ డ్రైవర్లనూ, వాహనం కోసం చూస్తున్న ప్రయాణీకులను కలిపేందుకు ఈ అప్లికేషన్ ను అభివృద్ధి చేశారు. ఒక ప్రయాణం కోసం ఈ అప్లికేషన్ లో రిజిస్టర్ చేసుకున్న మరుక్షణమే వినియోగదారుల ముందు కారు ప్రత్యక్షం అయ్యేలా విస్తృతమైన నెట్ వర్క్ ను ఈ అప్లికేషన్ విస్తరించడంతో అది తమ భుక్తిని హరిస్తోందని టాక్సీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.

ప్రయాణీకులకు పోటీగా సేవలు అందజేయడానికి తాము అనుకూలమే అయినప్పటికీ ప్రభుత్వాలు తమపై విధించే నియమ నిబంధనలు ఏవీ ఈ అప్లికేషన్ ద్వారా అందుతున్న సేవలకు వర్తింపజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆప్ పైన ఐరోపా దేశాల్లో అనేక చోట్ల కోర్టుల్లో వ్యాజ్యాలు కూడా నడుస్తున్నాయి. ఉబర్ సేవలు నానాటికీ ఊపందుకోవడంతో ప్రత్యక్ష కార్యాచరణలోకి టాక్సీ డ్రైవర్లు దిగిపోయారు. బుధవారం అనేక యూరోపియన్ నగరాల్లో వారు సమ్మె కట్టి నగర రోడ్లను, ప్రధాన కూడళ్లను దిగ్బంధనం కావించారు.

టాక్సీ డ్రైవర్ల సమ్మె ఇటీవల కాలంలో జరిగిన పెద్ద రవాణా సమ్మెగా పత్రికలు పేర్కొన్నాయి. లండన్ లో 10 వేల మందికిపైగా సమ్మెలో పాల్గొన్నారని బి.బి.సి తెలిపింది. సెంట్రల్ లండన్ లో ప్రసిద్ధి చెందిన ట్రాఫల్గర్ స్క్వేర్ ను లైసెన్స్ టాక్సీ డ్రైవర్లు తమ బ్లాక్ క్యాబ్ లతో ముట్టడించారని, ఈ ముట్టడి వల్ల స్ధానికంగా రవాణా వ్యవస్ధ స్తంభించిందని ఇతర పత్రికలు తెలిపాయి. ప్రధాని కామెరాన్ నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్ లో ఊరేగింపుగా వెళ్తూ తమ ట్యాక్సీల హారన్ లను పెద్దగా మోగిస్తూ బ్రిటిష్ ప్రధాన మంత్రికి తమ మొర వినిపించడానికి వారు ప్రయత్నించారు.

ఫ్రెంచి రాజధాని ప్యారిస్ లోనూ టాక్సీ డ్రైవర్లు తమ టాక్సీలతో ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. జర్మనీ రాజధాని బెర్లిన్ లోనూ ఇదే పరిస్ధితి. బెర్లిన్ ప్రధాన రహదారిని వందలాది టాక్సీలు నింపేశాయి. ఫలితంగా  ప్రజా రవాణా కొన్ని చోట్ల స్తంభించగా మరికొన్ని చోట్ల నెమ్మదిగా సాగింది. స్పెయిన్ నగరాలు మాడ్రిడ్, బార్సీలోనా లలోనూ టాక్సీ డ్రైవర్ల సమ్మె వల్ల ప్రజా రవాణా స్తంభించింది. టాక్సీలో అందుబాటులో లేకపోవడంతో బస్సులు, మెట్రో రైళ్లు ప్రయాణీకులతో క్రిక్కిరిసిపోయాయి. అనేకమంది నడిచి కార్యాలయాలకు చేరుకోవలసిన పరిస్ధితి కూడా ఏర్పడింది.

యాండ్రాయిడ్ ఫోన్లు, ఐ ఫోన్లలో ఒక ఆప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు ఉబర్ కంపెనీ సేవలను పొందవచ్చు. మొదట్లో లగ్జరీ వాహనాల ప్రయాణీకులకు పరిమితం అయిన ఉబర్ సేవలు క్రమంగా అన్నీ తరగతుల ప్రయాణీకులకు విస్తరించాయి. ఇప్పుడయితే ఒక్క టాక్సీ లకు మాత్రమే పరిమితం కాకుండా అనధికారిక ప్రయాణ సేవలను కూడా ఉబర్ అందజేస్తోంది. అనగా ఒక రూట్ లో ప్రయాణించే టాక్సీని అదే రూట్ లో వెళ్లదలుచుకున్న వివిధ ప్రయాణీకులు ఉమ్మడిగా షేర్ చేసుకునే సేవలను సైతం ఉబర్ అందిస్తోంది. అనగా మామూలుగా అయితే ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకుని, రూట్ పరిమితి తీసుకుని, తగిన ఫీజులు-పన్నులు చెల్లించి నిర్వహించే రవాణా సేవలను ఉబర్ అనధికారికంగా నిర్వహిస్తోంది. ఇది సహజంగానే రవాణా సేవలు అందజేయడానికి లైసెన్స్ పొందిన టాక్సీ డ్రైవర్ల జీవికను దెబ్బ తీస్తోంది. అంతే గాకుండా ప్రజా రవాణా వ్యవస్ధకు నష్టాలు వాటిల్లడానికి కారణం అవుతోంది.

సరిగ్గా ఈ అంశాన్నే టాక్సీ డ్రైవర్లు ఎత్తి చూపుతున్నారు. టాక్సీ డ్రైవర్లకు అధికారిక లైసెన్స్ ఇవ్వాలంటే సవాలక్షా పరీక్షలు పెడితే గాని ఇవ్వరు. అది కూడా కనీసం 5 నుండి 7 సంవత్సరాల వరకూ అనుభవం ఉండాలి. ఇలా పొందిన లైసెన్స్ ల ద్వారా దశాబ్దాలుగా టాక్సీలు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఉబర్ ఆప్ వల్ల వారి ఉపాధికి తీవ్ర ప్రమాదం వచ్చిపడింది. టాక్సీ డ్రైవర్లను లైసెన్స్ ల కోసం వేధించే ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల పెట్టుబడితో నిర్వహిస్తున్న ఉబర్ సేవలను ఉపేక్షించడం చట్టాల ఉల్లంఘనే అని, తమకు వర్తించే చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు వర్తించవని టాక్సీవాలాలు ప్రశ్నిస్తున్నారు.

‘ఉబర్ టెక్నాలజీస్ ఇంక్’ కంపెనీలో పెట్టుబడిదారులు ఎవరో అధికారికంగా తెలియనప్పటికీ ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ అయిన ‘ఫిడిలిటీ ఇన్వెస్ట్ మెంట్స్’ ఇందులో ప్రధాన వాటా కలిగి ఉన్న విషయం బహిరంగ రహస్యం. ప్రముఖ వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ‘గోల్డ్ మేన్ సాచ్’ కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. అంతెందుకు గూగుల్ కంపెనీకి సైతం ఉబర్ లో వాటాలు ఉన్నాయి. ఇంకా ఇతర సిలికాన్ వ్యాలీ కంపెనీలు కూడా వివిధ మొత్తాల్లో వాటాలు కలిగి ఉన్నాయి. టాక్సీ తోలకం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నవారి ఉపాధిని కూడా బడా బహుళజాతి గుత్త పెట్టుబడిదారీ కంపెనీలు హరించివేస్తున్నాయనీ దీని ద్వారా అర్ధం అవుతోంది. 2010లో పూర్తి స్ధాయి సేవలను ప్రారంభించిన ఉబర్ టెక్నాలజీస్ 2014 నాటికే 18.3 బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీగా అవతరించిందంటే ఎన్ని కుటుంబాల ఆదాయాన్ని ఈ కంపెనీ కొల్లగొట్టిందో అర్ధం చేసుకోవచ్చు.

టాక్సీ డ్రైవర్ల ఆక్రోశాన్ని ఉబర్ వెనుక ఉన్న బడా కంపెనీలు యధావిధిగా అసత్య వాదనలతో కొట్టి పారేస్తున్నారు. టాక్సీ రవాణా పరిశ్రమ ఇన్నాళ్లూ పోటీ లేకుండా ఉన్నదని తమ ప్రవేశంతో పోటీ పెరిగి వినియోగదారులకు తక్కువ రేట్లకు సేవలు అందుతున్నాయని వారు వాదిస్తున్నారు. కానీ లైసెన్స్ లేకుండా రవాణా సేవలు అందజేయడం వల్ల టాక్సీ డ్రైవర్ల ఉపాధి పోవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పడిపోతున్న విషయాన్ని వారు మరుగుపరుస్తున్నారు. లైసెన్స్ లేకుండా రవాణా సేవలు నిర్వహిస్తున్నందుకు వివిధ దేశాల్లో కోర్టుల నుండి ఉబర్ కు నోటీసులు అందాయి. కొన్ని చోట్ల కేసులను కొట్టివేయగా మరికొన్ని చోట్ల టాక్సీ డ్రైవర్లకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. కానీ ఆ తీర్పులను అమలు చేయడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదు. దానితో పరిస్ధితి అలాగే కొనసాగుతోంది.

లాస్ వేగాస్, మియామి నగరాల్లో స్ధానిక ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తేవడంతో ఉబర్ సేవలకు బ్రేకు పడింది. చికాగో, శాన్ ఫ్రాన్ సిస్కో, వాషింగ్టన్ డి.సి లలో ఉబర్ తో పాటు ఇతర అదే తరహా కంపెనీలు కోర్టు వ్యాజ్యాలు ఇంకా ఎదుర్కొంటున్నాయి.

షేర్డ్ ప్రయాణాల ద్వారా ప్రయాణీకులకు 30 శాతం నుండి 50 శాతం వరకూ రాయితీలు ఇస్తుండడంతో ఉబర్ కంపెనీకి సహజంగానే ఆదరణ పెరుగుతోంది. ఉబర్ ఆప్ ద్వారా ప్రయాణ ఛార్జీని లెక్కించే సౌకర్యాన్ని డ్రైవర్లకు కలుగుతుంది. ఇది టాక్సీ మీటర్లతో సమానం. అయితే మీటర్లతో రవాణా సేవలు అందించడానికి అనేక చట్టపరమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. వాటన్నింటిని పాటించే అవసరం లేకుండానే ఉబర్ ట్యాక్సీలు బిలియన్లు ఆర్జిస్తున్నాయి.

తమ వద్ద ఉన్న ఫైనాన్స్ వనరుల ద్వారా ప్రారంభంలో అతి తక్కువ ధరలకు సేవలు ఇవ్వడం ద్వారా కార్పొరేట్ కంపెనీలు పోటీ లేకుండా చేసుకుంటాయి. చిన్న చిన్న కంపెనీలు, వ్యక్తిగత టాక్సీ డ్రైవర్లు వారి పోటీ తట్టుకోలేక మొత్తంగా మార్కెట్ నుండి తప్పుకోవలసిన పరిస్ధితి ఏర్పడుతుంది. దానితో ఉబర్ లాంటి కార్పొరేట్, వాల్ స్ట్రీట్ కంపెనీల చేతికి మొత్తం మార్కెట్ వచ్చేస్తుంది. అనగా ఉబర్ చెప్పే పోటీ, చౌక ధరలు ఆచరణలో ఉనికిలో లేకుండా పోతాయి. ఏ రంగం చూసుకున్నా కార్పొరేట్ కంపెనీలు అనుసరించే వ్యూహమే ఇది!

ఉబర్ కంపెనీ ప్రస్తుతం 38 దేశాలకు పైగా ఉన్న 128 నగరాల్లో సేవలు అందిస్తోంది. మంచి నీటి సరఫరాను కూడా కైవసం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలు చివరికి మన నోటికి ముద్ద అందజేసే పనిని కూడా స్వాయత్తం చేసుకునే రోజు వస్తుందేమో!

 

One thought on “అమెరికన్ ఉబర్ ఆప్ పై ఐరోపా టాక్సీ డ్రైవర్ల సమ్మె పోరు

  1. // మంచి నీటి సరఫరాను కూడా కైవసం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలు చివరికి మన నోటికి ముద్ద అందజేసే పనిని కూడా స్వాయత్తం చేసుకునే రోజు వస్తుందేమో!//
    వచ్చేసింది! మన మెట్రొ నగరాల్లో ప్రజా రవాణా రంగాన్ని ప్రైవేట్‌ కంపెనీల టేక్సీలు ఆక్రమించుకొన్నాయి! అవి ఇంతంతై వటుడింతై కార్పోరేట్‌ స్తాయికి ఎదగడానికి పెద్ద సమయం పట్టదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s