కరాచిపై పాక్ తాలిబాన్ దాడులు, శాంతి ఎప్పటికి? -ఫోటోలు


‘ఆ, శాంతి గాక ఇక ఏమున్నదిలే!” అని సత్యహరిశ్చంద్రుడు కాటి సీన్ చివరి అంకంలో దీర్ఘంగా నిట్టూర్చి ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం పరిస్ధితి అదే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరాంతానికి ఆఫ్ఘనిస్ధాన్ ను ఖాళీ చేయడానికి అమెరికా ముహూర్తం పెట్టుకున్న నేపధ్యంలో తాలిబాన్ తో శాంతి చర్చలు ఫలించే సూచనలేవీ కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఆఫ్ఘన్ తాలిబాన్ తో ఆఫ్ఘన్ ప్రభుత్వం శాంతి చర్చలు విఫలం అవుతుండగానే పాక్ తాలిబాన్ తో పాక్ కొత్త ప్రభుత్వం తలపెట్టిన శాంతి చర్చలు కూడా విఫల దిశలోనే సాగుతున్నాయి.

పాక్ తాలిబాన్ (తెహరీక్-ఎ-తాలిబాన్) తో శాంతి చర్చలు చేస్తామన్న వాగ్దానంతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. చెప్పినట్లుగానే శాంతి చర్చలు ప్రారంభించినట్లు ప్రభుత్వం చాటుకుంది. కానీ అదే సమయంలో ఆఫ్ఘన్ సరిహద్దు లోని వాయవ్య గిరిజన రాష్ట్రాల పైకి సైనికులతో దండెత్తి వెళ్లింది పాక్ కేంద్ర ప్రభుత్వం. ఈ దాడులనుండి తప్పుకోవడానికి కరాచి చుట్టుపక్కల ఆశ్రయం పొందుతున్న పాక్ తాలిబాన్ మిలిటెంట్లు గత ఆదివారం రాత్రంతా విమానాశ్రయంపై దాడి చేసి ధన, ప్రాణ హానికి, విధ్వంసానికి తెగబడ్డారు.

ఆదివారం తెల్లవారు ఝాముకల్లా దాడికి పాల్పడిన 10 మంది మిలిటెంట్లను మట్టుబెట్టామని ప్రభుత్వ బలగాలు ప్రకటించి విక్టరీ సంకేతాలు సైతం టి.వి కెమెరాలకు చూపించారు. కానీ ఇంతలోనే మంగళవారం మరో మిలిటెంట్ బృందం రెండు దిశల నుండి కరాచి విమానాశ్రయానికి ఒక కి.మీ దూరంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ పైకి దాడి చేశారు. ఈ దాడిని కూడా తిప్పి కొట్టామని ప్రభుత్వం ప్రకటించగా తాలిబాన్ మాత్రం తాము తమ దాడులను అనుకున్నట్లుగానే విజయవంతంగా ముగించామని ప్రకటించింది. అకాడమీపై దాడి అనంతరం మిలిటెంట్లు పక్కనే ఉన్న అతి పెద్ద మురికివాడలోకి విజయవంతంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ దాడులతో పాక్ తాలిబాన్, పాక్ ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలకు అవకాశం లేనట్లేనని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాయవ్య పాకిస్ధాన్ రాష్ట్రాలపై మంద్ర స్ధాయి దాడులు చేస్తున్న ప్రభుత్వం ఇక పూర్తి స్ధాయి దాడికి ఆలోచన చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుండి ఇంకా ఎలాంటి సూచనా అందలేదు.

“ప్రభుత్వం పై జరిగిన విజయవంతమైన దాడికి మేమే బాధ్యులం. మేము మా లక్ష్యాలన్నింటినీ సాధిస్తున్నాము. ఇలాంటి దాడుల్ని మరిన్ని చేయబోతున్నాం” అని పాక్ తాలిబాన్ ప్రతినిధి షాహీబుల్లా షాహిద్ చెప్పారని పశ్చిమ పత్రికలు (రాయిటర్స్, బి.బి.సి, ఎ.పి) తెలిపాయి.

ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది యూనిఫారం ధరించి వచ్చిన మిలిటెంట్లు 10 మంది భారీ మందుగుండు సామాగ్రితో ఆదివారం రాత్రి కరాచి విమానాశ్రయంపై దాడి చేశారు. ఇటీవలి కాలంలో ఇంత భారీ దాడికి తాలిబాన్ పూనుకోలేదు. గతంలోనూ కరాచీ నగరంలో దాడులు చేసిన చరిత్ర మిలిటెంట్లకు ఉంది. పౌర ప్రభుత్వానికి, మిలట్రీ పాలకులకూ మధ్య వైరుధ్యాలు తలెత్తినప్పుడల్లా అవి ఈ విధంగా మిలిటెంట్ల దాడుల రూపంలో వ్యక్తం అవుతాయి.

ఉగ్రవాదులుగా అమెరికా, ఐరోపా, చివరికి పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్తాన్ లు కూడా చెప్పే పాక్ తాలిబాన్ లో వివిధ గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో కొన్ని పౌర పాలకుల చెప్పు చేతల్లో ఉంటే మరికొన్ని మిలట్రీ పాలకుల (ఐ.ఎస్.ఐ) చెప్పు చేతల్లో ఉంటాయి. సి.ఐ.ఎ ఆధ్వర్యంలో, నిధులతో నడిచే ఉగ్రవాద గ్రూపులు కూడా కొన్ని ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. వివిధ పాలకవర్గ గ్రూపుల మధ్య వైరుధ్యాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా పరిష్కరించుకోలేని పరిస్ధితి ఏర్పడినప్పుడు ఉగ్రవాద దాడులు జరగడం అక్కడ మామూలు విషయం. ప్రపంచానికి మాత్రం పాక్, పశ్చిమ ప్రభుత్వాలు ఉగ్రవాదంపై గొప్ప పోరాటం సాగిస్తున్నాయన్న బిల్డప్ ఇవ్వబడుతుంది.

కరాచి విమానాశ్రయం, అకాడమీలపై పాక్ తాలిబాన్ చేసిన దాడులకు గల తక్షణ కారణం ఏమిటన్నదీ ఇంకా వెల్లడి కావలసి ఉంది.

ఈ కింది ఫోటోలను వివిధ వార్తా సంస్ధలు (ఎ.పి, యాహూ న్యూస్, రాయిటర్స్) అందించాయి.

12 thoughts on “కరాచిపై పాక్ తాలిబాన్ దాడులు, శాంతి ఎప్పటికి? -ఫోటోలు

  1. మీ వ్యంగ్యానికి రీసన్ ఎంటి పాకిస్టాన్ నిజంగానే ఉగ్రవాదమనే పాముని పెంచడంలేdaa

  2. పాము-పాలు పోలిక వాస్తవానికి విరుద్ధం. పైగా అది దాడుల లక్ష్యాన్ని నెరవేరుస్తుందే గానీ వివరించదు. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలో అసలు సమస్య అమెరికా-పాక్-ఆఫ్ఘన్ ప్రభుత్వాల ఉమ్మడి దోపిడి, అణచివేతలు. భౌగోళిక రాజకీయాల్లో భాగంగానే ఉగ్రవాద దాడులు జరుగుతాయి. గతం తీసుకున్నా, వర్తమానం తీసుకున్నా ఈ వాస్తవాన్నే తెలియజేస్తాయి. టార్గెట్ ఎంచుకుని జరుగుతున్న సుశిక్షిత దాడులలో పాల్గొంటున్నవారు మిలట్రీ శిక్షణ పొందినవారు. అలాంటి శిక్షణ ఇచ్చేది ఆఫ్-పాక్ లలో సి.ఐ.ఏ, ఐ.ఎస్.ఐ లే.

    పశ్చిమ సామ్రాజ్యవాదం ఆఫ్ఘనిస్ధాన్ ని తమ వ్యూహాత్మక కేంద్రాలలో ఒకటిగా ఎంచుకుంది. కాబట్టి అక్కడ వారి సేనలు ఉండాలి. సేనలు మరింత కాలం కొనసాగడానికి కారణాలు కావాలి. ఆ కారణాలే ఉగ్రవాద దాడులు. సిరియా, ఇరాక్, లిబియా లలో ఆల్-ఖైదా శక్తులకు అమెరికాయే శిక్షణ ఇచ్చి ప్రవేశపెట్టిన సంగతి వర్తమానమే. ఇటీవలి గతం కూడాను. ఒకవైపు ఆల్-ఖైదా తమ శతృవని చెబుతూ వారికే మద్దతు ఇవ్వడానికి కారణంగా ఇంతకంటే మరో వివరణ ఉండదు. తాలిబాన్ ను ప్రోత్సహించింది ఒక్క పాకిస్తాన్ మాత్రమే అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది. సి.ఐ.ఏ-అమెరికా ప్రభుత్వాల అనుమతి, నిధులు, మద్దతు లేకుండా పాకిస్ధాన్ కు అది అసాధ్యం. ఈ వివరాలు గత ఆర్టికల్స్ లో చాలాసార్లు రాశాను. పునశ్చరణ ఎందుకని ఈ ఆర్టికల్ లో రాయలేదు.

  3. నా.శ్రీ గారూ, భలేవాళ్ళే మీరు! మీతో వ్యంగ్యం ఎందుకాడతాను? మీ రెండో వ్యాఖ్యకు కూడా మీకా ఆలోచన వచ్చిందన్న అనుమానమే నాకు తట్టలేదు. పైన చెప్పాక చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s