రైతులకు మోడి వాత, యూరియా ధర పెంచే యోచన


A Kashmiri farmer spreads fertiliser on a rice field on the outskirts of Srinagar June 22, 2011. REUTERS/Fayaz Kabli/Files

A Kashmiri farmer spreads fertiliser on a rice field on the outskirts of Srinagar June 22, 2011. REUTERS/Fayaz Kabli/Files

బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను పరోక్షంగా ప్రవేశపెట్టనున్న మోడి ప్రభుత్వం అదే ఊపుతో రైతులకు నేరుగానే వాత పెట్టేందుకు యోచిస్తోంది. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు తగిన విధంగా రుణం తీర్చుకోవడానికి మోడి ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మేలు చేయడం కోసం గ్యాస్ ధరలను రెట్టింపు చేసినందున పెరగనున్న సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి యూరియా ఎరువు ధరను కనీసం 10 శాతం పెంచేందుకు యోచిస్తోంది. ఈ మేరకు ఉప్పందడంతో ఎరువుల కంపెనీల షేర్ల ధరలు ఒక్కసారిగా పెరిగి 8 శాతం వరకూ లాభపడ్డాయి.

యూరియా తయారీలో సహజవాయువుని అవసరం బాగా ఉంటుంది. నత్రజని ఎరువు అయిన యూరియా తయారీకి అయ్యే ఖర్చును ఐదు వంతులు చేస్తే అందులో నాలుగు వంతులు సహజవాయువు కోసమే అవుతుంది. అందువల్ల గ్యాస్ ధర పెరిగితే అనివార్యంగా దాదాపు అదే మొత్తంలో యూరియా ఎరువు ధర పెరుగుతుంది. కాబట్టి యూరియా సబ్సిడీ భారం కూడా పెరుగుతుంది. ఈ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి యూరియా ధరల్ని ఏకంగా 10 శాతం పెంచాలని మోడి ప్రభుత్వం తలపెడుతోంది. ఈ మేరకు ఎరువుల మంత్రి ఆమోదం కూడా లభించిందని, ప్రధాని ఆమోదం అయ్యాక బడ్జెట్ ద్వారానో, కేబినెట్ ద్వారానో యూరియా ధరను పెంచుతారని ప్రభుత్వాధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

రిలయన్స్ కు మేలు, రైతుకు భారం

యు.పి.ఏ ప్రభుత్వం పోతూ పోతూ రిలయన్స్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరను ఒక బ్రిటిష్ ధర్మల్ యూనిట్ కు 4.2 డాలర్ల నుండి 8.4 డాలర్లకు పెంచి పోయింది. అనగా సరిగ్గా రెట్టింపు చేసింది. ఈ ధర పెంపుదల కోసం వరుసగా ముగ్గురు మంత్రులను మార్చడానికి సైతం రిలయన్స్ కంపెనీ మంత్రాంగం నడిపింది. గత మూడేళ్లుగా కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం సహజవాయువును ఉత్పత్తి చేయకుండా ఉత్పత్తిని అమాంతంగా మూడింట రెండు వంతులు తగ్గించింది. కాంట్రాక్టుకు విరుద్ధంగా ఉత్పత్తిని తగ్గించినందుకు ఒప్పందం ప్రకారం 1 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా అది కూడా చెల్లించకుండా కాలయాపన చేస్తూ చివరికి ఆర్బిట్రేషన్ కోసం ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

ఈ వివాదం ఏళ్ల తరబడి సాగినా ప్రతిపక్ష బి.జె.పి ఒక్కసారి కూడా నోరు మెదిపింది లేదు. అక్రమంగా సహజవాయువు ధర పెంచి ప్రజలకు నష్టం చేకూర్చినందుకు ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అప్పటి కేంద్ర చమురు మంత్రి వీరప్ప మొయిలీ, కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, చమురు శాఖ కార్యదర్శి లపై ఎ.సి.బి కేసు నమోదు చేయించింది. ఈ అంశంపై తమ విధానం ఏమిటో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్, బి.జె.పిల ప్రధాని అభ్యర్ధులయిన రాహుల్, మోడి లకు అనేక సభల్లో బహిరంగ సవాళ్ళు విసిరారు. అయినా వారిద్దరూ నోరు తెరిచిన పాపాన పోలేదు. మోడి సైతం ఎందుకు నోరు తెరవలేదో ఇప్పుడు అర్ధం అవుతోంది. రిలయన్స్ కంపెనీకి ఎట్టి పరిస్ధితుల్లోనూ మేలు చేయడమే మోడి, రాహుల్ ల లక్ష్యం. ఆ సంగతి పైకి చెప్పలేకనే నోరు తెరవకపోవడం.

పోనీ రిలయన్స్ కంపెనీ గ్యాస్ కు ఏకంగా ధరను రెట్టింపు చేయడానికి కారణం ఏమన్నా ఉందా అంటే అదీ లేదు. చమురు వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని రంగరాజన్ నేతృత్వంలో కమిటీ వేసి ఆ కమిటీ చేత మమ అనిపించుకుని గ్యాస్ ధర పెంచేశారు. ధర పెంపుకు కమిటీ చెప్పిన కారణాలు అత్యంత హాస్యాస్పదం. ఎక్కడో సింగపూర్ లోనూ, బ్రిటన్ లోనూ ఉండే చమురు మార్కెట్ లో ఉన్న ధరలకూ ఇండియాలో ఉన్న ధరలకు తేడా ఉన్నదట. ఈ రెండు ధరలను సమానం చేయడానికి ఇండియాలో ఉత్పత్తి అయ్యే చమురు ధరని పెంచాలిట. ఇదొక కారణం. రెండో కారణం చమురు ధరలు తక్కువగా ఉన్నందున, లాభాలు తక్కువగా ఉన్నాయనీ, అందువలన చమురు రంగంలో విదేశీ పెట్టుబడులు రావడం లేదనీ కారణం చెప్పిన కమిటీ ఎఫ్.డి.ఐ లను ఆకర్షించాలంటే చమురు ధరలు పెంచాలని చెప్పింది.

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా మగడా అంటే దూడ మేతకు అని సమాధానం ఇచ్చిన కల్లు దొంగ చందం కాదా ఇది? ఒక సరుకు ధరను ఎలా నిర్ణయిస్తారు? ఆ సరుకుని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుని బట్టి నిర్ణయిస్తారు. ధరల నిర్ణయానికి అంతకు మించిన దారే లేదు. కానీ ఘనత వహించిన ఆర్ధిక వేత్త రంగరాజన్ మాత్రం గ్లోబల్ మార్కెట్ ధరల్ని బట్టి ఇక్కడి ఉత్పత్తి ధరల్ని నిర్ణయించేశారు.

మన చమురుని వెలికి తీయడానికి మన ఓ.ఎన్.జి.సి కంపెనీ ఉంది. దానికి అప్పగిస్తే చక్కగా చమురు వెలికి తీసి పెడుతుంది. దాన్ని శుద్ధి చేసి పంపకం చేసే ప్రభుత్వ కంపెనీలూ ఉన్నాయి. ఇన్ని వనరులు ఉంచుకుని ఎఫ్.డి.ఐ ల అవసరం ఎందుకొచ్చింది? ఇటు దక్షిణ చైనా సముద్రం నుండి అటు ఆఫ్రికా సముద్ర తీరాల వరకూ ఒన్.ఎన్.జి.సి కంపెనీ కార్యకలాపాలు విస్తరించాయి. అయినా దాన్ని కాదని రిలయన్స్ కి కాంట్రాక్టు ఇచ్చేశారు. పోనీ అనుకుంటే ఆ కంపెనీకి మేలు చేయడం కోసం కుంటిసాకులు చెప్పి ధరని రెట్టింపు చేయడం ఏ భారతీయ వినియోగదారుడి ప్రయోజనం కోసం? ఈ నిర్ణయం విదేశీ కంపెనీలకు, పెట్టుబడులకు (ఎఫ్.డి.ఐ) మేలు చేయడానికి తప్ప జనానికి మేలు చేయడానికి కాదు.

ఇలాంటి నిర్ణయాన్ని బి.జె.పి ఏ మాత్రం తప్పు పట్టలేదు. విలేఖరులు అడిగినప్పుడు తప్ప స్పందించలేదు. చివరిని ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏఏపి నేత స్వయంగా గుజరాత్ వెళ్ళి అడిగినా మోడి జవాబివ్వలేదు. ఆ తర్వాత కూడా అనేక సభల్లో అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశాన్ని లేవనెత్తి మోడి స్పందన కోరినా సమాధానం రాలేదు.

తీరా అధికారంలోకి వచ్చాక యు.పి.ఏ నిర్ణయాన్ని తిరగదోడడం మానేసి ఆ నిర్ణయం వల్ల పడే భారం తగ్గించుకోవడం కోసం రైతులపై భారం మోపడానికి మోడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. నిర్ణయాన్ని తిరగదోడితే ముఖేష్ అంబానికి మాత్రమే కోపం వస్తుంది. కానీ కోట్లాది మంది రైతులకు, గృహ, పారిశ్రామిక వినియోగదారులకు మేలు జరిగేది. యు.పి.ఏ నిర్ణయాన్ని అమలు చేస్తే మాత్రం మొత్తం ఆర్ధిక వ్యవస్ధని ధరల పరంగా అనేక అడుగుల ఎత్తుకు తీసుకొనిపోయి జనానికి అందకుండా చేయాల్సి వస్తోంది.

గ్యాస్ ధర రెట్టింపు చేసినందుకు గృహ వినియోగదారులకు ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ సబ్సిడీ తగ్గించడానికి గృహ సరఫరా (సిలిండర్) ధరలు పెంచుతారు. యూరియా ధరలు పెరుగుతాయి కాబట్టి యూరియా సబ్సిడీ తగ్గించడానికి యూరియా ధర పెంచుతారు. యూరియా ధర పెంచితే రైతులకు ఉత్పత్తి ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధర పెంచాలని ఆందోళన తలెత్తడం ఖాయం. గిట్టుబాటు ధర పెంచితే మళ్ళీ ఆహార ధరలు పెరుగుతాయి. వెరసి ఆర్ధిక వ్యవస్ధలోని వివిధ భాగాలు ధరల పరంగా గ్యాస్ ధర పెరిగిన మేర పైకి వెళ్లిపోతాయి. ఇది మళ్ళీ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ద్రవ్యోల్బణం అరికట్టడానికి మానిటరీ పాలసీకి ప్రతికూల సవరణలు చేయాలి. ఇంత తతంగానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడుతోంది.

విదేశీ కంపెనీలకు లాభం

రాయిటర్స్ ప్రకారం ఎరువుల మంత్రి అనంత కుమార్ యూరియా ధర పెంచడానికి తలూపారు. జులైలో బడ్జెట్ లో ప్రవేశపెట్టడం లేదా ఆ లోపే కేబినెట్ చేత ఆమోదింపజేసుకోవడం… ఈ రెండింటిలో ఏది బెటర్ అని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ధర పెంచాలా వద్దా అని కాదు. యూరియా ధర పెంపు ద్వారా మోడి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతోందని, బలహీన ఆర్ధిక వ్యవస్ధ వల్ల ఎదురవుతున్న కోశాగార ఒత్తిడులనుండి తప్పించుకుని యూరియా వృధా కాకుండా చర్య తీసుకుంటోందనీ రాయిటర్స్ మహదానందపడుతోంది. భారత రైతులకు యూరియా అందకుండా పోతే రాయిటర్స్ కి అంత ఆనందం మరి!

రాయిటర్స్ సంతోషం ఎందుకు? ఎందుకంటే యూరియా ధర పెంపు నిర్ణయం అమెరికా, ఐరోపాలకు చెందిన పోటాష్, పాస్ఫేట్ ఎరువుల కంపెనీలు కూడా లబ్ది పొందనున్నాయి. యూరియా ధర పెరిగితే ఆ మేరకు యూరియా నుండి రైతులు కాస్త దూరం జరిగి పోటాష్, పాస్ఫేట్ ఎరువుల వైపు మొగ్గు చూపుతారని పరిశీలకుల అంచనా. రాయిటర్స్ కూడా అదే అంచనా వేస్తోంది. పోటాష్, పాస్ఫేట్ ఎరువుల్లో అత్యధిక మొత్తాన్ని ఇండియా అమెరికా, కెనడా, రష్యాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అనగా యూరియా ధరల పెంపు వలన పోటాష్, పాస్ఫేట్ ఎరువులకు గిరాకీ పెరిగి అమెరికా, కెనడా, రష్యాల కంపెనీలు లాభపడతాయి. పోటాష్, పాస్ఫేట్ ఎరువుల ధరలపైన 2010 నుండి కంట్రోల్ ఎత్తివేసిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.

యూరియా ధరల్ని గత పదేళ్లుగా అసలు పెంచనేలేదట. అందువల్ల ఎరువుల సబ్సిడీ భారం విపరీతంగా పెరిగిపోయిందట. (రైతుల దగ్గరికెళ్లి ఈ మాటంటే బహుశా కర్ర పట్టుకుని తరుముకోవడం ఖాయం.) గ్యాస్ ధర పెంపుతో ఇక ఎరువుల ధరలు పెంచక తప్పని పరిస్ధితి ఏర్పడిందట. ఇవన్నీ మోడి ప్రభుత్వం లోని అధికారుల (బ్యూరోక్రట్ల) మాటలు. “గ్యాస్ ధర పెంపు వల్ల యూరియా ధరల పెంపు తప్పనిసరి అయింది. ప్రభుత్వం వద్ద మరో దారి లేదు. బడ్జెట్ లోపల గానీ, బడ్జెట్ లో గానీ నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాం” అని ప్రభుత్వ ఎరువుల కంపెనీ లోని సీనియర్ అధికారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

భారత ప్రజలకు కేంద్రం చెల్లించే సబ్సిడీ మొత్తం 11 బిలియన్ (రు. 65,000 లక్షల కోట్లు) డాలర్లయితే అందులో సగానికిపైగా యూరియా సబ్సిడీయే అని తెలుస్తోంది. అందుకే యూరియా ధరలు పెంచడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనిని రైతుల కోణం నుండి చూస్తే భారీ సంఖ్యలో రైతాంగం యూరియా ధర పెంపు వల్ల నష్టపోనున్నారని అర్ధం చేసుకోవచ్చు. యూరియా ధర పెంపు విషయంలో అంతిమ నిర్ణయం మోడీదేనని కూడా తెలుస్తోంది. కాబట్టి యూరియా ధర పెరిగాక, అందులో మోడి పాత్ర ఏమీ లేదని చెప్పడానికి వీలు ఉండబోదు. బహుశా మోడి చేయబోయే పని నెపం అంతా యు.పి.ఏ పైకి నెట్టివేయడం. యు.పి.ఏ గ్యాస్ ధర పెంచింది కాబట్టి తాము యూరియా ధర పెంచక తప్పలేదని చెప్పవచ్చు.

నిజానికి ఆ కారణం కూడా మోడీకి అందుబాటులో ఉండదు. ఎందుకంటే మోడి ప్రభుత్వం తలచుకుంటే గ్యాస్ ధరల్ని తిరిగి యధాతధ స్ధితికి తేవచ్చు. కాంట్రాక్టు ఉల్లంఘించినందుకు రిలయన్స్ ముక్కుపిండి జరిమానా వసూలు చేయొచ్చు. ఒప్పందం ప్రకారం రిలయన్స్ ఆధీనంలోని చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకుని ఓ.ఎన్.జి.సి కి అప్పగించవచ్చు. తద్వారా గ్యాస్ ధర పెంచడానికి బదులు తగ్గించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పొందవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు. అది కంపెనీల ప్రభుత్వం; కార్పొరేట్ల ప్రభుత్వం; ఎఫ్.డి.ఐల ప్రభుత్వం; రాయిటర్స్ లాంటి కార్పొరేట్ పత్రికలు మెచ్చిన ప్రభుత్వం. కాబట్టి అద్భుతాలు జరిగి యూరియా ధర యధాతధంగా కొనసాగే అవకాశం దాదాపు సున్నా.

పైగా కోశాగార క్రమశిక్షణ (Fiscal Discipline) నెలకొల్పుతామన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చుకోవాల్సిన భారం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పైన కూడా ఉందాయే. కోశాగార క్రమ శిక్షణ అంటే వృధా ఖర్చు తగ్గించుకుని ప్రతి పైసాను ఉత్పాదక ఖర్చుగా మలచడం. పాలకుల దృష్టిలో ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు పరమ వృధా ఖర్చు. ఓట్ల కోసం వాటిని కొనసాగిస్తారు గానీ ఏ మాత్రం వీలు దొరికినా వాటిని ఎత్తివేయడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధమే.

ఇది మొదటి విడత పెంపు మాత్రమే

గ్యాస్ ధర పెంపు వల్ల భారత రైతులు వినియోగించే యూరియా ఉత్పత్తి ఖర్చు కనీసం 1.7 బిలియన్ డాలర్లు పెరుగుతుందని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఏ.ఐ) అంచనా వేసింది. ఇది దాదాపు 10 వేల కోట్ల రూపాయలకు సమానం. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను కోశాగార లోటు జి.డి.పి లో 4.1 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గత ప్రభుత్వం 2014-15 ఆర్ధిక సంవత్సరానికి రు. 67,970 కోట్లు ఎరువుల సబ్సిడీ ఇవ్వాలని బడ్జెట్ లో ప్రతిపాదించింది. ఇది తక్కువ అంచనా అనీ, వాస్తవానికి రు. లక్ష కోట్లు దాటుతుందని ఎఫ్.ఏ.ఐ అంచనా వేస్తోంది. దానికి కారణం గత సంవత్సరం సబ్సిడీలో కొంత భాగాన్ని గత ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ సంవత్సరానికి బదలాయించడం. అలా బదలాయించడం ద్వారా చిదంబరం అంకెల గారడీ చేసి ఫిస్కల్ డెఫిసిట్ లక్ష్యాన్ని సాధించాం అనిపించుకున్నారు. కాబట్టి గత సంవత్సరం సబ్సిడీని కూడా తగ్గించాల్సిన భారం మోడి ప్రభుత్వం పైన పడింది.

ఈ నేపధ్యంలో యూరియా ధరను వాస్తవానికి 40 నుండి 50 శాతం వరకూ పెంచాల్సి ఉందని ఒకేసారి అంత పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ప్రస్తుతానికి 10 శాతానికి పరిమితం చేస్తున్నామని ప్రభుత్వ ఎరువుల కంపెనీ అధికారి చెప్పారు. “గ్యాస్ ధర పెంపు వల్ల యూరియా ధరల్ని 40% నుండి 50& వరకూ పెంచాల్సి ఉంది. ప్రభుత్వం ఒకేసారి అంత పెంచలేదు. కాబట్టి 10 శాతంతో ప్రారంభించడం ఉత్తమం” అని సదరు అధికారి చెప్పారు.

యూరియా ధర 2,000 నుండి ఇప్పటివరకు 16.5 శాతం మాత్రమే పెరిగిందట. (ఇప్పుడు యూరియా టన్ను ధర రాయిటర్స్ ప్రకారం రు 5,360/-.) ఇదే కాలంలో డి.ఏ.పి ధర మూడు రెట్లు పెరగ్గా, పాస్ఫేట్ (MoP) నాలుగు రెట్లు పెరిగిందని దానితో రైతులు యూరియాను విచక్షణారహితంగా వాడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. గత దశాబ్ద కాలంలో యూరియా వినియోగం 30 మిలియన్ టన్నులకు పెరిగిందని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తున్న విషయం. భారత ఎరువుల పరిశ్రమలు 22 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుండగా మిగిలిన 8 మిలియన్ టన్నులను దిగుమతి చేస్తున్నారని ఎఫ్.ఏ.ఐ లెక్కలు చెబుతున్నాయి. యూరియా ధరల పెంపు ద్వారా ఈ వినియోగాన్ని తగ్గిస్తే రైతులు కొంతమేరకైనా అమెరికా, కెనడా, రష్యాలు పంపే డి.ఏ.పి, ఎం.ఓ.పి లవైపు మళ్లుతారని తద్వారా పశ్చిమ కంపెనీలు దండుకోవచ్చని పాలక వర్గాలు ఆశలు పెట్టుకున్నారు. సదరు ఆశలను నెరవేర్చేందుకు మోడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గుజరాత్ మోడల్ అంటే ఇదే.

5 thoughts on “రైతులకు మోడి వాత, యూరియా ధర పెంచే యోచన

  1. Asalu ee రాయిటర్స్ evaru… Veeri raatalani miru enduku ekkuvaga pattinchukuntunnaru
    Ademina prabhutva adhikara samstha???daya chesi cheppandi leka ekkadina already cheppi unte link ivbandi

  2. రాయిటర్స్ బ్రిటన్ కి చెందిన వాణిజ్య, రాజకీయ వార్తా సంస్ధ. అది రాయిటర్స్ కాబట్టి పట్టించుకోవడం కాదు. ఆ సంస్ధ స్వయంగా ప్రభుత్వాధికారులు చెప్పిన అంశాలనే వార్తలుగా ఇస్తోంది. అందుకే పట్టించుకోవడం. ఇతర వార్తా సంస్ధల వార్తల్లో సొల్లు ఎక్కువ ఉంటుంది. రాయిటర్స్ రాసేదాంట్లో విషయంపై కేంద్రీకరణ ఉంటుంది. గణాంక వివరాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ గణాంకాలు మన ప్రభుత్వ గణాంకాలతో తేడాగా ఉన్నా మొత్తం మీద ఒక పిక్చర్ ఇస్తుంది. దాని విశ్లేషణ తప్పా, ఒప్పా అన్నది మనం నిర్ణయించుకోవాలి. ఒక్క రాయిటర్స్ మాత్రమే కాదు, పశ్చిమ వార్తా సంస్ధలు ఇచ్చే వాస్తవ సంఘటన వివరాలు, గణాంకాలు పట్టించుకుంటూనే వాటి విశ్లేషణలని విమర్శనాత్మకంగా చూడాల్సిందే.

  3. // పాలకుల దృష్టిలో ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు పరమ వృధా ఖర్చు. ఓట్ల కోసం వాటిని కొనసాగిస్తారు గానీ ఏ మాత్రం వీలు దొరికినా వాటిని ఎత్తివేయడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధమే. //
    ఎందు వల్లనంటారు? సబ్సిడీలు ప్రజల పేరు తోటి పాలకులు పెట్టుబడి దార్లకు ఇచ్చే ఒక ఇన్సెంటీవ్‌ గానే ఉంటుంది మరెందుకు వారు భాధ పడి పోతారు? అసలి పెట్టుబడి దారులు చేపించే ఉత్పత్తి కి ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఆ సరుకు విలువకు దాని ధరకు ఉండే విత్యాసం ఏమిటీ? ఉదా: ఒక సరకు విలువ 60 రూపాయలనుకుంటే దాన్ని అతను మార్కెట్‌ లో 80 అమ్మగలిగి నప్పుడు అతని లాభం 20. అదే సరుకు పంపనీ చేసి 40 రూపాయలను సబ్సిడీగా పొందినపుడు అతని లభం 40. దాన్నే అధనపు విలువా అంటున్నాం. ఈ ఉత్పత్తికి కావల్సిన ముడుసరుకు సామాజికమైనది కూడా. అలాంటపుడు ఏ విధంగా నష్ట పోతున్నట్టు?

  4. తిరుపాలు గారూ

    “ఒక సరుకు విలువ 60 దాన్నీతను మార్కెట్ లొ 80 అమ్ముతాడు అతని లాభం 20” అతను 80 కే ఎందుకు అమ్మాలి? ఏ 100 కొ లేక 120కొ ఎందుకు అమ్మలేదు?. సరుకు విలువ 80 గానే వుంది వాడు ఏ విదంగా లెక్క వేస్తాడంటె ముడిసరుకులూ , జీతాలూ, పొను అప్పటికే మార్కెట్ అనుభవం ద్వారా తను ఎంత లాభం తీసుకొవచ్చునొ ఒక అంచనాకు వస్తాడు కాబట్టి ఆ మిగిలింది లాభం అనుకుంటాడు. మొసాల ద్వరా వచ్చేది సెకండరీ లాభం. అసలు వాస్తవంగా ఏమిజరుగుతుందొ వాడికి తెలియదు. లాభం బయటనుంచి వస్తుందనుకుంటాడు.

    కంపెనీ చేసిన ఉత్పత్తిని ప్రభుత్వం ద్వరా సబ్సీడీ పొందినప్పుడు దాని విలువలొ ఎమీ మార్పు రాదు . అది కొనుగొల దార్లకు తక్కువ విలువకు లభిస్తుంది. అది కొనుగొలదార్లకు ఒక రకంగా తక్కువ ధరకు రావడం వల్ల లబ్ది చేకూరుతుంది. దాన్ని అదనపు విలువగా భావించకుడదు. మీ వ్యాక్య ద్వారా లాభం వేరూ అదనపువిలువ వేరూ అనుకుంటునట్టు ఉన్నారు రెండూ ఒకటే 40 లాభాన్ని పెట్టుభడిదార్గురించి మాట్లాడుతున్నారా లేక కొనుగొలదార్లగురించి మాట్లాడుతున్నారనేది అస్పస్టంగా వుంది.

  5. ఎరువుల ధరలు పెరగడం వల్ల కూడా 1998 తరువాత రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. దేశ కరెన్సీ విలువ తగ్గిన ప్రతిసారీ ఎరువుల తయారీ కోసం దిగుమతి చేసుకునే ముడి సరుకుల ధరలు పెరుగుతాయి, తత్ఫలితంగా ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s