ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణదేవాలయంలో కత్తుల కోలాటం -ఫోటోలు


జూన్ 6 తేదీతో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కు 30 యేళ్ళు నిండాయి. సిక్కుల పవిత్ర దేవాలయం ‘గోల్డెన్ టెంపుల్’ లో తిష్ట వేసిన ఖలిస్తాన్ టెర్రరిస్టులను పారద్రోలేందుకు ఇందిరాగాంధి ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్, భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది (అనధికార అంచనా ప్రకారం వేలాది మంది) చనిపోగా, అనంతరం జరిగిన ప్రతీకార హత్య, మూకుమ్మడి హత్యాకాండలలో మరిన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కుల ఊచకోత గురించిన కేసు ఇప్పటికీ కాంగ్రెస్ నేతలను వెన్నాడుతున్న సంగతి తెలిసిందే.

ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 30 సం.లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ దేవాలయంలోపల ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఖలిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేయడం దగ్గర మొదలయిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి పరస్పరం కత్తులు, ఈటెలతో తలపడేవరకూ దారి తీసిందని పత్రికలు తెలిపాయి. స్వర్ణ దేవాలయం బైట ఉన్నవారికి కూడా లోపల పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో జరిగిన కొట్లాట దృశ్యాలు వినిపించాయని, కనిపించాయని తెలుస్తోంది. ఘర్షణలో పలువురు గాయపడ్డారని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు నివేదించాయి.

ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసే విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఘర్షణ చెలరేగిందని ది టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. అయితే బి.బి.సి కధనం భిన్నంగా ఉంది. ఆపరేషన్ బ్లూస్టార్ వార్షిక దినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారని, ఈ సందర్భంగా ఎవరు మొదట మైకులో మాట్లాడాలన్న విషయంలో తగాదా జరిగిందని, ఇదే పరస్పరం కత్తులతో తలపడేవరకూ వెళ్లిందని బి.బి.సి తెలిపింది. ఘర్షణవల్ల కనీసం ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించగా డజను మంది వరకూ గాయపడ్డారని ఇతర పత్రికలు తెలిపాయి.

1984 ఆపరేషన్ లో 400 మంది సిక్కులు 87 మంది సైనికులు చనిపోయారని భారత ప్రభుత్వం చెబుతుంది. అయితే వివిధ సిక్కు సంస్ధలు వెయ్యికి పైగా సిక్కులు మరణించారని చెబుతారు. చనిపోయినవారిలో దేవాలయం సందర్శనకు వచ్చిన అనేకమంది యాత్రీకులు కూడా ఉన్నారని సిక్కు సంస్ధలు వాదిస్తాయి. నీలం రంగు, కాషాయ రంగు తలపాగాలు ధరించిన రెండు గ్రూపుల వాళ్ళు పరస్పరం కేకలు వేసుకుంటూ కత్తులు, ఈటెలు విసురు కుంటూ వీడియోల్లో కనిపించారని పత్రికలు తెలిపాయి. టెలిగ్రాఫ్ లాంటి పత్రికలు పలు ఫోటోలను ప్రచురించాయి.

“ఈరోజు 1984 మృత వీరులను పవిత్రంగా స్మరించుకోవాలని భావించాము. కానీ జరిగింది చాలా విచారకరం. ఆలయ గౌరవానికి ఈ రోజు మరోసారి భంగం కలిగింది” అని పంజాబ్ పాలక పార్టీ శిరోమణి అకాలీ దళ్ ప్రతినిధి ప్రేమ్ సింగ్ వ్యాఖ్యానించారని బి.బి.సి తెలిపింది.

వేర్పాటువాద గ్రూపుగా పత్రికలు చెబుతున్న శిరోమణి అకాలీ దళ్ (అమృత్ సర్) కార్యకర్తలు శిరోమణి గురుద్వారా ప్రభంధక్ కమిటీకి చెందిన భద్రతా బలగాలతో తలపడ్డారని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. పరస్పరం కత్తులు, చురకత్తులు, కర్రలు, బరిసెలు (ఈటెలు) ధరించి తలపడ్డారని స్ధానిక పోలీసులు, రాజకీయ నేతలను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది.

ఖలిస్తాన్ ఉద్యమం పైకి చల్లబడినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ జ్ఞాపకాల ప్రాతిపదికన భావోద్వేగాలు అంతర్గతంగా వ్యాపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు గత కొన్ని సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ఇందిరాగాంధి హత్యానంతరం ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సిక్కులపై కొనసాగిన ఊచకోతకు సరైన న్యాయం జరగలేదన్న వాస్తవం కూడా ఈ భావోద్వేగాలను మరింతగా పెంచి పోషిస్తోందని, ఆనాటి ఘటనలతో సంబంధం లేని యువకులు సైతం ప్రస్తుతం ఈ భావోద్వేగాల చుట్టూ ర్యాలీ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బి.జె.పి-శిరోమణి అకాలీ దళ్ పార్టీల కూటమికి ప్రత్యామ్నాయంగా ఇటీవల ఎన్నికల్లో ఏఏపి కి ఆదరణ పెరగడం వెనుక కూడా ఈ తరహా విభజన (polarization) పని చేసిందని వారి అభిప్రాయం.

దేశం దృష్టిలో అప్పటి సిక్కు వేర్పాటు వాద నాయకుడు జర్నెల్ సింగ్ భింద్రన్ వాలే టెర్రరిస్టు అయినప్పటికీ పంజాబ్ లో సిక్కుల దృష్టిలో మాత్రం ఉన్నత స్ధాయి అమరవీరుడుగా ఇప్పటికీ మన్ననలు అందుకుంటున్నారు. స్వర్ణ దేవాలయంతో పాటు అనేకమంది సిక్కుల ఇళ్ళలో భింద్రన్ వాలే, ఆయనతో పాటు చనిపోయిన నేతల ఫోటోలు పూజలు అందుకుంటున్నాయి. ఈ వాస్తవాన్ని తెలియనట్లు ప్రధాన స్రవంతి జాతీయ పార్టీలు నటిస్తున్నాయని, ఇదే పద్ధతి కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నవారు లేకపోలేదు.

ఈ ఫోటోలను ది టెలిగ్రాఫ్, బి.బి.సి తదితర పత్రికలు అందించాయి. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s