సంక్షోభం వీడని ఐరోపా, మరింత ఉద్దీపన అమలు


President of European Central Bank Mario Draghi

President of European Central Bank Mario Draghi

2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఐరోపా దేశాలను చుట్టుముట్టిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఇంకా ఆ దేశాల్ని పీడిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) ప్రకటించిన తాజా ఉద్దీపన చర్యలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు సున్న శాతానికి దగ్గరగా ఉన్న వడ్డీ రేటును మరింతగా తగ్గించడం ద్వారా మరిన్ని నిధులను మార్కెట్ లో కుమ్మరించడానికి ఇ.సి.బి నిర్ణయం తీసుకుంది. బహుశా మరే దేశమూ ఇంతవరకు చరిత్రలో ఎరగని చర్యలను కూడా ప్రకటించడం ద్వారా తాము పడుతున్న కష్టాల తీవ్రతను ఇ.సి.బి ప్రపంచానికి తేటతెల్లం చేసింది. 18 ఐరోపా దేశాల యూరో జోన్ కూటమిని ఋణ సంక్షోభం నుండి బైటికి తేవడానికి సంప్రదాయేతర చర్యలను ప్రకటించింది.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రస్తుతం నిర్వహిస్తున్న వడ్డీ రేటు కేవలం 0.25 శాతం మాత్రమే. దీనర్ధం యూరో జోన్ దేశాల బ్యాంకులు ఇ.సి.బి నుండి రుణం తీసుకోవాలంటే 0.25 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. దీనిని ఇంకా తగ్గించి 0.15 శాతానికి చేర్చడం ద్వారా సంక్షోభం తీవ్రత ఏపాటిదో ఇ.సి.బి లోకానికి వెల్లడి చేసింది. 0.1 శాతం మేరకు వడ్డీ రేటు తగ్గించడం ద్వారా బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలు మరిన్ని నిధులను సెంట్రల్ బ్యాంకు నుండి తీసుకుని కంపెనీలకు, కార్పొరేషన్లకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ఇతర ధనిక వర్గాలకు రుణాలుగా, ఇతర పంపకాలుగా పంపిణీ చేయాలని ఇ.సి.బి ఉద్దేశ్యం.

ఇ.సి.బి తీసుకున్న మరీ విచిత్రమైన, బహుశా మున్నెన్నడూ ఎవరూ చూడని చర్య: బ్యాంకులు తన వద్ద డబ్బును డిపాజిట్ చేయకుండా నిరోధించడానికి ప్రతికూల (నెగిటివ్) వడ్డీ రేటును నిర్ణయించడం! సాధారణంగా బ్యాంకులు తమ వద్ద మార్కెట్ కు అవసరమైనడాని కంటే డబ్బు ఎక్కువగా ఉందనుకుంటే ఆ డబ్బును సెంట్రల్ బ్యాంకు (రిజర్వ్ బ్యాంకు) లో డిపాజిట్ చేస్తాయి. ఆ విధంగా డిపాజిట్ చేసినందుకు సెంట్రల్ బ్యాంకు, వాణిజ్య బ్యాంకులకు నిర్దిష్ట మొత్తంలో వడ్డీ చెల్లిస్తుంది. దీనిని ఇండియాలో రివర్స్ రెపో రేటు అంటారు. ఈ వడ్డీ రేటును మైనస్ 0.1 (-0.1%) శాతంగా ఇ.సి.బి తాజాగా నిర్ణయించింది. అనగా వాణిజ్య బ్యాంకులు తమ డబ్బును ఇ.సి.బి వద్ద డిపాజిట్ చేయకుండా నిరోధించింది. ఒకవేళ డిపాజిట్ చేయాలని ఏ బ్యాంకయినా భావిస్తే అందుకు ఇ.సి.బి వడ్డీ ఏమీ ఇవ్వకపోగా 0.1 శాతం వడ్డీని తానే వసూలు చేస్తుంది. ఆ విధంగానైనా వాణిజ్య బ్యాంకులు విస్తారంగా రుణాలు పంపిణీ చేయాలనీ తద్వారా ఆర్ధిక వ్యవస్ధలో పెట్టుబడులు పెంచి చురుకుదనం తేవాలనీ ఇ.సి.బి ఆశిస్తోంది.

ఈ చర్యలు ప్రకటించిన అనంతరం ఐరోపా దేశాలతో పాటు ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు గురువారం (జూన్ 5) లాభాలను నమోదు చేశాయి. యూరో విలువ కూడా బలహీనపడింది. యూరో విలువ తగ్గడం వల్ల యూరో జోన్ ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. విలేఖరుల సమావేశంలో ఇ.సి.బి పరపతి విధానాన్ని ప్రకటించిన బ్యాంకు అధ్యక్షుడు మారియో ద్రాఘి తమ విధానం మరో 4 సంవత్సరాలు, అనగా కనీసం 2018 వరకూ ఇదే విధంగా కొనసాగుతుందని స్పష్టం చేశాడు. అప్పటిదాకా బ్యాంకులకు చౌక రేటుకు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేస్తుందని తెలిపాడు. ఒకవేళ ఇ.సి.బి వడ్డీ రేటు పెంచినప్పటికీ ఈ రుణాలకు మాత్రం ఫిక్స్ డ్ వడ్డీ రేటు మాత్రమే వసూలు చేస్తామన్నాడు. అనగా పాలసీ రేటు పెరిగినా ఈ నాలుగేళ్లలో ఇచ్చే రుణాలకు మాత్రం 0.15 శాతం వడ్డీ మాత్రమే వాణిజ్య, పెట్టుబడి బ్యాంకుల నుండి వసూలు చేస్తారు. ఆ విధంగా 2018 వరకూ తమకు చౌకగా రుణాలు అందుబాటులో ఉంటాయన్న నమ్మకం బ్యాంకులకు కలుగుతుందని అది ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి ఊతం ఇస్తుందనీ తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులకు ఇచ్చే రుణాల మొత్తం, సదరు బ్యాంకులు కంపెనీలకు ఇచ్చే రుణాలపై ఆధారపడేలా చూస్తామని చెప్పారు. ఆ విధంగా ఇ.సి.బి నిధులు కంపెనీలకు అందేలా జాగ్రత్త పాటిస్తున్నామని ద్రాఘి చెప్పదలిచారు.

చిన్న వ్యాపారస్ధులకు ఇచ్చిన రుణాలను బ్యాచ్ ల వారీగా తామే కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఈ కొనుగోలు ద్వారా బాండ్లు జారీ చేస్తామని ఇ.సి.బి అధ్యక్షుడు చెప్పారు. దీనివల్ల కంపెనీలకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు వీలవుతుందని ఇ.సి.బి అంచనా. వారం వారీగా డిపాజిట్లు సేకరించే కార్యక్రమాన్ని ముగిస్తామని తద్వారా బ్యాంకుల వద్ద 179 బిలియన్ యూరోల సొమ్ము ఉండిపోతుందని మారియో చెప్పారు. సభ్య దేశాలు జారీ చేసే సార్వభౌమ ఋణ పత్రాలను (సావరిన్ బాండ్లు లేదా ట్రెజరీ బిల్లులు) తామే కొనుగోలు చేసి డబ్బును మార్కెట్ లోకి విడుదల చేసే ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ (క్యూ.ఇ) విధానాన్ని అనుసరించే అవకాశం కూడా ఉంటుందని ద్రాఘి చెప్పడం విశేషం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరిగ్గా ఇదే విధానాన్ని క్యూ.ఇ-3 కింద అనుసరిస్తోంది. అమెరికా తన క్యూ.ఇ 3 ని మెల్లగా ఉపసంహరించుకుంటుండగా యూరోజోన్ క్యూ.ఇ వైపు ప్రయాణిస్తోంది. బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (ఇంగ్లాండ్ యూరో జోన్ లో సభ్యురాలు కాదు) లు కూడా క్యూ.ఇ విధానాన్ని అమలు చేస్తున్నాయి. 18 సభ్య దేశాలు ఉన్నందున సంక్లిష్టం అవుతుందన్న భయంతో ఈ విధానం జోలికి ఇ.సి.బి ఇంతవరకు పోలేదు. ఇప్పుడు ఆ సంక్లిష్టత భయాలను కూడా వదులుకోవాల్సిన పరిస్ధితిలో ఇ.సి.బి/ఐరోపా దేశాలు పడిపోయాయి.

ఐరోపా దేశాలను ముఖ్యంగా యూరో జోన్ దేశాలను వెన్నాడుతున్న మరో భయం ప్రతి ద్రవ్యోల్బణం. జపాన్ ను రెండు దశాబ్దాలుగా విడతలవారీగా పట్టి పీడిస్తున్న ప్రతి ద్రవ్యోల్బణం (Deflation) ఇప్పుడు తమనూ పట్టుకుంటుందని ఇ.సి.బి భావిస్తోంది. మార్కెట్ నిండా సరుకులు ఉన్నప్పటికీ కొనుగోలుదారుల వద్ద ఆ సరుకుల విలువకు సమానమైన డబ్బు లేకపోవడమే ప్రతి ద్రవ్యోల్బణం. ఈ పరిస్ధితి వలన సరుకుల ధరలు బాగా పడిపోతాయి. ధరలు తగ్గుతున్నప్పుడు జనం సాధారణంగా సరుకులు కొనడం తగ్గించేస్తారు. కొంత ఆగితే ధరలు ఇంకా తగ్గవచ్చన్న ఆలోచనతో వారలా చేస్తారు. అనగా కొనుగోళ్ళు తగ్గిపోతాయి. ఫలితంగా డబ్బు చెలామణి పడిపోతుంది. దానితో ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడి జి.డి.పి పడిపోతుంది. ఈ పరిస్ధితిని తప్పించడానికి కూడా తమ ఉద్దీపన చర్యలను ఉద్దేశించామని, ద్రవ్యోల్బణం పెంచడం తమ కర్తవ్యాలలో ఒకటని ఇ.సి.బి అధ్యక్షుడు ద్రాఘి చెప్పారు. సాధారణంగా స్టిములస్ చర్యలకు వ్యతిరేకంగా ఉండే జర్మనీ సెంట్రల్ బ్యాంకు (Bundesbank) సైతం సై అనడంతో స్టిములస్ ద్వారా ద్రవ్యోల్బణం పెంచుకునేందుకు ఇ.సి.బి చర్యలకు దిగింది.

ఇ.సి.బి లెక్క ప్రకారం ద్రవ్యోల్బణం కనీసం 2 శాతం అన్నా ఉండాలి. మార్కెట్లోని సరుకుల విలువ కంటే కనీసం 2 శాతం ఎక్కువ డబ్బు జనం వద్ద ఉంటేనే సరుకుల మారకం తగినంతగా జరగదని దీని అర్ధం. కానీ గత సం.ము యూరో జోన్ లో నమోదయిన ద్రవ్యోల్బణం 0.5 శాతం మాత్రమే. ఈ సంవత్సరం ఇది 0.7 శాతం ఉంటుందని ఇ.సి.బి అంచనా వేస్తోంది. గతంలో ఈ అంచనా 1 శాతం అనుకోగా, వాస్తవ పరిస్ధితి విరుద్ధంగా ఉండడంతో అంచనాను 0.7 శాతానికి తగ్గించుకున్నారు. అయితే 2015 లో ద్రవ్యోల్బణం 1.1 శాతానికి 2016లో 1.4 శాతానికి పెరుగుతుందని ఆశిస్తున్నామని ఇ.సి.బి తెలిపింది. ద్రవ్యోల్బణం ఆశించినంతగా పెరగకపోతే ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోతామని ఇ.సి.బి భావిస్తోంది.

యూరో జోన్ జి.డి.పి వృద్ధి రేటు ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 0.2 శాతం మాత్రమే నమోదయింది. నిరుద్యోగం మాత్రం 11.7 శాతం రికార్డయింది. అనగా కొనుగోలుదారుల వద్ద కొనుగోలు శక్తి బాగా బలహీనంగా ఉన్నది. ఉన్న డబ్బు అంతా ధనిక వర్గాలు, కంపెనీలు, ఫండ్ ల వద్ద పేరుకుపోగా సరుకుల అవసరం ఉన్న కార్మిక వర్గం వద్దనేమో డబ్బు లేదు. పొదుపు విధానాల పేరుతో అమలవుతున్న వేతనాల కోతలు, సదుపాయాల రద్దు, ప్రైవేటీకరణల వల్ల నిరుద్యోగం పెరగడమే కాకుండా వేతనాలు పడిపోతున్నాయి. ఇవి అనివార్యంగా ప్రజల కొనుగోలు శక్తిని దిగజార్చుతున్నాయి. ఏ మార్కెట్ కొనుగోలు శక్తిని పెంచాలని ప్రభుత్వాలు, ఇ.సి.బి భావిస్తున్నాయో, అదే మార్కెట్ నుండి మరిన్ని లాభాలు పిండుకోవడానికి కంపెనీలు బలవంతగా పొదుపు విధానాలు అమలు చేస్తున్నాయి. ఇక కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది? సరుకులు కొనేవారెవ్వరు? ఒకపక్క కొనుగోలుదారుల శ్రమ శక్తికి తక్కువ ధరలు చెల్లించి ఎక్కువ లాభాలు పిండుకోవాలని పెట్టుబడిదారులు ప్రయత్నించడం, మరో పక్క శ్రమశక్తికి తక్కువ ధర ఇవ్వడం వల్ల కొనుగోలు శక్తి పడిపోయి సరుకుల అమ్మకాలు పడిపోయి లాభాలు పెంచుకోలేని పరిస్ధితి ఏర్పడడం! పెట్టుబడిదారీ వ్యవస్ధలోని మౌలిక వైరుధ్యం ఇది. ఈ వైరుధ్యం పరిష్కారం కానంతవరకూ ఎన్నెన్ని పై పూతలు పూసుకున్నా అవి మళ్ళీ మళ్ళీ మాసిపోతూ, మళ్ళీ మళ్ళీ వైరుధ్యం మరింత తీవ్రంగా తలెత్తుతూనే ఉంటుంది. 

One thought on “సంక్షోభం వీడని ఐరోపా, మరింత ఉద్దీపన అమలు

  1. http://ibnlive.in.com/news/drugs-sex-and-alcohol-could-boost-growth-in-europe/477548-79.html

    Paris: Europe’s governments are turning their attention to prostitution, drugs and contraband as possible ways of boosting their economic growth profiles, as they struggle away from their debt crises.

    Italy caused a stir when it announced last month that it would begin including revenues from drug trafficking and the sex trade, as well as contraband tobacco and alcohol, to calculate gross domestic product (GDP) from next year.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s