యూరప్ స్టిములస్: ఆకాశ వీధుల్లో భారత స్టాక్ మార్కెట్లు!


Sensex rises

ప్రతి ద్రవ్యోల్బణం భయంతో వణికిపోతున్న యూరోపియన్ దేశాలను బైటపడేయడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరో ఉద్దీపన పధకం ప్రకటిస్తుందన్న ఊహాగానాలు వ్యాపించడంతో భారత స్టాక్ మార్కెట్లు పరవళ్ళు తొక్కాయి.

ఆర్ధిక గమనాన్ని వేగవంతం చేయడానికి మరింత లిక్విడిటీని ఇ.సి.బి ప్రవేశపెడుతుందని నమ్మకమైన సంకేతాలు అందాయి. దాని ప్రభుత్వం భారత స్టాక్ మార్కెట్లకూ విస్తరించి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. సెన్సెక్స్ మొట్టమొదటిసారి 25,000 మార్కు దాటగా, నిఫ్టీ సైతం కొత్త రికార్డు నెలకొల్పింది.

గురువారం మెటల్, విద్యుత్, చమురు మరియు సహజవాయువు తదితర రంగాల షేర్లు భారీ కొనుగోళ్లకు గురయ్యాయి. దానితో బి.ఎస్.ఇ సెన్సెక్స్ 25,000 మార్కు దాటి 25,019.51 పాయింట్ల వద్ద ముగిసింది. ఐ.టి, పబ్లిక్ రంగ కంపెనీల షేర్లు సైతం బాగా లాభపడ్డాయి.

మే 16 తేదీన సెన్సెక్స్ మొదటిసారి ట్రేడింగ్ మధ్యలో 25,375 పాయింట్లు తాకినప్పటికి ఆ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్ళీ వెనక్కి పడిపోయింది. ఆ తర్వాతా, తన జీవితకాలంలోనూ 25,000 మార్కు దాటి ముగియడం సెన్సెక్స్ కు ఇదే మొదటిసారి.

ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా ఇదే తరహాలో లాభపడింది. దాదాపు 1 శాతం పెరిగి 7474 పాయింట్ల వద్ద ముగిసింది. దీనితో గత రికార్డు 7416 పాయింట్ల మార్కును నిఫ్టీ అధిగమించినట్లయింది.

ఉద్దీపన

యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు తన మానిటరీ పాలసీని ప్రకటిస్తూ దిగజారుతున్న ద్రవ్యోల్బణాన్ని పెంచడం కోసం (అవును! పెంచడం కోసమే) మరిన్ని నిధులను మార్కెట్ లో కుమ్మరించే చర్యలు ప్రకటిస్తుందన్న ఊహాగానాలు జోరుగా సాగాయి. (ఊహలకు తగ్గట్లుగానే ఇ.సి.బి వడ్డీ రేటును 0.25 శాతం నుండి 0.15 శాతానికి తగ్గించింది. బ్యాంకులు రుణాలు ఇవ్వడం మాని డబ్బు నిలవ చేస్తే 0.1 శాతం వడ్డీ వసూలు చేస్తామన్న విచిత్ర నిర్ణయాన్నీ ప్రకటించింది. ఈ అంశాలు మరోసారి చర్చిద్దాం.) దానితో సదరు నిధులు అందుబాటులోకి వస్తాయన్న అంచనాతో ఎఫ్.ఐ.ఐ లు భారీ మొత్తాల్లో స్టాక్ ల కొనుగోళ్లకు తెగబడ్డాయి.

ముఖ్యంగా బ్లూ చిప్ స్టాక్ లుగా పేరు గాంచిన షేర్లను కొని నిలవ చేయడానికి మదుపుదారులు ఎగబడ్డారు. జులైలో నూతన ప్రభుత్వం ప్రకటించనున్న బడ్జెట్ లో పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను ప్రకరిస్తారన్న అంచనాలు కూడా స్టాక్ మార్కెట్లను ఉర్రూతలూగించాయని ద ఎకనమిక్ టైమ్స్ (ఇ.టి) పత్రిక తెలిపింది.

ఒక విశ్లేషణా సంస్ధ అయితే సెన్సెక్స్ వచ్చే బడ్జెట్ లోపలే 30,000 మార్కు దాటిపోవచ్చని అంచనా వేసింది. మోడి/బి.జె.పి/ఎన్.డి.ఏ కి మెజారిటీ వచ్చిన నేపధ్యంలో ఈ సంవత్సరాంతానికి 30 వేల మార్కును సెన్సెక్స్ దాటుతుందని జర్మనీ బ్యాంకు డ్యూశ్చ్ బ్యాంకు అంచనా వేసింది. అసలా అంచనా వచ్చే నెలరోజుల్లోనే చేరుకోవచ్చని పరిశీలకులు చెప్పడాన్ని బట్టి కంపెనీల వర్గాలు ఎంత ఉత్తేజంతో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ప్రతి ద్రవ్యోల్బణం

ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణానికి బదులు ప్రతి ద్రవ్యోల్బణం జాడలు విప్పి నర్తిస్తుందన్న భయాలు అటు ప్రభుత్వ అధికారులను, ఇటు మార్కెట్లను పీడిస్తున్నాయి. ద్రవ్యోల్బణానికి (Inflation) వ్యతిరేక లక్షణం ప్రతి ద్రవ్యోల్బణం (Deflation). ద్రవ్యోల్బణం అంటే మార్కెట్ లో అందుబాటులో ఉన్న సరుకుల విలువ కంటే ఎక్కువ డబ్బు ఆర్ధిక వ్యవస్ధ చెలామణిలో ఉండడం అని తెలిసిందే. ప్రతి ద్రవ్యోల్బణం దీనికి సరిగ్గా విరుద్ధం. మార్కెట్లో సరుకులు దండిగా అందుబాటులో ఉంటాయి. కానీ జనం వద్ద డబ్బు సరుకుల విలువ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రతి ద్రవ్యోల్బణం వలన సరుకుల ధరలు పడిపోతూ ఉంటాయి. అసలే ఉత్పత్తులు అమ్ముడుబోక ఆర్ధిక వృద్ధి పడిపోతోంది. సాధారణంగా ధరలు తగ్గేటప్పుడు జనం కొనుగోళ్ళు తగ్గిస్తారు. దానికి కారణం ధరలు ఇంకా తగ్గవచ్చన్న అంచనాతో, ఇంకా తగ్గాక కొనుక్కోవచ్చులే అనుకుని కొనుగోళ్ళు వాయిదా వేస్తారు. దానితో సరుకులు షాపుల అలమరల నుండి కదలవు. ఈ ప్రతి ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మార్కెట్ లోకి మరింత లిక్విడిటీ ని చొప్పించాలని ఇ.సి.బి ఈ రోజు నిర్ణయం తీసుకుందని పత్రికలు తెలిపాయి.

ఇ.సి.బి నిర్వహిస్తున్న వడ్డీ రేటు ఇప్పటిదాకా 0.25 శాతం మాత్రమే. 2008 నుండి ఇ.సి.బి ఈ స్ధాయిలో వడ్డీ రేటు కొనసాగిస్తోంది. అయినప్పటికీ కంపెనీలు డబ్బును ఎక్కడికి అక్కడ బిగపట్టడంతో మదుపులు తగ్గిపోయాయి. పెట్టుబడి కార్యకలాపాలు మందగించాయి. ఫ్యాక్టరీలు స్ధాపించి ఉత్పత్తుల ద్వారా లాభ సంపాదనకు దిగడానికి బదులు, కంపెనీలు, సెంట్రల్ బ్యాంకు ఉద్దీపనల ద్వారా అందిన సొమ్మును మూడో ప్రపంచ, వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లకు తరలిస్తూ వేగిరం లాభాలు (quick profits) సంపాదించడంలోనే ఆసక్తి  కనపరుస్తున్నాయి.

దానితో డబ్బు చలామణి పరిమిత రంగాల్లోనే ఉంటోంది. పెట్టుబడులు ఉండవు గనుక ఉద్యోగాలూ ఉండవు. ఉద్యోగాలు తక్కువ కనుక కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఫలితంగా సరుకులు మళ్ళీ స్టోర్ల నుండి కదలవు. ఈ విధంగా ద్రవ్యోల్బణం లాగే ప్రతి ద్రవ్యోల్బణమూ ఒక  విష వలయం. వడ్డీ కోత, డబ్బు నిలవపై జరిమానాలు వేయడం లాంటి చర్యల ద్వారా ఈ వలయాన్ని చేదించాలని ఇ.సి.బి భావిస్తోంది. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s