కె.సి.ఆర్ కారు ఎక్కేశారు. డ్రైవర్ సీటు కూడా చేజిక్కించుకుని ప్రయాణం కూడా మొదలు పెట్టేశారు. అనగా సి.ఎంగా పదవీ స్వీకార ప్రమాణం చేసి, మంత్రివర్గం కూడా నియమించుకుని పాలన మొదలు పెట్టేశారు.
కాబట్టి ఆయన వదులుతున్న వాగ్దానాలకు కాస్త అర్ధం వచ్చి చేరింది. అవి నెరవేరుస్తారా లేదా అన్నది తర్వాత సంగతి.
రైతుకు 12,000 దాకా రుణం మాఫీ అంటున్నారు. ఉన్న పెట్టుబడులు ఎక్కడికీ వెళ్లొద్దని కోరారు. కొత్తవాళ్లు కూడా రావచ్చన్నారు. ప్రత్యేక హోదా తమకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడి ప్రభుత్వంతో శతృత్వం లేదన్నారు. బాబుతో పోటీ పడి కేంద్రంతో లాబీయింగ్ చేస్తామనీ చెప్పారు.
కానీ చంద్రబాబు గారు ఇంకా పదవీ స్వీకార ప్రమాణం చేయలేదు. ఆయన మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారో ఇంకా తేల్లేదు. కనీసం మంత్రులు ఎంతమందో కూడా తేల్చుకోలేదు. ఆయన వాగ్దాన పరంపరకు మాత్రం ఇంకా బ్రేకులు పడలేదు. ఎన్నికల ప్రచార మూడ్ నుండి ఇంకా బైటికి రానట్లుగా ఆయన ధోరణి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చిపోయిన ఆర్ధిక పరిస్ధితి పైన వలపోత సాగిస్తున్నారు. ఐనా సరే, ఋణ మాఫీల దస్త్రాలపైనే తన మొదటి సంతకాలు ఉంటాయని చెబుతున్నారు.
సింగపూర్ లాంటి రాజధాని ఇస్తామనీ, ప్రపంచంలోనే గొప్ప నగరం నిర్మిస్తామనీ, హైద్రాబాద్ ఎందుకూ పనికిరాదనేలా చేస్తాననీ, ఉద్యోగాలు వరద పెట్టిస్తాననీ… ఇంకా ఇలాంటివి ఏవేవో చెబుతూ పోతున్నారు.
కె.సి.ఆర్, చంద్రబాబులు ఇస్తున్న వాగ్దానాల తేడాను కార్టూనిస్టు ఈ విధంగా చూపారు. కె.సి.ఆర్ ఆఅసలు కారెక్కి దూసుకుపోతుంటే బాబేమో వీడియో గేమ్ లో కారుని రయ్ రయ్ మనిపిస్తున్నారు.
ఈ కార్టూన్ నిన్న చూసినపుడు నాకు తాబేలు-కుందేలు కథ గుర్తొచ్చింది. బహుశా చంద్రబాబు తాను కుందేలు లాంటి వాడిని అనుకొని ఉంటారు. గతంలో ఓ మారుమూల గ్రామమైన హైదరాబాద్ ను అభివృద్ధి చేసి హైటైక్ సిటీగా మార్చింది తానేనని అనుకుంటారు ( అనుకోవడమే కాదు…బయటకి కూడా పదేపదే చెప్తారు.). తన హయాంలోనే రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని…ఇలా రకరకాలుగా !
కాబట్టి ఇంతోటి హనుభవం ఉన్న చంద్రబాబుకు అభివృద్ధి చేయడం ఎంతపని. సిటికెలో సేసేత్తారు. కాబట్టే తీరిగ్గా కూసున్నారు. సూద్దాం. తాబేలు గెలుస్తుందో, కుందేలు గెలుస్తుందో.