సి.ఐ.ఏపై కేసుకు పాక్ కోర్టు ఆదేశం


Anti-Drone activist Karim Khan

పాకిస్తాన్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పాక్ లో పని చేసి వెళ్ళిన సి.ఐ.ఏ మాజీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ దాడుల ద్వారా హత్య, కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించడం తదితర నేరాలకు పాల్పడినందుకు గాను వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టాలని కోర్టు ఆదేశించింది. అమెరికన్ డ్రోన్ దాడుల్లో తన కొడుకును కోల్పోయిన ఉత్తర వజీరిస్తాన్ పౌరుడొకరు చేసిన ఫిర్యాదును విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇస్లామాబాద్ లో సి.ఐ.ఏ స్టేషన్ చీఫ్ గా పని చేసిన జొనాధన్ బ్యాంక్స్, ఆయన లీగల్ కౌన్సెల్ జాన్ ఎ. రిజ్జో లపై కేసు రిజిష్టర్ చేయడానికి పోలీసులు ఉద్యుక్తులయ్యారు. హత్య, కుట్ర, దేశంపై యుద్ధ ప్రకటన నేరాలతో పాటు 1997 టెర్రరిస్టు చట్టం కింద కూడా కేసు నమోదు చేయనున్నారు.

ఉత్తర వజీరిస్తాన్ రాష్ట్రంలోని అటవీ ప్రాంత నివాసి కరీం ఖాన్, ఫిర్యాదుదారు. అమెరికన్ డ్రోన్ దాడిలో తన కొడుకును, సోదరుడిని ఆయన కోల్పోయారు. డిసెంబర్ 31, 2009 తేదీన జరిగిన డ్రోన్ దాడిలో తన వారిని కోల్పోయినప్పటినుండి కరీం ఖాన్ న్యాయం కోసం పోరాడుతున్నారు. 2010లో కోర్టు ద్వారా న్యాయం పొందేందుకు ఆయన కేంపయిన్ ప్రారంభించారు. కోర్టు ఆదేశాలు తమ విజయంగా ఆయన పేర్కొన్నారు.

“పాకిస్ధాన్ లో అమెరికా నేతృత్వంలో సాగిన డ్రోన్ దాడుల్లో చనిపోయిన అమాయక పౌరులందరి విజయంగా కోర్టు ఆదేశాలను పరిగణిస్తున్నాను. పాకిస్ధాన్ పౌరుడిగా ఈ రోజు నాకు తిరిగి నమ్మకం చేకూరింది. వజీరిస్తాన్ లో నాలాగా ఆప్తులను కోల్పోయిన అనేకమందికి న్యాయం పొందేందుకు ఈ పరిణామం సహాయపడుతుందని ఆశిస్తున్నాను. నేరస్ధులకు వ్యతిరేకంగా తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు నిజాయితీగా కృషి చేస్తారని నమ్ముతున్నాను” అని కరీం ఖాన్ అన్నారని పి.టి.ఐ తెలిపింది.

ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ అనే సంస్ధ ఆధ్వర్యంలో కరీం ఖాన్ న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్ధకు చెందిన లాయర్ మీర్జా షాజాద్ అక్బర్ కరీం తరపున వాదిస్తున్నారు. ఆయన ప్రకారం అమెరికా డ్రోన్ దాడులు పాకిస్ధాన్ చట్టాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. డ్రోన్ హత్యల ద్వారా అమెరికా అధికారులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.

Some of the victims of drone attacks by the U.S.

షాజాద్ అక్బర్ ప్రకారమే కాదు, సాక్ష్యాత్తూ ఐరాస అధినేత బాన్ కి-మూన్ ప్రకారం కూడా అమెరికా డ్రోన్ హత్యలను అంతర్జాతీయ చట్టాలు అనుమతించవు. అయితే ఆఫ్రికా ఖండ దేశాలపైన ప్రపంచం అంతా దద్దరిల్లేలా గర్జించే అంతర్జాతీయ చట్టాలు అమెరికా సాగించే పచ్చి మానవతా వ్యతిరేక నేరాల పట్ల మాత్రం కనీసం మ్యావ్ కూడా అనలేవు. అమెరికా జేబు సంస్ధగా ఎన్నడో మారిన ఐరాస, దాని అనుబంధ సంస్ధలు అమెరికా నేరాల విషయంలో చట్టాలు వల్లిస్తాయే తప్ప అమలుకు పూనుకోవు.

కరీం ఖాన్ ను ఉదాహరణగా తీసుకుని డ్రోన్ హత్యల బాధిత కుటుంబాలు సి.ఐ.ఎ కి వ్యతిరేకంగా ఉద్యామిస్తారని ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ సంస్ధ ఆశిస్తోంది. సి.ఐ.ఎ అధికారులకు వ్యతిరేకంగా కేసు పెట్టడానికి ముందుకు రావాలని సంస్ధ బాధితులకు పిలుపు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు పాక్ కోర్టుల స్వతంత్రతకు ప్రతీక కూడా అని ఫౌండేషన్ ప్రతినిధులు అభివర్ణించారు.

2004 నుండి జరుగుతున్న అమెరికన్ డ్రోన్ దాడుల్లో కనీసం 2,200 మంది అమాయక పౌరులు మరణించారని ఒక అంచనా. అయితే ఏ రెండు సంస్ధల అంచనాలు కూడా హతుల సంఖ్యలో ఏకీభవించకపోవడం విశేషం. డ్రోన్ దాడులకు లోపాయకారిగా పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున హతుల సంఖ్య తగ్గించి చెప్పడానికే అధికారులకు అమిత ఆసక్తి అని విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం.

అమెరికన్ డ్రోన్ దాడులకు తమ అనుమతి లేదని పాక్ ప్రభుత్వం చెబుతుంది. కానీ పాక్ ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇచ్చాకనే తాము దాడులు చేస్తామని అమెరికా చెబుతుంది.

కరీం ఖాన్ పోరాటం అమెరికాకు వ్యతిరేకంగా అయినప్పటికీ అది నల్లేరుపై నడకగా మాత్రం సాగలేదు. అమెరికా డ్రోన్ దాడుల్లో పాకిస్ధాన్ ప్రభుత్వ సహకారం కూడా ఉందన్న సంగతిని రుజువు చేస్తూ పాక్ గూఢచార సంస్ధలు ఆయన్ను కిడ్నాప్ చేసి తీవ్ర చిత్రహింసలకు గురి చేశాయి.

గత ఫిబ్రవరిలో అమెరికన్ డ్రోన్ హత్యల గురించి యూరోపియన్ పార్లమెంటేరియన్లకు తెలియజేయడానికి యూరప్ ప్రయాణించవలసి ఉండగా ఫిబ్రవరి 5 తేదీన ఆయన కిడ్నాప్ కు గురయ్యారు. పోలీసు దుస్తుల్లో, పోలీసు వాహనాల్లో వచ్చిన అనేకమంది దుండగులు తెల్లవారు ఝామునే వచ్చి ఆయనను కిడ్నాప్ చేయడంతో పాకిస్ధాన్ లో గగ్గోలు పుట్టింది. పౌర హక్కుల సంస్ధలు, ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.

ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ (FFR) సంస్ధ ఇస్లామాబాద్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి కరీం ఖాన్ ఆచూకీ గురించి పోలీసుల వద్ద నుండి సేకరించాలని కోరింది. కరీం ఖాన్ ఆచూకీ చెప్పాలని కోర్టు పోలీసులను ఆదేశించగా ఆయన తమ వద్ద లేడని, తాము కిడ్నాప్ చేయలేదని పోలీసులు బదులిచ్చారు. పోలీసులు కాకపోతే గూఢచార సంస్ధలు కిడ్నాప్ చేసి ఉంటాయని ఎఫ్.ఎఫ్.ఆర్ లాయర్లు కోర్టుకు చెప్పడంతో కేంద్ర హోమ్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరీం ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని కోరింది.

అయితే అనూహ్య పరిస్ధితుల్లో కరీం ఖాన్ ను అజ్ఞాత వ్యక్తులు ఫిబ్రవరి 14 తేదీన రావల్పిండిలో ఒక కారు నుండి విసిరేసి పారిపోయారు. అనంతరం కరీం ఖాన్ ఇచ్చిన వివరాల ప్రకారం దుండగులు ఆయనను కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టి 2 లేదా 3 గంటలు ప్రయాణం చేసి గుర్తు తెలియని చోట బంధించారు. అక్కడ ఆయనను చిత్రహింసలకు గురి చేశారు. అమెరికన్ డ్రోన్ దాడులపై ఆయన సేకరించిన సమాచారం ఏమిటో చెప్పాలని బెదిరించారు. డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఎంతమంది బాధితులు సిద్ధంగా ఉన్నారో చెప్పాలని కోరారు. ఉద్యమం మానుకోవాలని హెచ్చరించారు.

ఈ లోపు కరీం ఖాన్ విడుదల కోసం అంతర్జాతీయంగా రగడ చెలరేగింది. యూరప్ రావలసి ఉన్న కరీం ఎందుకు అదృశ్యం అయ్యాడో వివరాలు కనుక్కోవాలని బ్రిటన్, జర్మనీ, బెల్జియం తదితర దేశాలకు చెందిన పార్లమెంటు సభ్యులు పాక్ ప్రభుత్వానికి వర్తమానం పంపారు. వివిధ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధల నుండి కూడా పాక్ ప్రభుత్వానికి తాఖీదులు అందాయి. ఈ ఒత్తిడి వల్లనే కరీం ను పాక్ ప్రభుత్వం విడిచిపెట్టక తప్పలేదు. విడిచి పెట్టే సమయంలో కూడా జరిగిన విషయాలను పత్రికలకు చెప్పొద్దని హెచ్చరించి మరీ విడిచారని అనంతరం కరీం ఖాన్ విలేఖరులకు చెప్పారు.

ఈ సంవత్సరం ఇంతవరకు పాక్ భూభాగాలపై అమెరికన్ డ్రోన్ ల దాడులు జరగలేదు. కరీం ఖాన్ లాంటి వారి పోరాటం వల్లనే ఇది సాధ్యం అయిందా లేక మరే ఇతర కారణం వల్లనా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరాంతానికి ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరణ పూర్తవుతుందని అమెరికా చెపుతున్న నేపధ్యంలోనే దాడులు జరగడం లేదని విశ్లేషిస్తున్నవారు లేకపోలేదు. అమెరికా ఆపాలజిస్టులు మాత్రం అమెరికా దృష్టి యెమెన్, సోమాలియా దేశాలపై కేంద్రీకృతం అయినందున పాక్ లో దాడులు లేవని వివరిస్తున్నారు. యెమెన్, సోమాలియాలలో కూడా కరీం ఖాన్ లు తయారు కావాలని వాళ్ళు పరోక్షంగా చెబుతున్నారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s