దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?


Amazon's logistics centre in Graben

Amazon’s logistics centre in Graben

బి.జె.పి/నరేంద్ర మోడి ఎన్నికల వాగ్దానాల్లో రిటైల్ ఎఫ్.డి.ఐ ఒకటి. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యు.పి.ఏ ప్రభుత్వం అనుమతించగా బి.జె.పి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. సదరు వాగ్దానాన్ని నెరవేర్చడం మాట అటుంచి దొడ్డి దారిన యు.పి.ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి తమకు గట్టి సూచనలు అందాయని రాయిటర్స్ వార్తా సంస్ధ మురిపెంగా వెల్లడి చేసింది.

ఇంతకీ ఏమిటా దొడ్డిదారి? రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించే బదులుగా ఇ-టైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించడమే ఆ దొడ్డి దారి! అనగా ఇంటర్నెట్ (కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ మొబైల్, టాబ్లెట్స్, ఫాబ్లెట్స్ మొ. సాధనాలన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ వాహకాలే) ద్వారా జరిగే రిటైల్ వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-టైల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే ఇక రిటైల్ మార్కెట్ లో ఎఫ్.డి.ఐ లకు అనుమతి లేదన్న బెంగ అనవసరం.

ఇంకా చెప్పాలంటే రిటైల్ రంగంలో అమ్మే సరుకుల్లో నిర్దిష్ట మొత్తాన్ని దేశీయ వనరుల నుండి సమకూర్చుకోవాలన్న షరతును భారత రిటైల్ ఎఫ్.డి.ఐ చట్టం విధించింది. ఇ-టైల్ రంగంలో ఈ షరతును పూర్తిగా ఎత్తివేయడం ద్వారా విదేశీ బడా బహుళజాతి ఇటైల్ కంపెనీల మార్కెట్ అవకాశాలకు పూర్తి భరోసాను నూతన ప్రభుత్వం ఇస్తోందని రాయిటర్స్ తెలియజేసింది.

అమెజాన్, ఈబే (ebay) లాంటి బడా బహుళజాతి కంపెనీలు తాము రిటైల్ చేసే సరుకులను సొంతగానే సమకూర్చుకుంటాయి. అనగా ఇండియాలో భారతీయ ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన సరుకులనే ఈ కంపెనీలు మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండదు. ఈ తరహా కంపెనీలకు పూర్తి స్ధాయి అనుమతులు ఇవ్వడానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివిధ స్వదేశీ, విదేశీ ఈటైల్ కంపెనీలతో ఒక సమావేశాన్ని నిర్వహించాయని తెలుస్తోంది.

ఆన్ లైన్ లో రిటైల్ ధరలకు సరుకులను అందుబాటులోకి తెచ్చే కంపెనీలనే ఈటైల్ కంపెనీలు అంటున్నారు. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, హోమ్ షాప్ 18 (రిలయన్స్), ఇన్ఫిబీమ్, జబాంగ్, మింత్రా తదితర ఆన్ లైన్ కంపెనీలు భారతీయ ఈటైల్ కంపెనీలుగా పత్రికలు పేర్కొంటాయి. కానీ వీటిలో కంట్రోలింగ్ వాటాలు మాత్రం వివిధ లోపాయకారి మార్గాల ద్వారా వాల్ స్ట్రీట్ కంపెనీల చేతుల్లోనే ఉంటాయి.

అమెజాన్, ఈబే లాంటి విదేశీ బహుళజాతి కంపెనీలతో పాటు భారతీయ ఈటైల్ కంపెనీలు కూడా మోడీ ప్రభుత్వం తీసుకోబోయే కొత్త నిర్ణయం ద్వారా లబ్ది పొందనున్నాయని రాయిటర్స్ సంస్ధ ఊరించింది. ఇది పాక్షిక వాస్తవం కాగా ఈ కంపెనీలు తాము మార్కెట్ చేసే సరుకులను అంతర్జాతీయ మార్కెట్ లో అత్యంత చౌక ధరలకు లభ్యమయ్యే చోటనే సేకరిస్తాయి గనుక అంతిమంగా భారతీయ ఉత్పత్తిదారులు పెద్దమొత్తంలో నష్టపోనున్నారు.

ఈ అంశంపై ఎక్స్ క్లూజివ్ వార్తను ప్రచురిస్తూ రాయిటర్స్ ఇలా పేర్కొంది:

The move could allow the government to circumvent political opposition to opening up India’s $500 billion retail sector to global retail giants such as Wal-Mart Stores Inc.

“భారత దేశపు 500 బిలియన్ డాలర్ల రిటైల్ రంగాన్ని వాల్ మార్ట్ లాంటి ప్రపంచ బడా రిటైల్ కంపెనీల కోసం తెరవడానికి రాజకీయ వ్యతిరేకత ఎదురవుతోంది. సదరు వ్యతిరేకత కన్ను గప్పడానికి ఈ చర్య ప్రభుత్వానికి సహాయపడుతుంది.”

రిటైల్ ఎఫ్.డి.ఐ లకు భారత దేశంలో రాజకీయ వ్యతిరేకత ఎదురవుతోందని పైన రాయిటర్స్ అంగీకరిస్తోంది. ఎవరి నుండి ఈ వ్యతిరేకత వస్తోంది. కాంగ్రెస్ నుండయితే కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రిటైల్ ఎఫ్.డి.ఐ చట్టాన్ని గతేడు ఆమోదించింది. ఈ చట్టాన్ని అమలు చేసే స్వేచ్ఛను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని బి.జె.పి పాలిత రాష్ట్రాలు తాము చట్టాన్ని అమలు చేయబోమని చెప్పాయి. బి.జె.పి తమ మ్యానిఫెస్టోలో రిటైల్ ఎఫ్.డి.ఐ నిర్ణయాన్ని సమీక్షిస్తామని వాగ్దానం ఇచ్చిన సంగతిని కూడా గుర్తు చేసుకుంటే రాయిటర్స్ చెప్పిన రాజకీయ వ్యతిరేకత బి.జె.పి నుండే వస్తోందని ఇట్టే అర్ధం అవుతుంది.

ఈ రాజకీయ వ్యతిరేకత కన్ను గప్పి పరోక్షంగా రిటైల్ ఎఫ్.డి.ఐ లను అనుమతించడానికి మోడి ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయం దోహదపడుతుందని పత్రిక చంకలు గుద్దుకుంటోందన్నమాట! అసలు బి.జె.పి వ్యతిరేకత కంటిని బి.జె.పి ప్రభుత్వమే కప్పడం ఏమిటి? ఒకపక్కేమో రిటైల్ ఎఫ్.డి.ఐ కి వ్యతిరేకం అని మేనిఫెస్టోలో వాగ్దానం ఇస్తారా! తీరా అధికారం లోకి వచ్చిన తర్వాతేమో తమ వాగ్దానాన్ని తామే ఉల్లంఘించడానికి తగిన మార్గాలను వెతుకుతారా! ఇంతకంటే మోసం ఉంటుందా?

ప్రభుత్వంలో జరుగుతున్న చర్చల గురించి బాగా తెలిసిన నలుగురు ప్రభుత్వాధికారులు తమకు ఈ సమాచారం ఇచ్చారని రాయిటర్స్ తెలిపింది. ఆన్ లైన్ రిటైల్ మార్కెట్ లోకి విదేశీ కంపెనీలకు పూర్తిస్ధాయి అనుమతి ఇవ్వడం ద్వారా దేశంలో మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని ఉద్దీపింపజేయడంతో పాటు, వినియోగాన్ని కూడా పెంపొందించవచ్చని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సదరు అధికారులు చెప్పారుట.

“ఈ-కామర్స్ లో ఎఫ్.డి.ఐ లకు స్టేక్ హోల్డర్లలో అత్యధికులు మద్దతు ఇస్తున్నారు. పూర్తిగా (100 శాతం) ఎఫ్.డి.ఐ లకు అనుమతి ఇవ్వాలని మేము భావిస్తున్నాము” అని ఒక అధికారి చెప్పారని పత్రిక తెలిపింది. స్టేక్ హోల్డర్లు అంటే ప్రభుత్వ పెద్దలు, అధికారులు, కంపెనీలు అందరూనని భావించవచ్చు. ఆన్ లైన్ రిటైల్ కంపెనీలు సరుకుల సేకరణ (సోర్సింగ్) ను దేశం నుండే చేయాలన్న నిబంధన విధించబోరని కూడా రాయిటర్స్ వెల్లడించింది. దేశంలోపలే సరుకుల సేకరణ చేయని ఆన్ లైన్ కంపెనీల వల్ల దేశంలో మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని ఎలా ఉద్దీపింపజేస్తాయో రాయిటర్స్ నిపుణులే (లేదా మోడి ప్రభుత్వంలోని నిపుణులు) చెప్పాలి. ఆ చెప్పే అబద్ధం అయినా కనీసం అతికనట్లు చెప్పొద్దా?

ఈ-కామర్స్ రంగం 2020 నాటికల్లా దేశ ఆర్ధిక వ్యవస్ధలో 4 శాతం ఆక్రమించవచ్చని పరిశ్రమ వర్గాలు జరిపిన ఒక సర్వేలో వెల్లడి అయింది. రెండు వారాల క్రితమే కేంద్ర ప్రభుత్వ అధికారులు స్వదేశీ, విదేశీ ఆన్ లైన్ రిటైల్ కంపెనీల అధికారులతో సమావేశమై తమ ఆలోచనలు పంచుకుని చర్చలు జరిపారని, సదరు సమావేశంలో పాల్గొన్న ప్రైవేటు కంపెనీల అధికారులు సమావేశం జరిగిన సంగతిని ధృవీకరించారని రాయిటర్స్ తెలిపింది. సమావేశంలో అమెజాన్, గూగుల్, ఈ బే, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని కూడా పత్రిక తెలిపింది. “చర్చను ప్రభుత్వం ప్రారంభించిన పద్ధతిని చూచినట్లయితే వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారని అర్ధం అవుతోంది. ఈ చర్య వలన చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, విస్తరించుకోవడానికీ తద్వారా పెద్ద పెద్ద మార్కెట్ లకు చేరువ కావడానికీ దోహదపడుతుందని వారికి అర్ధం అయింది” అని ఒక విదేశీ కంపెనీ అధికారి రాయిటర్స్ కు చెప్పారు.

మళ్ళీ అదే కూత! భారత దేశంలోని చిన్న వ్యాపారులు బి.జె.పి కి ఓటు బ్యాంకుగా అందరూ భావిస్తారు. ఈ ఓటు బ్యాంకు కోసమే రిటైల్ ఎఫ్.డి.ఐ కి తాము వ్యతిరేకం అని బి.జె.పి చాటుకుంది. ఇప్పుడు ఈ చిన్న వ్యాపారుల ప్రయోజనాలనే ఈటైల్ వ్యాపారం కాపాడుతుందని రాయిటర్స్ చెబుతూ అది తాను చెప్పే మాట కాదనీ, కేంద్ర ప్రభుత్వ అధికారులే ఆ నిజాన్ని గ్రహించారనీ చెబుతోంది. అది కూడా ఒక ప్రైవేటు కంపెనీ అధికారి ద్వారా తమకు అందిన సమాచారంగా చెబుతోంది. పశ్చిమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చడానికే పుట్టి పెరిగి వర్ధిల్లుతున్న పశ్చిమ కార్పొరేట్ పత్రికల దగ్గర ఇలాంటి కిటుకులు ఎన్నో ఉన్నాయి.

రిటైల్ ఎఫ్.డి.ఐ లను పైకి వ్యతిరేకించిన బి.జె.పి నేత మోడి ఈ-టైల్ విషయంలో మాత్రం గత ఫిబ్రవరిలోనే వ్యాపార వర్గాలకు భరోసా ఇచ్చారు. “ఇలాంటి విషయాల వల్ల బెంగ పెట్టుకోవద్దు. మన పిల్లలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రపంచం వాకిటికి తీసుకెళ్లారు. (కాబట్టి) మనమే వాటిని వాటేసుకోవాలి” అని మోడి గత ఫిబ్రవరిలో ఒక చిన్నవ్యాపారుల సదస్సులో చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి అయిన ఈ-కామర్స్ (ఆన్ లైన్ రిటైల్ వ్యాపారం) విస్తరించడానికి మన పిల్లలే కారణం కాబట్టి మనమే వాటిని ఆహ్వానించాలి కదా అన్నది మోడీ వాదన! దీనినే కదా “మన వేలితో మన కన్నే పొడుచుకోవడం” అనేది?

మన పిల్లలు ఐ.టి చదువులు చదివి ఉద్యోగం వెతుక్కుంటూ దేశ దేశాలు వేళ్లారే అనుకుందాం. ఇక్కడి కాలేజీల్లో, ఇక్కడి యూనివర్సిటీల్లో ఇక్కడి పంతుళ్ళు నేర్పిన విద్య గరిపి ఇక్కడి ప్రజలకు సేవ చేయడం మానేసి డాలర్ల కోసం విదేశాలకు తరలిపోయారే అనుకుందాం! ఆ పాపానికి గాను, అష్టదరిద్రాలు అనుభవిస్తూ కూడా ఇక్కడే ఈ దేశంలోనే ఉంటూ  ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ ఉత్పత్తులు తీస్తున్న కోట్లాది మంది పొట్టగొట్టే పాపాన్ని కూడా మన వలస బుద్ధి జీవులే మోయాలా? మన పిల్లల్ని విదేశీ కొలువుల్లో పెట్టాం గనుక మన వ్యాపారాలు కూడా గుల్ల చేసుకుని విదేశీ వ్యాపారాలకు మన మార్కెట్లన్నీ అప్పజెప్పాలన్న లాజిక్ ని కనిపెట్టిన పెద్ద మనిషిని ఏమని వర్ణించాలి?

ఆన్ లైన్ రిటైల్ మార్కెటింగ్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే అంశాన్ని రాష్ట్రాల దయాదాక్షిణ్యాలకు వదలబోమని కూడా ప్రభుత్వ వర్గాలు హామీ ఇచ్చాయని మరో సమాచారం. పైన చెప్పినట్లు రిటైల్ ఎఫ్.డి.ఐ చట్టాన్ని తెచ్చిన యు.పి.ఏ ప్రభుత్వం దాని అమలును రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలకు వదిలేసింది. ఈ వెసులుబాటు తోనే బి.జె.పి ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం నుండి తమను తాము మినహాయించుకున్నాయి. ఇంత చేసిన బి.జె.పి ఆన్ లైన్ రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించే చట్టాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేదిలేదని హామీ ఇచ్చేసింది. అనగా మోడి ప్రభుత్వం ఈ చట్టం తెస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కిమ్మనకుండా దాన్ని అమలు చేసేలా చట్టం తెస్తారు.

ఆన్ లైన్ రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించే విషయంలో తగిన మార్గదర్శకాలను రూపొందించేందుకు సహజంగా ఎవరు ఎవరితో చర్చలు జరుపుతారు? మంత్రులు, కార్యదర్శులు, దేశీయ ఆర్ధిక నిపుణులు, ఇంకా కావాలంటే దేశీయ కంపెనీల నుండి ఒకరిద్దరు ప్రతినిధులు చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ మన ప్రభుత్వ అధికారులు మాత్రం అమెజాన్, గూగుల్, ఫ్లిప్ కార్ట్, వాల్ మార్ట్ లాంటి ఈటైలర్ కంపెనీలతో సమావేశమై పెట్టుబడులకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడంలో వారి నుండి సలహాలు తీసుకున్నారు. ఈ సంగతి కూడా రాయిటర్సే చెప్పింది. ప్రభుత్వ చట్టాలు, మార్గదర్శకాలు ప్రజలకు ప్రధానంగా ప్రయోజనం చేకూర్చాలి. ప్రజల ప్రయోజనాలను నిర్దేశించే చట్టాలు, మార్గదర్శకాల రూపకల్పన కోసం విదేశీ కంపెనీలను సంప్రతీస్తే ఇక ప్రజల ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయి?

అమెజాన్, ఈ బే లాంటి కంపెనీలు తమ తమ సొంత వనరుల నుండి సరుకులను సేకరించకుండా భారత దేశంలో నిషేధం విధించారు. అనగా ఆన్ లైన్ రిటైల్ వ్యాపారం చేస్తున్న విదేశీ కంపెనీలు సరుకుల్ని ఈ దేశంలోనే సేకరించాలి. ఈ షరతును సంతృప్తి పరచడానికి విదేశీ కంపెనీలు మన దేశంలో షాపులు, పంపిణీ సంస్ధలు తెరిచి మార్కెటింగ్ చేయాల్సి వస్తోంది. దానివల్ల కొంత మేర పెట్టుబడులు రావడమే కాక పన్నుల ఆదాయం, బొటాబోటి ఆదాయం వచ్చే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ నిషేధాన్ని ఎత్తివేయడానికి మోడి ప్రభుత్వం సుముఖంగా ఉందని కూడా పత్రిక తెలిపింది. అంటే ఆ కాస్త పన్నుల ఆదాయం, ఆ నామమాత్ర పెట్టుబడులు, ఆ కాస్త ఆదాయం ఇచ్చే ఉద్యోగాలు కూడా క్రమంగా కనుమరుగు కావచ్చు. మోడి హామీ ఇచ్చిన ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన’ వాగ్దాన అమలు ఇలా ఉంది!

ఈ-కామర్స్ భారత దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంకా తాకని (untapped market) భారీ మొత్తంలో ఉండడమే దానికి కారణం. డిజిటల్-కామర్స్, IAMAI-IMRB లు తయారు చేసిన నివేదిక ప్రకారం ఇండియాలో ఈ-కామర్స్ రంగం వార్షిక ప్రాతిపదికన 34 శాతం కాంపౌండ్ వృద్ధితో పెరుగుతోంది. ఆన్ లైన్ లో రిటైల్ సరుకుల అమ్మకం గత సంవత్సరం మొత్తం మీద 1.6 బిలియన్ డాలర్ల మేరకు జరిగింది. ఇది 2021 కల్లా 76 బిలియన్ డాలర్లకు (దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలకు సమానం) పెరుగుతుందని ఒక (టెక్నోపాక్ కన్సల్టెన్సీ) అంచనా. [పోలిక కోసం: ఈ సంవత్సరం చైనా ఈ-కామర్స్ అమ్మకాలు 180 బిలియన్లు దాటుందని అంచనా] ఇలాంటి బంగారు గుడ్ల బాతును విదేశీ కంపెనీలకు అప్పగించడానికి మోడి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

అంతం కాదిది. ఆరంభం మాత్రమే.

3 thoughts on “దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?

  1. అవును. ఇది అంతం కాదు…ఆరంభమే. ఐతే ఆ ఆరంభం కూడా మొదలుకాలేదు. ఇది కేవలం చిన్న ట్రైలర్ మాత్రమే. మొత్తం సినిమా మనం తర్వాత చూడబోతున్నాం. ఇటువంటి ఘరానాచిత్రవిచిత్రాలు మరిన్ని మొదలవుతాయి. రక్షణ రంగంలో కూడా వందశాతం FDIలకు అనుమతి రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మోడి అధికారంలోకి రావాలని…పశ్చిమ దేశాలు, మీడియా ఎందుకు సర్వశక్తులు ఒడ్డాయో….మనకి త్వరలోనే తేటతెల్లం కానుంది.

  2. //అంతం కాదిది. ఆరంభం//
    బాగా చెప్పారు! అప్పుడే ఫలాలనివ్వడం మొ దలపెట్టింది. ఇక అయి దేళ్లు అభివృద్దే అభివృద్ది. ఇక ఆ తరువాత కంపౌండ్ అభివృద్ది జరుగుతుంది లెండి.

  3. రక్షణ రంగంలో కూడా వందశాతం FDIలకు అనుమతి ఇవ్వడం అనేది “భారతదేశ” భద్రత ఎంగిలి మెతుకులకు అమ్ముకోడం తో సమానం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s