సామాన్యుడిని నెత్తి మీద పెట్టుకుంటానని ఉనికిలోకి వచ్చిన ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. కానీ అనతికాలం లోనే జనంలో పలుకుబడి కోల్పోయిందని లోక్ సభ ఎన్నికలు రుజువు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని కట్టబెట్టడం ద్వారా ప్రజలు పెట్టుకున్న ఆశల్ని తగిన విధంగా ఆచరణలోకి తేవడంలో ఆ పార్టీ విఫలమైందని అందుకే ప్రజల్లో పలచన అయిందని వారి అవగాహన.
అధికారంలోకి వచ్చీ రావడంతోనే సంచలన కార్యక్రమాలకు తెరతీసిందని సో కాల్డ్ మర్యాదస్తులు, రాజకీయ విశ్లేషకులు మొదలయినవారు ఆరోపించారు. నీటి ఛార్జీల ఖర్చు తగ్గించడం, ప్రైవేటు డిస్కమ్ లపై కాగ్ ఆడిట్ కు ఆదేశించడం ద్వారా యుద్ధం ప్రకటించడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ వసూలు చేస్తున్న గ్యాస్ ధర అక్రమం అని చెప్పి ఎ.సి.బి విచారణకు ఆదేశించడం అలాంటి సంచలనాల కోవలోనివే అని వారి ఆరోపణ.
కానీ ఇవన్నీ ప్రజల సమస్యలే. అధిక ధరలు ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. ప్రైవేటు కంపెనీల అక్రమ లాభ దాహం వల్ల ధరలు అందకుండా పోవడం ఇంకా ముఖ్యమైన సమస్య. ఈ లాభ దాహాన్ని అరికట్టగలిగితే కంపెనీలకు సాధారణ లాభాలు, జనాలకు సాధారణ ధరలు అందుబాటులోకి రావడం ఖాయం. ఎఎపి ఈ ముఖ్యమైన సమస్యని పరిష్కరించడానికి పూనుకుంది. ఆ పూనుకోవడం ఈ దేశంలోకెల్లా అత్యంత ధనిక కుటుంబానికి వ్యతిరేకంగా ఉండడంతో అది కాస్తా సంచలనం అయింది. అది ఎఎపి తప్పెలా అవుతుంది, చెయ్యాల్సిందే చెయ్యడం అవుతుంది గాని?
ఎఎపి చేసిన పొరబాటు ఎవరో తరుముకొచ్చినట్లు ఢిల్లీ ప్రభుత్వ పగ్గాలను వదులుకోవడం. అంబానీల కోసం కాంగ్రెస్, బి.జె.పి లు కుమ్మక్కయినమాట వాస్తవమే గానీ ఆ విషయాన్ని జనానికి శక్తివంతంగా తెలియజేయడంలో ఎఎపి విఫలం అయింది. పైగా లోక్ సభ ఎన్నికలు ముందున్న పరిస్ధితుల్లో అంబానీలపై పోరాటం కోసం ప్రభుత్వాన్ని త్యాగం చేశామన్న కీర్తి మూట గట్టుకుంటే అది లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇస్తుందని ఎఎపి భావించిందనడానికి తగిన అవకాశాన్ని ఎఎపియే ఇచ్చింది. దానితో ఢిల్లీ ప్రభుత్వం వదులుకున్నందుకు ఖ్యాతి మాట అటుంచి, సీరియస్ పాలకులు కాదన్న అపఖ్యాతి దక్కించుకుంది. బహుశా ఈ వ్యవహారం ఢిల్లీ ఓటర్లను పునరాలోచనలో పడేసి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.
అసెంబ్లీ సీట్ల సంఖ్య పరంగా చూస్తే లోక్ సభ ఎన్నికల్లో కేవలం 10 సీట్లను మాత్రమే గెలుచుకున్న ఏఏపి ఓట్ల సంఖ్య పరంగా చూసినపుడు విచిత్రంగా 4 శాతం ఓట్లు ఎక్కువ సంపాదించుకుంది. కాంగ్రెస్ ఓట్లను బి.జె.పి, ఏఏపి లు రెండూ గెలుచుకున్న ఫలితంగా ఏర్పడిన పరిణామం ఇది. కాంగ్రెస్ ఓట్లను ఏఏపి కంటే ఎక్కువగా బి.జె.పి గెలుచుకోవడంతో మొత్తం 60 అసెంబ్లీ స్ధానాల్లో బి.జె.పి ముందుండగా 10 స్ధానాల్లో మాత్రమే ఏఏపి ముందుంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఎం.పి లకు ఓట్లు వేశారని అసెంబ్లీ ఎన్నికలు వస్తే తప్పనిసరిగా తమకే అధికారం కట్టబెడతారని ఏఏపి నాయకులు విశ్వాసంతో ఉన్నారు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆయాచితంగా వదిలి పెట్టడంతో పాటు ఏఏపి చేసిన మరో పొరబాటు ఏకంగా 400 స్ధానాలలో అభ్యర్ధులను నిలబెట్టడం. బలం ఉందని భావించిన సీట్లను 100-200 మధ్య ఎంచుకుని వాటిపైనే తమ శక్తిని కేంద్రీకరించినట్లయితే ఏఏపి పరిస్ధితితో పాటు బి.జె.పి పరిస్ధితి కూడా మరో విధంగా ఉండేదేమో తెలియదు గానీ ఏఏపి అతి అంచనాకు పోయి తాను నమలగలిగిన దానికంటే ఎక్కువే కొరుక్కున్న మాట మాత్రం వాస్తవం.
కాంగ్రెస్ పార్టీతో పాటు కులం పైన ఆధారపడిన అనేక ప్రాంతీయ పార్టీలు అత్యంత ఘోరంగా తమ తమ పునాదులను కోల్పోయిన నేపధ్యంలో భవిష్యత్తులో బహుశా ఏఏపికే ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు. అయితే ప్రజల ముందు నిఖార్సయిన విధానపరమైన ప్రత్యామ్నాయాన్ని ఏఏపి ఉంచగలగాలి. తాము పెట్టుబడిదారీ విధానానికి అనుకూలమే గానీ, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికే వ్యతిరేకం అంటూ గాలి మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. వ్యవస్ధ తీరు తెన్నుల పట్ల స్పష్టమైన తాత్విక అవగాహన ఏర్పరుచుకుని తదనుగుణమైన రాజకీయ, ఆర్ధిక ప్రత్యామ్నాయాన్ని జనానికి చూపలేకపోతే కార్టూన్ లో చూపినట్లు పార్టీ మరింతగా ఉనికిలో లేకుండా పోవడం తధ్యం. ఆ విధంగా కాస్త ఆసరా అవుతుందనుకున్న పార్టీ, చివరికి ప్రజల ఆశల్ని వమ్ము చేసిన పార్టీగా త్వరలో కనుమరుగు కావడమే ఇక మిగులుద్ది!
విశేఖర్ గారు. యూపీలో ఓ మహిళా న్యాయమూర్తిపై అత్యాచారం జరిగిందని ఇవాళ పేపర్లో వార్త వచ్చింది. మరీ న్యాయమూర్తికి కూడా రక్షణ లేకపోతే…ఇక మారుమూల మహిళల గతి ఏమిటి….
యూపీ అత్యాచారాలపై వివరణాత్మకమైన పోస్టు రాయగలరు.