ఆకాశం దించాలా, భువి తునక తుంచాలా? -ఫోటోలు


అమెరికా, రష్యాలు భౌగోళిక రాజకీయ రంగంలో ఎంతగా తగువులాడుకున్నా ఆ దేశాల అంతరిక్ష సంస్ధలు మాత్రం కలిసి మెలిసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి. బహుశా, కనీసం ప్రస్తుత కాలానికి,  అమెరికా-రష్యాల మధ్య గల వైరుధ్యాల పరిమితులను ఇది తెలియజేస్తుందేమో! ఎక్స్ పెడిషన్ 39 పేరుతో జరిగిన అంతరిక్ష ప్రయాణంలో ఇరు దేశాల సిబ్బంది కలిసి ప్రయాణించి శాస్త్ర పరిశోధనలలో పాలు పంచుకోవడమే కాకుండా అద్భుతమైన భూ దృశ్యాలను రికార్డు చేసి మనముందు ఉంచారు.

ఇరు దేశాలకు చెందిన ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station -ISS)లో భూమి చుట్టూ తిరుగుతూ తీసిన ఫొటోల్లో కొన్నింటిని కింద చూడవచ్చు. మైక్రో గ్రావిటీ పైన ప్రయోగాలు చేస్తున్న ఐ.ఎస్.ఎస్ సిబ్బంది భూ ఉపరితలానికి అతి దగ్గరగా తిరుగుతూ ఈ ఫోటోలు తీసి భూమికి పంపారు. గత డిసెంబర్ నుండి ఇటీవల మే 14 తేదీన భూమి పైకి దిగినంతవరకు అమెరికా, రష్యా వ్యోమగాములు తీసి పంపిన ఫొటోల్లోని కొన్నింటిని ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

వీటిల్లో మొదటి ఫోటో ఆస్ట్రేలియాకు నైరుతి మూలన ప్రయాణిస్తుండగా తీసినది. మార్చి నెలాఖరులో తీసిన ఈ ఫోటో చలికాలం ముందర సంభవించే తుఫానుల్లో ఒకదానిని రికార్డు చేసింది. తుఫాను హెచ్చరికల సందర్భంగా టి.వి ఛానెళ్లు ప్రదర్శించే సంకేతాత్మక దృశ్యాల అసలు రూపం ఇలా ఉంటుందన్నమాట!

దూముడి వంపు నదిగా పిలిచే గ్రీన్ రివర్ దృశ్యం ఆ తర్వాతది. తన చుట్టూ తాను తిరుగుతున్నట్లు ఉండే ఈ నది అమెరికాలో ఊతా (Utah) రాష్ట్రం లోనిది. భూ ఉపరితలానికి దాదాపు వెయ్యి అడుగుల లోటులో ప్రవహించడం వల్ల భూమికి లోతైన గాటు పెట్టినట్లుగా ఈ నది ఉండడం గమనించవచ్చు. మూడో ఫోటో కువైట్, సౌదీ అరేబియా నగరాల రాత్రి దృశ్యం.

నాల్గవ ఫోటో హిందూ మహా సముద్రం యొక్క నైరుతి భాగంకు సంబంధించినది. జనవరి ఆఖరున తీసిన ఈ ఫోటోలో రెండు చిన్న ద్వీపాలను గమనించవచ్చు. సముద్ర ఉపరితలానికి 400 కి. మీటర్ల ఎత్తునుండి తీసిన ఈ ఫోటోలో తెల్లగా కనిపిస్తున్నది మేఘాల వరుస. గాలి పశ్చిమం నుండి తూర్పుగా (కుడి నుండి ఎడమకు) వీయడం వలన ద్వీపాలు కేంద్రంగా ఆంగ్ల వి (V) ఆకారంలో అలలు ఏర్పాడ్డాయట. హిందూ మహా సముద్రం పైనగల ఉపరితలానికి ఈ తరహా వాతావరణం ప్రత్యేకం (అట)! ఇందులో కుడిపక్క ఉన్న ద్వీపం పేరు పొసెషన్ ఐలాండ్ కాగా ఎడమ పక్క ఉన్న ద్వీపం పేరు ఈస్ట్ ఐలాండ్.

5వ ఫోటోలో కనిపిస్తున్నది అమెరికా, దక్షిణ డకోటా రాష్ట్రంలోని షార్పే సరస్సు. ఇది నిజానికి మిస్సోరీ నది వంపు. ఈ నదికి ఇలాంటి వంపులు ఇంకా ఉన్నాయిట. ఈ తీవ్ర వంపు వలన దాదాపు 130 కి.మీ పొడవైన సరస్సు ఏర్పడి మధ్యలో ద్వీపంలా ఉన్న ప్రాంతంలో వ్యవసాయ అవసరాలు తీరుస్తోంది. తెల్లగా గడ్డ కట్టుకుపోయి కనిపిస్తున్నదే నది. ఆ మధ్యలో వృత్తాకారంలో కనిపిస్తున్నవి వ్యవసాయ క్షేత్రాలు. స్ప్రింక్లర్ల ద్వారా సేద్యం చేసేవారు ఇలా తమ పొలాలను వృత్తాకారంలో ఏర్పాటు చేసుకుంటారుట.

6వ ఫోటోలో సాలీడు గూడులా కనిపిస్తున్నది మాస్కో నగరం. జనవరి ఆఖరులో తీసిన ఈ ఫోటో రాత్రి సమయంలో తీసిందని చెప్పనవసరం లేదు. ఐ.ఎస్.ఎస్ ఉపరితలానికి 386 కి.మీ ఎత్తులో ఉండగా ఈ ఫోటో తీశారు. 7వ ఫోటోలో కరీబియన్ సముద్రంలోని క్యూబా దేశాన్ని చూడవచ్చు. దశాబ్దాలుగా అమెరికా పక్కలో బల్లెంగా ఉన్న క్యూబా చూడబోతే సముద్రంలో మునిగినట్లు కనిపిస్తోంది. బహుశా తెల్లటి మేఘాల కింద ఉండడం వల్ల అలా అనిపిస్తున్నదేమో!

ఆ తర్వాత (8వ) ఫోటో న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్ దృశ్యం. ఆకాశ హర్మ్యాలకు నిలయం అయిన మన్ హట్టన్ ఫోటోలో కుడిపక్క కనిపిస్తున్నది సెంట్రల్ పార్క్. ఆ తర్వాత ఫోటో చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల రాత్రి దృశ్యం. పైనా కిందా విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతున్న భూభాగాలు చైనా, దక్షిణ కొరియాలు. మధ్యలో దట్టంగా చీకటి అలుముకున్న భూభాగం ఉత్తర కొరియా. ఉత్తర కొరియాలో ఆ మధ్య భాగం మాత్రమే దీప కాంతులతో కనిపిస్తోంది. అది ఆ దేశ రాజధాని ప్యాంగ్ యాంగ్. ఉత్తర కొరియా పాటిస్తున్న విద్యుత్ పొదుపుగా ఈ ఫోటోను చూసేదీ కొందరయితే, మరికొందరు ఆ దేశ విద్యుత్ దారిద్ర్యాన్ని చూపుతోందని వ్యాఖ్యానిస్తారు.

10వ ఫోటో ఐ.ఎస్.ఎస్ నుండి తీసినది కాదు. ల్యాండ్ శాట్ అనే ఉపగ్రహం తీసిన ఫోటో. కజకిస్తాన్ లోని ఆల్మతి రాష్ట్రంలో జుంగేరియన్ అలతౌ పర్వత శ్రేణులను ఈ ఫోటో పై భాగంలో చూడవచ్చు. హిమాలయాల్లో మానస సరోవరం నుండి గంగా నది పుట్టిందని హిందూ నమ్మకం. కజకిస్తాన్ లో మాత్రం టెంటే నది నిజంగానే ఈ కొండల్లోని అలకోల్ సరస్సు నుండి బయలుదేరుతుంది. కొండల నుండి బైటపడి బైటికి ప్రవహించే కొద్దీ పాయలు పాయలుగా చీలిపోయి ఒక జడ అల్లకంలాగా ఈ నది కనిపిస్తుంది.

జపాన్ ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు నానో ర్యాక్స్, క్యూబ్ శాట్స్ లను ఐ.ఎస్.ఎస్ సిబ్బంది ఫోటో తీశారు. ఆ ఫోటోయే 11 వది. 12వ ఫోటోలో సముద్రం నుండి పొడుచుకుని వచ్చినట్లు కనిపిస్తున్న నాలుగు ద్వీపాలను చూడవచ్చు. ఉత్తర పసిఫిక్ అగ్రాన అలాస్కా (అమెరికా) నుండి కాంచట్కా (రష్యా) వరకూ ఆర్క్ ఆకారంలో ఉండే 71 ద్వీపాల వరుసలో భాగం ఇవి. ఈ ద్వీపాల్లో 57 అగ్ని పర్వతాలే. సముద్రం అట్టడుగు నుండి ఉద్భవించిన ఈ అగ్ని పర్వతాలు సముద్రం ఉపరితలం దాటి పైకి చొచ్చుకుని రావడం వల్ల ఈ ద్వీపాలు ఏర్పడ్డాయి. ఇవి మానవ నివాసయోగ్యం కావు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగంగా కూడా ఈ ద్వీపాలను పరిగణిస్తారు.

13వ ఫోటో ఐ.ఎస్.ఎస్ నుండి తీసినదే. భూమినీ, ఆకాశాన్నీ వేరు చేసే దిగంతాన్ని ఊహించుకోవడమే గానీ మనం ఎప్పుడూ చూళ్లేదు గదా. ఆ దిగంతం ఇదేనేమో! 14వ ఫోటోలో మధ్యలో కనిపిస్తున్న ఎత్తైన ప్రదేశం మధ్య నమీబియా (ఆఫ్రికా ఖండం) లోని ఒక పర్వత ప్రాంతం.

కజకిస్ధాన్ లోని బైకనూర్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి సోయూజ్ TMA12M ఉపగ్రహాన్ని మార్చి 25 తేదీన ప్రయోగించారు. ఇందులో ఇద్దరు రష్యా కాస్మోనాట్ లు, ఒక నాసా (అమెరికా) ఆస్ట్రోనాట్ లు ఉన్నారు. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుండగా ఐ.ఎస్.ఎస్ 39వ ఎక్స్ పెడిషన్ బృందం వాళ్ళు ఫోటో తీశారు. ఆ ఫోటోయే 15వది. అదే ఉపగ్రహం ఆకాశంలో ఉండగా మార్చి 27, 2014 తేదీన తీసిన ఫోటో 16వది.

17వ ఫోటో ల్యాండ్ శాట్ ఉపగ్రహం తీసినది. చైనాలోని కాస్ట్ (Karst) పర్వత శ్రేణులను ఇందులో చూడవచ్చు. అక్టోబర్ 8, 2013 తేదీన తీసిన ఈ ఫోటోలో ఆగ్నేయ చైనా రాష్ట్రం గువాంగ్జి కూడా ఉంది.

18వ ఫోటో: Soyuz TMA-11M అంతరిక్ష ఉపగ్రహం మే 14, 2014 తేదీన భూమివైపు ప్రయాణం కట్టి కజకిస్ధాన్ లోని ఝెజ్కాజ్గన్ వద్ద కిందికి దిగుతున్నప్పటి ఫోటో ఇది. ఐ.ఎస్.ఎస్ 39వ ఎక్స్ పెడిషన్ బృందం వాళ్ళు (జపాన్ వ్యోమగామి కోయిచి వకట, రష్యా వ్యోమగామి మీఖాయిల్ ట్యూరిన్, నాసా శాస్త్రవేత్త రిక్ మాస్) ఈ ఉపగ్రహంలో కిందికి దిగారు.

19వ ఫోటో: Soyuz TMA-11M కజకిస్ధాన్ లో నేలను తాకినప్పటి ఫోటో.

20వ ఫోటో: సోయూజ్ కాప్సూల్ నుంచి జపాన్ వ్యోమగామి వకాట ను బైటికి తెస్తున్న దృశ్యం.

భూ గ్రహంపైన మనకు తెలియని చోట్ల గురించి కొద్దిగా అవగాహనను ఈ ఫోటోలు మనకు అందిస్తాయి. వీటిలో కొన్ని చోట్లకి మనం ఎప్పటికీ వెళ్లడానికి వీలు లేనివి. ‘రవి గాంచని చోట కవి గాంచున్’ అన్నది ఒక కోణంలోని సత్యం అయితే ‘రవి గాంచే చోట్లన్నీ ఉపగ్రహం గాంచున్’ అని మరో కోణంలోని సత్యం అనుకోవాలి. అలాంటి ఉపగ్రహ చిత్రాలు ఎన్ని చూసినా తనివి తీరదు! సౌందర్య భూషితమైన కాసిన్ని భువి తునకలను తుంచి ప్రేయసి సిగలో తురిమే కలల్ని కనే ప్రేమికుల కోసం ఇలాంటి ఫోటోల్ని అంకితం ఇవ్వవచ్చు. కదా!?

2 thoughts on “ఆకాశం దించాలా, భువి తునక తుంచాలా? -ఫోటోలు

  1. పింగ్‌బ్యాక్: ఆకాశం దించాలా, భువి వంక తుంచాలా? -ఫోటోలు | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s