తెలంగాణ మొదటి అడుగు: కె.సి.ఆర్ వాగ్దాన ఉల్లంఘన


నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిష్కృతం అయింది. ఉద్యమ పార్టీ నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో కొలువు తీరిన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అనగా దాదాపు 25 శాతం ఒకే కుటుంబ మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని కొత్త రాష్ట్రం తలకెత్తుకుంది.

తెలంగాణ ఉద్యమాన్ని సైతం కుటుంబ ఉద్యమంగా నడిపిన ఆరోపణలు ఎదుర్కొన్న కె.సి.ఆర్ ప్రభుత్వాన్ని సైతం కుటుంబంతో నింపేశారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. కానీ వారి ఆరోపణలకు సమాధానం ఇచ్చే పరిస్ధితిలో కె.సి.ఆర్ గానీ ఆయన పార్టీ గానీ ఉన్నట్లు కనిపించడం లేదు.

అసలు సంగతి మరొకటుంది. అది కె.సి.ఆర్ వాగ్దాన ఉల్లంఘన. ఉద్యమం సాగినన్నాళ్లూ కె.సి.ఆర్ నోట ఒకటే వాగ్దానం పదే పదే వినిపించేది. నూతన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఆయన చెప్పని వేదిక లేదు. సదరు వాగ్దానాన్ని వెయ్యి అడుగుల నిలువు గోతిలో పాతేస్తూ ఈ రోజు కె.సి.ఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

ఆ విధంగా బడుగు ప్రజలు ఎన్నో కలలు కంటూ అనేక త్యాగాలకు ఓర్చి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కె.సి.ఆర్ మొట్టమొదటి వాగ్దాన ఉల్లంఘనతో తన ప్రయాణం ప్రారంభించింది. సామాజిక తెలంగాణమే తమ లక్ష్యం అని ప్రకటించుకున్న కె.సి.ఆర్ ఈ వాగ్దాన ఉల్లంఘన ద్వారా తాను చెప్పిన సామాజిక తెలంగాణం ఎలా ఉండబోతోందో ప్రారంభంలోనే చెప్పినట్లు భావించాలా?

దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం అన్నది కేవలం వాగ్దానం మాత్రమే కాదు. దళితులు అంటే విశాల అర్ధంలో శ్రమ జీవులు. సమాజంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి ఒక్క వస్తువుకూ శ్రమ జీవుల శ్రమే మూలాధారం. అలాంటి శ్రమజీవులైన దళితుడు ముఖ్యమంత్రి అయితే జనానికి ఆచరణలో ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. కానీ తన వాగ్దానాన్ని నిలుపుకున్నట్లయితే తన పాలన దిశ కూడా వాగ్దానాలను నిలుపుకునే వైపుగా ఉంటుందన్న సందేశాన్ని కె.సి.ఆర్, ఆయన పార్టీ ఇచ్చినట్లు అయ్యేది. తనకా ఉద్దేశ్యం లేనే లేదని కె.సి.ఆర్ తన వాగ్దాన ఉల్లంఘన ద్వారా స్పష్టం చేశారు.

దళితుడే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అవుతారని కె.సి.ఆర్ పదే పదే ఎందుకు చెప్పినట్లు? ఎందుకంటే ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమ నెగళ్ళు రగిలించి విద్యార్ధి లోకాన్ని, మొత్తం ఉద్యమాన్నీ ఉర్రూతలూగించిందీ కూడా ప్రధానంగా దళితులే. వారి ఉద్యమ ఉత్తేజాన్ని సొమ్ము చేసుకోవడానికి ‘దళిత ముఖ్యమంత్రి’ నినాదం ఇచ్చిన కె.సి.ఆర్, ఏరు దాటాక తెప్ప తగలేయడానికి వెనుదీయలేదు.

ఉద్యమ ప్రారంభ దినాల్లోనే వసూల్ రాజాలు గా టి.ఆర్.ఎస్ నేతలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించారని కె.సి.ఆర్ కుటుంబం పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు ఏనాడూ స్పందించనట్లే ఈ రోజు దళిత ముఖ్యమంత్రి వాగ్దానాన్ని ఎందుకు ఉల్లంఘించారో కూడా కె.సి.ఆర్ స్పందించట్లేదు.

తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేనట్లయితే వారి శ్రమ, ప్రాణ త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరే కానున్నాయని ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి.

5 thoughts on “తెలంగాణ మొదటి అడుగు: కె.సి.ఆర్ వాగ్దాన ఉల్లంఘన

 1. మొత్తానికి తెలంగాణ యువకులు ప్రాణాలు అశువులు బాసింది ఒక కుటుంబం కోసమన్నమాట. ప్రజల ప్రాణాలొదిలి సాదించుకున్న సమాజాలని ఎవడో హైజాక్‌ చేసుక పోవటం చరిత్రలో చాలా చూడగలం.

 2. “రాయి” తీస్తే ఉద్యమం , “రాయితీ’ ఇస్తే ప్రజా మాధ్యమం. ఈ రెండిటి సహకారంలోని
  సాధికారతే నూతన తెలంగాణా ఆవీర్భనీయత. నిర్భయంగా ఉద్యమాలు నడిపే కే.సీ.ఆర్. కు
  బాధ్యతయుతంగా పగ్గాలు పట్టడం ఒకింత అనితరసాధ్యం.

 3. అంతేకాదు. తన మొదటి సంతకం…రుణమాఫీ పైనో,అమరుల కుటుంబాలను ఆదుకునేందుకో పెడతారనుకుంటే…పోలీసు అధికారుల కేటాయింపులపై సంతకం చేశారు.
  యాదృచ్చికంగానే ఐనా అందులో ఇంకేదో భావం స్పురిస్తోంది.
  తెలంగాణ విద్యార్ధులపై తుపాకి ఎక్కుపెట్టిన కొండా మురళి, కొండా సురేఖలు ఇప్పుడు తెరాస నేతలయ్యారు. సురేఖ త్వరలో మంత్రి కూడా అవుతుందట.
  ఉద్యమాలు పోరాటదశలో ప్రజల చేతుల్లోనే ఉంటాయి.త్యాగాలు చేసినా, ప్రాణాలు దారపోసినా దళితులు, పేదలు, అణగారిన వర్గాలే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటారు.
  అధికారం చేజిక్కిన తర్వాత ప్రజల ప్రయోజనాల కన్నా, పెట్టుబడిదారుల ప్రయోజనాలే మొదటి స్థానంలోకి వస్తాయి.
  ఆనాటి స్వతంత్ర పోరాటం నుంచి, ఇవాళ్టి తెలంగాణ పోరాటం దాకా ఇదే నిజాన్ని నిరూపిస్తున్నాయి.

 4. Here everyone needs to understand is Telangana movement is different and KCR (TRS) is different. KCR alone dint fight for Telangana so many poets,employes,students,itellectuals struggled for it not because they will benefit by Telangana state because of their own identity and culture ofcourse economic benefits is one of the reason. Here we need to understand TRS got only 63 out of 119 so all ppl are not behind him.But as a CM for Telangana every one needs to respect him, might be he can not do much things but far better than most of the ex AP chief ministers. What all I want to say is dont take KCR is the replica of Telangana whatever the cause and CM may be Telangana is deserved to be created and as a peoples judgment we should accept it and hope for the best.

 5. ఎప్పటినించో నా అభిప్రాయమిది. కేసీయార్ కి దీటైన వాక్పటిమతో, ఊకదంపుడు వాగుడు కాకుండా పట్టుకున్న పాయింటుని సమర్ధంగా వ్యక్తపరచి ఆకట్టుకోగల మాటకారి మంద కృష్ణ మాదిగ. అతడు దళిత వర్గీకరణ బదులు, దళితులతో పాటు, అశ్రద్ధ చెయ్యబడ్డ అన్ని కులాలనీ కలుపుకుని రాజ్యాధికారమే లక్ష్యంగా ఇన్నేళ్ళు శ్రమించినట్టయితే ఆ కూటమి ఈ సరికి నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి ఉండేది. ఎవరో చేస్తేనే గాని కాలేని ముఖ్యమంత్రి చేసినవాడికి బానిస కిందే లెక్క. అసలు, రాజకీయాలు దళిత వర్గీకరణని ఎప్పుడో చేసేశాయి. దళితుల మధ్య వైషమ్యాలు, విమర్శలు ప్రతి విమర్శలు ఆ చలవే. ఈ అనైక్యతే పలుకుబడి ఉన్న రాజకీయపార్టీలకి ఆహ్లాదం కలిగించే నమ్మకమైన పెట్టుబడి. కృష్ణ మాదిగతో పాటు చేవ ఉన్న దళిత, విస్మరిత కులాల నాయకులందరూ ఇప్పటి రాజకీయ పార్టీల బుట్టల్లో పడటం మానేసి సంఘటితమైతే వారికి అధికారం వేరొకరివ్వనవసరం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s