షియా ఇరాన్ సందర్శనలో సున్నీ కువైట్ అమీర్


Kuwait's Emir Sheikh Sabah al-Ahmed al-Sabah

Kuwait’s Emir Sheikh Sabah al-Ahmed al-Sabah

మధ్య ప్రాచ్యంలో మరో పరిగణించదగిన పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు పక్కా మిత్ర దేశం కువైట్ అమీర్ ఒకరు ఆదివారం నుండి తన ఇరాన్ సందర్శన ప్రారంభించాడు. షియా ఇరాన్ ప్రభావం మధ్య ప్రాచ్యంలో పెరిగడానికి దారి తీసే ప్రతి పరిణామాన్ని ఆటంకపరిచే సున్నీ సౌదీ అరేబియా పాత్ర ప్రస్తుత పరిణామంలో ఎంత ఉందన్నది వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

గత సంవత్సరం అధికారం చేపట్టిన రౌహాని ప్రభుత్వం అమెరికా, పశ్చిమ రాజ్యాలతో పాటు ప్రాంతీయ ప్రత్యర్ధి రాజ్యాలతోనూ సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా దశాబ్దాల బలవంతపు ఆంక్షల నుండి బైటపడేందుకు ప్రయత్నిస్తోంది. కువైట్ అమీర్ ఇరాన్ సందర్శించడం కూడా ఇందులో భాగమే. అయితే సౌదీ అరేబియా, అమెరికాల ఆమోదం లేకుండా ఈ సందర్శన జరిగే అవకాశం లేనందున ఇరాన్ ప్రయాణం పైనే పలు అనుమానాలు కలుగుతున్నాయి.

1979లో ఇరాన్ లో అమెరికా వ్యతిరేక ఇస్లామిక్ విప్లవం ద్వారా షియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక కువైట్ రాయబారి ఒకరు ఇరాన్ సందర్శించడం ఇదే మొదటిసారి. అప్పటి అమెరికా అనుకూల షా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి అయితుల్లా ఖోమైనీ నేతృత్వంలోని షియా ఇస్లామిక్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అప్పటి నుండి ఇరాన్ ప్రభుత్వం కూల్చివేతకు అమెరికా చేయని ప్రయత్నం లేదు. ఇరాక్-ఇరాన్ యుద్ధాన్ని ఎగదోయడం దగ్గర్నుండి అణ్వాయుధాల సాకుతో రాజకీయ, ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించడం వరకూ అమెరికా పశ్చిమ రాజ్యాలు అమలు చేశాయి.

అహ్మది నెజాద్ నేతృత్వంలోని ఇరాన్ ప్రభుత్వం అమెరికా ఆధిపత్యాన్ని స్ధైర్యంతో ధిక్కరించే అవగాహనను అమలు చేయడంతో అమెరికా, ఐరోపాలు ఐరాస చేత పలు విడతలుగా ఆంక్షలను విధింపజేశాయి. ఈ ఆంక్షల వల్ల భారత్ లాంటి దేశాలు అధిక చమురు బిల్లులను మోయవలసి వచ్చింది. తమ అణు విధానం శాంతియుత (విద్యుత్, వైద్య) ప్రయోజనాల కోసమే అని ఇరాన్ మొత్తుకున్నప్పటికీ, దానిని సి.ఐ.ఏ, మొస్సాద్ (ఇజ్రాయెల్) లు ధృవీకరించినప్పటికీ అసత్య ఆరోపణలతో ఆంక్షలను మాత్రం కొనసాగించారు. దానితో ఇరాన్ ఆర్ధిక వ్యవస్ధ బలహీనపడింది. అనేక రకాల ఔషధాలు అందుబాటులో లేక పిల్లలు, స్త్రీలు, వృద్ధులు ఆరోగ్యపరంగా కష్టాలను ఎదుర్కొన్నారు.

ఈ నేపధ్యంలో గత సం.ము జరిగిన ఎన్నికల్లో హాసన్ రౌహాని ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐరాస సమావేశాల నిమిత్తం అమెరికా వెళ్ళిన రౌహాని నేరుగా ఒబామాతో టెలిఫోన్ లో మాట్లాడడం ద్వారా ప్రపంచ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపారు. అమెరికాతోనూ, ఇరుగు పొరుగు అరబ్ రాజ్యాలతోనూ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అభ్యంతరం లేదనీ, తదనుగుణంగా ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధం అనీ తద్వారా ఆయన సందేశం పంపారు. అనంతర కాలంలో P5 + 1 (ఐరాస భద్రతా సమితిలోని 5 శాశ్వత  సభ్య దేశాలు + జర్మనీ) తో జరిగిన ప్రాధమిక చర్చల్లో 6 నెలల పాటు తాత్కాలికంగా, పాక్షికంగా ఆంక్షలు ఎత్తివేయడానికి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత అవే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పశ్చిమ దేశాలు అసాధ్యమైన గొంతెమ్మ కోర్కెలను ఇరాన్ ముందు ఉంచడంతో ఒప్పందం కుదరడం ఆలస్యం అవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ పరిస్ధితుల్లో సున్నీ మతానికి చెందిన కువైట్ రాయబారి షేక్ సబా ఆల్-అహ్మద్ ఆల్-సబా ఇరాన్ సందర్శించడం ఇరాన్ కు సానుకూల పరిణామంగానూ సౌదీ అరేబియాకు వ్యతిరేక పరిణామం గానూ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే సౌదీ అరేబియా గట్టిగా వ్యతిరేకిస్తున్నా కువైట్ అమీర్ ఇరాన్ సందర్శిస్తున్నారని భావించలేమ్. ఈ విషయంలో ఒక అవగాహనకు రావడానికి మరిన్ని పరిణామాలు జరగవలసి ఉంది.

కువైట్ లో సున్నీ ప్రజలు మెజారిటీ కాగా షియా ప్రజలు మైనారిటీ. కువైట్ ద్వారా ఇరాన్ మరియు గల్ఫ్ అరబ్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇరాన్-గల్ఫ్ దేశాల మధ్య కువైట్ వంతెనగా పని చేసేందుకు ముందుకు వస్తోందని కొందరు చెబుతున్నారు. సౌదీ అరేబియాతో సైతం ఇరాన్ సంబంధాలు మెరుగుపడడానికి కువైట్ రాజు కృషి చేస్తుండవచ్చని వారి అంచనా. ప్రస్తుతానికైతే ఇరాన్-సౌదీ సంబంధాలు ఎప్పటిలా చిటపటలుగానే కొనసాగుతోంది. సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలోనే ఇరాన్, సౌదీల మధ్య తీవ్ర విభేదాలు నెలకొని ఉన్నాయి. సిరియాలో అస్సాద్ ప్రభుత్వాన్ని కోల్పోవడం అంటే ఇరాన్ తన కుడి భుజాన్ని కోల్పోవడమే. అస్సాద్ ను ఎలాగయినా గద్దె దింపాలని సౌదీ సకల ప్రయత్నాలు చేస్తోంది.

ఈ విభేదాల మధ్యనే ఇరాన్ విదేశీ మంత్రిని సౌదీ సందర్శించాలని ఆహ్వానం వెళ్ళడం గమనార్హం. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (OIC) సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ ఆహ్వానం వెళ్లింది. అయితే ఈ ఆహ్వానాన్ని ఇరాన్ విదేశీ మంత్రి జావద్ జారీఫ్ స్వీకరించలేదు. ఆహ్వాన తేదీల నాటికి తాను P5+1 దేశాలతో అణు చర్చలలో ఉంటానని కాబడ్డీ ఆహ్వానాన్ని స్వీకరించలేక పోతున్నందుకు చింతిస్తున్నానని ఆయన సౌదీ కి వర్తమానం పంపినట్లు తెలుస్తోంది.

షేక్ సబా, కువైట్ కు మాజీ విదేశాంగ మంత్రిగా పని చేశారు. మధ్య ప్రాచ్యంలో అత్యంత చురుకైన రాయబారిగా ఈయనకు పేరుందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అత్యంత కీలక సమయంలో కువైట్ రాయబారి ఇరాన్ సందర్శిస్తున్నారని కువైట్ లో ఇరాన్ రాయబారి ఆలీ అనాయతి వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పెరగడానికి ఇది దోహదపడుతుందని ఆయన ఆశాభావం ప్రకటించారు. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోని స్ధిరమైన ప్రాంతీయ వ్యవస్ధ ఏర్పాటుకు కువైట్, ఇరాన్ లు కృషి చేస్తాయని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్య సౌదీ అరేబియాను ఉద్దేశించిందా లేక సాధారణ పరిశీలనా అన్నది తెలియరాలేదు.

ఇరాన్ వార్తా సంస్ధల ప్రకారం కువైట్ రాయబారి సబా వెంట కువైట్ చమురు మంత్రి, విదేశీ మంత్రులు కూడా ఉన్నారు. అనగా నిర్దిష్ట లక్ష్యంతోనే కువైట్ రాయబారి సందర్శన జరుగుతోందని భావించవచ్చు. ఇరాన్ తన పొరుగు దేశాలతో సంబంధాలు పెంచుకోవడం అత్యావశ్యకమే. కానీ అది తన దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండడం అంగీకరించడానికి వీలు లేనిది. పశ్చిమ దేశాలతో స్నేహం అంటేనే అది అనివార్యంగా ఆయా దేశాల ప్రజలకు చేటు తెచ్చేదని చరిత్ర రుజువు చేసిన సత్యం. అందుకే ఇరాన్ కదలికలు పలు అనుమానాలకు తావిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s