
U.S. Defense Secretary Chuck Hagel speaks at the opening plenary meeting at the 13th Asia Security Summit in Singapore, May 31, 2014.
సింగపూర్ లో శనివారం జరిగిన ‘షాంగ్రీ-లా డైలాగ్’ చైనా, అమెరికాల మధ్య మాటల తూటాలు పేలడానికి వేదికయింది. ప్రాంతీయంగా అస్ధిరత్వం నెలకొనడానికి చైనా కారణం అవుతోందని అమెరికా చైనాను నిందించగా, అమెరికా ప్రసంగం చైనాను బెదిరిస్తున్నట్లుగా ఉందని చైనా తిప్పి కొట్టింది. అమెరికా తరపున డిఫెన్స్ కార్యదర్శి చక్ హెగెల్ ప్రసంగించగా చైనా తరపున ఆ దేశ ఆర్మీ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ వాంగ్ గువాంగ్ ఝాంగ్ ప్రసంగించారు.
‘ఆసియన్ సెక్యూరిటీ ఫోరం’ నే ‘షాంగ్రీ-లా డైలాంగ్’ అని పిలుస్తారు. ఆసియాలో అతిపెద్ద భద్రతా వేదికగా దీన్ని పిలుస్తారు. ఆస్ట్రేలియా, చైనా, తైవాన్, హాంగ్ కాంగ్, ఇండియా, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, మంగోలియా, న్యూ జీలాండ్, ఫిలిప్పైన్స్, ధాయిలాండ్, టర్కీ, వియత్నాం లు ఇందులో సభ్య దేశాలు. జపాన్, ఫిలిప్పైన్స్ తదితర దేశాల మిత్ర దేశంగా అమెరికా కూడా ఇందులో పాల్గొంటుంది.
“ఇటీవలి నెలల్లో దక్షిణ చైనా సముద్రంలో చైనా అస్ధిరపరిచే చర్యలకు పాల్పడుతోంది. తనవిగా చెబుతున్న ప్రాంతాలపై హక్కుల కోసం ఏకపక్ష చర్యలకు దిగుతోంది” అని చక్ హెగెల్ పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా “మా భౌగోళిక పునఃసమతూకాన్ని ఆసియా-పసిఫిక్ ప్రాంతం పైకి కేంద్రీకరించడానికి అమెరికా కట్టుబడి ఉంది” అని ఆయన ప్రకటించేశాడు. “అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన మౌలిక సూత్రాలకు సవాళ్ళు ఎదురవుతున్నపుడు అమెరికా మరోవైపు చూస్తూ ఉండబోదు” అని కూడా హెచ్చరిక జారీ చేశాడాయన.
చక్ హెగెల్ ఏదీ దాచుకోలేదు. అస్ధిరపరిచే చర్యలకు, ఏకపక్ష చర్యలకు చైనా పాల్పడుతోందని ఒక పక్క ఆరోపిస్తూనే అదే నోటితో తన ఆరోపణల అసలు అర్ధం ఏమిటో కూడా ఆయన చెప్పేశారు. చైనా చర్యలు ఈ ప్రాంతంలో తన ఆధిపత్యానికి భంగకరంగా పరిణమించాయని, తన ప్రయోజనాలకు భంగం కలిగితే తాము సహించేది లేదని ఆయన దాదాపు నేరుగానే చెబుతున్నారు. ఒబామా ప్రకటించిన ‘ఆసియా-పివోట్’ సూత్రం చైనా ఎదుగుదలను కట్టడి చేయడానికి ఈ ప్రాంతంలో తమ మిత్ర దేశాలను (ముఖ్యంగా జపాన్) రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికీ ఉద్దేశించినదే అని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతీయ స్ధిరత్వం/అస్ధిరత్వం పట్ల ఆయనకు చింత లేనేలేదని నిజానికి తమ ప్రయోజనాల కోసం తానే అస్ధిరతకు అమెరికా దోహదం చేస్తోందని హెగెల్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రాంతీయంగా (వివిధ ద్వీపాలపైనా, సముద్ర సంపదలపైనా) వివిధ దేశాలు వ్యక్తం చేస్తున్న హక్కుల పట్ల అమెరికా ఏ పక్షమూ తీసుకోదని చక్ హేగెల్ ఈ సందర్భంగా చెప్పారు. కానీ ఏ దేశమైనా బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. “ఏ దేశమైనా బెదిరింపులకు, ఒత్తిడిలకు, బలవంతాలకు, తన హక్కుల కోసం బలప్రయోగాలకు దిగితే గనక మేము గట్టిగా వ్యతిరేకిస్తాము” అని ఆయన చెప్పారు.
చక్ హేగెల్ మాటలకు చైనా ఘాటుగా స్పందించిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా ప్రతినిధి ప్రసంగం పూర్తిగా బెదిరింపులతోనూ, ఆధిపత్యవాదంతోనూ నిండి ఉన్నదని ఆ దేశ ఆర్మీ ఉప అధిపతి వాంగ్ ఆరోపించారు. “సెక్రటరీ హేగెల్ ప్రసంగం అంతా ఆధిపత్యవాదం, బెదిరింపులు, భయపెట్టడంతో నిండి ఉన్నది. ఆయన ప్రసంగం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సమస్యలు సృష్టించడానికే ఉద్దేశించబడింది” అని వాంగ్ ఆరోపించారు.
శుక్రవారం (మే 30) ప్రారంభం అయిన షాంగ్రీ-లా సదస్సులో ప్రారంభం రోజున జపాన్ ప్రధాని ప్రసంగించారు. ఆయన కూడా చైనా పై ఆరోపణలు ఎక్కుపెట్టడం ద్వారా సమావేశంలో కాక పుట్టించారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో తమకూ హక్కులు ఉన్నాయని వాదిస్తున్న ప్రాంతీయ దేశాలకు అండగా నౌకలు, యుద్ధ విమానాలు పంపుతామని ఆఫర్ ఇవ్వడం ద్వారా చైనాను మరింత రెచ్చగొట్టి, అమెరికాకు కావలసినంత మేత అందజేశారు. షాంగ్రీ-లా సదస్సుకు కీ-నోట్ ప్రసంగం జపాన్ ప్రధాని షింజో-అబే దే కావడం గమనార్హం. “ఆగ్నేయాసియా దేశాలకు గట్టి మద్దతు ఇవ్వడానికి జపాన్ కట్టుబడి ఉంది” అని అబే డిక్లేర్ చేయడం ద్వారా ఉద్రిక్త ప్రసంగాలకు నాంది పలికారు.
తూర్పు చైనా సముద్రంలోని దియోయు/సెంకాకు ద్వీపకల్పం పై హక్కుల కోసం చైనా-జపాన్ లు తగాదా పడుతున్నాయి. ఈ ద్వీపాలు ఒకప్పుడు చైనాకు చెందినవే. అయితే కొన్ని శతాబ్దాల క్రితం చైనా ఫ్యూడల్ పాలకులు వాటిని జపాన్ కు లీజుకు ఇచ్చారు. జపానే దురాక్రమించిందని చైనా వాదన. ఆ విధంగా అవి ప్రస్తుతం జపాన్ ఆధీనంలో ఉండగా వాటిని తిరిగి తమకు అప్పజెప్పాలని చైనా కోరుతోంది. జపాన్ అందుకు తిరస్కరిస్తోంది.
దక్షిణ చైనా సముద్రం బహుళ సంపదలకు నిలయం. మత్స్య సంపదతో పాటు భారీ చమురు సంపదలు కూడా ఇక్కడ ఉన్నాయని భావిస్తున్నారు. వీటిలో తమకూ భాగం ఉందని వియత్నాం, ఫిలిప్పైన్స్, తైవాన్, జపాన్, బ్రూనో దేశాలు వాదిస్తున్నాయి. చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంలో అత్యధిక భాగం తమదేనని వాదిస్తున్నట్లుగా పశ్చిమ పత్రికలు చెబుతున్నాయి. నిజంగా చైనా ఎంతవరకు క్లయిమ్ చేస్తున్నది పూర్తి వివరాలు అందుబాటులో లేవు.