యుద్ధ విమానాలతో యుద్ధం చేసుకోవడం మొదటి ప్రపంచ యుద్ధంలోనే మొదలయింది. అప్పటికి విమానాల నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందలేదు. చాలా ప్రాధమిక స్ధాయిలోనే విమానాల నిర్మాణం ఉన్నప్పటికీ శత్రువుపై పై చేయి సాధించడానికి పశ్చిమ దేశాలు వాటినీ వదల్లేదు. ప్రారంభంలో కేవలం గూఢచర్యానికి మాత్రమే విమానాలను, ఇతర ఎగిరే వస్తువులను (బెలూన్లు, గాలిపటాలు మొ.వి) వినియోగించేవారు. యుద్ధం తీవ్రం అయ్యేకొద్దీ అవసరం రీత్యానే బాంబర్లు, ఫైటర్ విమానాలు తయారు చేసుకుని వినియోగించారు.
దాడులకు విమానాలను వినియోగించవలసి వచ్చినపుడు కూడా విమానాలకు పెద్ద పెద్ద తుపాకులను అమర్చడం కాకుండా పైలట్లే తుపాకి ధరించేవారు. కొన్నిసార్లు తుపాకి ఏమీ లేకుండానే గూఢచర్యం కోసం యుద్ధ విమానంలో వెళ్ళేవారు. 1918 కల్లా ఫైటర్ విమానాలు, భారీ బాంబులు జారవిడిచే బాంబర్ విమానాలు, ఒకటి కంటే ఎక్కువ మెషీన్ గన్లు అమర్చిన విమానాలను తయారు చేసుకున్నారు. ఇలా తయారు చేసుకున్న దేశాల్లో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ లాంటి దేశాలే ముందున్నాయని వేరే చెప్పనవసరం లేదు.
బెలూన్ల ద్వారా గూఢచర్యం నిర్వహించడం, ప్రత్యేకంగా తయారు చేసిన గాలిపటాల ద్వారా ఎత్తుకు వెళ్ళి శత్రు బలగాలను పరిశీలించడం… ఇవన్నీ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంలో విస్తృతంగా వినియోగించబడ్డాయి. అనంతరం ఫైటర్ విమానాలను ప్రతి దేశమూ తయారు చేసుకోవడంతో విమాన వ్యతిరేక తుపాకులను కూడా కనిపెట్టారు. యుద్ధ విమానాలను కూల్చివేసే వ్యూహాత్మక ఎత్తుగడలను తయారు చేసుకుని అమలు చేశారు.
దానితో యుద్ధ విమానాల పైలట్ల ఉద్యోగం ప్రమాదకరంగా మారింది. వారు తరచుగా శత్రువుల తుపాకులకు, ప్రతికూల వాతావరణ పరిస్ధితులకు గురయ్యేవారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా విమానాలు కనిపెట్టడంతో వాటిని ప్రయోగించి చూసే దశలో కూడా పైలట్లు మరణించేవారు. యుద్ధ విమానాలు శత్రువుల ప్రమేయం లేకుండానే తరచుగా వాటంతట అవే కూలిపోయేవి. ఆ విధంగా ఫైటర్ విమానాలకు నిపుణులైన పైలట్ల అవసరం పెరుగుతూ పోయింది.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 100 సం.లు పూర్తయిన సందర్భంగా ది అట్లాంటిక్ పత్రిక వరుసగా అప్పటి ఫోటోలను వివిధ సెక్షన్లుగా విభజించి ప్రచురిస్తోంది. ఈ ఫోటోలు మొదటిసారిగా జరిగిన గగనతల యుద్ధానికి సంబంధించినవి.
సర్,మొదటిప్రపంచయుద్ధం తర్వాత ఆ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన దేశాల ఆర్ధికస్తితిగతులను వివరించ ప్రార్ధన! నాలాంటివారికి ఇది ఎంతోఉపయోగకరంగా ఉంటుంధి.