ఈ.యుకు సమాధానం యూరేసియన్ యూనియన్ రెడీ!


EEU agreement signed

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దశాబ్దం నాటి కల నెరవేరుతోంది. చరిత్రాత్మక ఒప్పందం కుదరడంతో రష్యా మీది మీదికి వస్తున్న నాటో-ఇ.యు-అమెరికా కు గట్టి సమాధానంగా యూరేసియన్ యూనియన్ ప్రపంచ భౌగోళిక-రాజకీయ చిత్రపటం పైకి దూసుకొస్తోంది. రష్యా, కజకిస్తాన్, బెలారస్ దేశాల నేతలు ఆస్తానాలో సమావేశమై పూర్తిస్ధాయి ఆర్ధిక కూటమి (యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ -ఇ.ఇ.యు) ఏర్పాటు చేస్తూ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు ఇప్పటిదాకా ఉన్న కస్టమ్స్ యూనియన్, జనవరి 1, 2015 నుండి యూరేసియన్ యూనియన్ గా ఉనికిలోకి రానుంది. బహుళ ధృవ ప్రపంచం ఏర్పాటు దిశలో మరో పొటెన్షియల్ ధృవ ఏర్పాటుకు ఆ విధంగా బీజం పడనుంది.

ఆసియా, ఐరోపా ఖండాలకు అనుసంధానకర్త గానూ, పశ్చిమ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఆర్ధిక, రాజకీయ, మిలట్రీ కూటములకు సమాధానం గానూ యూరేసియన్ యూనియన్ పని చేస్తుందని సంబంధిత దేశాల వర్గాలు ప్రైవేటుగా చెబుతున్నాయి. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో కుదిరిన ఒప్పందం చరిత్రాత్మకమైనదిగా ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

జనవరి 1, 2015 తేదీ నుండి అమలులోకి వచ్చే యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ వల్ల 17 కోట్ల మిలియన్ల ప్రజలు నివసించే ఉమ్మడి మార్కెట్ ఉనికిలోకి వస్తుంది. ఈ మూడు దేశాల ఉమ్మడి జి.డి.పి 2.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ది హిందు పత్రిక ప్రకారం ప్రపంచ శక్తి వనరులలో (గ్యాస్, చమురు) నాలుగో వంతు ఈ మూడు దేశాల ఆధీనంలో ఉన్నాయి. ఏ శక్తి వనరులపై ఆధిపత్యం కోసమైతే మధ్య ప్రాచ్యాన్ని గత ఆరేడు దశాబ్దాలుగా రణరంగంగా పశ్చిమ దేశాలు మార్చివేసాయో, రష్యా పొరుగున ఉన్న మధ్య ఆసియా దేశాలను తమ ప్రాభవంలోకి తెచ్చుకోవడానికి వీలుగా నిరంతర వైషమ్యాలను రష్యా సరిహద్దు వరకూ తెచ్చాయో అవే శక్తి వనరులు ఇప్పుడు నూతన ఆర్ధిక కూటమికి పెట్టని ఆర్ధిక కోటగా మారనున్నాయి.

“రష్యా, బెలారస్, కజకిస్తాన్ దేశాలు తమ మధ్యగల సహకారాన్ని మౌలికంగా నూతన స్ధాయికి తీసుకెళ్ళాయి. తద్వారా ఉమ్మడి మార్కెట్ ను ఏర్పరుస్తున్నాయి. ఈ మార్కెట్ లో సరుకులు, సేవలు, పెట్టుబడి, కార్మిక శక్తి స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. శక్తి రంగం, పరిశ్రమలు, వ్యవసాయం, టెక్నాలజీ, రవాణా రంగాల్లో సమన్వయంతో కూడిన విధానాలను ఈ త్రయ రాజ్యాలు అమలు చేస్తాయి” అని ఒప్పందం సంతకం చేసిన అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు. కజకిస్తాన్ అధ్యక్షుడు నజర్బయేవ్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో లు ఒప్పందం పై సంతకాలు చేశారు.  

యూరేసియన్ యూనియన్ కేవలం మూడు దేశాలకే పరిమితం కాదు. వచ్చే నెలలోనే ఈ కూటమిలో చేరేందుకు ఆర్మీనియా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఒకప్పటి సోవియట్ రష్యాలో భాగం అయిన ఆర్మీనియా, కజకిస్తాన్, బెలారస్, రష్యాలు ఆ విధంగా మళ్ళీ ఒక చోటికి చేరుతాయి. యూనియన్ లో చేరేందుకు కిర్ఘిస్తాన్, తజకిస్తాన్ లు కూడా వరుసలో నిలబడి ఉన్నాయని సమాచారం. ఈ రెండు దేశాలు కూడా చేరితే యూనియన్ సభ్య దేశాల సంఖ్య 6 కు పెరుగుతుంది.

అంతేనా? యూరేసియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి వివిధ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వాటిలో ఇండియా కూడా ఒకటి. వియత్నాం, న్యూజీలాండ్, టర్కీ, ఇజ్రాయెల్ దేశాలు కూడా యూరేసియన్ యూనియన్ తో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలన్న కోరికను వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఇజ్రాయెల్, ఇండియాలతో ప్రాధాన్యతా వాణిజ్య వ్యవస్ధల ఏర్పాటు గురించి ఆస్తానాలో తాము చర్చించామని కూడా పుతిన్ తెలియజేశారు.

వాషింగ్టన్ పోస్ట్ (డబ్ల్యూ.పి) పత్రిక ప్రకారం ఒప్పందం ఫలితంగా యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ సభ్య దేశాల పౌరులందరికీ సభ్య దేశాలన్నింటిలోనూ విద్య, ఉద్యోగాలలో సమాన అవకాశాలు లభిస్తాయి. “21వ శతాబ్దపు నూతన భౌగోళిక-ఆర్ధిక వాస్తవం ఈ రోజు పురుడు పోసుకుంది. ఈ ఒప్పందం గత 20 సంవత్సరాల కఠోర శ్రమ ఫలితం. మా ప్రజలకు ఒక ఆశీర్వాదం” అని కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజర్బయేవ్ యూనియన్ ఏర్పాటుపై వ్యాఖ్యానిస్తూ అన్నారని డబ్ల్యూ.పి తెలిపింది. మూడు దేశాలు ఉమ్మడి కరెన్సీ ఏర్పాటు చేస్తాయా అన్నది ఇంకా తెలియలేదు. కజకిస్తాన్ ప్రభుత్వ వర్గాల ప్రకారం ఉమ్మడి కరెన్సీ ఏర్పాటు విషయమై ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు.

పశ్చిమ పత్రికలు నూతన కూటమి భవిష్యత్తు గురించి పెదవి విరుస్తూ అదేమీ పెద్ద సంగతి కాదని తమ పాఠకులకు చెప్పుకోవడంలో నిమగ్నం అయ్యాయి. ఇదంతా రష్యా ఆధిపత్యం కోసం జరుగుతోందని, ఆధునీకరణ జరక్కుండా కూటమి విజయవంతం కావడం కష్టం అనీ అవి విశ్లేషిస్తున్నాయి. ఉక్రెయిన్ తమ ప్రభావం నుండి జారిపోతున్న నేపధ్యంలో పోయిన ప్రతిష్ట, శక్తి లను కూడగట్టుకోవడానికే పుతిన్ నూతన యూనియన్ ను రంగం మీదికి తెచ్చారని అవి విశ్లేషిస్తున్నాయి. సోవియట్ రష్యా పతనం అనంతరం ఎల్లకాలం ఏక ధృవ ప్రపంచమే కొనసాగుతుందని కలలుగన్న అమెరికా, తదితర పశ్చిమ దేశాలకు నూతన కూటమి ఆవిర్భావం రుచించకపోవడంలో ఆశ్చర్యం లేదు. తమ ముందు సాష్టాంగ ప్రమాణం చేసిన ఎల్టిసిన్ వలే కాకుండా రష్యాను సొంత ప్రాభవ దేశంగా నిర్మించడంపైనే దృష్టి పెట్టిన పుతిన్ ను రాక్షసీకరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన పశ్చిమ పత్రికలకు సైతం యూరేసియన్ యూనియన్ ఆవిర్భావం మింగుడు పడని విషయమే.

అమెరికా, ఐరోపా దేశాలకు పోటీగా బహుళ ధృవ కేంద్రాల ఆవిర్భావం ప్రపంచ భౌగోళిక-రాజకీయ రంగంలో నిస్సందేహంగా ఒక సానుకూల పరిణామమే. బహుళధ్రువ ప్రపంచంలో వివిధ దేశాల మధ్య సంబంధాలు మరింతగా ప్రజాస్వామికీకరణ చెందడానికి అవకాశం లభిస్తుంది. ఐరాస, ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ తదితర ప్రపంచ రాజకీయ, ఆర్ధిక సంస్ధలను గుప్పెట్లో పెట్టుకుని తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా చలామణి చేసుకుంటున్న పశ్చిమ దేశాల దాష్టీకం సాపేక్షికంగా క్షీణించడానికి అవకాశం ఏర్పడుతుంది.

అయితే ఈ అవగాహనకు ఉన్న అనేక పరిమితులను విస్మరించడం కార్మిక వర్గ కోణంలో ఆత్మహత్యా సదృశం కాగలదు. ఆర్ధిక కూటముల ఏర్పాటు ప్రాధమికంగా ఆయా సభ్య దేశాల కార్మిక వర్గ ప్రయోజనాలకు మౌలికంగా విఘాతం కలిగిస్తుంది. వివిధ దేశాల మధ్య ఉండే భౌగోళిక, ఆర్ధిక, రాజకీయ సరిహద్దులకు అతీతంగా తమ తమ వాణిజ్య ప్రయోజనాలను వృద్ధి చేసుకోవడానికే ఆర్ధిక కూటములను ఆయా దేశాలలోని పాలక వర్గాలు ఏర్పాటు చేసుకుంటాయి.

సాధారణంగా స్ధానిక ఉత్పత్తుల మార్కెట్ కు భంగం కలగకుండా ఉండడానికి ఆయా ప్రభుత్వాలు పన్నులు, సుంకాలు విధిస్తాయి. అయితే ఒక దేశంలో కంపెనీలు పెరిగి పెద్దవై భారీ ఉత్పత్తి చేయగల సామర్ధ్యం సంతరించుకున్నాక పక్క దేశాల మార్కెట్ లు వారికి అవసరం అవుతాయి. కానీ అక్కడి పన్నులు, సుంకాలు వారి ఉత్పత్తుల ప్రవాహానికి ఆటంకంగా నిలుస్తాయి. ఇదే పరిస్ధితిని ఇతర దేశాలలోని కంపెనీలు కూడా ఎదుర్కొంటూ ఉంటాయి. ఈ ఆటంకాలను అధిగమించి తమ ఉత్పత్తులకు మార్కెట్ పెంచుకునేందుకు ఆర్ధిక కూటములు (ఎకనమిక్ యూనియన్) ఏర్పాటుకు కంపెనీలు తమ ప్రభుత్వాలను ప్రేరేపిస్తాయి.

ఇక్కడ కంపెనీల ప్రయోజనాలే ప్రధానం తప్ప అందులో పని చేసే కార్మికుల ప్రయోజనాలు లెక్కలో ఉండవు. ఉత్పత్తుల ప్రవాహానికి అంగీకరించినంత తేలికగా కార్మికుల ప్రవాహానికి సభ్య దేశాలు అంగీకరించనిది అందుకే. ఆర్ధిక కూటములలో శక్తివంతమైన దేశాలే ఎప్పటికీ ప్రధాన లబ్దిదారులుగా ఉంటాయి తప్ప ఒప్పందాలలో పేర్కొన్నట్లుగా సమాన హక్కులు, ప్రయోజనాలు అంటూ ఏమీ ఉండవు. ఈ విధంగా చూసినపుడు ఆర్ధిక, వాణిజ్య వ్యవస్ధల విలీనం అంతిమ పరిశీలనలో ధనిక వర్గాలకు, బహుళజాతి కంపెనీలకు మరిన్ని లాభాలు, సంపదలు సమకూర్చితే, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు మాత్రం తమ ఉపాధి, ఆదాయ వనరులతో పాటు భౌగోళిక వనరులను కూడా కోల్పోయి మరింతగా నష్టపోతారు.

కనుక యూరేసియన్ కూటమి ఆవిర్భావం భౌగోళిక-రాజకీయాల పరంగా చూసినపుడు సానుకూల పరిణామంగా కనిపించినప్పటికీ అది ఆయా సభ్య దేశాల శ్రామిక వర్గ ప్రయోజనాలకు ప్రతికూల పరిణామం అవుతుంది.  ప్రపంచ వేదికలపై పశ్చిమ దేశాల దుర్మార్గపూరితమైన ఆధిపత్యాన్ని సాపేక్షికంగా తగ్గించే ప్రత్యామ్నాయ ధృవ ఆవిర్భావాన్ని ఆహ్వానించాలా లేక కూటమి సభ్య దేశాలలో కార్మిక వర్గ ప్రయోజనాలకు విఘాతం కలిగించే పరిణామం గనుక దాన్ని తిరస్కరించాలా అన్న ధర్మ సంకటం ఇక్కడ ఎదురవుతుంది.  ప్రపంచ దేశాలు, అందులోని వ్యవస్ధలలో వివిధ వర్గాల ప్రజలు అసమాన స్ధాయిల్లో అభివృద్ధి చెందిన ఫలితం ఇలాగే ఉంటుంది. అసమాన వ్యవస్ధలు ఏర్పాటు చేసుకునే సమాన ఒప్పందాలు అంతిమంగా మరిన్ని అసమానతలను పెంచుతాయి.

కార్మిక వర్గ పోరాటాలు కనీస ప్రత్యామ్నాయాన్ని సైతం ప్రజల ముందు ఉంచలేని బలహీనతలో ఉన్న ఫలితం కూడా ఇది. పోటీ పడుతున్న రెండు లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ శిబిరాలన్నీ సామ్రాజ్యవాద శిబిరాలే కావడం, అందులో సోషలిస్టు శిబిరం లేకపోవడంతో ఇలాంటి సంకటం ఏర్పడింది. ఈ విధంగా చూసినా కార్మిక వర్గ ఉద్యమాలను తీవ్రం చేయాల్సిన అవసరం మరింతగా పెరిగింది.

One thought on “ఈ.యుకు సమాధానం యూరేసియన్ యూనియన్ రెడీ!

 1. ప్రపంచ దేశాలు, అందులోని వ్యవస్ధలలో వివిధ వర్గాల ప్రజలు అసమాన స్ధాయిల్లో అభివృద్ధి చెందిన ఫలితం ఇలాగే ఉంటుంది.
  ప్రజల అభివృద్ధి క్రమం ఎల్లప్పుడూ అసమానతలతోనే కొనసాగుతుందికదా! మరి అటువంటప్పుడు ఫలితాలుకూడా ఎలానే ఉంటాయి.

  అసమాన వ్యవస్ధలు ఏర్పాటు చేసుకునే సమాన ఒప్పందాలు అంతిమంగా మరిన్ని అసమానతలను పెంచుతాయి.
  మరిసమాన వ్యవస్తలు ఎక్కడున్నాయి అంటారు?(కార్మికుల సమాజంలోనా?)
  అసమానతలను తొలగించే వ్యవస్థలు కార్మికుల పోరాటాలవలనే సాధ్యమంటారా?

  కార్మిక వర్గ పోరాటాలు కనీస ప్రత్యామ్నాయాన్ని సైతం ప్రజల ముందు ఉంచలేని బలహీనతలో ఉన్న ఫలితం కూడా ఇది.
  మరి వైఫల్యం ఎక్కడుందంటారు? కార్మికులలోనా?నాయకత్వంలోనా? లేదా ఈ సిద్దాంతంలోనా? ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నవ్యవస్థలకన్న(సమాజం) మెరుగైన వ్యవస్తలు మానవాలికి అవసరం. అదిఏవిధంగా సిద్ధిస్తుంది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s