మంత్రివర్గం పొందిక మార్కెట్లకు నచ్చలేదుట!


credit_suisse

నరేంద్ర మోడి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆగమనంతో మురిసిపోయిన విదేశీ (and hence స్వదేశీ) కంపెనీలు మంత్రి వర్గ నియామకాలు చూసి జావగారిపోయాయి. మార్కెట్ లకు ఈ మంత్రివర్గ పొందిక నచ్చలేదని మార్కెట్ విశ్లేషణ సంస్ధలు తేల్చిపారేశాయి.

ఏనుగు మీద అదేదో ముతక సామెత చెప్పినట్లు అయిందే అని మార్కెట్లు వాపోతున్నాయిట. స్విట్జర్లాండ్ కి చెందిన బహుళజాతి ఆర్ధిక, ద్రవ్య సేవల సంస్ధ క్రెడిట్ సుసి, రాయిటర్స్ వార్తా సంస్ధ నిర్వహించే ‘మార్కెట్ ఐ’ శీర్షికలు సంయుక్తంగా మోడి మంత్రివర్గ నియామకాలపై పెదవి విరిచేశాయి.

మంత్రివర్గ నియామకాల గురించి రాయిటర్స్ వార్తా సంస్ధ ఒక వార్త ప్రచురిస్తూ దానికి పెట్టిన శీర్షికను చూడండి:

“New ministers underwhelming development for market – CSuisse”

“కొత్త మంత్రులు, మార్కెట్ కు నిరాశపరిచే పరిణామం” అని ఈ శీర్షిక అర్ధంగా చూడవచ్చు.

క్రెడిట్ సుసి సంస్ధ అభిప్రాయంగా శీర్షికలో చెప్పినప్పటికీ ఇది ‘రాయిటర్స్ మార్కెట్ ఐ’ అభిప్రాయం కూడా. ఆ సంగతి వార్త లోపలికి వెళితే గాని తెలియదు.

మంత్రుల నియామకాలు మదుపుదారుల (పెట్టుబడిదారుల) అంచనాలను నిరాశపరిచాయని, సంస్కరణలను వేగంగా అమలు చేయించడానికి వీలుగా నిపుణులైన (ప్రొఫెషనల్) వ్యక్తులను సంబంధిత శాఖలకు మంత్రులుగా నియమిస్తారని అనుకుంటే అలా జరగలేదని రాయిటర్స్ మార్కెట్ ఐ, క్రెడిట్ సుసి లు విశ్లేషించాయి.

సంస్కరణల అమలును వేగం చేయడానికి లక్ష్యం చేయబడిన శాఖలను కూడా రాయిటర్స్ ప్రస్తావించింది. రైల్వేలు, బొగ్గు మొదలయిన శాఖలు అని అది చెప్పింది. ఆర్ధిక శాఖకు అరుణ్ జైట్లీని నియమించారు గనక వారికి సంతోషమే. అదనంగా కార్పొరేట్ వ్యవహారాలు, రక్షణ రంగాలు కూడా ఆయనకు అప్పగించినందున ఇంకా సంతోషం. ఎన్నికలకు చాలా ముందుగానే ఆర్ధిక శాఖామాత్యులుగా అరుణ్ జైట్లీ వస్తారని పశ్చిమ పత్రికలు ప్రచారం చేసుకున్నాయి. తద్వారా ఎవరిని నియమించాలో అవి ముందే చెప్పాయన్నమాట!

వాణిజ్య మంత్రిగా నియమితురాలయిన నిర్మలా సీతారామన్, రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించేది లేదని అప్పుడే ప్రకటించేశారు. కానీ వాణిజ్య శాఖను ఎందుకో క్రెడిట్ సుసి ప్రస్తావించలేదు. నిర్మలా సీతారామన్ ప్రకటనలో వాస్తవం ఎంత ఉన్నదో ఒకటి రెండేళ్లు ఆగితే గాని తెలియదు. పైకి కనిపించకుండా చాప కింద నీరులా సంస్కరణలను అమలు చేయడంలో పాలకులు ఇప్పటికే రాటుదేలారు మరి!

రైల్వేల కేబినెట్ మంత్రిగా సదానంద గౌడను నియమించగా, సహాయ మంత్రిగా మనోజ్ సిన్హాను మోడి నియమించారు. బొగ్గు శాఖకు ప్రత్యేకంగా కేబినెట్ మంత్రిని నియమించలేదు గానీ, గనుల కేబినెట్ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ ను నియమించారు. అయితే బొగ్గు శాఖకు సహాయ మంత్రిగా పీయూష్ గోయల్ ను నియమించడం విశేషం. వీరందరూ నిపుణులు కారని, సంస్కరణలకు టార్గెట్ గా ఉన్న ఈ రంగాలకు (ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ) నిపుణులను నియమిస్తే బాగుండేదని క్రెడిట్ సుసీ, రాయిటర్స్ లు సణుగుతున్నాయి.

“చిన్న ప్రభుత్వం, నైపుణ్య పాలన” లేదా “తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన” అన్నది మోడి ఎన్నికల్లో ఇచ్చిన ఒక నినాదం. భారీ విజయం సాధించిన మోడి చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని భారత పత్రికలు సర్టిఫికేట్ ఇచ్చాయి కూడాను. కానీ క్రెడిట్ సుసి ఈ సర్టిఫికేట్ ను ఒప్పుకోలేదు. ఒకే స్వభావం కలిగిన వివిధ శాఖలను ఒకే మంత్రి కిందకు చేర్చినప్పటికీ ఆయా శాఖలను ఒకే శాఖగా విలీనం చేయడంలో విఫలం అయ్యారని చెప్పింది.

“చిన్న ప్రభుత్వం” అన్న నినాదం బడా బహుళజాతి ప్రైవేటు కంపెనీలకు చాలా ఇష్టమయిన నినాదం. ప్రభుత్వం పెద్దదిగా ఉండడం అంటే అనేక వ్యాపార, ఆర్ధిక, పారిశ్రామిక, కార్మిక కార్యకలాపాలను ప్రభుత్వమే నిర్వహించడం. చిన్న ప్రభుత్వం అంటే కేవలం రక్షణ, పోలీసు, పాలన రంగాలు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తూ సమస్త వ్యాపార, ఆర్ధిక, పారిశ్రామిక, కార్మిక, సేవల రంగాలను ప్రైవేటు కంపెనీలు లాభార్జనకు వదిలి పెట్టేయడం.

ఉదాహరణకి నీటి పారుదల, మంచినీటి సరఫరా ప్రభుత్వాలు నిర్వహిస్తేనే జనానికి న్యాయం జరుగుతుంది. నీరు ప్రకృతి సహజ వనరు. అది ప్రజలకు సహజసిద్ధంగానే అందుబాటులో ఉండాలి. కానీ ఇందులోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించడంతో తాగు నీటి వ్యాపారం వేల కోట్ల రూపాయలను ప్రైవేటు కంపెనీలకు సమకూర్చి పెడుతోంది. త్వరలో వ్యవసాయ వినియోగానికి కూడా మీటర్లు పెట్టి కొలిచే పరికరాలు అమర్చబోతున్నారు. అనగా రైతులు కూడా డబ్బు ఇచ్చి నీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో సాగు నీటికి మీటర్లు బిగించడానికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నిరసన రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే అధికారం చేపట్టనున్నారు. కాబట్టి ఇరిగేషన్ వాటర్ మీటర్లు రావడానికి అట్టే సమయం పట్టకపోవచ్చు.

ఇలాగే బ్యాంకులు, ఇన్సూరెన్స్, రోడ్లు, రవాణా (రైల్వేలు, బస్సులు, విమానయానం) తదితర ప్రధాన రంగాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తేనే అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చి, వారికి న్యాయం జరుగుతుంది. ప్రైవేటు బస్సులు, ప్రభుత్వ బస్సుల మధ్య తేడాలు మనకు అనుభవంలోకి వస్తున్నాయి కూడాను. ఈ రంగాల్లోని ప్రతి ఒక్క కార్యకలాపాన్ని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేస్తే ఇక ప్రభుత్వ బాధ్యతలు తగ్గిపోయి ప్రభుత్వం పరిణామం కూడా తగ్గిపోతుంది. అనగా ప్రభుత్వం చిన్నదైపోతుంది. కాబట్టి ‘ప్రైవేటీకరణ’ నినాదానికి మరో రూపమే ‘చిన్న ప్రభుత్వం’ అన్న నినాదం.

ఈ విధంగా ‘చిన్న ప్రభుత్వం’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మోడి అది సరిగ్గా నిర్వహించలేదని క్రెడిట్ సుసి అంటోంది. శాఖలను విడివిడిగానే ఉంచి ఒక మంత్రిని నియమించడం కాకుండా వాటిని విలీనం చేయాలని అది చెబుతోంది. అలా చేస్తే ప్రభుత్వం తన బాధ్యతలను ఒక్కటొక్కటిగా వదిలించుకుని ప్రైవేటు కంపెనీల లాభార్జనకు అప్పజెప్పడం సులభం అవుతుంది.

ఇన్ని చెప్పిన క్రెడిట్ సుసి కొత్త మంత్రుల్లో అనేకమంది పరిశుభ్రమైన వారని కితాబిచ్చింది. (కానీ కేంద్ర మంత్రివర్గంలోని 46 మందిలో 14 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పత్రికల సమాచారం. నితిన్ గడ్కారీ పైనయితే అవినీతి ఆరోపణలే ఉన్నాయి.) సంస్కరణలు అమలు చేయాల్సిన శాఖల మంత్రులు మోడీకి సన్నిహితులు కావడం సంతోషించదగిన విషయం అని అది సంతృప్తి పడింది. మోడి భారీ విజయం సాధించినందున మొత్తం మీద పరిస్ధితి సానుకూలమే అని కూడా వ్యాఖ్యానించింది. నియామకాలు అనుకూలం కాకపోయినా వారందరూ మోడి చేతుల్లో ఉన్నవాళ్లే కనుక (కూటమి ప్రభుత్వంలో వలే ఇతరుల దయా దాక్షిణ్యాలపై ప్రభుత్వం ఆధారపడి లేదన్న గుర్తింపు ఇది) అంతిమంగా పరిస్ధితి ఫర్వాలేదని క్రెడిట్ సుసీ భరోసా ప్రకటించింది.

పరిశుభ్రమైన వ్యక్తులని కితాబులు కూడా ఇస్తున్న క్రెడిట్ సుసీ పరిశుభ్రమైనదేనా? కానే కాదు. స్విట్జర్లాండ్ కి చెందిన క్రెడిట్ సుసీ కంపెనీ రిటైల్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్ తదితర సేవలను అందజేసే భారీ బహుళజాతి కంపెనీ. దాదాపు 150 యేళ్ళ క్రితం స్ధాపించబడిన క్రెడిట్ సుసీ తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచ వ్యాపితంగా అనేక బ్యాంకులను, ఫైనాన్స్ కంపెనీలను తనలో కలిపేసుకుని బహుళజాతి కంపెనీగా అవతరించింది.

2008 నాటి ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభం నుండి పెద్దగా నష్టపోకుండా బైటపడిందని పేరు తెచ్చుకున్న క్రెడిట్ సుసీ ఆ తర్వాత ఒక్కటోక్కటిగా తన అక్రమ కార్యకలాపాలు బైటపడడంతో అప్రతిష్ట పాలయింది. ఈ కంపెనీ అక్రమాలపై జర్మనీ, బ్రెజిల్, అమెరికా దేశాలు అనేక విచారణలు జరిపి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించాయి. ముఖ్యంగా ఆ దేశాల పౌరులు తమ అక్రమ సంపాదనను పన్నులు కట్టకుండా దాచుకునేందుకు సహకరించిందని ఆ దేశాలు నిర్ధారించాయి. సదరు నేరాలను అంగీకరిస్తున్నట్లుగా ఈ నెలలోనే (మే 2014) అమెరికాలోని ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పన్నులు ఎగవేయడానికి అమెరికా పౌరులకు సహకరించినందుకు గాను 2.6 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి సైతం క్రెడిట్ సుసీ ఈ సందర్భంగా ఒప్పుకుంది.

అలాంటి క్రెడిట్ సుసీ భారత దేశ జాతీయ ప్రభుత్వంలోని మంత్రుల గుణ గణాల గురించీ, వారి సామర్ధ్యం గురించీ సర్టిఫికెట్లు జారీ చేయడమే ఒక పెద్ద హిపోక్రసీ. దానికి రాయిటర్స్ సంస్ధ పతాక శీర్షికలతో ప్రచారంలో పెట్టడం మరో అసంగతం. ఈ కంపెనీలు, వార్తా సంస్ధలు మన దేశ గమనాన్ని నిర్దేశిస్తున్నాయి మరి!

3 thoughts on “మంత్రివర్గం పొందిక మార్కెట్లకు నచ్చలేదుట!

  1. ప్రభుత్వాలు హిపో క్రసిని అనుసరిస్తాయి కనుక నచ్చక పోవటం సహజమే లెండి. ఇది మాత్రం ఇపోక్రసి అని ఎందుకనుకోగూడదు?

  2. అమెరికా వాడు మోడికి వీసా ఇవ్వనందుకు తప్పైపోయిందని , ఎమనుకోవద్దు, అదొక పెద్దపొరపాటు, అని Tacit అపాలజి చెప్పి, మీరు మా దేశం రండి అని సందేశం పంపాడు. మోడి దానిని పట్టించుకోకుండా జపాన్ కి ముందు వెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆసియా దేశాలతో సంభంధాలకి కి ప్రథమ స్థానం ఇస్తునట్లు సందేశం పశ్చిమ దేశాల వారికి పంపాడు.
    మోడి మంత్రివర్గం పైన అలా ఏడవటానికి వారి ఎత్తులు పారి ఉండకపోవచ్చు. ఒక కేంద్ర మాజి మంత్రి కొడుకును ప్రపంచ బాంక్ నుంచి రిజైన్ చేసి, బిజెపిలో చేరి ఎన్నికలలో గెలిచాడు. అతనిని కేబినేట్లోకి ప్రమోట్ చేయటానికి ప్రయత్నించి విఫలమై ఉంటారు. వారి ప్రముఖ నాయకుడి వారసుడు గనుక తప్పక మంత్రి పదవి వస్తుందని ఊహించి ఉంటరు. మోడి పార్టి నాయకుల వారసులకు మంత్రి పదవే ఇవ్వలేదు. నిరాశ చెందిన వెస్ట్ వాళ్లు తిట్లు లంకించు కొన్నట్లున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s