ఎఎపిలో లుకలుకలు, ఎ.కె అరెస్టుతో గట్టెక్కే ప్రయత్నం!


సాధారణ ఎన్నికలు ముగియడంతో ఓటమి చెందిన పార్టీలు కాసింత సంక్షోభానికి లోను కావడం మామూలే. అయితే అది సాధారణ, సాంప్రదాయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం. అక్కడ స్వార్ధ ప్రయోజనాల కోసమే చేరికలు, దూకుళ్ళు ఉంటాయి. కానీ ఆం ఆద్మీ పార్టీ అలాంటి పార్టీ కాదు లేదా కనీసం ఆ పార్టీ నాయకులు అలా చెబుతారు. అద్భుతాలేమీ సృష్టించకపోయినా కనీసం గణనీయ మొత్తంలోనయినా లోక్ సభ సీట్లు సాధిస్తుందని అంచనా వేసిన ఎఎపి కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

ఈ నేపధ్యంలో ఎటువంటి స్వార్ధ ప్రయోజనాలూ లేని అవినీతి ఉద్యమ పార్టీకి నాయకులుగా చెప్పుకున్న కొందరు నేతలు ప్రస్తుతం రాజీనామాల బాట పడుతున్నారు. పోతూ పోతూ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైపోయిందని నాలుగు రాళ్ళు కూడా వేసిపోతున్నారు. కాగా కార్యకర్తలు మాత్రం పార్టీ నేతృత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు చెబుతున్నాయి. వారి అసంతృప్తిని తాత్కాలికంగానయినా చల్లార్చడానికి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును పార్టీ నేతలు అడ్డు పెట్టుకుంటున్నారని పత్రికలు చెబుతున్నాయి.

ఎఎపిలో సీనియర్ నేతగా పేరు పొందిన షాజియా ఇల్మి పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది. పూర్వాశ్రమంలో టీ.వి నటి అయిన ఇల్మి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, మరే పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. “స్వరాజ్ గురించి చెప్పే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైపోయింది. అందుకే నేను పార్టీని వీడుతున్నాను. ఒక కోటరీ పార్టీని నడుపుతోంది. అది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటుంది. ఆ నిర్ణయాల గురించి ఆ తర్వాత మాత్రమే మాకు తెలుస్తుంది” అని షాజియా ఇల్మి ఆరోపించారు.

పార్టీ సంచలనవాదంలో కొట్టుకుపోతోందని ఆమె మరో ఆరోపణ చేశారు. కేవలం కొద్దిమంది కార్పొరేట్లు, రాజకీయ నాయకులను మాత్రమే నిందించడం తగదని ఆమె పేర్కొన్నారు. “సెన్సేషనలిజం మాకు సహాయపడిన మాట వాస్తవమే కావచ్చు. కానీ అది అంతకంతకు తగ్గుతూ పోయే ఫలితాలను ఇచ్చే సూత్రంగా మారిపోయింది” అని ఇల్మి పేర్కొన్నారు. నిరంతరాయంగా ఫలితాలు ఇచ్చే పనైతే సెన్సేషనలిజంతో తనకు ఇబ్బందేమీ లేదని షాజియా ఇల్మి చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఫలితాల కోసం సూత్రాలు అయ్యే పనైతే బి.జె.పి, సంఘ్ పరివార్ లు మతోన్మాదం ద్వారా లబ్ది పొందితే మాత్రం తప్పేముంది? సెక్యులరిజం పేరు చెప్పి కాంగ్రెస్ ఫలితాలు సాధిస్తే తప్పెలా అవుతుంది? ఎఎపి కూడా సూత్రబద్ధంగా కాకుండా కేవలం ఫలితాల కోసమే అవినీతి వ్యతిరేక సంచలనాలు సృష్టించాలని ఇల్మి చెప్పదలిచారా?

“పార్టీకి దిశ అనేది లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. ఎఎపి తనను తాను మరోసారి కనుగొనాలి. కేవలం ఆందోళనలు, నిరసనలు మాత్రమే కాకుండా మనం ఇంకా చేయాల్సి ఉంది” అని ఇల్మి పేర్కొన్నారు. పార్టీ బాగోగులు కాంక్షించేవారు గానీ, సద్విమర్శక పరిశీలకులు గానీ మొదటి నుండీ చెబుతున్నది ఇదే. సమాజ గమనం పైనా, వ్యవస్ధ తీరు తెన్నులపైనా నిర్దిష్ట అవగాహన లేకుండా ఆర్ధిక, రాజకీయ, సామాజిక నిర్ణయాలు తీసుకోవలసిన ప్రభుత్వాలు నిర్వహించడం సాధ్యం కాదనీ, ఒకవేళ ప్రభుత్వాలు నడిపినా అలాంటి ప్రభుత్వాలు ప్రవాహంలో పడి కొట్టుకుపోతాయని వారు చెబుతూ వచ్చారు.

సదరు విమర్శలను ఆమోదిస్తున్నట్లు కనిపిస్తున్న షాజియా ఇల్మి పార్టీ నుండి బైటికి రావడం వల్ల ఏమిటి ప్రయోజనం? పార్టీకి దిశ లేదని భావిస్తే ఆ దిశను సమకూర్చేందుకు పార్టీలో ఉండి కృషి చేయాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే పార్టీలో ఉంటూ దానికోసం నాయకులతో కొట్లాడాలి. అదేమీ చేయకుండా భుజాన కాడి కింద పడేసి చేతులు ఎత్తేస్తే పార్టీలో ప్రజాస్వామ్యం వచ్చేస్తుందా?

ఈ నాయకులు ఎఎపిలో చేరుతూ తమకు ఉన్నాయని చెప్పిన ఉదాత్త లక్ష్యాలు నిజానికి వారికి లేకపోతేనే ఇలాంటి సాకులు చూపే అవకాశం ఉంటుంది. ఉదాత్త లక్ష్యం ఉన్నది నిజమే అయితే ఉన్న సంస్ధలో లోపాలు సవరించడానికి, తద్వారా దానిని గమ్యం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. దానికి బదులు ఒక ఎన్నికలో ఓటమి ఎదురు కావడంతోనే భ్రమలు కోల్పోవడాన్ని బట్టి వారి లక్ష్య శుద్ధిపైనే అనుమానం కలుగుతోంది.

తన రాజీనామాకు ఇల్మి చూపిన మరో కారణం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయి జైలులో కూర్చోవడానికి బదులు బెయిల్ మొత్తం చెల్లించి బెయిల్ తీసుకోవాల్సి ఉండగా అలా చేయలేదని. బెయిల్ చెల్లించి బైటికి వచ్చి తన సమయాన్ని పార్టీ కార్యకర్తలు, అభ్యర్ధులతో గడపాలని ఆమె కోరారు. సలహాలు ఇస్తున్నారు సరే, అసలు కాడి కింద పడేయడం ఏమిటని? అలసిపోతే ఆ మాటే చెప్పి ఇంటికెళ్లడం ఉత్తమం. అది చెప్పకుండా పార్టీ నుండి బైటికి వెళ్లిపోతూ అలా చేయండి, ఇలా చేయండి అంటూ సలహాలు ఎలా ఇవ్వడం నైతికంగా ఎలా సమర్ధనీయమో అర్ధం కానీ విషయం.

షాజియా ఇల్మి రాజీనామా ప్రకటించిన కొద్ది సేపటికే మరో నాయకుడు జి.ఆర్.గోపీనాధ్ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాయకత్వంతో విభేదాలు పెరిగినందున రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలి చర్యలు బాగా లేదని బెయిల్ తీసుకోకుండా జైలుకు వెళ్ళడం తనకు నచ్చలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన పార్టీలో చేరిందే ఈ సంవత్సరం జనవరిలో. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి ఎన్నికలయ్యాక పార్టీకి గుడ్ పై చెప్పేశారు.

2003లో ఎయిర్ డెక్కన్ సంస్ధను స్ధాపించి తక్కువ రేట్లకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత సంపాదించిన గోపీనాధ్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఎయిర్ బస్ కంపెనీ ఉన్న తౌలౌసే నుండి మాట్లాడుతూ తన రాజీనామాను ధృవీకరించారని ది హిందూ తెలిపింది. ఎయిర్ డెక్కన్ కంపెనీ ఇప్పుడు విజయ్ మాల్యాకి చెందిన కింగ్ ఫిషర్ ఆధీనంలో ఉంది. డబ్బు సంపాదనలో మునిగి ఉండే పారిశ్రామిక వేత్తలు అవినీతి వ్యతిరేక పార్టీలలో కూడా చొరబడి లబ్ది పొందాలని ప్రయత్నించడం, దానికి ఎఎపి సహకరించడం జనానికి అర్ధం కావలసిన విషయం.

ఇదిలా ఉండగా ఎఎపి కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పత్రికలు వార్తలు ప్రచురించాయి. శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు వారు నినాదాలు ఇచ్చారని, పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారని తెలుస్తోంది. పార్టీ ఓటమికి నాయకత్వం బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి ఆగ్రహాన్ని అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సంఘటనను ఉటంకించడం ద్వారా చల్లార్చడానికి నాయకులు ప్రయత్నించారని ది హిందు తెలిపింది.

“మీరు ఆగ్రహంగా ఉన్నారని తెలుసు. కానీ ప్రస్తుతానికి మీ కోపాన్ని మర్చిపోయి అరవింద్ కేజ్రీవాల్ విడుదల కోసం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఢిల్లీ కార్యకర్తల సమావేశంలో పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ కోరారు. తీహార్ జైలు నుండి కేజ్రీవాల్ భావోద్వేగంతో రాసిన లేఖను సైతం మనీష్ సిసోడియా చదివి వినిపించారు. లేఖాంశాలు విన్నంతనే కార్యకర్తలు ఆవేశపడినప్పటికీ తమ డిమాండ్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. నిర్ణయాలు తీసుకుంటున్న రాజకీయ వ్యవహారాల కమిటీ, జాతీయ కార్యవర్గ కమిటీ లను వెంటనే రద్దు చేయాలనీ వారు నినాదాలు చేశారు. అయితే పార్టీని పునర్నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం ద్వారా తాత్కాలికంగా వారి ఆగ్రహాన్ని నేతలు చల్లార్చారు.

తమ ప్రధాన పునాది అయిన ఢిల్లీ వదిలిపెట్టి ఏకంగా 400 సీట్లలో పోటీ చేయడం వల్ల కేంద్రీకరించలేకపోయామని అత్యధిక కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంచలనాల వెంటబడి పోతూ ప్రధాన పునాది ఉన్న ఢిల్లీని విస్మరించారని దానితో అక్కడ ఒక్క సీటూ గెలవలేకపోయామని వారు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని కొనసాగించకుండా రద్దు చేసినందుకు అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజుల క్రితమే క్షమాపణలు కోరారు. సాధారణ ఎన్నికలు ఎదుర్కోవడం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హడావుడిగా రద్దు చేశారని ఎఎపి, ఎ.కె లపై విమర్శలు వచ్చాయి. ఆందోళనలు, నిరసనలు తప్ప సజావుగా ప్రభుత్వ పాలన చేసే ఉద్దేశ్యం ఎఎపి కి లేదని బి.జె.పి, కాంగ్రెస్ లు విమర్శించాయి. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవడం ద్వారా వారి విమర్శలకు జవాబు చెప్పవచ్చని భావించిన ఎఎపి నేతలు చివరికి ఉన్న పునాదిని కూడా కోల్పోక తప్పలేదు.

 

One thought on “ఎఎపిలో లుకలుకలు, ఎ.కె అరెస్టుతో గట్టెక్కే ప్రయత్నం!

  1. అధికారం అందలేదుగా ఇక లుకలుకలే. ఆప్ కూడా సాధారణ రాజకీయ పార్టీలలాగే ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s