2014 సాధారణ ఎన్నికల్లో గెలిచింది ఎవరు? పార్లమెంటు సెంట్రల్ హాలులో భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చిన నరేంద్ర మోడి కన్నీరు పెట్టుకోగా, ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేస్తామని చెప్పిన రాహుల్ మాత్రం యధావిధిగా కాంగ్రెస్ యువరాజుగా కొనసాగుతున్నారు. దానితో ఎన్నికల్లో గెలిచిందేవరన్న అనుమానం వస్తోందని ఈ కార్టూన్ సూచిస్తోంది.
పార్లమెంటు సెంట్రల్ హాల్ లో బి.జె.పి పార్లమెంటరీ నేతగా ఎన్నికయిన అనంతరం 30 నిమిషాలు ప్రసంగించిన మోడి ఆ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నారని పత్రికలు నివేదించాయి. బి.జె.పి కి మోడి మేలు చేశారని ప్రశంసించిన అద్వానీ మాటల్ని ఉద్వేగపూర్వకంగా స్వీకరిస్తూ తనకు దేశం ఎలా తల్లి లాంటిదో, బి.జె.పి కూడా అలాగే తల్లి లాంటిదే అనీ, ఎవరన్నా తల్లికి చేసేది మేలు అవుతుందా అని ఆయన ప్రశ్నిస్తూ ఎమోషనల్ అయ్యారని పత్రికలు తెలిపాయి.
మరో వైపు, ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీల రాజీనామాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశానికి చేయాల్సింది ఎంతో ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ చెబుతూ ఆయన రాజీనామాను వారించారట. ఇంకా ఇతర సభ్యులు కూడా దాదాపు ఇదే తరహా (అనివార్య) పొగడ్తలతో తమ నాయకుల రాజీనామాలను తిరస్కరించి ఒక పని అయిందనిపించుకున్నారు.
బి.జె.పిని అధికారంలోకి తేవడం ద్వారా ఒకరు ఆ పార్టీకి ఫేవర్ చేస్తే, మరొకరేమో భవిష్యత్తులో కాంగ్రెస్ కు ఫేవర్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. జనాలకి ఫేవర్ చేసేవారు ఎవరన్నదే అసలు సమస్య!
మే 26 తేదీన 15వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడి పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రవేశిస్తున్న, ప్రసంగిస్తున్న ఈ దృశ్యాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక అందజేసింది.
ఈ టపాకు ఆ శీర్షిక అప్రస్తుతం,అనవసరం! గెలిచినవాడు ఆ ఆనదంలో ఏడ్వడం కొన్నిసార్లు జరిగేదే!(గెలిచాననే భావోద్వేగంలో) అంతమాత్రానికే అది ఓడినట్టుసంకేతం ఎలావుతుంది? కానీ ఒకవిషయం మాత్రం నిజం,అది జనాలకి ఫేవర్ చేసేవారు ఎవరన్నదే అసలు సమస్య! ఈరోజు పత్రికలలో ప్రచురితమైన వి.హెచ్.పి కోర్కెల చిట్టా గమనిస్తే అది ఎవరికి ప్రయోజనమోగానీ?! సామాన్యుడుకైతే కాదు! మరి వారిగురించి పట్టించు కొనేవాడెవడొ?!