పునఃప్రచురణ: కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి


Modi

(ఈ ఆర్టికల్ గత ఏప్రిల్ 24 తేదీన రెండు భాగాలుగా ప్రచురించబడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపధ్యంలో రెండింటినీ కలిపి ఒకే ఆర్టికల్ గా పునఃప్రచురిస్తున్నాను -విశేఖర్)

భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు.

పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి ఎలాగూ ఎదురు చూపులు తప్పవు. వాటితో పాటు ఫలితాల కోసం ఎదురు చూసేదీ వ్యాపార, భూస్వామ్య, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వర్గాలు. వీరిలో కూడా అందరికంటే ఎక్కువగా ఆత్రపడుతున్నది సామ్రాజ్యవాదులే. అనగా అమెరికా, ఐరోపా దేశాల బహుళజాతి కంపెనీలు వారి భారతీయ ఏజెంట్లూను. వినడానికి కాస్త కఠినంగా ఉన్నప్పటికీ నిజం అదే మరి.

నిజానికి ఈ నాలుగు వర్గాలు అంతగా ఆత్రపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా లబ్ది పొందేది వారే. కానీ ఈసారి పరిస్ధితి వారిని ఆత్రపడేలా చేస్తోంది. దానికి కారణం తమ వాళ్ళే అనుకున్నప్పటికీ 10 యేళ్ళు పాలించిన యు.పి.ఏ వారి ఆశలకు తగినట్లుగా వ్యవహరించలేదన్నది వారి ఫీలింగ్. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యు.పి.ఏ నూతన ఆర్ధిక విధానాలను పక్కాగా అమలు చేసింది.

వాటి ఫలితాన్ని పైన చెప్పిన నాలుగు వర్గాలు చక్కగా అనుభవించారు అనేందుకు వరుసగా వెల్లడయిన లక్షల కోట్ల భారీ కుంభకోణాలే సాక్ష్యం. కానీ పశ్చిమ బహుళ జాతి కంపెనీలకు యు.పి.ఏ సంస్కరణల వేగం సరిపోలేదు. మధ్య మధ్యలో ఆహార భద్రత అనీ, ఉపాధి హామీ పధకం అనీ జనం సొమ్ముని కాస్తయినా తిరిగి వారికే చెల్లించడం స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు సుతారాము నచ్చలేదు. పైగా ప్రతి సంస్కరణకి మీన మేషాలు లెక్కించడం, దానికి కూటమి ధర్మం అని సాకులు చెప్పడమూ వారికి నచ్చలేదు.

2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం తదితర కుంభకోణాలు వెల్లడి అయ్యాక ఏర్పడ్డ పరిస్ధితిని చక్కదిద్ది యధావిధిగా సంస్కరణలను అమలు చేయడంలో యు.పి.ఏ విఫలం అయిందని మన పాలకుల విదేశీ యాజమానుల అభిప్రాయం. ఆ కోపంతోనే మన్మోహన్ కి వ్యతిరేకంగా టైమ్ లాంటి పత్రికలు అసమర్ధ ప్రధాని అని బిరుదులు ఇచ్చి మరీ తిట్టిపోశాయి. భారత ప్రభుత్వానికి విధానపరమైన పక్షపాతం (policy paralysis) వచ్చిందని నిరసించాయి. పనిలో పనిగా అవినీతిమయం అని అభివర్ణిస్తూ భారత ప్రజల పక్షం ఉన్నట్లు నటించాయి కూడాను.

ఇప్పుడు స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు (సింపుల్ గా ‘కంపెనీలు’ అందాం) మహా వీరుడయిన రాజకీయ నాయకుడు కావాలి. ఆ నాయకుడు అసమ్మతి అనేదే లేకుండా చేయగలగాలి. స్వపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అసమ్మతిని, భేదాభిప్రాయాన్ని తొక్కిపారేయ్యాలి. అలా తోక్కెయ్యడానికి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. బీహార్ బి.జె.పి నేత గిరిరాజ కిషోర్ అలాంటి సాంపుల్ ఒకటి ఎన్నికల ముందే రుచి చూపించారు. మోడి విమర్శకులు పాకిస్ధాన్ సమర్ధకులే అనీ, కాబట్టి మోడిని విమర్శించేవారంతా పాక్ వెళ్లిపోవడం మేలని ఆయన సూచించారు.

ఇతర పార్టీలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా కూడా ఆయన తన మాటల్ని వెనక్కి తీసుకోకపోగా మళ్ళీ అవే మాటల్ని బహిరంగంగా చెప్పారు. ఆయన కోసం పోలీసులు వెతకడం, ఆయన దొరక్కపోవడం… ఇవన్నీ మామూలు విషయాలు. వాటివల్ల గిరిరాజ్ గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మోడి లాంటి నాయకుడు అధికారంలోకి వస్తే అసమ్మతి, విమర్శ, ఆందోళన… లాంటివి ఏ విధంగా అణచివేతకు గురవుతాయో గిరిరాజ్ ముందే ఒక నమూనా చూపారు.

కంపెనీలకు కావలసింది కూడా సరిగ్గా ఇలాంటి నాయకులే. అమెరికా, ఐరోపాల ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు అంత తీవ్రంగా ఉన్నాయి మరి. ఒకవైపు పొదుపు విధానాలతో ప్రజల కొనుగోలు శక్తికి కోతపెడుతూ మరోవైపు పన్నులు పెంచుతూ పోతుంటే కంపెనీల ఉత్పత్తులకు అక్కడ మార్కెట్ పడిపోయింది. కాబట్టి వారి సరుకుల కోసం మరింత మార్కెట్ (కొనుగోలుదారులు) కావాలి. భారత దేశంలో చూస్తేనేమో, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సాంప్రదాయక గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు ఇత్యాది దేశీయ ఉత్పత్తిదారుల ఆధీనంలో ఉన్న మార్కెట్ కు రక్షణగా అనేక భారతీయ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను ఇంకా ఇంకా నీరుగార్చాలి. అసలు రద్దు చేసేస్తే ఇంకా మేలు.

‘నవరత్న’ అనీ, గాడిద గుడ్డు అనీ బ్రహ్మాండమైన ఉత్పాదక సామర్ధ్యం కలిగిన ప్రభుత్వ పరిశ్రమలు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎల్.ఐ.సి, జి.ఐ.సి లాంటి ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు భారత దేశ ఫైనాన్స్ మార్కెట్ కు పట్టుగొమ్మగా ఉన్నాయి. వీటితో పోటీ పడడం విదేశీ బహుళజాతి కంపెనీల వల్ల కావడం లేదు. ఎన్ని ప్రతికూల పరిస్ధితులు కల్పించినా అవి తమపై భారత ప్రజలు పెట్టుకున్న నమ్మకమే పెట్టుబడిగా నిలబడ్డాయి.

ఇలాంటి కంపెనీలని కూల్చేస్తే పశ్చిమ కంపెనీలకు బోలెడు మార్కెట్. వారు తమకు అనుకూలమైన మార్కెట్ పరిస్ధితులను సృష్టించుకోవాలంటే నమ్మకమైన, దూకుడుగా వ్యవహరించగల, ప్రజల ఆందోళనలను కర్కశంగా అణచివేయగల నాయకులు, అధికార వ్యవస్ధ కంపెనీలకు కావాలి. భారత నాయకుల వేలితోనే భారత ప్రజల కళ్ళు పొడవాలి. ఈ లక్షణాలన్నీ మోడీ, ఆయన వెనుక ఉన్న హిందూత్వ గణాలు కలిగి ఉన్నాయని కంపెనీలు భావిస్తున్నాయి. ఆ ఆశతోనే మోడి చుట్టూ అభివృద్ధి, ఉద్యోగాలు అనే ఒక మాయా పొరను కష్టపడి నిర్మించుకున్నాయి. వారి ప్రయత్నం సఫలం అయితే తమ ఆశలు ఈడేరినట్లేనని కంపెనీలు భావిస్తున్నాయి. ఆ ఆశతోనే పశ్చిమ కార్పొరేట్ మీడియా ద్వారా తమ డిమాండ్ లను ముందే వెల్లడి చేస్తున్నాయి.

బ్రిటిష్ వాణిజ్య, రాజకీయ వార్తా సంస్ధ రాయిటర్స్ పశ్చిమ బహుళజాతి కంపెనీల తరపున ఒక డిమాండ్ల జాబితా తయారు చేసి ప్రచురించింది. అనగా కంపెనీల డిమాండ్లను భారత రాజకీయ పార్టీల ముందు ఉంచింది. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ డిమాండ్లు నెరవేర్చవలసిందే. తామూ మోడితో పాటుగా సంస్కరణలు అమలు చేయగలమని కాంగ్రెస్ కూటమి, సో కాల్డ్ ధర్డ్ ఫ్రంట్ (లేదా ఆల్టర్నెట్ ఫ్రంట్) లు కూడా వివిధ రూపాల్లో చెప్పాయి కూడా. రాయిటర్స్ తయారు చేసిన డిమాండ్ల జాబితా ఇలా ఉంది:

1. జి.ఎస్.టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్): ఇప్పుడు ఉన్న వివిధ పన్నుల వ్యవస్ధలన్నీ రద్దు చేసి ఒకే ఒక పన్నుల వ్యవస్ధను ప్రవేశపెట్టాలని కంపెనీలు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నాయి. యు.పి.ఏ I, II ప్రభుత్వాలు రెండూ దీనిని అమలు చేయడానికి కోడ్ రాసి పెట్టాయి. కానీ రాష్ట్రాల అభ్యంతరాల వల్ల కుదరలేదు. కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు అని ప్రత్యేకంగా లేకుండా ఒకే యాజమాన్యంలో పన్నులు వసూలు చేసే పద్ధతిని జి.ఎస్.టి ప్రవేశపెడుతుంది. దీనివల్ల రాష్ట్రాల ఆర్ధిక వనరులు కుచించుకుపోతాయని, కేంద్రం పెత్తనం పెరుగుతుందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవాయే నడుస్తోంది. ఆ పార్టీల వెనుక పాలకవర్గాలు తమ వాటా తగ్గిపోతుందని సహజంగానే భావిస్తున్నారు. వారి అభ్యంతరాలను పక్కకు నెట్టేసి జి.ఎస్.టి అమలు చేయాలని కంపెనీలు కోరుతున్నాయి.

జి.ఎస్.టి తెస్తే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి కనీసం 2 శాతం పెరుగుతుందని సామ్రాజ్యవాదులు నమ్మబలుకుతున్నారు. ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది, అదే సమయంలో వ్యాపార లావాదేవీల ఖర్చు తగ్గిపోతుందని రాయిటర్స్ చెబుతోంది. ఒకవైపు జి.డి.పి వృద్ధి, ఆదాయం పెరుగుతూ మరోవైపు వ్యాపారులకు ఖర్చు ఎలా తగ్గుతుంది? జనంపై పన్నుల భారం పెరగడం, వ్యాపారులకు మేలు చేసే పన్నుల వ్యవస్ధను ప్రవేశపెట్టడం జరక్కుండా ఈ రెండు పనులు ఒకే చర్యతో జరగడం ఎలా సాధ్యం? నిజానికి జి.ఎస్.టి ని వ్యతిరేకించిన రాష్ట్రాల్లో బి.జె.పి పాలిత రాష్ట్రాలూ ఉన్నాయి. కానీ బి.జె.పి తన మేనిఫెస్టోలో మాత్రం రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరిస్తూ నిర్దిష్ట కాల వ్యవధిలో జి.ఎస్.టి ని అమలు చేస్తానని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అయితే అధికారంలోకి వస్తే 1 సం.లో జి.ఎస్.టి అమలు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

2. ఆర్.బి.ఐ చట్టం: ఆర్.బి.ఐ నియమించిన కమిటీ ఒకటి గత జనవరిలో కొన్ని సిఫారసులు చేసింది. ఆరి.బి.ఐ విత్త విధానం (మానిటరీ పాలసీ) కు వినియోగదారి ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఉండేలా చట్టం మార్చాలని ఈ కమిటీ సిఫారసుల్లో ఒకటి. అలాగే విత్త విధానానికి ఆర్.బి.ఐ గవర్నర్ ఒక్కరే కాకుండా ఒక కమిటీ బాధ్యత వహించాలని చెప్పింది. ఆ విధంగా ఆర్.బి.ఐ గవర్నర్ పై భారం తగ్గుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సిఫారసును వ్యతిరేకించింది. ఎప్పటి లాగానే టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణమే విత్త విధానానికి లక్ష్యంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం. ద్రవ్యోల్బణంతో పాటు ఆర్ధిక వృద్ధి (జి.డి.పి గ్రోత్) కూడా ఆర్.బి.ఐ విత్త విధానానికి లక్ష్యంగా ఉండాలని కాంగ్రెస్ అభిలాష.

బి.జె.పి ఈ విషయంలో ఇంకా ఏమీ చెప్పలేదు. కానీ బి.జె.పి కోశాధికారి గోయల్ మొదలుకుని సుబ్రమణ్య స్వామి వరకు ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చర్యలను తీవ్రంగా విమర్శించారు. జి.డి.పి వృద్ధి పడిపోతుంటే వడ్డీ రేటు తగ్గించి మరిన్ని నిధులు వ్యాపారులకు, పెట్టుబడిదారులకు ఇవ్వడం మానేసి ద్రవ్యోల్బణం సాకుగా చూపుతూ మూడుసార్లు వడ్డీ రేటు పెంచడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఒకరిద్దరు నాయకులైతే రఘురాం రాజన్ ను తొలగిస్తామని కూడా చెప్పారు.

కాబట్టి ఆర్.బి.ఐ కమిటీ సిఫారసులు కొండెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జి.డి.పి వృద్ధిని లక్ష్యంగా చేసుకుంటే ఇక ఆర్.బి.ఐ పలుదఫాలుగా ప్రకటించే విత్త విధానం ధరలను పట్టించుకోవడం మానేస్తుంది. అనగా ధరలు ఒకపక్క పెరుగుతున్నప్పటికీ (అనగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ) ఆర్ధిక వృద్ధి పేరుతో మరింత డబ్బును వ్యాపారులకు, కంపెనీలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా వడ్డీ రేట్లు తగ్గిస్తుంది. ఇది ఒక నష్టం. మరొక నష్టం ఏమిటంటే ప్రజలకు వాస్తవంగా అనుభవంలోకి వచ్చే ధరలు వినియోగదారీ ధరలే తప్ప టోకు (wholesale) ధరలు కాదు. కాబట్టి వినియోగదారీ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంను లక్ష్యంగా చేసుకుని విత్త విధానం రూపొందిస్తే అది ప్రజలకు మరింత దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తనకు అది ఇష్టం లేదని ప్రత్యక్షంగా చెప్పగా బి.జె.పి పరోక్షంగా చెప్పింది. ఏ రాయితో పళ్ళు ఊడగొట్టుకోవాలో నిర్ణయించుకోవలసిన అవస్ధ జనానిది.

ఆర్.బి.ఐ చట్ట సవరణలో కొన్ని ప్రజలకు మేలు చేసే చర్యలు ఉండగా ఆ పేరుతో ప్రజలకు కీడు చేసే అవకాశమూ పొంచి ఉంది. అలాగే వ్యాపార, కంపెనీ వర్గాలకు మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు కలిగే లాభం పిడికెడు కాగా ధనికులకు కలిగే మేలు బారెడు. అందుకే ఆర్.బి.ఐ చట్టం సవరించాలని రాయిటర్స్ కోరుతోంది.

3. ప్రయివేటీకరణ: నవరత్నాలుగా పేరు గాంచిన వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లను తెగనమ్మాలని పశ్చిమ కంపెనీలు పోరు పెడుతున్నాయి. అనగా ప్రభుత్వ్బ రంగ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రైవేటీకరణకు కావలసిన తాత్విక భూమికను పాలకవర్గాలు ఇప్పటికే ఏర్పరుచుకున్నాయి. లాభాలు వచ్చే పబ్లిక్ కంపెనీలను ఎందుకు అమ్మేస్తున్నారని అడిగేవారు ఇప్పుడు లేరు. ఆ వాటాలు తెగనమ్ముతుంటే ఎగబడి కొనుక్కునే ధనికవర్గాలే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి షేర్ల మెతుకుల కోసం ఎదురు చూసే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు దేశంలో తయారై ఉన్నారు. వారిపైన బడి మేసే షేర్ బ్రోకర్లు, చిన్నా చితకా కంపెనీలు ఉన్నాయి. వారికి కూడా ప్రయివేటీకరణ కావాలి. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపుతుంటే ఒక వార పొంచి ఉండే కాకులు వీళ్ళు.

భారత ప్రభుత్వ కోశాగార లోటును అదుపులో పెట్టాలంటే ప్రభుత్వ కంపెనీలని తెగనమ్మాలని ఐ.ఏం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు ఏనాడో బోధించాయి. ఆ కారణాన్ని ఇప్పటికీ మన పాలకులు చెబుతున్నారు. ఉన్న ఆస్తులు అమ్మేసి లోటు పూడ్చితే భవిష్యత్తులో లోటు ఎవరు పూడ్చాలో చెప్పేవారు లేరు. చేపలని పట్టి ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పడం ఆకలికి శాశ్వత పరిష్కారం అన్న సూత్రం అందరికి తెలిసిందే. బహుశా ఈ సూత్రాన్ని పాలకులు మరో కోణంలో పాటిస్తున్నారని భావించాలి. వారి దృష్టిలో ఆకలిగొన్నవారు భారత ప్రజలు కాదు, సంక్షోభాల్లో కూరుకుపోయిన పశ్చిమ బహుళజాతి కంపెనీలు. ఆ కంపెనీల కోసం భారత ప్రజలను అనాదిగా పోషిస్తున్న ప్రభుత్వ కంపెనీలను తెగనమ్మేయాలని సామ్రాజ్యవాదులు శతపోరుతుండగా దానికి మన పాలకులు తలలూపుతున్నారు. దానికి జి.డి.పి వృద్ధి అనీ, కోశాగార లోటు అనీ సాకులు చూపుతున్నారు. రాయిటర్స్ కూడా సరిగ్గా ఇదే కారణాలతో ప్రయివేటీకరణ వేగం చేయాలని కోరుతోంది.

2013-14లో ప్రభుత్వ కంపెనీల షేర్ల అమ్మకం ద్వారా 3 బిలియన్ డాలర్లు భారత ప్రభుత్వం సంపాదించింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న మొత్తంలో ఇది మూడో వంతు మాత్రమే. కాబట్టి మరింత వేగంగా ప్రభుత్వ కంపెనీలని అమ్మేసే ప్రభుత్వం రావాలని పశ్చిమ కంపెనీల కోరిక. 2014-15 సం.కి గాను 9.3 బిలియన్ డాలర్లు (రు. 57 వేల కోట్లు) ప్రభుత్వ కంపెనీల అమ్మకం ద్వారా సంపాదించాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఈ లక్ష్యాన్ని కొత్త ప్రభుత్వం మరింత పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. అలా చేస్తే కోశాగార లోటును జి.డి.పిలో 4 శాతానికి తగ్గించే లక్ష్యం సులువుగా నెరవేరుతుందని రాయిటర్స్ ఆశపెడుతోంది. ప్రభుత్వ కంపెనీల అమ్మకం కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన చరిత్ర బి.జె.పి-ఎన్.డి.ఏ కి ఉంది. కాబట్టి మోడి ప్రభుత్వం వస్తే, కంపెనీల కోరిక నెరవేరుతుందనడంలో సందేహం లేదు.

4. సబ్సిడీలు: భారత ప్రభుత్వాలు భారత ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను పెద్ద తలనొప్పిగా పశ్చిమ దేశాలు, వారి కంపెనీలు భావిస్తాయి. అలాగని వారు సబ్సిడీలు ఇవ్వరా అంటే అదేమీ లేదు. ప్రపంచ దేశాల్లో అత్యధిక సబ్సిడీలు ఇచ్చేదీ అమెరికా, ఐరోపా దేశాలే. అటు కంపెనీలతో పాటు ఇటు ప్రజలకు కూడా వివిధ రూపాల్లో అవి సబ్సిడీలు చెల్లిస్తాయి. అయితే ఆర్ధిక సంక్షోభం ఫలితంగా ప్రజల సబ్సిడీలను ఒక్కొక్కటీ తగ్గించివేస్తున్నాయి. కంపెనీల సబ్సిడీలను మాత్రం యధాతధంగా కొనసాగిస్తున్నాయి. సంక్షోభం సాకు చూపి పెద్ద మొత్తంలో కంపెనీలకు మేపిన బెయిలౌట్లు (Troubled Assets Relief Programme – 1, & 2, QE – 1, 2 & 3, దాదాపు జీరో వడ్డీ రేటు మొదలయినవన్నీ అమెరికా ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లే) వాటికి అదనం. తమ కంపెనీలకు ఇలా భారీ సబ్సిడీలు ఇచ్చే అమెరికా, ఐరోపాలు భారత ప్రజలకు మాత్రం ఒక్కపైసా కూడా ఇవ్వకూడదని ఆంక్షలు విధిస్తాయి.

కోశాగార లోటును అదుపు చెయ్యాలన్నా, పశ్చిమ రేటింగ్ కంపెనీలు (ఎస్ & పి, ఫిచ్, మూడీస్) మన దేశ సార్వభౌమ ఋణపత్రాల రేటింగ్ ను తగ్గించకుండా ఉండాలన్నా సబ్సిడీలు తగ్గించాల్సిందేనని రాయిటర్స్ బోధిస్తోంది. 2013-14లో భారత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ జి.డి.పిలో 2.2 శాతం మాత్రమే. ఇదీ ఎక్కువే అని రాయిటర్స్ కుండబద్దలు కొట్టింది. ఈ సబ్సిడీలు ప్రధానంగా ఆహారం, ఎరువులు, ఇంధనం (గ్యాస్, కిరోసిన్, డీజిల్) లకు ఇస్తారు. వీటిల్లో కూడా అత్యధికం వెళ్ళేది ధనికవర్గాలకే. ఆహార సబ్సిడీ పేరుతో పంపిణీ చేసే చౌక దుకాణం సరుకులు ఎవరికి చేరేది జనానికి తెలిసిన విషయమే. సబ్సిడీ ఎరువులను దారి మళ్లించి కాంప్లెక్స్ ఎరువులుగా మార్చి అమ్ముకున్న వై.ఎస్.ఆర్ బంధువు దురాగతం ఇటీవలిదే. గ్యాస్ తదితర ఇంధనం సబ్సిడీ వల్ల అధిక లబ్ది పొందుతున్నది కూడా హోటళ్లు, లాడ్జిలు తదితర పరిశ్రమల వర్గాలే. వారందరు వాడుకోగా ప్రజలకు అందేది చాలా తక్కువ. ఇది కూడా తగ్గిస్తూ కాంగ్రెస్ చట్టాలు చేసింది.

అవసరమైన సబ్సిడీలను మాత్రమే కొనసాగిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా, అభివృద్ధికి నిధులు అందుబాటులో లేకుండా చేసే ఏ ఖర్చునూ అనుమతించబోమని బి.జె.పి చెప్పింది. వేరు వేరు మాటల్లో ఈ రెండు పార్టీలు చెప్పింది ఒకటే. జనానికి ఇచ్చే సబ్సిడీలు తగ్గించేసి ఉన్న దబ్బంతా అవసరం, అభివృద్ధి పేరుతో కంపెనీలకు తరలించడం. ఈ సబ్స్డీల తొలగింపు ద్వారా ఖాళీ అయ్యే మార్కెట్ ను పశ్చిమ బహుళజాతి కంపెనీలు ఆక్రమించడం దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం. చౌకధరల దుకాణాలు లేకుండా చేస్తే జనం ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మోర్, రిలయన్స్ ఫ్రెష్, వాల్ మార్ట్, కేరేఫర్, టెస్కో లాంటి కంపెనీల దుకాణాలకి వెళ్ళాలి. ఈ కంపెనీల సరుకుల సేకరణ విదేశాల నుండే జరుగుతుంది తప్ప భారత దేశం నుండి కాదు. ఆ విధంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పంటలు కూడా మార్కెట్ లేక వ్యవసాయం ఇంకా కుంటుపడుతుంది.

5. కార్మిక చట్టాలు: భారత దేశంలో కార్మిక చట్టాలను సాధ్యమైనంత నీరు గార్చేశారు మన పాలకులు. ఒకటీ ఆరా ఏమన్నా మిగిలి ఉంటే అవి జీవచ్ఛవాలతో సమానం. ఉనికిలో ఉన్నా ప్రాణం ఏ మాత్రం లేని కార్మిక చట్టాలను కూడా తొలగించాలని పశ్చిమ దేశాలు, కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల సంఖ్యను తగ్గించాలంటే అలా చేయకుండా యాజమానుల చేతుల్ని ఈ చట్టాలు కట్టిపడేస్తున్నాయని రాయిటర్స్ వాపోయింది. విచిత్రం ఏమిటంటే కోట్లాది ఉద్యోగాలను సృష్టించాలంటే ఈ చట్టాలని తొలగించాలని చెప్పడం. ఉన్నవారిని తీసేయాలంటే చట్టాలు ఆటంకంగా ఉన్నాయని ఒకపక్క చెబుతూ ఇంకా కోట్లాది ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ చట్టాలు తొలగించాలని చెప్పడం అబద్ధాలు పదే పదే చెప్పి నిజం చేయడంలో ఆరితేరిన పశ్చిమ పత్రికలకే సాధ్యం అవుతుంది. సామెత కోసం పాపం గోబెల్స్ ని ఇంకా వాడుకుంటున్నాం గానీ గోబెల్స్ ని ఎప్పుడో మించిపోయాయి అమెరికా, ఐరోపాల కార్పొరేట్ వార్తా సంస్ధలు.

కఠినమైన కార్మిక చట్టాల వలన కంపెనీలు ఎక్కువగా కాంట్రాక్ట్ కార్మికులను తీసుకోవాల్సి వస్తున్నదనీ దాని ఫలితంగా కార్మికులకు అతి తక్కువ వేతనాలు లభించి ఆదాయ అంతరాలు పెరిగిపోతున్నాయని రాయిటర్స్ ఓ వితండవాదం చేసింది. వేతనాలు ఎక్కువ ఇవ్వాలనుకుంటే కాంట్రాక్టీకరణ తో పనేముంది? కాంట్రాక్టు కార్మికులను తీసుకోకుండా సరిపడా వేతనాలు ఇచ్చి తీసుకోవచ్చు గదా? కనీస తర్కానికి కూడా అందని ఈ కుతర్కాల ఏకైక లక్ష్యం పశ్చిమ బహుళజాతి కంపెనీలకు మేలు చేయడమే అన్నది స్పష్టమే.

కార్మిక చట్టాలను సవరిస్తామని కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ వాగ్దానాలు ఇచ్చాయి. లక్ష్యాలూ పెట్టుకున్నాయి. ఉద్యోగులకు, కార్మికులకు, యాజమాన్యాలకూ అందరికీ న్యాయం చేసే విధంగా కార్మిక చట్టాలు సవరిస్తామని రెండు పార్టీలు వాగ్దానం ఇచ్చాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండే రెండు వర్గాలకూ ప్రయోజనం చేయడం ఎలాగూ కుదరనిపని. వారు చేసేది ఒకే ఒక్కటి: కార్మిక చట్టాలను మరింత నీరుగార్చి లేదా రద్దు చేసి కంపెనీల విచక్షణారహిత దోపిడీకి గేట్లు తెరవడం. కార్మికుల అసమ్మతిని ప్రకటించకుండా చేసే విధంగా నిర్బంధ, నల్ల చట్టాలను మరిన్ని తేవడం. సామ్రాజ్యవాద సంక్షోభం తీవ్రం అవుతున్న నేపధ్యంలో నిర్బంధ, నల్ల చట్టాల అవసరం కూడా స్వదేశీ, విదేశీ పాలకవర్గాలకు పెరుగుతోంది. రాయిటర్స్ డిమాండ్ల జాబితాలోని కార్మిక చట్టాలు ఈ అవసరాన్ని తీర్చడానికి ఉద్దేశించినది మాత్రమే.

6. రక్షణ రంగం: భారత దేశ రక్షణ రంగాన్ని మరింతగా ప్రైవేటీకరించి విదేశీ కంపెనీల పెట్టుబడులకు అనువుగా మార్చాలని అమెరికా, ఐరోపాలు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నాయి. విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇస్తే ఇక ఇండియా విదేశీ ఆయుధాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, ఎంచక్కా అన్నీ దేశంలోనే తయారు చేసుకోవచ్చని పశ్చిమ కంపెనీలు ఊరిస్తున్నాయి. రక్షణరంగంలో  విదేశీ పెట్టుబడుల వలన దిగుమతులు తగ్గించుకుని, ఆధునీకరణ చేపట్టడం సులువు అవుతుందని అవి చెబుతున్నాయి.

ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు ఇండియాయే అని ఒక అంచనా. రక్షణ రంగంలో 26 శాతం విదేశీ యాజమాన్యానికి ప్రభుత్వాలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇమిడి ఉన్న ఆయుధ పరిశ్రమలయితే 26 శాతం కంటే ఎక్కువ విదేశీ పెట్టుబడులకు కూడా అనుమతి ఇస్తామని మన పాలకులు ప్రకటించారు. కానీ అనుభవం చెప్పిన విషయం ఏమిటంటే ఆయుధ పరిజ్ఞానాన్ని అమెరికా ఎవరికీ ఇవ్వదు. ఇటీవల 125 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు కోసం ఇండియా టెండర్లు వేయగా అమెరికా బదులు ఫ్రాన్స్ జెట్ లవైపు ఇండియా మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇదే. ఫ్రాన్స్ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా అప్పజెప్పదు. ఏమన్నా సమస్య వస్తే మళ్ళీ ఫ్రాన్స్ కంపెనీనే అడగాలి.

కాబట్టి విదేశీ రక్షణరంగంలో పెట్టుబడుల అనుమతిని కోరడం వెనుక భారత రక్షణ అవసరాల పట్ల ప్రేమ ఉండి కాదు. తద్వారా భారత రక్షణ రంగాన్ని కూడా తమ అదుపులోకి తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు ఆశిస్తున్నాయి. పెట్టుబడులు ఎంత ఎక్కువగా చొచ్చుకుని వస్తే రక్షణ వ్యూహాల కోసం అంత ఎక్కువగా విదేశాలపై ఆధారపడాలి. చైనా ప్రమాదాన్ని నిలువరించడానికి ఇండియాపై ఆధారపడాలని అమెరికా ఆశీస్తోంది. అమెరికా ఒక దేశంపై ఆధారపడదలుచుకున్నది అంటే అర్ధం, ఆ దేశాన్ని అన్నివిధాలుగా అదుపులోకి తీసుకోవడం అనే. ఆఫ్ఘన్ యుద్ధం కోసం పాక్ పై ఆధారపడినా, సిరియా దురాక్రమణ కోసం జోర్డాన్, సౌదీలపై ఆధారపడినా, ఉక్రెయిన్ అడుపుకోసం పోలాండ్ పై ఆధారపడినా అమెరికా చేసింది ఇదే. కాబట్టి చైనా బూచి చూపే భారత పాలకులు వాస్తవంలో అమెరికాకు ప్రయోజనం చేస్తున్నారు తప్ప దేశానికి కాదు.

చైనా బూచి చూపడంలో హిందూత్వ శక్తులకు అమిత ఆసక్తి. అమెరికాను విమర్శించినప్పుడల్లా హిందూత్వ వాదులు దానిని చైనాకు సమర్ధనగా చెప్పుకోవడం ఇష్టం. 1962 చైనా యుద్ధం వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండే బూటకపు కారణం. ఆ పేరుతో అమెరికాతో అంటకాగడం వారి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి బి.జె.పి సిద్ధం. తాము అధికారంలోకి వస్తే రక్షణ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తామని బి.జె.పి తన మేనిఫెస్టోలో చెప్పింది. కాంగ్రెస్ మాత్రం ప్రాధామ్యాల వారీగా విదేశీ పెట్టుబడుల అవసరాన్ని నిర్ణయిస్తామని చెప్పింది. మొదటి ప్రాధాన్యం ప్రభుత్వ రంగ కంపెనీలకే ఇస్తామని చెప్పింది. పబ్లిక్ సెక్టార్ రక్షణ కంపెనీలపై ఆధారపడిన నిరంకుశ బూర్జువా, బ్యూరోక్రటిక్ వర్గాల మేలు కోసమే కాంగ్రెస్ వాగ్దానం లక్ష్యంగా పెట్టుకుంది. అది మినహా విదేశీ పెట్టుబడులకు కాంగ్రెస్ కి కూడా అభ్యంతరం ఉండబోదు.

7. భీమా రంగం: జీవిత భీమా, సాధారణ భీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులపై ఉన్న పరిమితిని పూర్తిగా ఎత్తివేయాలన్నది పశ్చిమ కంపెనీల డిమాండ్. ప్రస్తుతం 26 శాతం మేర విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. 74 శాతం వాటా స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు ఇస్తూ మిగిలింది విదేశీ కంపెనీలు పెట్టవచ్చు. ఈ పరిమితిని 49 శాతానికి పెంచుతూ యు.పి.ఏ బిల్లును ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందగా లోక్ సభలో ఆమోదం పొందవలసి ఉంది. ఇతర బిల్లులపై రగడ చెలరేగడంతో భీమా బిల్లుకు వీలు లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం దీనిని ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది. విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం కంటే పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

భారత భీమా రంగం 2012 నాటికి 72 బిలియన్ డాలర్ల (రు. 4.32 ల. కోట్లు) విలువ కలిగినదని, ఇది 2020 నాటికి 280 (రు. 17 ల.కోట్లు) బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఒక అంచనా. ఇంత భారీ మార్కెట్ ను ఆక్రమించుకోవడం కోసం పశ్చిమ ఫైనాన్స్ కంపెనీలు గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్నాయి. జీవిత భీమా రంగంలో ఎల్.ఐ.సి, ఎస్.బి.ఐ లు ఇప్పటికీ 75 శాతం వాటా కలిగి ఉన్నాయి. క్లయిమ్ ల పరిష్కారంలో ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా ఎల్.ఐ.సి కి పేరుంది.

మరోవైపు పశ్చిమ భీమా కంపెనీలు నష్టాలకు పెట్టింది పేరు. క్లయిమ్ లు ఎగవేయడంలో అవి దిట్ట. అమెరికాలోని అత్యంత భారీ భీమా కంపెనీ ఏ.ఐ.జి నిలువునా కుప్ప కూలిన చరిత్ర ఇటీవలిదే (2008). అలాంటి విఫల, నష్టజాతక కంపెనీలకు భారత దేశ భీమా రంగాన్ని ఇచ్చేయాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి భారత పాలకులు ఓ.కె చెప్పేస్తున్నారు. భీమా రంగంలోని కార్మికవర్గం ప్రతిఘటన వల్లనే ఇన్నాళ్లూ భారత ప్రభుత్వ భీమా రంగం నిలబడింది. యూనియన్ లు క్రమంగా బలహీనపడుతున్న నేపధ్యంలో దానిని విదేశీ కంపెనీలకు అప్పజెప్పడం ఇక సమస్య కాదు. ఆ మంత్రసాని పనికి ఎవరు పూనుకుంటారన్నదే మిగిలిన సమస్య. కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ ఆ పనికి సిద్ధంగా ఉన్నాయి.

8. బ్యాంకింగ్: బ్యాంకింగ్ రంగాన్ని కూడా పూర్తి స్ధాయిలో తమకు ఇచ్చేయాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. మందగిస్తున్న ఆర్ధిక వృద్ధిని పరుగులు పెట్టించాలన్నా, మొండి అప్పులు పేరుకుపోకుండా ఉండాలన్నా పూర్తిస్ధాయి ప్రయివేటీకరణ చేయాలని కోరుతున్నాయి. ఎంత పరిహాసం అంటే అమెరికాయే స్వయంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి బైటికి రాలేక సతమతం అవుతోంది. బిలియన్ల కొద్దీ బెయిలౌట్లు పంచి పెడుతూ కృత్రిమంగా వృద్ధిని నమోదు చేస్తోంది. అది కూడా 1 శాతం కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడానికే అమెరికా అష్ట కష్టాలు పడుతోంది. ఇండియా కనీసం 4.5 శాతం వృద్ధికి తగ్గలేదు. కాబట్టి పశ్చిమ బ్యాంకింగ్ కంపెనీల అవసరం ఇండియా కంటే అమెరికాకే ఎక్కువగా ఉంది. ఐరోపా దేశాలు కూడా ప్రతికూల (నెగిటివ్) వృద్ధి రేటును ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాయి. కనుక ఐరోపా దేశాలకు కూడా వాటి సేవలు ఎక్కువ అవసరం కాదా?

వాస్తవం ఏమిటంటే అమెరికా, ఐరోపాలలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వలన పశ్చిమ ఫైనాన్స్ కంపెనీల లాభ దాహాన్ని అక్కడి మార్కెట్ తీర్చలేకపోతోంది. దానితో వారి ఫైనాన్స్ పెట్టుబడి, పెట్టుబడిగా రియలైజ్ అయ్యే మార్గాలు కుచించుకుపోతున్నాయి. ఫలితంగా ఇండియా లాంటి దేశాల ఫైనాన్స్ వనరులను కొల్లగొట్టడానికి అవి ఎదురు చూస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ తో సహా బ్యాంకింగ్, భీమా, పోర్ట్ ఫోలియో తదితర రంగాల్లో పరిమితంగా ప్రవేశించినందుకే అక్కడ జలుబు చేస్తే ఇక్కడ పడీ పడీ తుమ్ముతున్న పరిస్ధితి. ఇంకా చొరబడితే దేశ ఆర్ధిక వ్యవస్ధ కనీసంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండదు. కానీ బ్యాంకింగ్ రంగంలో మరింత దూకుడుగా సంస్కరణలు అమలు చేయడానికి కాంగ్రెస్, బి.జె.పి ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.

2008లో ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం వచ్చిందే వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్) లలోని బ్యాంకుల వల్ల. అలాంటి బ్యాంకులు ఇండియాను ఏ విధంగా ఉద్ధరిస్తాయో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

ఇంకా బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇవ్వడం పెంచాలనీ, విద్యుత్ పంపిణీని కూడా పూర్తిగా ప్రైవేటీకరించాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేస్తే బొగ్గు గనుల తవ్వకంలో అవినీతికి తావు ఉండదని రాయిటర్స్ ఒక వింత వాదన చేసింది. యు.పి.ఏ II హయాంలో వెల్లడి అయిన బొగ్గు కుంభకోణం కేవలం ప్రైవేటు కంపెనీల వల్ల జరిగినదే. అంత జరిగినా ప్రైవేటు కంపెనీల వల్ల అవినీతి తగ్గుతుందని చెప్పాలంటే ఎంత సాహసం కావాలి?

ఢిల్లీలో విద్యుత్ పంపిణీని రిలయన్స్, టాటా తదితర ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం వలన ప్రజలకు ఎంత నష్టం జరిగిందో, ఛార్జీలు ఎంతగా పెరిగిపోయాయో, ఎంత అవినీతి చోటు చేసుకుందో నెల రోజుల ఎఎపి పాలన వెల్లడి చేసింది. విదేశీ కంపెనీలకు కూడా ఇందులో చోటిస్తే ఛార్జీలు ఇక ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యే లేదు. గుజరాత్ నమూనా వల్ల 24 గంటలు విద్యుత్ సరఫరా అయిందనీ, పలు ప్రశంసలు పోందిందని రాయిటర్స్ మురిసిపోయింది. కానీ వాస్తవం ఏమిటంటే అక్కడ రైతులకు విద్యుత్ అందింది కేవలం 5 నుండి 8 గంటలు మాత్రమే. అది కూడా రాత్రి సమయాల్లో.

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రకారం గుజరాత్ లో 11 లక్షల ఇళ్లకు ఇంకా విద్యుత్ సౌకర్యమే లేదు. వాటిలో 15 శాతం పట్టణాల్లో ఉన్న ఇళ్లే. 9 లక్షల ఇళ్ళల్లో కిరోసిన్ దీపమే వెలుగు ఇస్తోంది. కంపెనీలకు మాత్రం 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతోంది. గుజరాత్ లో విద్యుత్ ఛార్జీలు యూనిట్ కి 8 రూపాయల పైమాటే అనీ అంత ధర ఇస్తున్నందునే కంపెనీలు పోటీపడి అక్కడ కంపెనీలు నెలకొల్పాయని ఎఎపి నాయకులు వెల్లడించిన నిజం. ప్రజలను చీకటిలో ఉంచుతూ ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకోవడం గుజరాత్ సాధించిన మోడల్. కంపెనీలకు మాత్రమే మేలు చేసే ఈ మోడల్ ను పశ్చిమ పత్రికలు ఆకాశానికి ఎత్తడం సహజమే.

పశ్చిమ దేశాల కోర్కెలు తీర్చడానికి భారత దేశంలోని ప్రధాన స్రవంతి పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుండి మహా రాష్ట్ర వరకూ, కాశ్మీర్ నుండి తమిళనాడు వారకూ ఎ రాష్ట్రంలో ప్రభుత్వం చూసినా ఈ విధానాలనే అమలు చేస్తున్నాయి. ఇక ప్రజలకి దారేది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s