బొకో హరమ్ కిడ్నాప్, మిచెల్లే ఒబామా హిపోక్రసీ


నైజీరియా పాఠశాల విద్యార్ధినుల కిడ్నాప్ విషయంలో అమెరికా ప్రధమ మహిళ మిచెల్లే ఒబామా తీసుకున్న చొరవ అధ్యక్షుడు ఒబామాకు ఎదురు తిరిగింది. కిడ్నాప్ అయిన అమ్మాయలను వెనక్కి తేవాలంటూ మిచెల్లే ఒక ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, దాదాపు అన్నీ పత్రికల్లోనూ హల్ చల్ చేసింది.

ఒబామా విధ్వంసక డ్రోన్ దాడుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న అనేకమంది వ్యక్తులు, సంస్ధలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. ఒబామా ముందు తన డ్రోన్ లను వెనక్కి పిలిపించుకోవాలని కోరుతూ అదే మిచెల్లే ఫోటోలో మార్చి రాసి సోషల్ మీడియాలో పెట్టడంతో అమెరికా డ్రోన్ హత్యలు మరోసారి చర్చకు వచ్చాయి.

బొకో హరమ్ అనేది నైజీరియాలో ఒక ముస్లిం తీవ్రవాద సంస్ధ. సంస్ధ పేరుకు అర్ధం ‘పశ్చిమ విద్య పాపం’ అని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు చెబుతాయి. అయితే అది వాస్తవం కాదని వివిధ రిఫరెన్స్ ల ద్వారా తెలుస్తోంది. స్ధానిక హౌసా భాషలో బొకో హరమ్ అంటే ‘బూటకపు విద్య పాపం’ అని అర్ధం అని వికీ పీడియా ద్వారా తెలుస్తోంది. దీనిని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు తమదైన అర్ధం చెప్పి ప్రచారం చేయడం మోసపూరితం.

ముస్లిం మత స్వచ్ఛతను కాపాడాలని, అసలు సిసలు ముస్లిం జీవన విధానం అనుసరించాలని ప్రబోధించే బోకో హరమ్ నిజానికి మతోన్మాదం లక్ష్యంగా పుట్టింది కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే హౌసా భాషీయులను నైజీరియా పాలకులు జాత్యహంకారంతో అణచివేస్తున్న నేపధ్యంలో జాతి అణచివేతకు వ్యతిరేకంగా పుట్టినదే బోకో హరమ్. తమ లక్ష్య సాధనకోసం ఇస్లాం మతాన్ని ఆలంబన చేసుకోవడంతో క్రమంగా బోకో హరమ్ తీవ్రవాద సంస్ధగా పేరు తెచ్చుకుంది.

ఈ సంస్ధ నెల రోజుల క్రితం ఈశాన్య నైజీరియాలోని చిబోక్ అనే గ్రామంపై దాడి చేసి 276 మంది విద్యార్ధినులను తరలించుకుని పోయారు. వారిలో కొందరు విద్యార్ధినుల ఎలాగో తప్పించుకున్నారు. ప్రస్తుతం 200 మందికి పైగా విద్యార్ధినులు బొకో హరమ్ చెరలో ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఈ కిడ్నాప్ ఘటనను మొదట్లో పశ్చిమ పత్రికలు పెద్దగా పట్టించుకోలేదు. ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాను రాక్షసీకరించే పనిలో నిండా మునిగిన పశ్చిమ పత్రికలకు ఎవరి మద్దతూ లేని నైజీరియా బాలికల కిడ్నాప్ పెద్ద అంశంగా కనపడలేదు.

అమెరికాలో ఒకటి రెండు పత్రికలు కొద్దిగా కవర్ చేసిన తర్వాతనే నైజీరియా కిడ్నాప్ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. అనంతరం బ్రిటిష్ పత్రిక టైమ్, పశ్చిమ పత్రికలు ఈ ఘోరాన్ని వదిలేశాయని విమర్శిస్తూ ఆర్టికల్ ప్రచురించడంతో మరింతగా వెలుగులోకి వచ్చింది. అమెరికా, ఐరోపాల విదేశాంగ విధానాలకు భంగం వాటిల్లితేనే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు చిలవలు పలవలు చేసి రాస్తాయని ఎక్కడో నైజీరియాలో మారుమూల జరిగిన కిడ్నాప్ వారిని అనవసరం అని టైమ్ విమర్శించింది.

అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా కిడ్నాప్ ను ఖండిస్తూ ఓ ప్రకటన జారీ చేయడంతో ఇక ఇతర పత్రికలన్నీ అందుకున్నాయి. వివిధ దేశాల అధినేతలు కూడా తలా ఒక మాట సాయం చేశారు. కానీ సమస్య మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఒబామా సతీమణి మిచెల్లే “BRING BACK OUR GIRLS” అని రాసి ఉన్న బోర్డు పట్టుకుని ఫోటో దిగి ప్రచారంలోకి పెట్టారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో (ఫేస్ బుక్, ట్విట్టర్ మొ.వి) విస్తృతంగా ప్రచారం పొందింది.

అయితే బొకో హరమ్ తాము కిడ్నాప్ చేసిన అమ్మాయిలకు హాని తలపెట్టలేదు. తాము చర్చలకు సిద్ధం అని ప్రకటించింది. తమ వాళ్ళను నైజీరియా ప్రభుత్వం జైల్లో పెట్టి చిత్ర హింసలు పెడుతోందని వారిని విడుదల చేస్తే బాలికలను విడుదల చేస్తామని షరతు విధించారు. నైజీరియా ప్రభుత్వం బోకో హరమ్ తో చర్చించేది లేదని స్పష్టం చేస్తోంది. బాలికలను నిర్బంధించిన స్ధలానికి సైన్యాన్ని పంపింది. సాయినికులకు బోకో హరమ్ వాళ్ళకు ఈ రోజు ఘర్షణ జరగడంతో ఇరువైపులా అనేకమంది చనిపోయారు తప్పితే సమస్య మాత్రం కొనసాగుతోంది.

బోకో హరమ్ కిడ్నాప్ బాలికలను విడుదల చేయాలని ఒబామా సతీమణి కోరిన నేపధ్యంలో ఒబామా సాగిస్తున్న డ్రోన్ దాడులు విస్తృతంగా చర్చకు వచ్చాయి. టెర్రరిజంపై యుద్ధం పేరుతో మానవ రహిత విమానాలతో దాడులు చేయిస్తూ వివిధ దేశాల్లో వేలాది మంది స్త్రీలు, పిల్లలను ఒబామా ప్రభుత్వం హత్య చేయిస్తోంది. అమెరికా డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని ఐరాస అనేకసార్లు స్పష్టం చేసింది. అయితే అమెరికా/ఒబామా మాత్రం తమ చర్యలు చట్టబద్ధమైనవే అని తమకు తాము సర్టిఫికేట్ ఇచ్చుకుంటుంది. డ్రోన్ దాడులతో అమాయక పౌరులను హత్య చేస్తూ బొకో హరమ్ కిడ్నాప్ బాధాకరం అని చెప్పడం ఒబామా హిపోక్రసీని చాటుతోందని మానవ హక్కుల సంస్ధలు, పత్రికలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

ఇన్ఫో వార్స్ వెబ్ సైట్ ప్రకారం డ్రోన్ దాడులు జార్జి బుష్ పాలనలోనే ప్రారంభం అయినప్పటికి చివరి 4 యేళ్ళ పదవీ కాలంలో 51 సార్లు డ్రోన్ విమాన దాడులు జరిపిస్తే ఒబామా హయాంలో 2009 నుండి ఇప్పటివరకు 390 సార్లు డ్రోన్ దాడులు జరిగాయి. పాకిస్ధాన్, యెమెన్, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్ లలో అమెరికా డ్రోన్ లో విస్తృతంగా దాడులు చేస్తూ అనేకమంది అమాయక పౌరులను బలిగొన్నాయి.

డ్రోన్ దాడుల్లో ఇప్పటివరకు వందలాది పిల్లలు మరణించారు. ఈ దాడుల్లో బతికి బైటపడినవారు అంగవైకల్యంతోనూ, కాలిన గాయాలతోనూ బతుకులు ఈడుస్తున్నారు. ఉదాహరణకి పాకిస్ధాన్ లో 4 యేళ్ళ బాలుడు షకీరా పరిస్ధితిని ఫోటోలో చూడవచ్చు. గణాంకాల ప్రకారం డ్రోన్ దాడుల్లో మరణించే ప్రతి ఒక్క టెర్రరిస్టుకు 50 మంది అమాయక పౌరులు దుర్మరణం చెందుతున్నారు. అనగా డ్రోన్ మరణాల్లో 98 శాతం మంది అమాయకులు తప్ప ఉగ్రవాదులు కాదు.

ఒకవేళ టెర్రరిస్టు అయినా విచక్షణారహితంగా చంపేసే హక్కు ఎవరికి లేదన్నది స్పష్టమే. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని విచారణ చేసి అవసరం అయితే మరణ శిక్ష విధించే హక్కు ఆయా జాతీయ ప్రభుత్వాలకు ఉంటుంది తప్ప అమెరికాకు కాదు. తనకు అవసరం అనుకుంటే నిధులు, ఆయుధాలు ఇచ్చి పోషించడం, తనకు ఎదురు తిరిగితే డ్రోన్ దాడుల్లో చంపేయ్యడం ఏ నాగరిక నీతి?

డ్రోన్ బాధితుల ప్రాణాలంటే ఒబామాకి ఎంత చులకనో తెలియజేసే వివిధ సంఘటనలను పత్రికలు గతంలో వెల్లడి చేశాయి. 2010లో వైట్ హౌస్ లో జరిపిన పత్రికా విలేఖరుల డిన్నర్ సమావేశంలో డ్రోన్ దాడులపై ఒబామా జోక్ చేశారని పత్రికలు వెల్లడి చేశాయి. 2012లో డ్రోన్ హత్యల విషయంలో తనంతటి వారు లేరని ఒబామా తన వైట్ హౌస్ సహాయకుల వద్ద గొప్పలు పోయిన సంగతిని కూడా పత్రికలు వెల్లడించాయి. చివరికి అమెరికా పోరులను సైతం అమెరికా డ్రోన్ లు చంపేస్తున్నాయి. అక్టోబర్ 2011లో యెమెన్ లో జరిపిన డ్రోన్ దాడిలో 16 యేళ్ళ అమెరికా పౌరుడొకరు మరణించారు. డిసెంబర్ 2013లో జరిగిన డ్రోన్ దాడిలో యెమెన్ లోనే ఒక పెళ్లి బృందం ఊరేగింపులో పాల్గొన్న 15 మంది పౌరులు చనిపోయారు. ఇలాంటి ఘటనలు ఆఫ్ఘన్, పాకిస్ధాన్ లలో అయితే లెక్కే లేదు.

బోకో హరమ్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ కాదు. అది కేవలం నైజీరియాలో ఈశాన్య ప్రాంతాలకు పరిమితమైన సంస్ధ. అది కూడా జాతి అణచివేతను ఎదుర్కోవడానికి పుట్టి హంతక చర్యలకు పాల్పడుతున్న సంస్ధ. తమ సహచరులను విడిపించుకోవడం కోసం ఎటువంటి రక్షణా లేని అమాయక బాలికలను కిడ్నాప్ చేయడం నిస్సందేహంగా ఘోరమైన విషయం. కానీ అది ఘోరం అని చెప్పే నైతిక అర్హత ఒబామాకు గానీ ఆయన భార్య మిచెల్లే ఒబామాకు గాని ఉండజాలదు.

4 thoughts on “బొకో హరమ్ కిడ్నాప్, మిచెల్లే ఒబామా హిపోక్రసీ

 1. excluding drone attacks your views on boko haram are factually wrong. it kidnapped , raped and already sold many girls as sex slaves. they even posted pics in which they converted all this christian girls into islam. Even boko haram justified their act and said its not wrong to have sex slaves in islam. what boko haram said is matching with what world famous islamic scholar zakir naik saying (see it here https://www.youtube.com/watch?v=dYr8l1hkp0U). so boko haram is not that cool as u r trying to say it here…………kidnapping 200+ girls, raping them and selling them and then justifying that barbaric act in the name of islam is not small issue . i never such cruel stunts in stories tooo!!!!!

 2. america తిట్టే / అది చేసిన కొన్ని పనులను వేలెత్తి చూపే క్రమంలో బోకో హారం లాంటి యదవల్ని మంచి వారిగా, వారి హక్కుల కోసం పోరాడే వ్యక్తులగా చిత్రీకరిచడం ఏమాత్రం బాలేదు.

 3. “బోకో హరమ్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ కాదు. అది కేవలం నైజీరియాలో ఈశాన్య ప్రాంతాలకు పరిమితమైన సంస్ధ. అది కూడా జాతి అణచివేతను ఎదుర్కోవడానికి పుట్టి హంతక చర్యలకు పాల్పడుతున్న సంస్ధ.”

  నేను రాసింది ఇది. బోకో హరం పుట్టినపుడు అహింస ఆయుధంగా చేసుకుందని పైన మిత్రుడు ఇచ్చిన లింక్ కూడా చెబుతోంది. పాశ్చాత్య సామ్రాజ్యవాదంపై పోరాడడానికి అది పుట్టిందనీ, వ్యవస్ధాపకుడు మరణించాక కొత్త నాయకత్వం హంతక చర్యలకు దిగిందని కూడా జ్యోతి సంపాదకీయం చెప్పింది.

  ‘అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ కాదు’ అంటే అర్ధం అసలు ఉగ్రవాద సంస్ధే కాదని కాదు. పైగా అది తీవ్రవాద సంస్ధ అని కూడా రాశాను. ఇక వారిని మంచివారిగా చూపిందెక్కడ? అంతర్జాతీయ ఉగ్రవాదానికి సామ్రాజ్యవాద మద్దతు ఉంటుంది. ఇప్పటివరకూ బోకో హరంకి అది లేదు. లేదా అందుకు తగిన సాక్ష్యాలు ఇంకా వెల్లడి కాలేదు. ఒకవేళ బోకో హరంకి అంతర్జాతీయ మద్దతు ఉందని తేలితే, అప్పుడు తప్పనిసరిగా ఈ ఆర్టికల్ ని సమీక్షించాల్సిందే.

  ఈ ఆర్టికల్ బోకో హరం గురించి, దాని తీవ్రవాదం గురించి చెప్పేందుకు ఉద్దేశించింది కాదు. ఒబామా దంపతుల హిపోక్రసీని చెప్పడానికి ఉద్దేశించినది. పైన మిత్రుడు భావించినట్లు జ్యోతి సంపాదకీయానికీ, ఈ ఆర్టికల్ కు వైరుధ్యం కూడా లేదు. కాకపోతే అక్కడ ధ్వనించిన టోన్ ఇక్కడ లేదు. దానికి కారణం రెండు ఆర్టికల్స్ ఉద్దేశ్యాలు ఒకటి కాకపోవడమే.

  వీలయితే బోకో హరం గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s