గని ప్రమాదాలకు పేరు పొందిన టర్కీ మరోసారి తన పేరు నిలుపుకుంది. పశ్చిమ టర్కీ నగరం సోమా లో బొగ్గు గని కూలి 300 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇప్పటివరకూ 245 మంది మరణాలను అధికారులు ధృవీకరించారని బి.బి.సి తెలిపింది. మరో 120 మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. 450 మంది బతికి బైటపడ్డారని తెలుస్తోంది. జీవించి ఉన్నవారి ప్రాణాలు నిలపడానికి ఆక్సిజన్ వాయువును గనిలోకి పంపింగ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో సజీవులు ఇంకా ఉంటారని మాత్రం ఎవరికీ ఆశలు లేనట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి నిరసనగా సోమ నగరంలో హింసాత్మక ఆందోళనలు పెచ్చరిల్లాయని రష్యా టుడే తెలిపింది. ఆందోళలకు దిగిన ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తూ తమను నియంత్రింపజూసిన పోలీసులపై విరుచుకుపడ్డారు. టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ యధావిధిగా ప్రమాదంపై విచారం ప్రకటించారు. సంతాప దినాలు ప్రకటించి విచారణకు ఆదేశించారు. గనుల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవని కార్మికులు అనేక యేళ్లుగా ఆందోళన చేస్తున్నప్పటికి ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలతో సరిపెట్టిన సంగతిని గుర్తు చేస్తూ ప్రజల ఆగ్రహోదగ్రులు అవుతున్నారు. ప్రదర్శనకు దిగిన ప్రజలపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ ఛార్జీ ప్రయోగించడంతో ప్రధాని మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
సోమ పట్టణంలో బొగ్గు గని ప్రాంతం అంతా రోదనలు, ఆందోళనలతో నిండిపోయిందని పత్రికలు తెలిపాయి. రక్షించినవారిలో 80 మందికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని ప్రధాని ప్రకటించారు. “ప్రమాదం గురించి అన్నీ కోణాల్లో పరిశోధిస్తామని హామీ ఇస్తున్నాను. పరిశోధన జరుపుతూనే (?) ఉంటామని హామీ ఇస్తున్నాను. ఎలాంటి నిర్లక్ష్యాన్ని అంగీకరించేది లేదు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాము” అని ప్రధాని ఎర్దోగన్ ప్రకటించారని బి.బి.సి తెలిపింది.
విద్యుత్ సరఫరా లోపాల వల్ల మంటలు చెలరేగాయని దానితో భారీ పేలుడు సంభవించి గని కూలిపోయిందని ప్రాధమిక సమాచారం బట్టి తెలుస్తోంది. పేలుడు జరిగిన చోటు భూమి ఉపరితలానికి 2 కి.మీ లోటులో ఉండగా గని ప్రవేశ ద్వారానికి 4 కి.మీ దూరంలో ఉంది. దానితో కార్మికులకు వెంటనే బైటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. పేలుడు వల్ల విడుదల కార్బన్ మోనాక్సైడ్ 5 నిమిషాల్లో మనిషి ప్రాణం తీసేస్తుంది. అందువల్ల సజీవంగా ఎవరూ మిగిలి ఉండరన్న అభిప్రాయానికి అంతా వచ్చేశారు.
సోమ ప్రాంతంలో బొగ్గు గని పరిశ్రమ అతి పెద్ద పరిశ్రమ. సమీపంలోని ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి బొగ్గు ఇక్కడి నుండే సరఫరా అవుతుంది. టర్కీలో 40 శాతం విద్యుత్ అవసరాలను ధర్మల్ విద్యుత్ తీరుస్తుంది. అయితే గనుల వద్ద భద్రతా ప్రమాణాలు అత్యంత లోపభూయిష్టంగా, అధమ స్ధాయిలో ఉంటాయని కార్మికులు అనాదిగా ఆరోపిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతో సర్దిపుచ్చి ఆందోళనలు సమసిపోయాక పట్టించుకోక పోవడం ప్రభుత్వాల నియమంగా మారిందని వారి ఆరోపణ. గతంలో సోమ లో జరిగిన గని ప్రమాదాలపై ఇప్పటికీ విచారణ జరపలేదని, పార్లమెంటరీ విచారణకు ప్రభుత్వం తిరస్కరించిందని అధికార పార్టీ ఎం.పిలే ఆరోపించడం గమనార్హం.
1999 నాటి భూకంపం అనంతరం రక్షణ, సహాయక చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలం అయినందుకే అప్పటి ప్రభుత్వం కూలిపోయింది. చాలా కాలం అనంతరం ఇస్లామిక్ పార్టీకి ప్రజలు అధికారం అప్పగించడానికి భూకంపం కారణంగా నిలిచింది. ఇప్పుడు జరిగిన గని ప్రమాదం త్వరలో జరిగే ఎన్నికల్లో ఒక ముఖ్య అంశంగా మారుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఫోటోలను బి.బి.సి, రష్యా టుడే అందించాయి.