ఎగ్జిట్ పోల్స్: ఎగిరెగిరి పడుతున్న స్టాక్ మార్కెట్లు


A road sign stands next to the Bombay Stock Exchange building

A road sign stands next to the Bombay Stock Exchange building

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్.డి.ఏ/బి.జె.పి/నరేంద్ర మోడి ప్రభుత్వం రాకను సూచించడంతో స్టాక్ మార్కెట్లు ఆనందంతో ఉరకలు వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్.డి.ఏ కి అనుకూలంగా ఉండవచ్చన్న అంచనాతో సోమవారం భారీ లాభాలను నమోదు చేసిన జాతీయ స్టాక్ మార్కెట్లు తమ అంచనా నిజం కావడంతో మంగళవారం కూడా అదే ఊపు కొనసాగించాయి. దానితో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. కాగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ధనిక వర్గాలకు, కార్పొరేట్ కంపెనీలకు లాభకరం అని స్టాక్ మార్కెట్ కదలికలు చెప్పకనే చెబుతున్నాయి.

స్టాక్ మార్కెట్ లు ఎంతగా సంతోషిస్తున్నాయంటే బోంబే స్టాక్ ఎక్ఛేంజీ లో లిస్ట్ అయిన స్టాక్ లలో 225 స్టాక్ ల ధరలు 52 వారాల (లేదా దాదాపు సంవత్సరం) గరిష్ట స్ధాయికి చేరాయి. రికార్డు స్ధాయిలో పైకి ఎగసిన స్టాక్ లలో ఎ.సి.సి, బి‌హెచ్‌ఈ‌ఎల్, బిపిసిఎల్, కోల్ ఇండియా, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌పి‌సి‌ఎల్, ఐ.సి.ఐ.సి.ఐ, ఎల్&టి, ఎన్‌ఎం‌డి‌సి, టాటా మోటార్స్, టాటా స్టీల్ తదితర కంపెనీలు ఉన్నాయి.

గత శుక్రవారం నుండి బుల్ మార్కెట్ ధోరణిలో ఉన్న బి.ఎస్.ఇ సెన్సెక్స్ ఆరోజు ఏకంగా 650 పాయింట్లు లాభపడి జీవితకాల ఉచ్చ స్ధితిని నమోదు చేసింది. సెన్సెక్స్ నమోదు చేసిన అత్యధిక స్ధాయి ఏప్రిల్ 25 తేదీన (22,939 పాయింట్లు) సంభవించింది. శుక్రవారం ఆ స్ధాయిని అధిగమించి 22,994 పాయింట్ల అత్యధిక స్ధాయిని సెన్సెక్స్ నమోదు చేసింది. ఒక దశలో శుక్రవారం నాడే 23,000 మార్కును దాటిన సెన్సెక్స్ ఆ తర్వాత తనను తాను కాస్త సవరించుకుంది.

నేషనల్ స్టాక్ ఎక్చేంజి/ఎన్.ఎస్.సి నిఫ్టీ సూచిక అయితే శుక్రవారం 3 శాతం పెరుగుదల నమోదు చేసింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 6858 పాయింట్లకు నిఫ్టీ చేరుకుంది. నిఫ్టీ కూడా ఏప్రిల్ 25 తేదీనే తన జీవితకాల అత్యధిక స్ధాయిని (6869 పాయింట్లు) అందుకుంది. ఒకదశలో సదరు రికార్డు స్ధాయిని దాటి 6871 పాయింట్లకు చేరుకున్న నిఫ్టీ అనంతరం కొద్దిగా వెనక్కి తగ్గింది.

సోమవారం కూడా (శనివారం స్టాక్ మార్కెట్లకు సెలవు) స్టాక్ సూచికలు అదే ధోరణిలో పైపైకి ఎగబాకాయి. ఈసారి మానసిక ఆటంకంగా మార్కెట్ వర్గాల అభివర్ణించే 23,000 మార్కును దాటి 23,573 పాయింట్ల వద్ద (2.42 శాతం లాభం) ముగిసింది. సోమవారానికి సెన్సెక్స్ కు అదే అత్యధిక జీవితకాల రికార్డు. నిఫ్టీ కూడా ఇదే ధోరణిలో 2.27 శాతం పెరిగింది. అది కూడా మానసిక ఆటంకం 7,000 మార్కును అధిగమించి 7,014 పాయింట్ల వద్ద ముగిసింది.

సోమవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చిన ఊపుతో ఈ రోజు (మంగళవారం, మే 13) స్టాక్ మార్కెట్లు మరింత ఉన్నత రికార్డులు నెలకొల్పాయి. కీలక మానసిక స్ధాయిగా రాయిటర్స్ వార్తా సంస్ధ అభివర్ణించిన 24,000 పాయింట్ల మార్కును సెన్సెక్స్ అధిగమించి 24,069 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారంతో పోలిస్తే ఇది 2.2 శాతం పెరుగుదలకు సమానం. నిఫ్టీ కూడా 2.3 శాతం పెరిగి తన జీవితకాలంలోనే అత్యధిక రికార్డు స్ధాయి 7,172 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ సంబరం అంతా బి.జె.పి/నరేంద్ర మోడి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే. మార్కెట్లు, కంపెనీలు, ధనికవర్గాలకు బి.జె.పి ఎంత దగ్గరో ఈ స్పందన తెలియజేస్తోంది. అయితే చారిత్రకంగా పరిశీలించినట్లయితే ఎన్నికల ఫలితాల ద్వారా షేర్ మార్కెట్లలో కనిపించే స్పందన తాత్కాలికం మాత్రమే. ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం పని చేయడం మొదలు పెట్టాక అవి మళ్ళీ అసలు మార్కెట్ పరిస్ధితులకు అనుగుణంగా తమ యధా స్ధానానికి వెళ్లిపోతాయి.

అయితే స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు అనుకూలంగా బి.జె.పి, మోడి ఇచ్చిన వాగ్దానాలు, మోడి ఇన్నాళ్లూ గుజరాత్ లో అనుసరించిన ధనిక వర్గాల అనుకూల విధానాలు మార్కెట్లను అమితంగా సంతోషపరిచాయన్నది కూడా వాస్తవమే. యూనిట్ భూమిని కేవలం పదుల రూపాయల నుండి వందల రూపాయల వరకూ నామమాత్ర రేట్లకు కంపెనీలకు అప్పజెప్పడం దగ్గర్నుండి అల్పాదాయ వర్గాలను చీకటిలో ముంచి మరీ కంపెనీలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించడం వరకూ గుజరాత్ లో కంపెనీలు వైభోగాలు అనుభవించాయి. అలాంటి ప్రియతమ నేత నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వమే ఏర్పడితే ఏ కంపెనీ మాత్రం సంతోషించదు?

మార్కెట్లు ఇంతగా మిడిసిపడడం పట్ల హెచ్చరికలు, జాగ్రత్తలు జారీ చేస్తున్నవారు కూడా లేకపోలేదు. కేవలం ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారంగా షేర్ మార్కెట్ లో పొజిషన్ తీసుకోవడం మంచిది కాదని వివిధ సలహా సంస్ధలు, బ్రోకరేజి సంస్ధలు, మార్కెట్ నిపుణులు, వాణిజ్య పత్రికలు హెచ్చరిస్తున్నాయి. 2004, 2009 ఎన్నికల నాటి ఎగ్జిట్ ఫోల్ ఫలితాలను వారు గుర్తుకు తెస్తున్నారు.

2009లో ఇలాగే ఎన్.డి.ఏ కి అత్యధిక స్ధానాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్.డి.ఏ కూటమికి 175 నుండి 199 వరకూ సీట్లు వస్తాయని బైటినుండి మద్దతు ఇచ్చే పార్టీల సహాయంతో ఎన్.డి.ఏ ప్రభుత్వం వస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. మార్కెట్ మదుపుదారులు కూడా అదే నమ్మి విస్తారంగా పొజిషన్లు తీసుకున్నారు. తీరా చూస్తే ఎన్.డి.ఏ కూటమికి 159 సీట్లు మాత్రమే దక్కడంతో మళ్ళీ యు.పి.ఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది.

2004లోనూ ఇదే పరిస్ధితి. 2001 నుండి జి.డి.పి వృద్ధి రేటు 8-9 శాతం మధ్యలో నమోదు అవుతూ రావడంతో దేశం అభివృద్ధి పధంలో దూసుకెళ్తోందని వాజ్ పేయి-బి.జె.పి ప్రభుత్వం జబ్బలు చరుచుకుంది. వృద్ధి రేటు తమ పుణ్యమే అని చెప్పుకుంటూ తదనుగుణమైన నినాదాలు కూడా ఇచ్చేశారు. ‘దేశం వెలిగిపోతోందని’, ‘అంతా బాగుంది’ అనీ నినాదాలు ఇస్తూ తమ ప్రభుత్వ పదవీ కాలం ముగియకుండానే కొద్ది నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లారు. ఆనాడు జరిగిన ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్ధలు ఎన్.డి.ఏ కూటమికి 248 నుండి 284 వరకూ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇంకేం! మార్కెట్లు మహా మిడిసిపడ్డాయి. తీరా చూస్తే ఎన్.డి.ఏ కూటమికి 189 సీట్లు మాత్రమే దక్కాయి. అంతకుముందు ఎన్నికల్లో కూటమి కట్టడానికి నిరాకరించి అహంకారయుతంగా వ్యవహరించిన కాంగ్రెస్ బాగా కిందికి దిగివచ్చి యు.పి.ఏ కూటమిని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసేసింది.

రాయిటర్స్ వార్తా సంస్ధ కూడా దాదాపు ఇదే జాగ్రత్త చెప్పింది. భారత దేశంలో ఎగ్జిట్ పోల్స్ నమ్మదగినవి కావనీ అవి ఎన్నడూ వాస్తవానికి దగ్గరగా రాలేదని సదరు సంస్ధ వాపోయింది. కాబట్టి మే 16 తేదీన అసలు ఫలితాలు వెలువడే వరకూ పరిస్ధితి ఎలా ఉండేదీ చెప్పలేమని తేల్చేసింది.

“ఎగ్జిట్ పోల్ ఫలితాలలో మదుపుదారులు కొట్టుకుపోకుండా సంయమనం పాటించాలి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పుల తడకతో కూడుకున్నవని చరిత్ర చెబుతోంది. మే 12 నుండి ఇవే ఫలితాలను చెబుతూ ఉంటారు. మే 16 తేదీన మాత్రమే అసలు ఫలితాలు వస్తాయి. ఎన్.డి.ఏ కూటమికి 235-245 సీట్లు వస్తాయన్న అంచనాను మార్కెట్లు ఇప్పటికే లెక్కలోకి తీసుకున్నాయి. ఈ సంఖ్యలో కనీసం 5 శాతం తేడా వచ్చినా మార్కెట్ లో అతి పెద్ద కుదుపు తప్పదు” అని ప్రముఖ హాంగ్ కాంగ్ (చైనా) స్టాక్ బ్రోకరేజి సంస్ధ సి.ఎల్.ఎస్.ఏ తమ క్లయింట్లను హెచ్చరించిందని ఎకనమిక్ టైమ్స్ (ఇ.టి) పత్రిక తెలిపింది. ఇండియాకు చెందిన బ్రోకరేజి కంపెనీ ‘కోటక్ సెక్యూరిటీస్’ కూడా ఇదే విధంగా జాగ్రత్తలు చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాకుండా అసలు ఫలితాలపై ఆధారపడి మాత్రమే పొజిషన్ తీసుకోవాలని గట్టిగా సూచించింది.

ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడంలో అనుభవం ఉన్న నిపుణుల ప్రకారం ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అసలు ఫలితాలకు ఇంత తేడా ఉండడానికి కారణం ఆయా సంస్ధలు అనుసరించే విధానంలో మౌలిక లోపం ఉండడమే. ఏయే పార్టీకి ఎన్ని వోట్లు వచ్చేది పసిగట్టడంలో సరిగ్గానే వ్యవహరించినప్పటికీ వాటిని సీట్ల సంఖ్యలోకి మార్చడంలో తప్పులు చేస్తున్నారని సదరు నిపుణులు చెబుతున్నారు. “మన దేశంలో ఉన్నది ఫెడరల్ వ్యవస్ధ కాదు. అందువలన ఈ విధంగా జరిగే తప్పును కనీస స్ధాయికి తగ్గించడం సాధ్యం కాదు. అదే కాకుండా సర్వే సంస్ధలు సేకరించే శాంపిల్స్ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని సదరు నిపుణుడు వివరించారని ఇ.టి తెలిపింది.

ఐ.డి.బి.ఐ నిపుణుల ప్రకారం మార్కెట్ వర్గాలు ఎన్.డి.ఏ కు 260-270 సీట్లు వచ్చే అవకాశాన్ని ఇప్పటికే పరిగణలోకి తీసుకున్నాయి. అనగా నిజంగానే ఎన్.డి.కి కనీసం 260 సీట్లు వచ్చినా మార్కెట్లు ఇంతకు మించి పెరిగే అవకాశాలు ఉండబోవు. పెరుగుతుందని భావిస్తూ పొజిషన్ తీసుకున్నట్లయితే (షేర్లు కొని పెరిగాక అమ్ముకుని లాభపడదాం అనుకుంటే) వారికి నిరాశ ఎదురుకాక తప్పదని సదరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ 200-225 సీట్లతో ఎన్.డి.ఏ సరిపెట్టుకుంటే తీవ్రమైన ఒడిదుడుకులకు మార్కెట్లు లోనూ కాక తప్పదని హంగ్ పార్లమెంటు ఏర్పడి అత్యంత అస్ధిరమైన ధర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశమూ లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.

షేర్ మార్కెట్ల ద్రిమ్మరులారా, తస్మాత్ జాగ్రత్త!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s