ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఒకరిపై మరొకరు కాపీ రైట్ ఉల్లంఘన కేసులు పెట్టుకోవడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. మొబైల్ ఫోన్ డిజైన్, టెక్నాలజీల విషయంలో సామ్ సంగ్, యాపిల్ కంపెనీల మధ్య సాగిన సుదీర్ఘ కోర్టు పోరాటంలో ఒక భాగం కొద్ది రోజుల క్రితమే ముగిసింది. ఇప్పుడు గూగుల్, ఒరకిల్ కంపెనీల మధ్య నడిచిన పోరు ఒక కొలిక్కి వచ్చింది.
యాపిల్ ఆశించిన నష్టపరిహారంలో కేవలం 10వ వంతుకంటే తక్కువ మాత్రమే సామ్ సంగ్ చెల్లించాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పడంతో ఆ తీర్పు రెండు కంపెనీలను సంతృప్తిపరిచినట్లయింది. యాపిల్ డిమాండ్ చేసినట్లుగా దాదాపు 1 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కాకుండా 120 మిలియన్లు మాత్రమే సామ్ సంగ్ చెల్లించాలని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. యాపిల్ కి చెందిన రెండు పేటెంట్లను సామ్ సంగ్ ఉల్లంఘించిందని చెప్పిన కోర్టు సామ్ సంగ్ కి చెందిన ఒక పేటెంట్ ని యాపిల్ ఉల్లంఘించిందని తీర్పు ఇచ్చింది. కేసు ద్వారా అమెరికాలో సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను అడ్డుకోవాలన్న యాపిల్ ఆశను మాత్రం కోర్టు తీర్చలేదు.
తాజాగా గూగుల్, ఒరకిల్ కంపెనీల మధ్య నడిచిన కేసులో ఇంటర్నెట్ మహాకాయుడు గూగుల్ పై ఒరకిల్ కంపెనీ కాపీ రైట్ కేసు గెలవడం విశేషంగా నిలిచింది. మొబైల్ ఫోన్లలో వినియోగించే యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒరకిల్ అభివృద్ధి చేసిన జావా కోడ్ ను అక్రమంగా వినియోగించారని ఒరకిల్ కంపెనీ ఆరోపించింది. ఒరకిల్ ఆరోపణలను ధృవీకరిస్తూ అమెరికా అప్పీలు కోర్టు తీర్పు చెప్పింది. వాషింగ్టన్ లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీలు కోర్టు ఇచ్చిన ఈ తీర్పు కోసం సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించింది. జావా ప్రోగ్రామింగ్ లాంగువేజ్ లోని నిర్దిష్ట భాగాలకు కాపీ రైట్ చట్టం వర్తిస్తుందా లేదా అన్నది ఐ.టి కంపెనీలకు ఒక చర్చాంశం ఉంటోందని కోర్టు తీర్పుతో అది నివృత్తి అయిందని తెలుస్తోంది.
హై ప్రొఫైల్ కేసుగా పత్రికలు పేర్కొన్న ఈ కేసులో తమ వాదనలు వినిపించడం కోసం ఇరు కంపెనీల అత్యున్నత అధికారులు సైతం ట్రయల్స్ లో పాల్గొనడం విశేషం. గూగుల్ సి.ఈ.ఓ ల్యారీ పేజ్, ఒరకిల్ సి.ఈ.ఓ ల్యారీ ఎల్లిసన్ కోర్టుకు హాజరై తమ తమ సాక్ష్యాలను ట్రయల్స్ సందర్భంగా వినిపించారు. ఐ.టి కంపెనీలు తమ మేధో సంపత్తి హక్కులను ఏ విధంగా పరిరక్షించుకోవచ్చునో గూగుల్-ఒరకిల్ కేసు ఒక దృష్టాంతంగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ కేసు 2010 నాటిది. మొబైల్ ఫోన్ లలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపరేటింగ్ సిస్టంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యాండ్రాయిడ్ లో గూగుల్ కంపెనీ జావా కోడ్ ను అక్రమంగా వినియోగించిందని ఒరకిల్ ఆరోపించింది. తమ కాపీ రైట్ హక్కులను ఉల్లంఘించినందుకు రమారమి 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఒరకిల్ డిమాండ్ చేసింది. జావా కోడ్ లోని ఆయా భాగాలపై కాపీ రైట్ లను ఒరకిల్ కంపెనీ తనవిగా చెప్పుకోజాలదని శాన్ ఫ్రాన్ సిస్కో ఫెడరల్ జడ్జి గతంలో తీర్పు చెప్పగా వాషింగ్టన్ లోని ముగ్గురు జడ్జిల బెంచి ఆ తీర్పును తిరగరాసింది.
“లక్ష్యిత ప్రక్రియలను (ఆపరేషన్స్) నిర్వహించాల్సిందిగా కంప్యూటర్ కి సూచనలు ఇచ్చే నిర్దిష్ట కమాండ్ ల సమూహంలో కాపీ రైట్ రక్షణలను పొందదగిన వ్యక్తీకరణలు ఉంటాయని మేము నమ్ముతున్నాము” అని ఫెడరల్ సర్క్యూట్ కోర్టు జడ్జి కేధలీన్ ఓ’మాలి తన తీర్పులో పేర్కొన్నారని రాయిటర్స్ తెలిపింది. ఈ తీర్పు వల్ల అనేక ఐ.టి కంపెనీలకు గతంలో లేని సమస్యలను మోపిందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వివిధ కంప్యూటర్ ప్రోగ్రామ్ లను కలిపేందుకు ఉపయోగించే అంతర్-ప్రక్రియల (interoperable) ప్రోగ్రామ్ లను రాయడం ఎలా అన్నది ఇప్పుడు సమస్య అవుతుందని వారు విశ్లేషిస్తున్నారు. సాఫ్ట్ వేర్ పరిశ్రమను అంతటినీ ఈ తీర్పు ఒక్క కుదుపు కుదపడం ఖాయం అని వారు చెబుతున్నారు. ఒరకిల్ కంపెనీ సమర్ధకులు మాత్రం ఈ వాదనలో పస లేదని తేల్చేస్తున్నారు.
ఏమిటి కేసు?
వివిధ కంప్యూటర్ ప్రోగ్రామ్ లను ఒకదాని నొకటి జత చేసేందుకు మరొక కంప్యూటర్ భాష ఉంటుంది. వీటిని ఎ.పి.ఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేసెస్) అంటారు. ఈ ఎ.పి.ఐ లపై కాపీ రైట్ హక్కులు పొందవచ్చునా లేదా అన్నది కేసులోని ప్రధాన అంశం. జావా కోడ్ లో రాసిన ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్ లను గూగుల్ కంపెనీ, ఒరకిల్ అనుమతి లేకుండా యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లో వినియోగించింది. తాము అభివృద్ధి చేసిన 37 రకాల జావా ఎ.పి.ఐ లను గూగుల్ అక్రమంగా వినియోగించిందని ఒరకిల్ ఆరోపించింది. అలా తన అనుమతి లేకుండా తన కాపీ రైట్ హక్కులను ఉల్లంఘించినందుకు నష్టపరిహారం కావాలని ఒరకిల్ కోరుతోంది.
యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం నిజానికి ఓపెన్ సోర్స్ కోడ్ ఆధారంగా రూపొందించినది. అనగా అనేక లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ లకు మల్లే బహిరంగంగా అందుబాటులో ఉన్న సోర్స్ కోడ్ ఆధారంగా యాండ్రాయిడ్ ను గూగుల్ రూపొందించింది. (ఒక కంప్యూటింగ్ మిషన్ ను కనీస స్ధాయిలో పని చేసేలా ఆదేశాలు ఇచ్చే వివిధ కమాండ్ ల మొత్తమే సోర్స్ కోడ్.) ఈ కారణం వల్లనే యాండ్రాయిడ్ ఓ.ఎస్ వినియోగించే స్మార్ట్ ఫోన్ల కోసం అనేక వేల అప్లికేషన్లను సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు స్వంతగా తయారు చేయగలుగుతున్నారు. ఓపెన్ సోర్స్ కోడ్ వల్ల సాఫ్ట్ వేర్ ఖర్చు గణనీయ మొత్తంలో తగ్గిపోతుంది. ఆ మేరకు వినియోగదారులు లాభపడతారు.
ఒరకిల్ కంపెనీ సైతం తాను ఓపెన్ సోర్స్ టెక్నాలజీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెబుతుంది. అది నిజం కూడా. అయితే ఓపెన్ సోర్స్ టెక్నాలజీని వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించడమే అసలు సమస్య. ఓపెన్ సోర్స్ గా అందుబాటులో ఉంచిన జావా ఏ.పి.ఐ లను గూగుల్ తన వ్యాపార అభివృద్ధి కోసం వాడుకుందని కాబట్టి తన కాపీ రైట్ హక్కులను అది ఉల్లంఘించిందని ఒరకిల్ వాదన. ఇలాంటి కార్యకాలాపాలు గూగుల్ కి కొత్త ఏమీ కాదు. ప్రపంచ వ్యాపితంగా ఉన్న కోట్లాది మంది కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ల వినియోగదారుల వ్యక్తిగత వివరాలను యేళ్ళ తరబడి సేకరించి పెట్టుకోవడం వల్లనే గూగుల్ ఈ రోజు అత్యంత విస్తారమైన ఐ.టి సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగింది. కాబట్టి ఒరకిల్ లాంటి కంపెనీలు కాపీ రైట్ ఉల్లంఘన కేసు వేయడంలో ఆశ్చర్యం లేదు.
sir please give your analysis on this article which come across to me in social networking sites, regarding a threat to nuclear security of India.This article was published by sunday guardian and it was shared by subramanya swamy of bjp in facebook,I am attaching the link of the article as well as link of face book post also sir.
http://www.sunday-guardian.com/news/pmo-unconcerned-about-scientist-deaths
https://www.facebook.com/drsubramanianswamy
sir u already mentioned to send the questions to the mail,but i hope it will be useful for the readers of teluguvartalu,com, if you give analysis on this matter soon.