ఉక్రెయిన్: మరో 2 ప్రాంతాలు స్వయం పాలనకు నిర్ణయం


ఉక్రెయిన్ సంక్షోభం కొండవీటి చాంతాడు లాగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో రెండు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు స్వయం పాలన ప్రకటించుకున్నాయి. తాము నిర్వహించిన రిఫరెండంలో ఉక్రెయిన్ నుండి విడిపోయి స్వతంత్రంగా ఉండడానికే ప్రజలు నిర్ణయించారని దోనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల తిరుగుబాటు నేతలు ప్రకటించారు. రిఫరెండంను రష్యా కుట్రగా ఉక్రెయిన్ పాలకులు తిట్టి పోశారు. రిఫరెండంను వాయిదా వేయాలని రష్యా అధ్యక్షుడు కోరినప్పటికీ దానికి తిరుగుబాటుదారులు అంగీకరించలేదు. రిఫరెండం ఫలితాల నేపధ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, ఈ.యులు సమాయత్తం అవుతున్నాయి.

రిఫరెండం ఫలితాలను తాము గౌరవిస్తున్నామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్ లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందిన దోనెత్స్క్ ప్రాంతంలో 90 శాతం మంది ప్రజలు స్వతంత్ర ప్రకటనకు అనుకూలంగా ఓటు వేశారని నిర్వాహకులు ప్రకటించారు. లుహాన్స్క్ ప్రాంత ప్రజలు 96.2 శాతం మంది స్వతంత్ర పాలనకు అనుకూలంగా ఓటు వేశారని స్ధానిక తిరుగుబాటు నేతలు ప్రకటించారు. లుహాన్స్క్, దోనెత్స్క్ ప్రాంతాల తిరుగుబాటుదారులు అనేకమంది బహిరంగంగానే రష్యాలో చేరికకు పిలుపు ఇస్తున్నారు. అయితే ఈ ప్రాంతాలను రష్యాలో కలుపుకునేందుకు రష్యా అధ్యక్షుడు సుముఖంగా లేరని తెలుస్తోంది.

ఉక్రెయిన్ తాత్కాలిక అధ్యక్షుడు ఒలెక్సాండర్ తుర్చినోవ్ తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల రిఫరెండంకు రష్యాను నిందించాడు. తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధ్యక్షుడుగా ఎన్నికయిన విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనల ద్వారా కూలదోసి తాను అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతిని తుర్చినోవ్ అంత సౌకర్యంగా ఎలా విస్మరించగలడో, విస్మరించి రష్యాపై ఎలా ఆరోపణలు చేయగలడో ఆశ్చర్యకరమైన విషయం. పైగా న్యాయబద్ధమైనదిగా తమ ప్రభుత్వానికి తనకు తానే ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. న్యాయబద్ధమైన ప్రభుత్వం అయితే మళ్ళీ ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఎందుకు జరుపుతున్నట్లు?

దోనెత్స్క్, లుహాన్స్క్ ప్రజలు, తిరుగుబాటు కార్యకర్తలు మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారని రాయిటర్స్ తెలిపింది. తమ ప్రాంతాలు ఎన్నడూ ఉక్రెయిన్ లో భాగం కాదనీ, తమ ప్రాంతాలు వాస్తవానికి రష్యాలో భాగంగా ఉన్నాయని వారి నేతలు చెప్పడం గమనార్హం. “మా నేల ఎన్నడూ ఉక్రెయిన్ కాదు… మేము మాట్లేడేది రష్యన్ భాష” అని దోనెత్స్క్ ప్రాంత నగరం స్లావియాన్స్క్ తిరుగుబాటు మేయర్ వ్యాచెస్లావ్ పోనోమర్యోవ్ అన్నారని రాయిటర్స్ తెలిపింది. ఉక్రెయిన్ సైన్యాన్ని త్వరలోనే పారద్రోలతామని ఆయన హెచ్చరించారు.

రష్యాలో కలిసేందుకు మరో రిఫరెండం నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు వ్యాచెస్లావ్ సమాధానం ఇవ్వలేదని వార్తా సంస్ధ తెలిపింది. అయితే అవసరం అయితే అతి తక్కువ వ్యవధిలోనే రిఫరెండంకు పిలుపు ఇచ్చి అమలు చేయగల సామర్ధ్యం తమకు ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. “ఆ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కానీ మేము సిద్ధంగా ఉన్నామని ఈ రిఫరెండం తెలియజేస్తోంది… ఎన్నికలు గానీ లేదా రిఫరెండం గానీ ఏది అవసరం అనుకుంటే అది నిర్వహించడానికి మేము సిద్ధం” అని ఆయన తెలిపారు.

“రష్యన్ ఫెడరేషన్ నాయకత్వం ఈ ప్రక్రియలను (రిఫరెండం) రెచ్చగొడుతోంది. ఇవి దోనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలకు వినాశకరమైనవి. ఆ ప్రాంతాల ఆర్ధిక వ్యవస్ధలకు నష్టకరం. పౌరుల సంక్షేమానికి, జీవితాలకు కూడా ఇవి మంచిది కాదు. ఉక్రెయిన్ ను అస్ధిరపరిచే లక్ష్యంతోనే వీటిని ప్రోత్సహిస్తున్నారు. మే 25న జరగబోయే అద్యక్ష ఎన్నికలను అంతరాయం కలిగించి ఉక్రెయిన్ అధికారాన్ని కూలదోయడానికే ఇవన్నీ చేస్తున్నారు” అని తుర్చినోవ్ జారీ చేసిన ప్రకటన ఆరోపించింది.

రష్యా ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఉక్రెయిన్ ప్రభుత్వం తమ పౌరులపై మిలట్రీ దాడులు చేసి చంపడం మానుకోవాలని హితవు పలికింది. “పౌరులపై బలప్రయోగం చేయడాన్ని, భారీ ఆయుధాలు ప్రయోగించడాన్ని మేము ఖండిస్తున్నాం… దోనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాం. బాధ్యతాయుతమైన నాగరిక పద్ధతిలో తమ రిఫరెండం ఫలితాన్ని అమలు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. హింసకు పాల్పడవద్దని, కేవలం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతున్నాం” అని రష్యా అధ్యక్ష భవనం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

రెండు ప్రాంతాల రిఫరెండంలను చట్ట విరుద్ధంగా యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాయుతంగా కూలదోసినప్పుడు మాత్రం అది ఉక్రెయిన్ ప్రజల ప్రజాస్వామిక చైతన్యంగా ఈ.యు కొనియాడింది. రైట్ సెక్టార్, శ్లోబోడా లాంటి తీవ్రవాద, హింసాత్మక ఆందోళనలు ప్రజాస్వామిక చైతన్యం అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా జరిగిన రిఫరెండంలు చట్ట విరుద్ధం ఎలా అవుతాయో ప్రజాస్వామ్య చాంపియన్లయిన ఈ.యు దేశాలే చెప్పాలి. రష్యాకు చెందిన కొన్ని కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని ఈ.యు తాజాగా ప్రకటించింది. రెండు క్రిమియా కంపెనీలు, 14 మంది క్రిమియా వ్యాపారులు తమ ఆంక్షల జాబితాలో ఉన్నారని తెలిపింది. మే 25 అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలుగజేస్తే గనక, శక్తి వనరులు, ఆర్ధిక సేవలు, ఇంజనీరింగ్ తదితర రంగాలకు కూడా ఆంక్షలు విస్తరిస్తామని ఈ.యు హెచ్చరించింది.

అయితే అమెరికా ఆంక్షల తీవ్రతతో పోల్చితే ఈ.యు ఎంతో వెనుకబడి ఉండని రాయిటర్స్ వార్తా సంస్ధ బాధపడింది. రష్యాపై వాణిజ్య ఆంక్షలు విధిస్తే తమకే నష్టం అని కొన్ని ఈ.యు దేశాలు భావిస్తున్నాయని వాపోయింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బైటికి వస్తున్నామని భావిస్తుండగా సదరు రికవరీని రష్యాపై విధించే ఆంక్షలు దెబ్బ తీస్తాయనడంలో సందేహం లేదు. ఆంక్షలకు రష్యా తీవ్రంగా ప్రతిస్పందిస్తే గనుక ఈ.యు దేశాలపై ప్రభావం కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s