ప్రశ్న (ఎ.మనోహర్):
మన దేశంలో డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపలేమా?
సమాధానం:
ఇది చాలామందిని వేధించే ప్రశ్న. ఎన్నికలు నీతివంతంగా జరిగితే ఆ వచ్చే నాయకులు నీతివంతంగా ఉంటారన్న ఆశ ఈ ప్రశ్నలో ఇమిడి ఉంటుంది. లోక్ సత్తా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ లాంటి నాయకులు సైతం ఎన్నికల్లో సరైన అభ్యర్ధులను ఎన్నుకుంటే దేశం దానంతట అదే బాగుపడుతుందని ప్రబోధిస్తున్నారు. కానీ అది నిజమేనా?
చెట్టు ముందా, విత్తు ముందా అని ప్రశ్నిస్తే ఏమిటి సమాధానం? కోడి ముందా, గుడ్డు ముందా అని అడిగితే సంతృప్తికరమైన సమాధానం ఉంటుందా? కోడి పెట్టనిదే గుడ్డు లేదు, గుడ్డు పొదగనిదే కోడి లేదు. అలాగే చెట్టు కాయనిదే విత్తు లేదు, విత్తు మొలవనిదే చెట్టు లేదు. కాబట్టి ఏది ముందు అన్నది ఎడతెగని తాత్విక ప్రశ్నగా మనముందు నిలబడినట్లు కనిపిస్తుంది.
ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే ఫిలాసఫీలోకి వెళ్లవలసి ఉంటుంది. తత్వ శాస్త్రం లోకి ప్రవేశించినా కూడా వచ్చేది ‘ఫలానాది ముందు’ అని తేల్చగల సమాధానం కాదు. అసలా ప్రశ్నే అసంగతం అని తాత్విక చర్చ తేల్చేస్తుంది. జీవ పరిణామం అనేది ఒక క్రమ పద్ధతిలో అనేక వందల వేల యేళ్ళ తరబడి సాగినదే తప్ప ఎక్కడికక్కడ ప్రశ్న, సమాధానం ఇచ్చుకోగల రీతిలో జరిగినది కాదు.
‘Survival of the fittest’ సూత్రం ప్రాతిపదికన జరిగిన ఈ పరిణామంలో జీవ పదార్ధం అమీబా దశ నుండి నేటి మానవుడి వరకూ రూపం మార్చుకుంటూ వచ్చింది. ఈ పరిణామంలో కోడి, గుడ్డులలో ఏది ముందు అని వెతుక్కోవడం అంటే జీవ పరిణామ క్రమాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదనే అర్ధం.
ఉదాహరణకి మనిషి ఎలా ఉద్భవించాడు? జీవ పరిణామ క్రమంలో వివిధ రకాల కోతి జాతులు ఉద్భవించాయి. వాటిలో హోమో సెపియన్ జాతి ఒకటి. హోమో సెపియన్ జాతే క్రమంగా మానవ జాతిగా ఉద్భవించింది. ఇతర కోతి జాతులు ఆయా కోతి జాతులుగా కొనసాగాయే తప్ప మానవుడిగా మారలేదు. ఎందుకంటే అందుకు తగిన జీవ పునాది ఆ జాతుల్లో లేదు కనుక.
అలాగే పక్షి, చెట్టు జాతులు! జీవ పరిణామ క్రమంలో ఒకానొక దశలో పరిణామం (evolution) ద్వారా అవి ఉనికిలోకి వచ్చాయి తప్ప ఒకరు కంటే మరొకరు పుట్టడమో లేదా ఒకరు ‘హామ్, ఫట్!’ అని ఊహించుకుని సృష్టిస్తేనో అవి ఉనికిలోకి రాలేదు. కాబట్టి కోడి ముందా, గుడ్డు ముందా అన్న ప్రశ్నే అర్ధం లేనిదని తేలుతుంది.
ఇదే పద్ధతిలో ‘డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపలేమా’ అన్న ప్రశ్నను పరిశీలిస్తే ఆ ప్రశ్నకు దారి తీసిన పరిస్ధితులను మనం సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నామన్న కంక్లూజన్ కు రావలసి ఉంటుంది. ఎందుకంటే, ఈ ప్రశ్నలు, సమాధానాలను పరిశీలించండి.
డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపవలసిన బాధ్యత, అధికారం ఎవరికి ఉంది?
ఎలక్షన్ కమిషన్ కు ఉంది.
ఆ ఎలక్షన్ కమిషన్ అధికారులను ఎవరు నియమిస్తారు?
ప్రభుత్వం నియమిస్తుంది.
ప్రభుత్వం నిర్వహించేది ఎవరు?
ఎన్నికల్లో గెలిచిన పార్టీ లేదా పార్టీల కూటమి.
ఆ పార్టీ లేదా పార్టీల కూటమి ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నాయి?
డబ్బు, మద్యం లాంటి అనేక ప్రలోభాల ద్వారా.
మరి డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపలేమా?
అసలు డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపవలసిన బాధ్యత, అధికారం ఎవరికి ఉంది?
ఇలా మనం మళ్ళీ మొదటికే వచ్చేశాం. ఇదొక వలయం. నిజం చెప్పాలంటే మాయా వలయం. సుడి గుండంలో చిక్కుకున్న వాడు ఆ సుడి వెంటే తిరుగుతూ లోపలికి కూరుకుపోతాడు తప్ప తనంత తానుగా బైటికి రాలేడు. బైటి నుండి ఎవరన్నా చేయో, తాడో అందిస్తే తప్ప అతనికి విముక్తి ఉండదు.
ఆ విధంగా చివరికి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే మనం వేసుకుంటున్న ప్రశ్న మనల్ని మనకే తెలియని ఒక సుడిగుండంలోకి తోసివేస్తోంది. అనగా ఆ ప్రశ్నలోనే ఏదో లోపం ఉంది. ఆ లోపం ఏమిటో పట్టుకోవాలి. ఆ లోపాన్ని పట్టుకుని మన ప్రశ్నని సవరించుకుని సమాధానం కోసం ప్రయత్నిస్తే తప్ప ఈ మాయా వలయం నుండి మనం బైటికి రాలేము.
అసలు ప్రశ్న ఎలా ఉండాలి అన్న చర్చలోకి వెళ్ళేలోపు ముందుగా మనం ఒక నిర్ణయానికి రావాలి. గత అరవై ఆరు సంవత్సరాల స్వతంత్ర గణతంత్ర ప్రాతినిధ్య ప్రజాస్వామ్య భారతంలో ఎటువంటి ప్రలోభాలు లేకుండా కేవలం రాజనీతి, ప్రజలకు అధికారం అప్పజెప్పడం, ప్రాధమిక హక్కుల కల్పన, ప్రజల నిజమైన అభివృద్ధి అన్న సూత్రాల ప్రాతిపదికన ఎన్నడన్నా ఎన్నికలు జరిగాయా? లేదు అన్నదే సమాధానం.
గతంలో బూర్జువా నీతి అయినా ఉండేది అని పెద్దలు చెబుతుంటారు తప్ప నీతి ఉండేది అని ఎవరూ చెప్పరు. బూర్జువా నీతి అంటే యుద్ధ నీతి లాంటిది. కొన్ని పద్ధతులు పాటిస్తూ యుద్ధం చేయడం యుద్ధ నీతి. అసలు యుద్ధమే సామ్రాజ్యాల ఆధిపత్యం కోసం జరిగేవి అయినప్పుడు ఆ యుద్ధమే ఒక అనీతి. సదరు యుద్ధాల ఫలితం ఎల్లప్పుడూ ఏదో ఒక సామ్రాజ్యాధీశునికి లాభం చేకూర్చుతుందే తప్ప జనానికి ఎలాంటి లాభమూ ఉండదు. అలాంటి యుద్ధంలో నీతి వెతకడం ఎలాంటిదో బూర్జువా నీతిలో ప్రజానుకూల నీతి వెతకడం అలాంటిది. బూర్జువా నీతి ఏదో ఒక బూర్జువా గుంపుకు లాభం చేకూర్చుతుంది తప్ప జనానికి కాదు.
అలాగే గతంలో ఒక పద్ధతిగా ఎన్నికలు జరిగేవి అని ఎవరన్నా చెబితే అవి బూర్జువా నీతికి లోబడి జరిగినవే తప్ప ప్రజా నీతికి లోబడి జరిగినవి కాదు. అనగా ప్రజలకు అచ్చంగా (absolute) మేలు చేసే ఎన్నికలు ఈ దేశంలోనే కాదు, మరే దేశంలోనూ జరగలేదు, జరగవు కూడా.
ఎందుకని? ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడానికి అనడమే ఒక మోసం. ఎన్నికల గురించి మన చట్టాల్లోనూ, రాజ్యాంగంలోనూ రాసుకున్నవి ఏవీ అమలులో లేవు. ఎవన్నా అమలులో ఉంటే అవన్నీ ధనిక వర్గాలకు మేలు చేసేవే తప్ప ప్రజలకు మేలు చేసేవి కావు. గత సమాజాలైన భూస్వామ్య, రాచరిక సమాజాలలో ఎవరైతే రాజ్యాలు ఏలేరో, ఎవరైతే భూముల్ని తమ గుత్త స్వామ్యంలో ఉంచుకున్నారో వారే నేడు ఎన్నికల వ్యవస్ధను నిర్వహించే నాయకులు. గతంలో వారిని రాజులు, సేనాధిపతులు, ఆస్ధాన పండితులు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు… ఇత్యాది పేర్లతో పిలిచాము. ఇప్పుడు వారిని ఎం.ఎల్.ఏ, ఎం.ఎల్.సి, ఎం.పి, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్, మేయర్… ఇత్యాది పేర్లతో పిలుస్తున్నాము. పేర్లు మారాయి, రూపాలు మారాయి, కానీ పెత్తనమూ, దోపిడీలు అలాగే కొనసాగుతున్నాయి.
గతంలో ఎన్నికలు అనే నాటకం లేకుండా అచ్చమైన పెత్తనం చెలాయిస్తే ఇప్పుడు ఎన్నికల నాటకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఒక్క నాటకమే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న భ్రమల్ని కలుగజేస్తోంది. ఈ ఎన్నికల నాటకంలో నిలబడగలిగేది ఎవరు? ఎవరన్నా ఆసక్తి ఉన్న ఒక కింది తరగతి వ్యక్తి చదువుకుని, విజ్ఞానం సంపాదించి ఎన్నికల్లో పోటీ చేయాలంటే చేయగలడా? ఎన్నాకల్లో పోటీకి ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బు ధనికుల వద్ద పేరుకుపోయి ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ధనిక స్పాన్సరర్లను వెతుక్కోవాలి. అనగా కార్పొరేట్ కంపెనీలనో, వ్యాపార వర్గాలనో మద్దతు పెట్టుకుని వారి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలి. అలా గెలిచాక ఆ వ్యక్తి తనను స్పాన్సర్ చేసిన ధనిక వర్గాల ప్రయోజనాలకు భిన్నంగా, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించగలడా?
ఒకవేళ ఒకరూ ఇద్దరూ పొరబాటున గెలిస్తే ఏమవుతుందో ఢిల్లీ ఎన్నికలు చూపాయి. కేవలం అంబానీ విద్యుత్ పంపిణీ కంపెనీ పైనా, చమురు కంపెనీ పైనా విచారణకు ఆదేశించినందుకే కాంగ్రెస్, బి.జె.పి లు కుమ్మక్కై ఎఎపి ప్రభుత్వాన్ని కూలదోసాయి. ఎఎపి రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇదే జరుగుతుంది. అసలు ఎఎపి పార్టీయే ఢిల్లీలో కొద్ది రోజులు పని చేసినట్లుగా ఐదేళ్లు పని చేయగలదా అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే ఆ పార్టీకి నిధులు ఇస్తున్నది కూడా కార్పొరేట్ కంపెనీలే. తాము ఆశ్రిత పెట్టుబడికి వ్యతిరేకమే గానీ పెట్టుబడికి వ్యతిరేకం కాదని స్వయంగా అరవింద్ కేజ్రీవాలే ప్రకటించిన సంగతి మరువరాదు.
కాబట్టి మనం చూస్తున్న ఈ సో కాల్డ్ ప్రజాస్వామిక ఎన్నికల్లో నిజానికి ప్రజాస్వామ్యం లేనే లేదు. మొన్న సల్మాన్ రష్దీ ప్రకటించినట్లుగా ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేళ్ల కోసారి జరిగే ఎన్నికలు కాదు. ప్రజల్లో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రాధమిక హక్కు నిజంగా ఆచరణలోకి వస్తేనే ప్రజాస్వామ్యం. అలాగే దేశంలోని ప్రతి ఒక్క సహజ సంపదా ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకునేలా అందుబాటులోకి రావడమే నిజమైన ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఈ ఎన్నికలు ఇవ్వలేవు.
ఈ ఎన్నికల వల్ల రాచరిక, భూస్వామ్య వ్యవస్ధలలో లేని స్వేచ్ఛ ఒకటి వచ్చిందన్నది నిజమే. గతంలో ఒక రాజవంశమే, ఒక జమీందారీ వంశమే పెత్తనం చేసేది. ఇప్పుడు జనానికి సదరు రాజుల్ని మార్చుకునే స్వేచ్ఛ వచ్చింది తప్ప అసలు రాజులే కేకుండా చేసుకోగల స్వేచ్చ రాలేదు. అనగా ఒక రెడ్డి రాజుగారు ఓడిపోతే మరో చౌదరి రాజుగారు పెత్తనంలోకి వస్తారు. చౌదరి, రెడ్డి రాజులు కాకపోతే మరో దళిత రాజుగారు (ఉత్తర ప్రదేశ్) పరిపాలన చేస్తారు. ఎన్నిసార్లు ఎన్నికలు జరిపినా ఆ ధనికుల పెత్తనానికే. ప్రజలు తమపైన తామే పెత్తనం చేయగల అవకాశం ఈ ఎన్నికల వ్యవస్ధలో లేదు.
కాబట్టి డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ఎన్నికల్లో పోటీ చేసేవారికి కాస్త డబ్బు ఖర్చు తప్పుతుందే గానీ గెలిచేది ఆ ధనిక వర్గాలే. ప్రజాసేవ చేస్తానంటూ ఎవరన్నా నీతిమంతులు బయలుదేరితే వారిని నిరుత్సాహపరిచి ఎక్కడికక్కడ నలగ్గొట్టే పరిస్ధితులను, వ్యవస్ధలను ధనిక వర్గాలు నిర్మించి పెట్టుకున్నాయి. నీతిమంతులు ఎన్నికల్లో నెగ్గితే ఆ వ్యవస్ధలు చూస్తూ ఊరుకోవు.
అందుకే రాజ్యం అనే పద ప్రయోగాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వం అంటే కేవలం పార్లమెంటు, అసెంబ్లీలు. కానీ ఇవి రాజ్యంలో ఒక భాగం మాత్రమే. సైన్యం, పోలీసులు, పారామిలట్రీ బలగాలు, బ్యూరోక్రసీ, కోర్టులు, పార్లమెంటు, అసెంబ్లీలు, ధనిక పత్రికలు ఇవన్నీ కలిపి రాజ్యం అవుతుంది.
ఈ రాజ్యాన్ని ఆధీనంలో పెట్టుకున్న వర్గాలు రాజ్యంలోని ఒక అంగం అయిన పార్లమెంటు, అసెంబ్లీలలో కొద్దిమంది నీతిమంతులు ప్రవేశిస్తే చూస్తూ ఊరుకోవు. ఏవైనా జరగొచ్చు. నీతిమంతుల ఇంట్లోనే హఠాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు దొరుకుతాయి. ఆ డబ్బు వారే అక్రమంగా సంపాదించారనేందుకు తగిన రికార్డులు కూడా మరో చోట దొరుకుతాయి. మన శిక్షాస్మృతిలో ఎన్ని నేరాలు లేవు? ఆ నేరాలలో ఎ ఒక్క నేరంలోనైనా వారు దొరికిపోవచ్చు.
ఏ నేరమూ బనాయించడం కుదరకపోతే ఏకంగా వ్యక్తే అదృశ్యం కావచ్చు. వెనిజులాలో జరిగింది అదే కదా! చమురు సంపదలో అతి కొద్దిభాగం కార్మికవర్గానికి తరలించినందుకే వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావేజ్ కేన్సర్ జబ్బుతో మరణించాడు. కాస్త ఆత్మగౌరవం ప్రకటించుకున్న పనామా, నికరాగువా, గ్రెనడా, జింబాబ్వే, కంపూచియా, లిబియా, సిరియా, ఇరాన్ లపై సాగిన, సాగుతున్న అంతర్జాతీయ కుట్రలను మనం మరువరాదు. ప్రపంచీకరణ యుగంలో అంతర్జాతీయ సంబంధాలను అసలే విస్మరించలేము.
కాబట్టి మనకు కావలసింది డబ్బు, మద్యం లేని ఎన్నికలు కాదు. సమాజంలోని సంపదలన్నీ ప్రజలపరం చేసే సమ సమాజ వ్యవస్ధ మనకు కావాలి. ఆ వ్యవస్ధ ఎలా వస్తుంది అన్నది వేరే చర్చ.
డబ్బులు పంచడానికి మా ఇంటికి ఎవరూ రాలేదు. నెలకి 60 వేలు సంపాదించే బ్యాంక్ ఉద్యోగిని 500 రూపాయల కోసం వోత్ వెయ్యదు కాబట్టి మా లాంటివాళ్ళ ఇళ్ళకి డబ్బులు పంచేవాళ్ళు రారు. మా పని మనిషి ఇంటికి మాత్రం మూడు పార్తీలవాళ్ళూ వచ్చారు.
లాభం వున్నప్పుడే పొటీ వుంటుంది. ప్రక్రుతి వనరులపైన , పన్నులద్వరా సమకురే నగదుపైనా ,ఆదిపత్యం తద్వరా వనరులనూ, కాంట్రాక్టు ద్వారా ధనాన్ని వీటి పంపకాలపైన భారీ పొటీ వున్నప్పుడు అనిర్వారియంగా ఆ లాభాలకై డబ్బు వెచ్చించటం తప్పనిసరి.కొడి ముందా గుడ్డు ముందా అలేది ప్రక్రుతికి సంభంధించింది ఎన్నికల్లొ డబ్బు పంచటమనేది సామాజిక విషయానికిసంభంధించింది కాబట్టి రొండింటినీ ఒక గాటిన కట్టడం సరైంది కాదు.
అవును. యాంత్రికంగా అన్వయించడం సరైంది కాదు. తాత్వికంగా అన్వయించడం సరైందే.
A railway TTE may not get attracted to Rs 500 bribed by a passenger. But it doesn’t prove that the TTE is a revolutionary. He may not be aware about class society and the value of labor etc. He is aware only about the duty that is directed by his employer.
విశేఖర్ గారు. ప్రజాస్వామ్యం లోతుపాతులు, లోటుపాట్లు చాలా చక్కగా వివరించారు. గొంగట్లో అన్నం తింటూ…వెంట్రుకలు ఏరుకున్నట్లు….ధనికులు, పెట్టుబడి దారులు నడిపిస్తున్న వ్యవ్యస్థలో వారి ప్రయోజనాలు కాకుండా సామాన్యుల ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయి. ?
మన ప్రజాస్వామ్య్ లొ తక్కువ ఓట్లు వచ్చిన వారు గేలవటం ప్రజాస్వామయం ,డబ్బు ఇవ్వకపొతె ఓటు వెయము అనటం,డబ్బును జూదం లొ బదులు ఎన్నికలలొ పెట్టం, ఇలా ఎన్నొ చెప్పవచ్చు