2వేల ఆఫ్ఘన్లను సమాధి చేసిన రాక్షస భూపాతం -ఫోటోలు


నీళ్ళు ఎత్తైన ప్రదేశం నుండి కిందకు జారిపడితే జలపాతం. ఏకంగా భూమే ఎత్తైన చోటి నుండి జారిపడితే! భూపాతం?

గాంధార దేశంలో ఈశాన్య మూలన ఎత్తైన కొండ వాలుల్లో నివసించే గ్రామాల్లో ఓ చిన్న గ్రామాన్ని అలాంటి భూపాతం తాకింది. కొండ వాలులు తప్ప నివశించడానికి మరో చోటే లేని ఈ ప్రాంతంపై కొండ చరియలు విరిగి పడడం, ప్రాణ నష్టం సంభవించడం కొత్త కాదు. కానీ ఈసారి జరిగిన దుర్ఘటనలో 2,000 మందికి పైగా మరణించారని అంచనా వేస్తుండడంతో ప్రపంచం నివ్వెరపోయింది.

ఈ పెను విపత్తు ఆఫ్ఘనిస్ధాన్ ఈశాన్య రాష్ట్రం బాదక్షాన్ రాష్ట్రంలో సంభవించింది. ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్య 500 వరకూ ఉన్నప్పటికీ వాస్తవంగా 2,000 మందికి పైగానే మరణించారని సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్న వివిధ పశ్చిమ దేశాల ఛారిటీ సంస్ధలు చెబుతున్నాయి.

ప్రమాద స్ధాయి ఎంత తీవ్రంగా ఉందంటే గల్లంతయినవారి కోసం వెతుకులాటను ప్రభుత్వం నిలిపివేసింది. కొండ చరియ విరిగిపడి తనలో కలిపేసుకున్న గ్రామ భాగాన్ని సమాధిగా ప్రకటించేశారు. మట్టి మిద్దెలుగా పేర్కొనదగిన ఇళ్లపైన భారీగా మట్టి పేరుకుపోవడంతో గల్లంతయినవారి ఆచూకీ కోసం ఆ మట్టిని తవ్వి తీయడం వృధాగా భావిస్తున్నారు.

యంత్ర భూతాలు పూనుకుని భారీ యెత్తున తవ్వకాలు జరిపితేగానీ కప్పబడిపోయిన వారిని చేరుకోలేని పరిస్ధితి. కానీ యంత్రాలు అంత తేలికగా వెళ్లగల ప్రాంతం కాదది. అక్కడక్కడా కనిపిస్తున్న పచ్చదనం తప్ప గ్రామాలు, ఇళ్ళు కూడా కొండల్లో కలిసిపోయినట్లు కనిపిస్తున్న ఈ ప్రాంతానికి యంత్రాలు చేరే మార్గం లేదు. పైగా విస్తారమైన మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న దేశమూ కాదాయే.

భౌగోళిక రాజకీయాలలో ఆధిపత్యం సంపాదించడానికి అనువైన వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడం తప్ప ఆఫ్ఘన్ దేశానికి మరో గుర్తింపు లేదు. అక్కడి మనుషులు ఎవరికీ అక్కరలేదు. అనేకానేక రాజ్యాధిపతులు, సామ్రాజ్యాధినేతల నిరంతర దాడులతో ఇప్పటికీ సతమతం అవుతున్న ఆఫ్ఘన్లను తాలిబాన్, లాడెన్ లుగా తప్ప సాధారణ ప్రజానీకంగా గుర్తించడానికి వీలు లేకుండా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు చిమ్మిన విషప్రచార మేఘాలు ఆ దేశాన్ని కమ్మేసాయి. దానితో ఆ ప్రజల బాగోగులు ఎవరికీ కాకుండా పోయాయి.

బ్రిటిష్ పత్రిక మిర్రర్ ప్రకారం సగం గ్రామం కొండ చరియలు విరిగిపడిన మట్టి కింద సమాధి అయింది. అత్యంత భారీ మొత్తంలో కొండ చరియ జారి గ్రామాన్ని కప్పేసిందని ఉత్తర ఆఫ్ఘనిస్ధాన్ యునిసెఫ్ (ఐరాస సంస్ధ) విభాగం అధిపతి ఆండ్రూ మోరిస్ చెప్పారు. అనధికారిక అంచనాల ప్రకారం మరణాల సంఖ్య 2,700కు పైనే.

మే 2 తేదీన మధ్యాహ్నం మొదటిసారి విరిగిపడిన కొండ చరియ ఆర్గో జిల్లాలోని అబీ బారిక్ గ్రామంలో 300 ఇళ్లను నేలమట్టం చేసింది. ప్రమాదానికి గురయిన వారిని రక్షించడానికి ఇతర గ్రామస్ధులు పరుగు పరుగున వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఇళ్లను కప్పేసిన మట్టిని తవ్వి తీస్తూ సహాయక చర్యల్లో వారు మునిగిపోయారు. అంతలోనే మరో కొండచరియ విరిగిపడడంతో రక్షిణ ఇవ్వడానికి వచ్చినవారు కూడా ఉత్పాతానికి బలైపోయారు. గ్రామంలో మూడో వంతు భాగం పూర్తిగా అదృశ్యం అయిపోయిందని మిర్రర్ తెలిపింది.

భారీ వర్షాలు ఈ పెను దుర్ఘటనకు కారణం అని పత్రికలు తెలిపాయి. మట్టితో పాటు కొండరాళ్ళు కూడా దొర్లుకుంటూ వచ్చి గ్రామాలను నాశనం చేశాయని, ఆ పైన మరింత మట్టి, మరింత మట్టి విరిగి పడిందని ఆఫ్ఘన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొండచరియాల్లోని మట్టి, రాళ్ళు నీళ్ళతో కలిసి ఉధృతంగా గ్రామాన్ని ముంచెత్తడంతో 300 ఇళ్ళ వరకూ నామరూపాలు లేకుండా కొట్టుకుపోవడమో, కప్పబడిపోవడమో జరిగిందని స్ధానిక ప్రాంతీయ గవర్నన్ షా వలీయుల్లా అదీబ్ చెప్పారు. అయితే వాస్తవంగా ప్రమాదానికి గురయిన ఇళ్ల సంఖ్య 1000కి పైనే ఉంటుందని ఇతర పత్రికలు తెలిపాయి.

బాదక్షాన్ రాష్ట్రం హిందూ కుష్ మరియు పామీర్ పర్వత శ్రేణుల వెంట ఉండే రాష్ట్రం. ఆఫ్ఘనిస్ధాన్ లో అత్యంత మారు మూల ప్రాంతంలో ఎటువంటి మౌలిక సౌకర్యాలకు నోచుకోకుండా దేశం నుండి పూర్తిగా వేరుగా విసిరివేసినట్లు ఉండే రాష్ట్రం. ఈ పరిస్ధితుల్లో పూడ్చబడిన గ్రామాన్ని సమాధిగా ప్రకటించడం తప్ప అధికారులకు మరో మార్గం లేకుండా పోయింది. తజికిస్ధాన్, చైనాల సరిహద్దులో ఉండే ఈ రాష్ట్రంలో తాలిబాన్ తదితర తిరుగుబాటు సంస్ధల ఉనికి సైతం తక్కువే అని తెలుస్తోంది.

శవాలను వెలికి తీసే పనికి స్వస్తి పలికిన ఆఫ్ఘన్ ప్రభుత్వం, వివిధ అంతర్జాతీయ ఏజన్సీలు బతికి బైటపడినవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అధికారుల ప్రకటనలు చెబుతున్నాయి. కానీ అనేకమందికి ఇంకా సాయం అందలేదని, ప్రభుత్వ సాయం ఎలాగూ అందదని తెలుసు గనక సమీప గ్రామాల్లో బంధువులు, స్నేహితుల ఇళ్ళలో వారు తలదాచుకుంటున్నారని కొన్ని పత్రికలు (ది అట్లాంటిక్ మొ.) తెలిపాయి.

ది అట్లాంటిక్, మిర్రర్ పత్రికలు ఈ ఫోటోలను అందించాయి.

3 thoughts on “2వేల ఆఫ్ఘన్లను సమాధి చేసిన రాక్షస భూపాతం -ఫోటోలు

  1. మీ కథనం యొక్క శీర్శిక “2వేల ఆఫ్ఘన్లను సమాధి చేసిన రాక్షస భూపాతం -ఫోటోలు”
    అయ్యా, తెలుగులో కొన్ని పలుకుబడులు ఉన్నాయి. దయచేసి వాటిని గౌరవించండి. అవసరమైతే ప్రయత్నించి ఐనా వాటిని తెలుసుకొని మరీ వాడండి. ఇక్కడ “2వేల మంది ….” అని వ్రాస్తే సరిగా ఉంటుంది. పత్రికలభాష రానురానూ తెలుగు యొక్క సహజత్వాన్ని మరిచిపోతోంది! ఇది మంచిది కాదు. ఎలక్ట్రానిక్ మీడియాలో స్కోలింగ్ పరిభాష కూడా ఇలా అపభ్రంశరూపాలతో నిండితోంది. పిల్లలు ఇవిచూసి ఇదే సరైన విధానం, ఈ తెలుగుభాషలో ఇలాగే వ్రాయాలీ ముందుముందు భాషకు మరింత దుర్గత్ పడుతుంది. ఈ రోజుల్లో ఎవరూ ఎవరికీ చెప్పగలవారు కాదని తెలిసీ ఏదో నా అవేదన కొద్దీ ఇలా చెబుతున్నాను. అధికప్రసంగం చేసాననుకుంటే మన్నించండి.

  2. శ్యామలరావు గారు, మీరు చెప్పింది నిజమే. శీర్షిక పొడవు తగ్గిద్దామని అలా రాశాను. కింద విషయంలో మీరు చెప్పినట్లే రాశాను.

    ఇంతకీ ‘భూపాతం’ అనడం సరైందేనంటారా? నాకు తెలియకుండానే ఆ పదం వాడాను. అందుకే వివరణ ఇచ్చాను. మీరు ఎంచకపోవడాన్ని బట్టి అలా రాయడంలో తప్పులేదని చెప్పినట్లే అనుకుంటున్నాను.

  3. ఈనాడు దినపత్రికలో తెలుగువాడుకను ఖూనీ చేస్తున్నారు. ప్రజల వాడుకలో లేని వాడుకభాష అదేం వాడుకభాషో అర్థం కాదు. ఈరోజు మెయిన్ ఎడిషన్లో ఒక వార్తాశీర్షికలో పెద్దపెద్ద అక్షరాలలో “….ఆశలంతా” అని ప్రయోగించారు. ఆశ అనే మాట ఏకవచనంలో ఉన్నప్పుడు “ఆశ అంతా = ఆశంతా” అనొచ్చు. కానీ అదే నపుంసక లింగ పదం బహువచనంలోకొచ్చాక మనవాళ్ళు “ఆశలన్నీ” అంటారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ సబ్-ఎడిటర్ కే తెలీదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s