ఓటమి: ఎన్నికల ముందు కాంగ్రెస్, ఫలితాల ముందు బి.జె.పి


Modi & Sha

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి వదిలేసిందని వివిధ పత్రికలు, ఛానెళ్లు తమ తమ విశ్లేషణల్లో పేర్కొన్నాయి. నరేంద్ర మోడి, అమిత్ షా లు చేసిన తాజా ప్రకటనలతో ఫలితాలకు ముందే బి.జె.పి తన ఓటమిని అంగీకరిస్తోందని ఇప్పుడు పత్రికలు, ఛానెళ్లు విశ్లేషిస్తున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ప్రచారం మొదలయిందో లేదో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 7 రేస్ కోర్స్ రోడ్ నుండి కృష్ణ మీనన్ రోడ్ కు తన నివాసాన్ని మార్చేసుకున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తన ఓటమిని అంగీకరించిందనడానికి ఇది సూచన అని బి.జె.పి ప్రచారం చేసుకుంది.

మన్మోహన్ సింగ్ వీడ్కోలు ప్రసంగాన్ని సైతం ప్రధాన మంత్రి కార్యాలయం సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. తాను మూడోసారి ప్రధాన మంత్రిగా ఉండబోనని మన్మోహన్ సింగ్ చెప్పారని అందుకే ఆయన ఖాళీ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ ఓటమిని అంగీకరించి కాదని ఆ పార్టీ నేతలు వివరణ ఇస్తున్నారు, అది వేరే సంగతి.

కానీ ఆ పార్టీ నేతలు ప్రచారంలో తీవ్రంగా వెనుకబడి పోవడం, హోర్డింగ్ లు, బోర్డ్ లు తదితర భారీ ప్రచార సామాగ్రిని నెలకొల్పడంలో కూడా వెనకబడిపోవడం బట్టి కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందే సగం ఓటమిని అంగీకరించారని భావించడానికి బలం చేకూరింది. పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెట్టలేని ఖర్చు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బి.జె.పి విపరీతంగా పెట్టడం కూడా పరిశీలకులను ఆశర్యపరిచిన అంశం.

రెండు విడతల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సహజంగానే విముఖత ఏర్పడడం ఒక వాస్తవం. దానితో పాటు అధికార పార్టీ అభ్యర్ధులు తమకు అందిన నిధులను ఎన్నికల ప్రచారం కోసం వెచ్చించడానికి బదులు ‘ఎలాగూ ఓడిపోతాం గదా’ అన్న ఆలోచనతో ఆ డబ్బును వెనకేసుకున్నారని అందుకే ఆ పార్టీ నుండి ప్రచార పటాటోపం కరువయిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

ఇక జై రామ్ రమేష్ లాంటి నాయకులు ప్రచార రంగంలోకి దూకి కత్తి ఝళిపించడానికి బదులు అలంకార ప్రాయమైన సాంకేతిక విశ్లేషణలతోనూ, సిద్ధాంత రాద్ధాంతాల చర్చోపచర్చలతోనూ పొద్దు పుచ్చారనీ, జాతీయ స్ధాయి రాజకీయాలకు కొత్త అయిన రాహుల్ గాంధీ ఒంటి చేత్తో ప్రచారం నిర్వహించలేక చతికిల పడ్డారని, అసలు ఆయనే ఎన్నికలకు సిద్ధపడలేదని విమర్శిస్తున్నవారు లేకపోలేదు.

ఇక ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని గానే ప్రభావం చూపలేకపోయారు. ప్రచారం చేసి ఏం ప్రభావం చూపగలరు? పైగా అత్యంత అవినీతిమయ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన చేష్టలుడిగిన చవట ప్రధానిగా అంతర్జాతీయంగానూ అపకీర్తిని ఆయన మూటగట్టుకున్నారాయే!

కాంగ్రెస్ మిత్రులు శరద్ పవార్ అయితే చాటు మాటుగా మోడి/బి.జె.పి తో సంధికి ప్రయత్నించి విఫలం అయ్యారు. కాస్తో కూస్తో మోడిని గట్టిగా విమర్శించి నిలబడింది బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులే. బీహార్ లాంటి చోట్ల లాలూ లాంటి మిత్రుడిని మిగుల్చుకున్నా లోక్ జన శక్తి (పాశ్వాన్) ను కోల్పోయింది.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల సంగతి చెప్పేదేముంది? సమైక్యాంధ్ర పేరుతో కాంగ్రెస్ నుండి వేరుపడి ఒకటి రెండు సీట్లయినా కాచుకుంటారని ఆశించిన కిరణ్ కుమార్ అసలు ఎన్నికల్లోనే నిలబడలేదు. నిలబడ్డావారేమో చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకుని టి.డి.పి-బి.జె.పి కి జై కొట్టేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా సొమ్ము చేసుకోలేని పరిస్ధితి.

ఇన్ని కారణాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిందని విశ్లేషకుల అభిప్రాయం.

కానీ మొదటి నుండీ దూకుడుగా ఉన్న బి.జె.పి చివరి దశ ఎన్నికలు ఇంకా మిగిలి ఉండగానే కొత్త పార్టీలకు కూటమిలో చోటు ఉండని ప్రకటించడంతో ఆ పార్టీకి కూడా అట్టే ఆశలు మిగల్లేదని పరిశీలకుల అంచనా! ఉందనుకున్న మోడి గాలి ఉందో లేదో కూడా తెలియకపోవడం, అద్వానీ-సుష్మా-జోషి లాంటి హేమా హేమీల సహాయ నిరాకరణ బి.జె.పి గాలిని తుస్సుమునిపిస్తాయా అన్న అనుమానాన్ని మిగిల్చాయి.

లేకపోతే కొత్త పార్టీలు వచ్చి చేరడానికి ఎన్.డి.ఏ కూటమి తలుపులు తెరిచే ఉన్నాయంటూ స్వయంగా గాలి సృష్టి కర్త నరేంద్ర మోడీ యే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం ఎలా అర్ధం చేసుకోవాలి? ఆయన ఒక్కరే కాదు. మోడి అనుంగు సహచర నేత, అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో ప్రచార సారధ్య బాధ్యతలను నెత్తిన వేసుకున్న అమిత్ షా సైతం ఇవే మాటలు చెప్పి ఆశ్చర్యపరిచారు.

‘రాజకీయ అస్పృశ్యత’పై బి.జె.పి కి నమ్మకం లేదని అమిత్ షా అట్టహాసంగా ప్రకటించి యు.పి.ఏ-III, ధర్డ్/ఫెడరల్ ఫ్రంట్ ఆశలను సజీవం చేశారు. “ఈ దేశం అభివృద్ధి కోసం కట్టుబడిన పార్టీలు మద్దతు ఇవ్వదలుచుకుంటే అన్ని పార్టీలకూ ఎన్.డి.ఏ తలుపులు తెరిచే ఉన్నాయి” అని ఆయన మోడి ఇంటర్వ్యూను తన మాటల్లో కొనసాగించారు.

“బి.ఎస్.పి తో కలిసి మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు, తృణమూల్, ఏ.ఐ.ఏ.డి.ఏం.కె పార్టీలేమో ఒకప్పటి ఎన్.డి.ఏ భాగస్వామ్య పార్టీలేనాయే కాబట్టి మీరు ఆ మూడు పార్టీల మద్దతు ఎందుకు తీసుకోరు?” అని ఒక టి.వి చానెల్ చేసిన ఇంటర్వ్యూలో మోడిని ప్రశ్నించగా ఆయన అందుకు తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ పేరుతో బి.జె.పియే ఈ సందేశాన్ని ఇతర పార్టీలకు పంపిందనీ, ఆ విధంగా తమకు మెజార్టీ రావడం అనుమానమే అని ఆ పార్టీ అంగీకరించిందని ఇతర పార్టీలు, స్వతంత్ర విశ్లేషకులు భావిస్తున్నారు.

కానీ బి.జె.పి స్నేహ హస్తాన్ని బి.ఎస్.పి, తృణమూల్ పార్టీలు తిరస్కరించాయి. ఎన్నికల అనంతరం తాము బి.జె.పి తో పొత్తు పెట్టుకునే అవకాశాలే లేవని మాయావతి స్పష్టం చేశారు. “అవసరం అయితే ఏ.ఐ.ఏ.డి.ఏం.కె నేత జయలలిత, టి.ఏం.సి నేత మమతా బెనర్జీ, బి.ఎస్.పి జాతీయ అధ్యక్షురాలు తదితరుల మద్దతు తీసుకుంటామని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడి పేర్కొన్నారు. కానీ నేను స్పష్టం చేయదలిచాను. మోడీ లేదా ఎన్.డి.ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బి.ఎస్.పి ఎట్టి పరిస్ధితులలోనూ సహకరించేది లేదు” అని మాయావతి స్పష్టం చేశారు.

“ఎన్నికలు మొదలయినప్పుడేమో మరే ఇతర పార్టీ మద్దతు ఎన్.డి.ఏ కి అవసరం లేదని మోడి చాటారు. తమ విజయం పట్ల అనుమానాలు ఉంటే తప్ప ఏ పార్టీ కూడా ఇతర పార్టీల మద్దతు గురించి మాట్లాడదు… మాకు ఓటు వేస్తున్న మైనారిటీలను అయోమయం సృష్టించడానికే మోడి ఈ ఎత్తుగడ పన్నారు” అని ఆమె ముక్తాయించారు.

తృణమూల్ నేత మమతా బెనర్జీ కూడా ఇదే రీతిలో స్పందించారు. “మోడి ప్రభుత్వానికి మద్దతు కోసం బి.జె.పి తలుపులు తెరిచే ఉన్నాయని వారు ప్రకటిస్తే అదే తరహా విశ్లేషణతో మేమూ చెబుతున్నాం ‘మా తలుపులు మూసేశాం, తాళాలను పారవేశాం’ అని” అని మమతా బెనర్జీ ప్రకటించారని ది హిందూ తెలిపింది.

కాంగ్రెస్ కూడా ఈ అవకాశాన్ని వదులుకోలేదు. మోడి ప్రధాని కావడం అసాధ్యం అని ఆ పార్టీ నేత అజయ్ మాకేన్ కుండ బద్దలు గొట్టారు. “ఇప్పటివరకు పరిస్ధితి చూస్తే బి.జె.పి లేదా ఎన్.డి.ఏకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంతమంది మిత్రులు దొరకరు. వారికి తగినన్ని సీట్లు రావు, తగినంతమంది మిత్రులు ఉండరు… మోడి ప్రధాని కావడం, బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం అని మేము మొదటి నుండి చెబుతున్నాం” అని ఆయన అన్నారు. యు.పి.ఏ III ప్రభుత్వం రావడం ఖాయం అని ఆయన చెప్పడం ఒక విచిత్రం. ముఖ్యమైన పార్టీలు బి.ఎస్.పి, టి.ఏం.సి లు తలుపులు మూసేశాక ఎన్.డి.ఏ కి మెజారిటీ రాదని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు.

అయితే ఏ.ఐ.ఏ.డి.ఏం.కె నుండి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. అటు జయలలిత గానీ ఇటు ఇతర పార్టీ నేతలు గానీ మోడి, అమిత్ షా ల పరోక్ష ఆహ్వానం గురించి స్పందించలేదు. బహుశా ఆ పార్టీ గోడ మీద కూర్చోవడానికే ప్రస్తుతానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఫలితాలు వచ్చాక ఏ శిబిరంలోనయినా ఆ పార్టీ చేరిపోవచ్చు. లేదా బైటినుండి మద్దతు అంటూ మరో అంకానికి తెర తీయవచ్చు.

బి.జె.పి లో అంతర్గత విభేదాలు ఆ పార్టీ అవకాశాలకు గండి కొట్టాయని పరిశీలకుల అభిప్రాయం. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ గానీ, ఛత్తీస్ ఘర్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గానీ మోడికి అతిగా ప్రాధాన్యం ఇవ్వడం ఇష్టపడలేదని కొన్ని పత్రికలు సూచించాయి. ఉత్తర ప్రదేశ్ లో కూడా ముజఫర్ నగర్ అల్లర్ల ప్రభావం ఉన్న పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ఏరియాలో తప్ప మిగిలిన అన్ని చోట్లా కుల రాజకీయాలే ప్రధాన పాత్ర పోషించడం కొనసాగిందని, ములాయం సింగ్ అజామ్ ఘర్ లో పోటీ చేయడంతో బి.జె.పి అనుకూలత కాస్తా ఎస్.పి అనుకూలతగా మారిందని విశ్లేషిస్తున్నారు.

మొత్తం మీద విజయం పైన ఏ పార్టీకీ నమ్మకం లేని పరిస్ధితి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగల సీట్ల సంఖ్య అటు యు.పి.ఏ కూటమికి గానీ, ఇటు ఎన్.డి.ఏ కూటమికి గానీ దక్కడం అనుమానమే అన్న పరిస్ధితి. బహుశా మూడో కూటమి పేరుతో ఊగిపోయే ములాయం, నితీష్, జయలలిత లాంటి నేతలకు మద్దతు ఇస్తున్నట్లు నాటకాలాడి మధ్యలోనే ప్రభుత్వాన్ని పడగొట్టే వ్యూహాలకు కాంగ్రెస్, బి.జె.పి లు మరోసారి పదును పెట్టినా ఆశ్చర్యం లేదేమో!

అయినా తినబోతూ రుచుల గురించి ఊహాగానాలెందుకని ప్రస్తుతానికి సరిపెట్టుకుందాం!

One thought on “ఓటమి: ఎన్నికల ముందు కాంగ్రెస్, ఫలితాల ముందు బి.జె.పి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s