రష్యా గ్యాస్ కు ప్రత్యామ్నాయం కోసం జి7 వెతుకులాట!


G7 energy ministers met in Rome

G7 energy ministers met in Rome

అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేసినట్లే జరుగుతోంది. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా యూరప్ గ్యాస్ మార్కెట్ ను అమెరికా చేజిక్కించుకోవడానికి ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. రష్యా నుండి ఇన్నాళ్లూ భారీ మొత్తంలో సహజవాయువు సరఫరా పొందుతున్న ఐరోపా దేశాలకు రష్యాకు ప్రత్యామ్నాయంగా అమెరికా షేల్ గ్యాస్ ను ఉపయోగపెట్టుకోవడానికి నిర్ణయించే వైపుగా అడుగులు పడుతున్నాయి. రోమ్ లో మూడు రోజుల క్రితం ముగిసిన జి7 శక్తి వనరుల మంత్రుల సమావేశం రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించింది.

ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలుగా పేరు పొందిన 7 దేశాల -అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా దేశాల- కూటమి ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా జి8 గ్రూపును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సోవియట్ రష్యా పతనం అనంతరం అమెరికా అడుగులకు మడుగులొత్తిన అప్పటి రష్యా అధ్యక్షుడు యెల్టిసిన్ కాలంలో, జి7 దేశాలు రష్యాతో కలుపుకుని జి8 కూటమి ఏర్పరిచినట్లు ప్రకటించాయి. అయితే జి8 కూటమి నామమాత్ర చర్చలతోనే ఇన్నాళ్ళు పొద్దుపుచ్చింది తప్ప వివిధ వ్యవస్ధాగత నిర్మాణాలను ఏవీ ఏర్పరుచుకోలేదు. దానితో జి8 కూటమినుండి రష్యాను బహిష్కరిస్తున్నట్లు జి7 దేశాలు ప్రకటించినప్పటికీ రష్యా పట్టించుకోలేదు.

ఉక్రెయిన్ లో యనుకోవిచ్ నేతృత్వంలోని ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని హింసాత్మకంగా కూలదోసిన తీవ్ర మితవాద గ్రూపులు, నయా నాజీ పార్టీలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చెలరేగిన సంగతి విదితమే. ఈ ఆందోళనలకు రష్యా మద్దతు ఇస్తోందనీ, క్రిమియా తరహాలోనే తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలను కూడా కలుపుకోవడానికి చూస్తోందని అమెరికా, ఐరోపాలు ఆరోపిస్తున్నాయి. రష్యా ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. ఉక్రెయిన్ ప్రభుత్వం తూర్పు, దక్షిణ రాష్ట్రాల తిరుగుబాటుదారులతో చర్చలు జరిపి వారి కోర్కెలను నెరవేర్చాలని రష్యా కోరుతోంది. తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలను కలుపుకునే ఉద్దేశ్యం తమకు లేదనీ, కానీ అక్కడ ఉన్న రష్యన్ల ప్రయోజనాలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరికలు చేస్తోంది. తదనుగుణంగా ఉక్రెయిన్ తూర్పు సరిహద్దు వద్ద వేలాది సైనికులను సైతం మోహరించింది.

ఉక్రెయిన్ లో సంక్షోభం మొదలయిందే ఈ.యు లో చేరడానికి ఆ దేశం వాయిదా వేసినందుకు. అమెరికా, ఐరోపా దేశాల ప్రోద్బలంతో ఇ.యు లో చేరడానికి ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేయాలంటూ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆందోళన మొదలయింది. ఈ ఆందోళనలు క్రమంగా రైట్ సెక్టార్, స్లోబోడా లాంటి తీవ్రవాద సంస్ధల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇ.యు తో అసోసియేషన్ అగ్రిమెంట్ ఒప్పందాన్ని వాయిదా వేసిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మకంగా కూలదోసిన తర్వాతనే ఆందోళనలు చల్లబడ్డాయి. కానీ రాజధాని కీవ్ లోని అనేక ప్రభుత్వ భవనాలు, పశ్చిమ ఉక్రెయిన్ లోని స్ధానిక ప్రభుత్వ భవనాలు తీవ్రవాద గ్రూపుల చేతుల్లోనే కొనసాగుతున్నాయి.

ఈ నేపధ్యంలో ఉక్రెయిన్ గుండా వెళ్లవలసిన రష్యన్ సహజవాయు సరఫరాలకు అంతరాయం ఏర్పడుతుందని ఐరోపా దేశాలు భయపడుతున్నాయని వార్తలు బయలుదేరాయి. కాబట్టి రష్యన్ గ్యాస్ పై ఆధారపడడం ఎప్పటికైనా నష్టమే అని ఐరోపా దేశాలు భావిస్తున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా తన భూఖండాలలోనే అట్టడుగు లోతుల్లోకి తవ్వి కఠిన శిలలను సైతం ఫ్రాకింగ్ ద్వారా పగలగొట్టి గ్యాస్ వెలికి తీస్తోంది. బ్రిటన్ కూడా అదే దారిలో ఉంది. దానితో అమెరికా, బ్రిటన్ లలో గ్యాస్ వనరులు పెరిగాయి. గ్యాస్ ఉత్పత్తి కూడా పెరిగింది. ఈ గ్యాస్ కు వినియోగదారులు పెరిగాలంటే రష్యా గ్యాస్ అమ్మకాలను తగ్గించడం తప్ప మరోదారి లేదు. అనగా ఉక్రెయిన్ సంక్షోభం పోయి పోయి చివరికి రష్యా గ్యాస్ అమ్మకాలకు ఎసరు తెస్తుండగా అమెరికా, బ్రిటన్ గ్యాస్ అమ్మకాలకు మార్కెట్ ను పెంచుతోంది. ఈ నేపధ్యంలో ఉక్రెయిన్ సంక్షోభం మూలాలు ఎక్కడ ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యాపై ఆంక్షలు విధించడానికి అమెరికా, బ్రిటన్ లే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇతర జి7 దేశాలపై, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నాయక దేశాలయిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. కానీ జర్మనీ, ఇటలీలకు రష్యాతో అనేక రంగాలలో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. రష్యాలో జర్మనీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇటలీకి చెందిన బహుళజాతి టైర్, గ్యాస్ కంపెనీ పిరెల్లీ తో రష్యా గ్యాస్ కంపెనీలకు లోతైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఫలితంగా రష్యాపై తీవ్ర ఆంక్షలను జర్మనీ, ఇటలీలు వ్యతిరేకిస్తుండగా, అమెరికా, బ్రిటన్ లు గట్టిగా సమర్ధిస్తున్నాయి.

రష్యా గ్యాస్ సరఫరాలపై ఆధారపడడం తగ్గించుకోవాలన్న అంశం 2006 నుండే జి7 ఎజెండాలో ఉంది. 2006లో కూడా ఉక్రెయిన్ లో ‘ఆరంజ్ రివల్యూషన్’ పేరుతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టాయి. అప్పుడు కూడా అధికారంలో ఉన్నది యనుకోవిచ్ ప్రభుత్వమే కావడం గమనార్హం. వివిధ రంగుల పేర్లతో మధ్య ఆసియా దేశాలలో పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన విప్లవాలు నిజానికి విప్లవాలు కానే కాదు. పశ్చిమ దేశాల ప్రయోజనాలను కనీస మాత్రంగానే నిరాకరించినందుకు గానూ అక్కడి ప్రభుత్వాలను కూలగొట్టడానికి పశ్చిమ దేశాలు రేపిన గొడవలే కలర్ రివల్యూషన్స్ గా పశ్చిమ పత్రికలు పిలుచుకుంటాయి. సో కాల్డ్ ఆరంజ్ రివల్యూషన్ కాలంలో ఉద్భవించిన ప్రత్యామ్నాయ గ్యాస్ సరఫరా ఆలోచన 2013-14 నాటి నయా నాజీ, తీవ్రవాద గ్రూపుల హింసాత్మక కూల్చివేతలతో ఒక రూపం తీసుకుంది.

తమ గ్యాస్ ఉత్పత్తికి మార్కెట్ వెతుక్కునే/పెంచుకునే క్రమంలో అమెరికా, బ్రిటన్ లో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలిగించాలని ఒత్తిడి తెస్తున్నాయి. మరిన్ని ఆంక్షలు విధిస్తే ప్రతీకార చర్యలు తప్పవని రష్యా ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసింది. దానితో జర్మనీ, ఇటలీలు వెనకడుగు వేస్తున్నాయి. ఆంక్షలు విధించడంపై అవి జాగ్రత్తగా మాట్లాడుతున్నాయి. అమెరికా, బ్రిటన్ లు దూకుడుగా ప్రకటనలు జారీ చేస్తున్నాయి.

రష్యా ప్రభుత్వ సహజవాయువు కంపెనీ రోస్ నెఫ్ట్ అధికారులపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు ప్రకటించింది. రోస్ నెఫ్ట్ సి.ఈ.ఓ ఇగోర్ సెచిన్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చుతున్నట్లు ప్రకటించింది. కానీ అదే రోస్ నెఫ్ట్ కంపెనీకి ఇటలీ టైర్ల కంపెనీ పిరెల్లీ వాటాలను కొనసాగిస్తోంది. పిరెల్లీ కంపెనీ ఇటలీకి చెందిన భారీ బహుళజాతి కంపెనీల్లో ఒకటి. అలాంటి కంపెనీ ప్రయోజనాలకు భంగం కలిగించడానికి ఇటలీ ప్రభుత్వం ఇష్టపడదు. అలాగే అనేక జర్మనీ ఎలక్ట్రానిక్, ఫైనాన్స్ కంపెనీలు రష్యాలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు కలిగి ఉన్నాయి. రష్యా హెచ్చరికలను జర్మనీ, ఇటలీలు పట్టించుకునేది ఇందుకే.

ఈ పరిస్ధితుల్లో జి7 దేశాలు తమ ప్రకటనల్లోని తీవ్రతను ఆచరణలోకి తేలేకపోతున్నాయి. అయితే మునుముందు జర్మనీ, ఇటలీలు కూడా నెమ్మదిగా దారికి వచ్చే అవకాశం లేకపోలేదు. వచ్చే జూన్ 4-5 తేదీల్లో బ్రసేల్స్ లో జి7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆంక్షలు విధించకపోయినా, అందుకు తగిన సూచనలతో కూడిన ఉమ్మడి ప్రకటన జారీ చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరిన్ని ఆంక్షలకు సంబంధించిన సిఫారసులు ఈ ప్రకటనలో చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సిఫారసులు మరిన్ని చర్చలు చేయడానికే తప్ప వెంటనే అమలు చేయడానికి కాదని తెలుస్తోంది. తమ తమ దేశాల్లో శక్తి వనరుల సామర్ధ్యం పెంచుకోవడం, ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా) నుండి షేల్ గ్యాస్ ను ఐరోపాకు తెచ్చేందుకు అవకాశాలు పరిశీలించడం, కాస్పియన్ సముద్రం నుండి పైప్ లైన్ లను అభివృద్ధి చేయడం తదితర చర్యలు జి7 శిఖరాగ్ర సమావేశం ప్రకటించవచ్చని తెలుస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s