మోడి నేతృత్వంలోని ప్రభుత్వం అధికరంలోకి వస్తే భారత దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పూర్తిగా అడుగంటడం ఖాయం అని ప్రముఖ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత సల్మాన్ రష్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మోడి అధికారంలోకి రాక మునుపే ఆయన పాలన ఎలా ఉండబోతోందో చాటే ఘటనలు జరుగుతున్నాయని, ఏం రాస్తే ఏమవుతుందో అని భావిస్తూ అనేకమంది సొంతగా సెన్సార్ షిప్ పాటిస్తున్నారని ఆయన చెప్పారు. ‘పెన్ వరల్డ్ వాయిసెస్ ఫెస్టివల్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్ లో పి.టి.ఐ వార్తా సంస్ధతో మాట్లాడుతూ రష్దీ ఈ మాటలు చెప్పారు.
“మోడి నేతృత్వంలో నడిచే ప్రభుత్వం పట్ల నాకు చాలా ఆందోళనగా ఉంది. మోడి ప్రభుత్వం బెదిరింపులతో నడుస్తుందన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. బి.జె.పి ఇంకా అధికారంలోకి రాకముందే జర్నలిస్టులను, రచయితలను బెదిరింపులకు గురి చేయడం మన ఇప్పటికే చూశాం” భావ ప్రకటనా స్వేచ్చ ప్రాముఖ్యతపై జరిగిన సెషన్ లో ప్రసంగిస్తూ రష్దీ అన్నారు.
“మరింత ఆందోళనకరం ఏమిటంటే అనేకమంది సెల్ఫ్-సెన్సార్ షిప్ పాటించడం మొదలు పెట్టారు. తమకు బెదిరింపులు తప్పవని కొంతమంది ఇప్పటికే భయపడుతున్నారు. ఆ భయంతో మోడీయిస్టులకు కోపం తెప్పించే పనులు చేయకుండా చాలామంది ఇప్పటినుండే జాగ్రత్తపడుతున్నారు” అని మోడి నేతృత్వంలో ఇండియా ఎలా ఉండబోతోందన్న విషయంలో తన భావాలను వెల్లడిస్తూ రష్దీ వ్యాఖ్యానించారని ది హిందు తెలిపింది.
భారత దేశంలో నరేంద్ర మోడి లాంటి రాజకీయవేత్త గతంలో ఎవరూ లేరని రష్దీ స్పష్టం చేశారు. జాతీయ ఎన్నికల్లో బి.జె.పి నెగ్గుకు వచ్చే అవకాశాలున్నందున, తదుపరి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నందున మోడి పాలన ఎలా ఉండేదీ మనం చూస్తామని ఆయన అన్నారు. “(అత్యున్నత) పదవిని నిర్వహించిన అనుభవం ఆయనను మోడరేట్ గా మార్చుతుందేమో వేచి చూడాలి” అని రష్దీ వ్యాఖ్యానించారు.
సల్మాన్ రష్దీ అంచనా నిజం అవుతుందా లేదా అన్న సంగతి పక్కన బెడితే అత్యున్నత పదవి ఆయనను మోడరేట్ గా మార్చవచ్చన్న రష్దీ ఊహ (సాధారణ పరిశీలనలో) అసాధారణం ఏమీ కాదు. సంఘ్ పరివార్ సంస్ధలు ప్రచారంలో పెట్టిన హిందూత్వ భావజాలంలో ఒకప్పుడు ఎల్.కె.అద్వానీ హార్డ్ లైనర్ గా పేరుంటే మోడరేట్ గా వాజ్ పేయికి పేరుండేది. మోడరేట్ గా పొందిన గుర్తింపే వాజ్ పేయికి ప్రధాని పదవిని కట్టబెట్టిందని పరిశీలకుల నిశ్చితాభిప్రాయం.
ఆ సంగతి గ్రహించే ఎల్.కె.అద్వానీ తాను కూడా మోడరేట్ గా మారానని చెప్పుకోవడానికి ఆ తర్వాత కాలంలో ప్రయత్నించి ఘోరంగా విఫలం అయ్యారు. ఆ ప్రయత్నాల వలన సంఘ్ పరివార్ నుండి విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతను ‘తప్పిదం’గా వర్ణించడం, పాకిస్ధాన్ వెళ్ళి జిన్నాను ‘గొప్ప సెక్యులరిస్టు’గా ప్రశంసించడం లాంటివి చేయడం ద్వారా తానూ మోడరేట్ నే అనీ కాబట్టి వాజ్ పేయి అనంతరం ప్రధాని కాగల అర్హత తనకు ఉన్నదని ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎన్.డి.ఏ రెండోసారి అధికారంలోకి రావడంలో విఫలం కావడంతో ప్రధాని పదవి ఆయనకు అందకుండా పోయింది.
అంతెందుకు? నరేంద్ర మోడి సైతం తాను శాకాహారిగా మారానని చెప్పుకోవడానికి రెండు సంవత్సరాల నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. సద్భావనా మిషన్ అంటూ విడతలు విడతలుగా దీక్షలు (నిరాహార దీక్షలు కాదు) చేశారు. ఆ విధంగా తానూ మోడరేట్ నే అనీ, లేదా మోడరేట్ గా మారాననీ కాబట్టి తాను ప్రధాని పదవికి అర్హుడనే అనీ చెప్పుకునేందుకు ప్రయత్నించారు. రచయిత సల్మాన్ రష్దీ కూడా సరిగ్గా ఈ అంశాన్నే లేవనెత్తుతున్నారు. ప్రధాన మంత్రి లాంటి అత్యున్నత పదవి నిర్వహించేటప్పుడు సహజంగానే అన్ని వర్గాలనూ కలుపుకోవలసిన అవసరం వస్తుందని, ఆ అవసరం రీత్యా అయినా నరేంద్ర మోడి మోడరేట్ గా మారకపోతారా అనీ రష్దీ ఆశిస్తున్నారు.
కానీ రష్దీ గారే చెపుతున్నట్లు ఈ వ్యవహారం ఒక్క నరేంద్ర మోడీ కే పరిమితం అయింది కాదు. మోడి ఆవిర్భావం ఇప్పుడు చారిత్రక సంధ్యలో ఉన్న ఒక దోపిడీ వ్యవస్ధ అవసరం. ఆ వ్యవస్ధకు ఇప్పుడు ఒక నిరంకుశ నేత కావాలి. అవినీతి నిర్మూలన అంటూ కార్పొరేట్ కంపెనీల మీదికి కాగ్ విచారణలను ఉసిగొల్పుతున్నవారి పని పట్టే నేత ఆ వ్యవస్ధకు కావాలి. భారత దేశ సంపన్న సహజవనరులపై కన్నేసిన విదేశీ బహుళజాతి కంపెనీ గద్దలను మేపేందుకు కాకులను కొట్టే నాయకులు కావాలి. ఆ అవసరమే మోడిని అందలం ఎక్కిస్తోంది తప్ప, రష్దీ ఆశిస్తున్నట్లుగా మోడి మోడరేట్ గా మారే అవకాశం చాలా తక్కువ. నరేంద్ర మోడి మోడరేట్ గా మారేపనైతే మోడినే ప్రధానిగా ఎంచుకోనవసరం లేదు. అందుకు బి.జె.పిలోనే అనేకమంది నాయకులు ఉన్నారు.
అయితే నరేంద్ర మోడి పట్ల రష్దీ అంచనాలు పరిశీలనార్హం. ఆయన దృష్టిలో మోడి అత్యంత తీవ్రమైన విభజిత నేత (divisive figure). తీవ్రవాదుల్లోకెల్లా తీవ్రవాది (hardliners’ hardliner). మోడి నేతృత్వంలోని బి.జె.పి పాలనలో భావ ప్రకటనా స్వేచ్చపైనా, సాహిత్య రచనలపైనా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల వరకే పరిమితం చేయడం సరికాదనీ, పౌరులందరికీ భావప్రకటనా స్వేచ్ఛ అందేలా చూడగలిగితేనే అది నిజమైన ప్రజాస్వామ్యం కాగలదని రష్దీ స్పష్టం చేశారు. ఈ సూత్రం నిజానికి ఇండియాకి మాత్రమే కాదు, ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ప్రతి దేశానికి వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా అమెరికాకి ఇంకా వర్తిస్తుంది. వర్తించాలి. అమెరికా గడ్డపై నిలబడి ఈ మాటలు చెప్పిన రష్దీ అమెరికాకు కూడా సుద్దులు చెబితే బాగుంటుంది.
“భావ ప్రకటనా స్వేచ్చ దాడికి గురవుతుంటే, మత స్వేచ్ఛ తీవ్ర బెదిరింపులకు లోనవుతుంటే, సమాజంలోని అతి పెద్ద భాగం భౌతిక బధ్రత లేని భయంలో కాలం గడుపుతుంటే అలాంటి సమాజం నిజమైన ప్రజాస్వామిక సమాజం అని చెప్పలేము” అని సల్మాన్ రష్దీ అన్నారు. తన పుస్తకం ‘సాతానిక్ వర్సెస్’ నిషేదానికి గురయినప్పటి నుండీ సాహిత్య, కళా సృజనలపై దాడులు తీవ్రం అయ్యాయని ఆయన గుర్తు చేశారు.
“ఇలాంటి పరిస్ధితులు మరింతగా క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి. హిందూ జాతీయవాద బి.జె.పి ఎన్నికల్లో గెలిచి అత్యంత తీవ్ర విభజిత (divisive) వ్యక్తి మరియు తీవ్రవాదులలోకెల్లా తీవ్రవాది అయిన నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి” అని రష్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మోడి అధికారంలోకి రావడం ఆహ్వానించదగిన పరిణామం కాదంటూ రష్దీ, ప్రముఖ శిల్పి అనీష్ కపూర్, ఇంకా అనేక రచయితలు, లాయర్లు, మేధావులు కొద్ది రోజుల క్రితం ఒక లేఖను విడుదల చేసిన సంగతిని రష్దీ గుర్తు చేశారు. ఆ లేఖను విడుదల చేశాక తమపైన సోషల్ మీడియాలో తీవ్రస్ధాయిలో అసభ్యకరమైన దాడులు జరుగుతున్నాయని రష్దీ గుర్తు చేశారు.
“బెదిరింపులు, అసహనంతో నిండిన నూతన హయాం అధికార పగ్గాలు చేజిక్కించుకోవడం మాకు ఆందోళన కలిగిస్తోంది. వారి ఆగమనాన్ని ఇప్పటికే సూచిస్తున్నారు. భయంకరమైన, అసహ్యకరమైన, ప్రతీకారంతో నిండి ఉన్న శక్తులు వీళ్ళు. మోడి విజయం అనంతరం ఇంతకంటే తక్కువ పరిస్ధితి మాత్రం ఉండబోదు” అని రష్దీ స్పష్టం చేశారు. అమెరికా రచయిత్రి వెండీ డోనిగర్ రాసిన పుస్తకం ‘ద హిందూస్, ఆల్టర్నేట్ హిస్టరీ’ ని ఇటీవలే నిషేదించారని, ఎం.ఎఫ్.హుస్సేన్ ను ప్రవాసం పంపింది ఈ శక్తులేనని ఆయన గుర్తు చేశారు. గూండాయిజం చెలాయించేవారి భావప్రకటనా స్వేచ్ఛయే అసలైన భావప్రకటనా స్వేచ్చగా మారే భయానక పరిస్ధితులు రానున్నాయని రష్దీ ఆందోళన వ్యక్తం చేశారు.
వి.శేఖర్ గారు. నిన్న ఇవాళ పోస్టు రాలేదు. ఆరోగ్యం ఓకే కదా సార్…?
విభజిత – Divided
విభాజక – Divisive
కనుక ఇక్కడ విభాజక నేత అని ఉండాలి.
చందుతులసి గారూ, వేరే ఊరు వెళ్లి గంట క్రితమే వచ్చాను. అందువల్ల బ్లాగ్ అప్ డేట్ చెయ్యలేదు. మీ అభిమానానికి ధన్యవాదాలు.
ఉత్తరామ్నాయం గారూ, తప్పయితే ఎవరో ఒకరు చెప్పకపోతారా అనుకుని రాసేశాను. ధన్యవాదాలు.
భావ ప్రకటనా స్వేచ్ఛ modi ivvadu kada lekundaa danini cheyataniki ee sodanta enduku zindabad congress zindabad rahul sonia ante potundi