ఉల్టా పల్టా: జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి -ఫోటోలు


‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అన్నారు పెద్దలు. ఆ పెద్దల భవిష్యద్దర్శనం ఎంత దూరం సాగిందో తెలియదు గానీ, ఈ ఫొటోల్లో కనపడుతున్నంత దూరం మాత్రం సాగి ఉండదని నిస్సందేహంగా చెప్పవచ్చనుకుంటాను. ఎంతో ఖర్చు పెట్టి ప్రఖ్యాత ఆర్కిటెక్చర్లను నియమించుకుని మరీ కట్టుకున్న ఇళ్ళు ఇలా తిరగేసి ఉంటాయని ఊహించగలమా?

పోనీ ఒక దేశంలో ఒకరిద్దరికి పుట్టిన ఆలోచనా ఇది అంటే, కానే కాదు. కనీసం నాలుగు దేశాల్లో కట్టిన ఇళ్ళు మనం ఇక్కడ చూడవచ్చు. చైనా, రష్యా, జర్మనీ, ఆస్ట్రియా… ఈ నాలుగు దేశాల్లో ఆర్కిటెక్చర్ నిపుణులు చాలా కష్టపడి కట్టిన ఇళ్లివి.

కేవలం బైటి నుండి చూడడానికే ఇలా తిరగేసి ఉన్నాయని లోపల అంతా మామూలుగానే కట్టుకుని ఉంటారని అనుకునేరు. లోపల కూడా ఇదే తంతు. ఇంటికి సంబంధించిన సమస్త అవయవాలను సరిగ్గా తిరగేసి కట్టినట్లు కనపడేలా సకల జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ ఇళ్ళల్లో నిలబడి ఫోటోలు తీసుకుని వాటిని తీరిగ్గా చూడడం మొదలు పెడితే ఒక చిత్రమైన అనుభూతి రావడం ఖాయం. ఫోటోలని ఉన్నవి ఉన్నట్లుగా చూస్తేనేమో ఇంటిని తలకిందులుగా తిప్పి నిలబడ్డట్లు కనిపిస్తాము. అలా కాకుండా ఆ ఫోటోని తిరగేసి చూస్తేనేమో సాధారణంగా కట్టిన ఇంట్లో మనమే కప్పుకు వేళ్లాడుతూ తిరుగుతున్నట్లు కనిపిస్తాము.

వీటిల్లో జర్మనీలో కట్టిన ఇంటి పేరు ‘ప్రపంచమే తన తలపై నిలబడింది’ అని అర్ధం వచ్చేలా పెట్టారు.

నిజం కూడా అదే అని కారల్ మార్క్స్ ఒకటిన్నర శతాబ్దాల క్రితమే చెప్పారు కూడాను. జర్మనీ తత్వవేత్త మొట్టమొదట గతితర్క తత్వాన్ని ప్రతిపాదించారు. కానీ ఆయన భావవాది. హెగెల్ శిష్యుడైన కారల్ మార్క్స్ తన గురువుగారు ప్రపంచాన్ని తిరగేసి అర్ధం చేసుకున్నారని కనిపెట్టారు. ఆ విధంగా తత్వ శాస్త్రాన్ని తన తలపై కాకుండా తన కాళ్లపై నిలబడి ఉండేలా నిలబెట్టారు కారల్ మార్క్స్.

ప్రపంచం కూడా తన కాళ్లపై కాకుండా తన తలపై నిలబడి ఉండని మొదట చెప్పింది కారల్ మార్క్స్. ప్రపంచం ఫలానా విధంగా ఉందని తత్వవేత్తలు రకరకాలుగా వ్యాఖ్యానించారు గానీ, దాన్ని మార్చుకోవడం ఎలా అన్నదే అసలు సమస్య అని మొదట చెప్పింది కూడా ఆయనే. చెప్పడమే కాకుండా ఆ పనికి పూనుకున్నారు. తన చివరి క్షణాల వరకూ కారల్ మార్క్స్ ఆ పనిలోనే ఉన్నారు.

ప్రపంచాన్ని నడిపిస్తున్నది శ్రమ జీవులే అనీ, శ్రమ చేసేవారు లేకపోతే ఈ ప్రపంచం ఒక్క అడుగు కూడా నడవలేదని సశాస్త్రీయంగా నిరూపించిన వ్యక్తి కారల్ మార్క్స్. కానీ ఆ శ్రమ జీవులు ఎటువంటి సుఖము లేకుండా కునారిల్లుతున్నారనీ ధనిక వర్గాలు వారిపై ఎక్కి స్వారీ చేస్తున్నారని చెప్పిన మార్క్స్, శ్రమ జీవులు మేల్కొని తమ ప్రపంచాన్ని తాము చేజిక్కుంచుకోవాలని ప్రబోధించారు. ‘పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప!’ అని నినదించారాయన!

కారల్ మార్క్స్ బ్రిటన్ లోని ఓ లైబ్రరీలో చదువుతూ, నోట్సు రాసుకుంటూనే కన్నుమూశారు. “ప్రపంచంలోనే అత్యంత తెలివైన మెదడు పని చేయడం ఆగిపోయింది” అని మార్క్స్ మిత్రుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్, తన మిత్రుడి మరణం గురించి వ్యాఖ్యానిస్తూ అన్నారు.

ఎంగెల్స్ అలా అనడానికి కూడా మార్క్స్ ప్రతిపాదించిన గతి తార్కిక తత్వ శాస్త్ర నేపధ్యం ఉంది. ప్రపంచానికి మూలం పదార్ధమే అనీ, ఆ పదార్ధం నుండే భావం పుట్టిందని మార్క్స్ ప్రతిపాదించారు. విశ్వ పరిణామ క్రమంలో పదార్ధం రూపం మార్చుకుంటూ అభివృద్ధి చెందుతూ వచ్చిందనీ, అత్యంత అభివృద్ధి చెందిన పదార్ధమే మానవుడి మెదడు అనీ మార్క్స్ ప్రతిపాదించిన గతితార్కిక భౌతికవాద తత్వశాస్త్రం చెబుతుంది.

ఈ ఫొటోల్లో ఉన్న ఇళ్లను చూస్తే తలకిందులుగా ఉన్న ప్రపంచాన్ని తిరిగి తన కాళ్లపై నిలబెట్టాల్సిన కర్తవ్యం మానవ సమాజానికి ఇంకా మిగిలే ఉందని గుర్తు చేస్తున్నట్లుగా లేవూ?

Photos: The Atlantic

4 thoughts on “ఉల్టా పల్టా: జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి -ఫోటోలు

  1. ప్రపంచం ఫలానా విధంగా ఉందని తత్వవేత్తలు రకరకాలుగా వ్యాఖ్యానించారు గానీ, దాన్ని మార్చుకోవడం ఎలా అన్నదే అసలు సమస్య అని మొదట చెప్పింది కూడా ఆయనే. చెప్పడమే కాకుండా ఆ పనికి పూనుకున్నారు. తన చివరి క్షణాల వరకూ కారల్ మార్క్స్ ఆ పనిలోనే ఉన్నారు. దయచేసి దీనిని విపులంగా వివరిస్తారా?

  2. మూల గారు,

    నేను రాసే అంశాలను వంటబట్టించుకుంటూ చదువుతున్నారని మీ ప్రశ్నలు చెబుతున్నాయి.

    సమయం చూసుకుని మీరు కోరినట్లు కాస్త వివరంగా రాస్తాను. ఆ లోపు కింద లింక్ లో ఇచ్చిన ఆర్టికల్ ను చూడండి. ఒక ఐడియా రావచ్చు.

    http://wp.me/p1kSha-Ww

  3. సర్,మీరిచ్చిన లింక్ ను నిన్నన్నే చూడడం జరిగింది. అయితే నా సందేహానికి సమాదానం మాత్రం అందులో లేదుగానీ,మరికొన్ని సంధేహాలు మాత్రం ఉత్పన్నమయ్యాయి!
    1.మర్క్సిజం ని సరిగ్గ అర్ధం చేసుకున్నవారికి అది తలాతోకా లేని ఆలొచనల కలబోత అని అర్దం అవుతుందా? అటువంటప్పుడు దానినే అంతగా పట్టుకోవలసిన అవసరం ఏముంది?
    2.”పారిస్ కమ్యూన్ ” -అంత తక్కువ కాలం మాత్రమే ఎందుకు మనగలిగింది?అప్పటినుండి ఇప్పటివరకు అటువంటి పరిస్తితి ఎందుకు పునరావృతం ఎందుకు కాలేకపోయింది?
    3.ఏమిటీ ఈ “అదనపువిలువ” ? దాని పర్యవసానాలేమిటి?
    4.మర్క్సిజం లోని ఖాళీలు “మార్క్సిజం-లెనినిజం”గా,దీనిలోని ఖాళీలు “మార్క్సిజం-లెనినిజం-మావో ధట్” గా పూరించుకొని ఆ ఇజం పరిపూర్నతను సాధించిందనుకోవచ్చా? లేక వేరే దేశకాలమాన పరిస్తితులాధారంగా ఈ ఇజం కొత్తరూపుసంతరిచుకొంటుందనుకోవచ్చా?
    నేను మార్క్సిజం గురించి ఎన్నడూ చదువుకోలేదు! ఇప్పుడిప్పుదే తెలుసుకోవాలనుకొంట్టున్నను దయచేసి సహాయం చేయగలరు?
    గతంలో టాలమీ ప్రతిపాదించిన “భూకేంద్రక సిద్ధాంతం” సరైనదేనని కొన్ని వందల ఏళ్ళు చలామని అయ్యింది! ఆతర్వాత గేలిలియో,కోపర్నికస్ ల పరిసోదనల ఫలితంగా “సూర్యకేంద్రక సింద్ధాంతం” అమలులోకివచ్చి శాస్త్రపరిశోధనా రంగాల పరీక్షలకు నిలబడి ఈ సింద్ధాంతమే సరైనదని రూఢీ అయినది.
    అలాగే, న్యూటన్ పరిశోధనలు విశ్వంలోని పధార్ధాల ఉనికిని తెలుసుకోవడానికి 300 ఏళ్ళకుపైగా సహకరిస్తే ఆతరువాత ఐన్ స్టీన్ ప్రతిపాదించిన రెలటివిటి థిఒరి మరంత ప్రగతిశీలమయినదిగా అందరిచే అంగీకరించ బడింది!
    అలాగే, మార్క్సిజం-లెనినిజం-మావో ధట్” సమాజ స్తితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగపడినట్లే, దానికన్న మెరుగైన సిద్ధాంతం మరొకటి రాకుండా ఉంటుందా? ఒకవేల వచ్చినట్లయితే అది ఏయే అంశాల అధారంగా ఉందవచ్చుననుకొంటున్నరో మీరు చెప్పగలరా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s