అస్సాం మత హింసకు మోడీయే కారణం -ఒమర్


జమ్ము & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అస్సాం మతోన్మాద దాడులపై నోరు విప్పారు. ఎన్నికల సమయంలో మతోన్మాద దాడులు చెలరేగడానికి కారణం నరేంద్ర మోడియే అని ఆయన ఆరోపించారు. మూడు రోజుల క్రితం అస్సాంలో ఎన్నికల ప్రచారం చేసిన మోడి అస్సాంలో నివశిస్తున్న ముస్లింలు అందరూ విదేశీయులే అని స్ధానికులను రెచ్చగొట్టారని దాని ఫలితమే దాడులు జరిగి డజన్ల మంది మరణించారని ఆరోపించారు.

“అస్సాంలో 30 మంది ముస్లింలను చంపేశారు. ఎందుకు? ఎందుకంటే బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి కొద్ది రోజుల క్రితం అక్కడ ప్రసంగించారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎవరూ నిరాకరించలేరు” అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బారాముల్లా లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆరోపించారు.

మూడు రోజుల క్రితం అస్సాంలో ప్రసంగించిన మోడి అస్సాం లోని ముస్లింలు అందరినీ బంగ్లాదేశీయులుగా పేర్కొన్నారని ఫలితంగానే అక్కడ ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. “మూడు రోజుల క్రితం ఆయన అక్కడికి వెళ్ళి ముస్లింలందరినీ బంగ్లాదేశీయులే అని చెప్పారు. ఫలితంగా ఈ రోజు అక్కడ 30 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయి సమాధుల్లో నిద్రిస్తున్నారు” అని అబ్దుల్లా ఆరోపించారు.

కాశ్మీర్ పండిట్ లు కాశ్మీర్ నుండి వలస వెళ్లిపోవడానికి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీయే కారణం అని నరేంద్ర మోడి ఇటీవల ఆరోపించారు. మోడి వ్యాఖ్యను గుర్తు చేస్తూ అబ్దుల్లా, దేశంలోని కాశ్మీరీలందరినీ అవమానించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని నిరసించారు. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విడగొట్టడానికి బి.జె.పి కుట్ర పన్నుతోందని కూడా అబ్దుల్లా ఆరోపించారు.

బ్రిటిష్ వాణిజ్య పత్రిక రాయిటర్స్ సైతం అబ్దుల్లా ఆరోపణతో ఏకీభవిస్తోంది. నిన్న (మే 2) ప్రచురించిన ఓ వార్తలో రాయిటర్స్ ఇలా పేర్కొంది.

Candidates in India’s general election, including opposition front runner Narendra Modi of the Bharatiya Janata Party (BJP), have contributed to anti-Bangladeshi feeling in Assam.

Modi, a Hindu nationalist, last week said immigrants from Bangladesh in a nearby state should have their “bags packed” in case he came to power. He accuses the state government of being soft on immigration.

“భారత దేశ సాధారణ ఎన్నికల్లోని అభ్యర్ధులు, ప్రతిపక్ష ఫ్రంట్ రన్నర్ గా భావిస్తున్న బి.జె.పి నేత నరేంద్ర మోడి తో సహా, అస్సాంలో బంగ్లాదేశీ వ్యతిరేక భావాలకు ఇతోధికంగా దోహదం చేశారు.

హిందూ జాతీయవాది మోడి ‘తాను అధికారంలోకి వస్తే గనుక బంగ్లాదేశ్ నుండి సమీపంలోని (భారతదేశ) రాష్ట్రంలోకి వలస వచ్చిన వారంతా తట్టా, బుట్టా సర్దుకుని వెళ్లిపోవాల్సిందే’ అని గత వారం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం (బంగ్లాదేశ్) వలసలపై మెతకగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

తీరా మత హింస పేట్రేగి బోడో తీవ్రవాదులు అనేకమంది స్త్రీలు, పిల్లలను కాల్చి చంపడం ప్రారంభించాక అస్సాం రాష్ట్ర బి.జె.పి ప్లేటు ఫిరాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ పౌరులను రక్షించేందుకు ఏమీ చేయడం లేదని స్ధానిక బి.జె.పి నేతలు ఆరోపించారని రాయిటర్స్ తెలిపింది. అనగా అస్సాం దాడుల్లో చనిపోయిన ముస్లింలు రాష్ట్ర/దేశ పౌరులే అని బి.జె.పి అంగీకరిస్తోందన్నట్లే.

“ఈ సమస్యకు మతం రంగు పులమరాదని నేను అన్ని పార్టీలకు పిలుపు ఇస్తున్నాను. ఇక్కడ వెంటనే శాంతి నెలకొనడానికి అందరూ కృషి చేయాలి” అని అస్సాం బి.జె.పి నాయకుడు సర్బానంద సోనోవాల్ ఒక ప్రకటనలో కోరారని పత్రిక తెలిపింది. ఎన్నికల ప్రచారం పేరుతో ఎన్నికల లబ్ది కోసం ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చగొట్టి పోవడం నరేంద్ర మోడి వంతు అయితే అల్లర్లు చెలరేగాక శాంతి కబుర్లు చెప్పడం స్ధానిక బి.జె.పి నేతల వంతు అన్నమాట!

అస్సాంలో గత సంవత్సరమే కోక్రాఝార్ తదితర నాలుగు బోడో జిల్లాల్లో తీవ్రమైన మత హింస చెలరేగింది. బాధ్యత ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా ఎన్నికల సందర్భంగా మతం కార్డు ప్రయోగిస్తారని ఊహించలేని విషయం. కానీ ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ల పునాదిపైనే రాజకీయ శక్తిగా అవతరించిన బి.జె.పికి అలాంటి సాధారణ జాగ్రత్తలేవీ వర్తించవు. కనీసం ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన వ్యక్తి అయినా కాస్త సంయమనం పాటిస్తారని అంచనా వేయడం ఎంత తప్పో బి.జె.పి నేత నిరూపించారనుకోవాలి!

హత్యాకాండ చెలరేగడానికి తక్షణ కారణం ముస్లింలు ఎంత మాత్రం కాదు. మూడు రోజుల క్రితం ముగ్గురు బోడో తీవ్రవాదులను అస్సాం రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కాల్చి చంపారు. ఎన్ కౌంటర్ లో మిలిటెంట్లు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని సాకుగా చూపుతూ బోడో గిరిజన తీవ్రవాద సంస్ధ ఒకటి విచక్షణారహితంగా స్ధానిక ముస్లింల ఇళ్ళల్లోకి జొరబడి కాల్పులు జరిపి స్త్రీలు, పిల్లలతో సహా ముస్లింలను కాల్చి చంపడం మొదలుపెట్టింది.

శనివారం ఉదయం బాక్సా జిల్లాలోని ఒక గ్రామంలో 9 మంది మైనారిటీ మతస్ధులు చనిపోయి ఉండగా కనుగొన్నారు. వారిలో నలుగురు పిల్లలు కాగా ఇద్దరు మహిళలు. సల్బరి సబ్ డివిజన్ లోని ఖగ్రబరి గ్రామంలోని తమ ఇళ్ళల్లో వారు చనిపోయి ఉండగా కనుగొన్నారు. పిల్లలు ఇద్దరినీ ఇలినా ఖాటూన్, అరిఫుల్ ఇస్లాంలుగా గుర్తించారని ది హిందూ పత్రిక తెలిపింది. సమీపంలోని అడవిలో ముగ్గురు పిల్లలు దాక్కొని ఉండగా పోలీసులు వారిని కాపాడి బైటికి తెచ్చారు.

గురువారం ఆయుధాలు ధరించిన ఎన్.డి.ఎఫ్.బి-ఎస్ తీవ్రవాద మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఒక ఇంట్లో జొరబడి కాల్పులు జరపడంతో తాజా హింస మొదలయింది. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఆ కాల్పుల్లో చనిపోగా ఒక పసిబాలుడు గాయపడ్డాడు. అనంతరం కోక్రాఝార్ జిల్లాలోని బలపర-I గ్రామంలో మిలిటెంట్ల కాల్పుల్లో 8 మంది చనిపోయారు. వారందరూ తమ తమ ఇళ్ళల్లో ఉండగానే కాల్పులకు గురై చనిపోయారు. గత రాత్రి బాక్సా జిల్లాలోని నంకెఖాద్రాబారి, నయంగురి గ్రామాల్లో 12 మందిని కాల్చి చంపేశారు. ఈ సంఘటనలో 100 వరకు ఇళ్లను తగలబెట్టారు. ఇప్పటి వరకు మొత్తం 32 మంది బోడోల హింసకు బలయ్యారు.

ఇన్నాళ్లూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మిలిటెంట్లను ఎన్ కౌంటర్ పేరుతో చంపడంపైన కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాలక, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై మత హింసకు ఆజ్యం పోసి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేశారని వారు ఆరోపిస్తున్నారు అయితే ఈ విశ్లేషణకు విశ్వసనీయతను ఆపాదించడం ఇప్పుడయితే సాధ్యం కాదు. మరిన్ని వివరాలు వెల్లడి కావలసి ఉంది.

One thought on “అస్సాం మత హింసకు మోడీయే కారణం -ఒమర్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s