“నీ ఓటు నాకివ్వు”
“నీ తలరాత మార్చేస్తా”
“ఈ దేశ గతిని కూడా మార్చేస్తా”
“చట్టాన్ని ఉల్లంఘించకుండా ఓటు వెయ్యడం ఎలాగో ముందు నీకు నేర్పి చూపిస్తా పద!”
—
“అరవై యేళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. నాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చి చూడండి! దేశం గతినే మార్చి చూపిస్తాను.”
ఇది నరేంద్ర మోడి అదే పనిగా భారత జనానికి చెబుతున్న మాట!
నరేంద్ర మోడీకి నిజంగానే అవకాశం ఇస్తే అది మొదటి అవకాశం మాత్రం కాబోదు. ప్రధానిగా ఆయనకు మొదటి అవకాశం అవ్వొచ్చు గానీ ఒక పాలకుడిగా ఆయనకి నాలుగో అవకాశం అవుతుంది.
మొదటి మూడు అవకాశాలలో మోడి ఏం చేయగలరో చేసి చూపించారు కూడాను. చట్టాల్లో మాత్రమే ఉన్న భూ సంస్కరణలను అమలు చేయడానికి ఏ మాత్రం పూనుకోకపోగా ఉన్న భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు దాదాపు ఉచితంగా కట్టబెట్టారు మోడి.
కొద్ది రోజులుగా జనానికి ఎస్.ఎం.ఎస్ లు వస్తున్నాయి “గుజరాత్ లో భూముల ఉచిత పంపకం మోడితో మొదలయింది కాదు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఆ పని చేశాయి” అని. (నాకూ ఒకటి వచ్చిందిలెండి!) అంతోసిదానికి కాంగ్రెస్ కి ఇచ్చిన అవకాశం నాకూ ఇవ్వండి అని అడగడం దేనికి, జనాన్ని మోసగించడానికి కాకపోతే?!
అంతేనా? గుజరాత్ మతోన్మాద హింసని అలా ఉంచితే గుజరాత్ లో మోడి అనుసరించిన విధానాల వల్ల అక్కడి ప్రజలు ముఖ్యంగా పిల్లలు అనేకమంది పోషకాహారం లేక నష్టపోయారు. అవినీతి నిర్మూలనకు తమవద్ద పధకం ఉందని చెబుతున్న మోడి గుజరాత్ లోకాయుక్త పదవిని పదేళ్ళు భర్తీ చేయకుండా ఖాళీ పెట్టారు. బహుశా ఆ పదవిని భర్తీ చేసినందుకు కర్ణాటకలో యెడ్యూరప్ప పడ్డ కష్టాలు మోడి కళ్ళు తెరిపించి ఉండాలి. గవర్నర్ స్వతంత్రించి లోకాయుక్తను నియమిస్తే దానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు మోడి. ఆయన ప్రధాన మంత్రి అయితే అవినీతి నిర్మూలన పధకం అమలు చేస్తారని ఎలా నమ్మడం?
కాంగ్రెస్ అన్నది ఒక రాజకీయ పార్టీ. నరేంద్ర మోడి ఒక వ్యక్తి. అలాంటప్పుడు ‘కాంగ్రెస్ కి 60 యేళ్ళు అవకాశం ఇచ్చారు, నాకు 5 యేళ్ళు ఇవ్వండి’ అని అడగొచ్చా? అడిగితే గిడిగితే ‘బి.జె.పి కి అవకాశం ఇవ్వండి’ అని అడగొచ్చు గానీ తనకు ఇవ్వమనడం ఏమిటి? ఆ విధంగా పార్టీ కంటే తాను ఎక్కువ అని మోడి చెబుతున్నారా? ‘మోడి గాలి’, ‘చాయ్ పే చర్చా’, ‘మోడి: టార్గెట్ 272+’ లాంటి నినాదాలను ఆమోదించడం ద్వారా బి.జె.పియే మోడిని ఆ స్ధాయిలో ఎత్తి చూపుతోంది. తత్ఫలితాన్ని అద్వానీ, జోషి, స్వరాజ్ లాంటి వారు చవి చూస్తున్నారు. ఇక జనమే మిగిలారా?
కాంగ్రెస్ పార్టీకి పోటీగా తమ పార్టీని నిలపడానికి బదులు ఒక వ్యక్తిని నిలబెట్టడం లోనే బి.జె.పి సగం చచ్చినట్లు కాదా?
ఇదంతా ఒక ఎత్తయితే దేశ గతినే మార్చుతానంటున్న మోడి కనీసం ఎన్నికల కోడ్ ని పాటించడం కూడా నేర్చుకోలేదని ఈ కార్టూన్ సూచిస్తోంది. ఓటు వేసి బైటికి వచ్చాక బి.జె.పి గుర్తు కమలం ఆకృతిలో తయారు చేసిన బొమ్మను మోడి ప్రదర్శించడం ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ కేసు పెట్టింది. ఈసారి ఎన్నికల్లో తాము తీసుకున్న అత్యంత తీవ్రమైన నిర్ణయం ఇదే అని కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది.
అదీ సంగతి. దేశానికి ప్రధాని కాగోరుతూ, దేశ గతిని మార్చేస్తానంటున్న మోడి గారు కనీసం ఎన్నికల కోడ్ పాటించాలన్న నియమం కూడా పెట్టుకోలేదు.
అరుణ్ జైట్లీ గారేమో ఎలక్షన్ కమిషన్ పట్ల గౌరవం ప్రకటిస్తూనే ఈ.సి తొందరపడిందని కూడా చెబుతున్నారు. ఆయన ఏమి చెప్పదలిచారు? గౌరవం నిజమా? లేక కోడ్ ప్రకారం వ్యవహరించిన కమిషన్ ను తప్పు పట్టడం నిజమా?
కోడిని తినేవాడు దాణా పెట్టి పోషిస్తున్నాడా ? కోడ్ ను ఉల్లంఘిచినవాడే కోడై
కూస్తూ దేశాన్ని ఉద్ధరిస్తాదు.
what about ajam khan and so called congress leaders
“కోడిని తినేవాడు దాణా పెట్టి పోషిస్తున్నాడా?”
శివరాం గారూ, ఈ లాజిక్ బాగుంది. దీని సాయంతో ఎన్నో పనుల్ని చక్కబెట్టుకోవచ్చు. నీతి-అనీతిల సంగతి తర్వాత!