ఎల్ నినో, లా నినా అంటే?


ప్రశ్న (నాగ మల్లేశ్వరరావు):

ఎల్ నినో, లా నినా అంటే ఏమిటో తెలుగులో వివరించగలరు.

సమాధానం:

ఇవి రెండూ ప్రపంచ వాతావరణ పరిస్ధితులకు సంబంధించినవన్న సంగతి చాలా మందికి తెలుసు గానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయో తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి తెలియదు. 17వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరంలోని మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్ధితిని మొదటిసారి కనుగొన్నారని రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుండీ శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం చేస్తున్నారు. ఆ అధ్యయనం ఇంకా పరిణామ దశలోనే ఉంది.

సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎల్ నినో, వర్షాభావ పరిస్ధితిని వివరిస్తుంది. లా నినా విపరీతంగా వర్షాలు కురిసే పరిస్ధితిని వివరిస్తుంది. స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే క్రైస్తవ బాలుడు (బాల యేసు) అని అర్ధం. లేదా బాలుడు (ద బాయ్) అని కూడా పిలుస్తారు. డిసెంబర్ నెలలో ఎల్ నినో వాతావరణ పరిస్ధితి ఉచ్ఛ దశకు చేరుతుంది. క్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్ లో వస్తుంది గనుక క్రిస్టమస్ పండుగను సూచిస్తూ ఎల్ నినో అని నామకరణం చేశారు.

లా నినో కూడా స్పానిష్ పదమే. ఆంగ్లంలో దీని అర్ధం ‘ద గర్ల్’ అని. ఎల్ నినో కు సరిగ్గా విరుద్ధంగా ఉంటుంది గనుక ‘ద బాయ్’ విరుద్ధ పదం అయిన ‘ద గర్ల్’ గా దానిని పిలుస్తున్నారు. ‘ఎల్ నినో’ లాగా, ‘లా నినా’ మరో బాలికా దేవతా స్త్రీని సూచించదు.

ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు మరియు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించే ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్ నినో – లా నినా లకు కారణం అవుతాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’ (ENSO) వలయాలు అంటారు. సముద్రము, దానిపైన ఆవరించి ఉండే వాతావరణాల ఉష్ణోగ్రతలు తీవ్ర స్ధాయిలో ఒడిదుడుకులకు లోనవడం వల్ల ఇవి ఏర్పడతాయి. ENSO యొక్క ఉష్ణ దశను ఎల్ నినో అనీ చలి దశను లా నినా అనీ పిలవచ్చు.

సాధారణంగా పసిఫిక్ మహా సముద్రంలో వాణిజ్య పవనాలు ఉపరితల సముద్ర నీటిని తూర్పు నుండి పశ్చిమానికి కొనిపోతాయి. అనగా మధ్య అమెరికా పశ్చిమ తీరం, దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలోని పశ్చిమ తీరాల నుండి ఉపరితల సముద్ర నీరు ఆసియా, ఆస్ట్రేలియా తీరాలకు కొనిపోతాయి. ఆస్ట్రేలియా దక్షిణ, ఈశాన్య తీరాలు, చైనా, ఆస్ట్రేలియాల మధ్య ఉన్న వివిధ ద్వీప దేశాలు వీటి మార్గాలో ఉంటాయి. ఈ వాణిజ్య పవనాలు సుదీర్ఘ దూరాలు సూర్యుడి కింద ప్రయాణించడం వలన పశ్చిమ దిశకు వెళ్ళేకొద్దీ వేడెక్కుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ.

ఎల్ నినో ఏర్పడినప్పుడు దీనికి విరుద్ధ పరిస్ధితులు ఏర్పడతాయి. పెరూ, ఈక్వడార్ దేశాల తీరం నుండి పశ్చిమం వైపుగా ఉన్న సముద్ర ఉపరితలం సాధారణ స్ధితి కంటే వేడెక్కుతుంది. ఫలితంగా పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖకు సమీపంగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణించే వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. దానితో పశ్చిమ పసిఫిక్ సముద్ర ఉపరితల జలాలు తూర్పుకు ప్రయాణిస్తాయి. దీనివల్ల అమెరికా ఖండాలలోనూ భారత ఉపఖండం లోనూ, ఈశాన్య యూరప్ లోని కొన్ని ప్రాంతాలలోనూ తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడతాయి.

ఎల్ నినో వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెంటీ గ్రేడు పెరుగుతుంది. ఈ పెరుగుదల ఒక్కోసారి, అరుదుగానే అయినా, 2 నుండి 6 డిగ్రీల వరకూ కూడా ఉండవచ్చు. ఎల్ నినో సంభవానికి ఒక క్రమ పద్ధతి అనేది ఏమీ లేదు. 2 నుండి 7 సంవత్సరాల వ్యవధిలో ఇది ఏర్పడవచ్చు. సగటు వ్యవధి 5 సం.లు అని ఒక అంచనా. ఎల్ నినో వ్యవధి 7 నుండి 9 నెలల వరకూ ఉంటుంది.

వికీ పీడియా ప్రకారం ఎల్ నినో సంభవించింది అనడానికి ఈ కింది పరిణామాలు సూచికలు.

1. హిందూ మహా సముద్రం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా లపైనా ఉపరితల ఒత్తిడి పెరుగుతుంది.

2. తహితితో సహా మధ్య-తూర్పు పసిఫిక్ సముద్రం పైన ఉపరితల గాలి ఒత్తిడి పడిపోతుంది.

3. దక్షిణ పసిఫిక్ లోని వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. లేదా తూర్పుకు ప్రయాణిస్తాయి.

4. పెరు దేశంపై గాలి వేడెక్కి వాతావరణం పైకి ప్రయాణిస్తుంది. అక్కడ చల్లబడి ఉత్తర పెరు ఎడారిలో వర్షాలు కురుస్తాయి.

5. సముద్ర ఉష్ణ జలాలు పశ్చిమ పసిఫిక్, హిందూ మహా సముద్రాల నుండి తూర్పు పసిఫిక్ కు విస్తరిస్తాయి. అవి తమతో పాటు వర్షాన్ని కూడా తీసుకెళ్తాయి. ఫలితంగా పశ్చిమ పసిఫిక్ తీరం, హిందూ మహా సముద్రం (ఇండియా) లలో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడడమే గాక సాధారణంగా వర్షం పెద్దగా కురవని పొడి ప్రాంతాలయిన తూర్పు ఫాసిఫిక్ తీరంలో వర్షం భాగా కురుస్తుంది. అమెరికా వరకు చూస్తే పశ్చిమ తీర ప్రాంతం ఎండిపోయి తూర్పు గల్ఫ్ తీర ప్రాంతంలో వర్షాలు దండిగా కురుస్తాయి.

ఎల్-నినో ప్రభావం ఇండియాపైన ఉంటుంది. కానీ స్ధిరంగా ఉండదు. ఈ సంవత్సరం ఎల్ నినో ఏర్పడే అవకాశం 60 శాతం ఉన్నదని భారత వాతావరణ విభాగం రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఎల్ నినో సంభవించినప్పుడల్లా ఇండియాలో వర్షాభావం ఏర్పడుతుందన్న నియమం లేదు. కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపగా మరికొన్నిసార్లు పెద్దగా ప్రభావం చూపలేదు. 1997-98లో తీవ్ర స్ధాయి ఎల్ నినో సంభవించింది. కానీ ఇండియాపై ప్రభావం చూపలేదు. 2002లో ఒక మాదిరి ఎల్ నినో ఏర్పడగా ఇండియాలో తీవ్ర కరువు పరిస్ధితి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే గత శతాబ్ద కాలంలో ఎల్ నినో వల్ల ఇండియాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. సగం కంటే ఎక్కువసార్లు దుర్భిక్ష పరిస్ధితులు ఏర్పడ్డాయి. అనగా ఎల్ నినో ప్రభావం భారత వ్యవసాయరంగాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

లా నినా వాతావరణం సాధారణంగా ఎల్ నినో అనంతరం ఏర్పడతాయి. కానీ ఎల్ నినో అనంతరం ఖచ్చితంగా లా నినా ఏర్పడుతుందని గ్యారంటీ లేదు. తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో భూ మధ్య రేఖ ప్రాంతం వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయి కంటే పడిపోయినప్పుడు లా నినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చు. లా నినా ప్రభావాలు ఎల్ నినో ప్రభావాలకు సరిగ్గా విరుద్ధంగా ఉంటాయి. ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తాయి. ముఖ్యంగా చిలీ, పెరు, న్యూ జీలాండ్, ఆస్ట్రేలియా తీరాల్లో కుంభ వృష్టి పడుతుంది. లా నినా వల్ల పశ్చిమ ‘దక్షిణ అమెరికా’ లో కరువు ఏర్పడితే ఉత్తర ‘దక్షిణ అమెరికా’లో వర్షాలు బాగా కురుస్తాయి.

ఇండియాలో ఎల్ నినో వల్ల, 2009లో జరిగినట్లుగా, నైరుతీ ఋతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. లా నినా వల్ల భారత నైరుతీ ఋతుపవనాలు లాభపడతాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఉదాహరణకి 2010లో పసిఫిక్ లో ఏర్పడిన లా నినా వల్ల ఇండియాలో నైరుతీ ఋతుపవనాలు దండిగా వర్షాలు ఇచ్చాయి. ఆస్ట్రేలియాలో అయితే ఆకాశం విరిగి నేలమీద పడినట్లుగా వర్షాలు కురిసి తీవ్రమైన ఉత్పాతాలకు దారితీసింది.

ఎల్ నినో ఏర్పడేందుకు గ్లోబల్ వార్మింగ్ కారణమా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం శాస్త్రవేత్తలకే ఇంకా తెలియదు. రెండింటికి సంబంధం ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉందని మాత్రం చెబుతున్నారు. భూ వాతావరణ చరిత్ర అంతా ఎల్ నినో, లా నినాల మధ్య ఊగిసలాడిన చరిత్రే అనీ, ఆ రెండింటి మధ్య సాధారణ వాతావరణం ఎక్కువ కాలం కొనసాగిన చరిత్ర గతంలో ఉండగా, ఇప్పుడది తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ నినో రాక ఇటీవల దశాబ్దాలలో మరీ ముఖ్యంగా గత రెండు, మూడు దశాబ్దాలలో బాగా ఎక్కువయిందని వారు చెబుతున్నారు.

ఇప్పుడు ప్రపంచంలోని వివిధ షేర్ మార్కెట్లు కూడా ఎల్ నినో, లా నినా ప్రభావాలకు అనుగుణంగా స్పందించేందుకు అలవాటు పడ్డాయి. పలు ఆర్ధిక వ్యవస్ధలకు ఋతుపవన వర్షపాతమే ఆధారం కనుక అది సహజమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s