బంగాళాఖాతంలో మలేషియా విమానం?


GeoResonance

హిందూ మహా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా పౌర విమానం MH370 గురించి మరో కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ సదరు విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందని భావించేందుకు తగిన ఆధారాలు తమకు లభ్యం అయ్యాయని ప్రకటించింది. అప్పుడే నిర్ధారించలేము గానీ తమకు దొరికిన శిధిలాలన్నీ బోయింగ్ 777 కి సంబంధించిన శిధిలాలే అనీ కాబట్టి మలేషియా విమానం బంగాళాఖాతంలో కూలిందనేందుకు ఇది గట్టి సాక్ష్యం కావచ్చని తెలిపింది.

గత కొద్ది వారాలుగా అంతర్జాతీయ అన్వేషణా ప్రయత్నాలన్నీ ఆస్ట్రేలియా పశ్చిమ తీర నగరం పెర్త్ కు పశ్చిమ దిశలో ఉన్న విస్తారమైన సముద్ర ప్రాంతంలోనే కేంద్రీకృతం అయ్యాయి. ఆస్ట్రేలియా మెరైన్ ఎక్స్ ప్లోరేషన్ కంపెనీ ‘జియో రెసోనాన్స్’ తమకు తాజాగా విమాన శిధిలాలు దొరికాయని ఆ ప్రాంతం ప్రస్తుత అన్వేషణ ప్రాంతానికి ఉత్తరాన 5,000 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో ఉన్నదని తెలిపింది. తమ అన్వేషణ ఫలితాలను ప్రభుత్వాలు పరిశీలించాలని కోరింది.

జియో రెసోనాన్స్ కంపెనీ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం కేంద్రంగా పని చేస్తుంది. తమ అంచనాల ప్రకారం తాము సొంతగా అన్వేషణ జరుపుతున్నామని ఆ కంపెనీ తెలిపింది. మార్చి 8 తేదీన అదృశ్యమైన MH370 విమానం ఆచూకీ చివరిసారిగా రికార్డయిన వివరాల ప్రకారం తాము అన్వేషణ సాగించామని, ఆ విధంగా బంగాళా ఖాతంలో విమాన శిధిలాలు ఉన్నట్లు గమనించామని తెలిపారు. సదరు చోటుకు సంబంధించిన రికార్డులను విమానం కూలిపోవడానికి ముందూ, తర్వాతా పరిశీలించామనీ ముందు లేని వస్తువులు కూలిపోయిన రెండు రోజుల తర్వాత (మార్చి 10) ప్రత్యక్షం ఆయ్యాయని కంపెనీ అధికారులు తెలిపారు.

శాటిలైట్ ఇమేజ్ లు, విమానాల నుండి తీసిన ఇమేజ్ లు… వీటి సహాయంతో జియో రెసోనాన్స్ కంపెనీ అన్వేషణ సాగించినట్లు తెలుస్తోంది. విమానం కూలిపోయిందని భావించిన వివిధ చోటుల్లో మొత్తం కలిపి 2 మిలియన్ చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ కంపెనీ అన్వేషణ సాగించింది. కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు విమానం ఆచూకీ చివరిసారిగా రికార్డు అయిన చోటుకు ఉత్తరంగా కేంద్రీకరించి పని చేశారు. తమ అన్వేషణ కోసం వారు 20 రకాల సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించారు. చివరికి ఒక అణు రియాక్టర్ నమోదు చేసిన వివరాలను కూడా వారు పరిశీలించారు. అణు క్షిపణులు, అణు సబ్ మెరైన్లను కనిపెట్టడానికి వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తాము వినియోగించామని కంపెనీ ప్రతినిధి డేవిడ్ పోప్ చెప్పారని ది హిందూ తెలిపింది.

MH370 విమానం అదృశ్యం కావడానికి మూడు రోజుల ముందు మార్చి 5 తేదీన తీసిన ఇమేజ్ లను తాము పరిశీలించామని తాము కనుగొన్న వస్తువులు ఆ రోజు అక్కడ లేనట్లు తాము కనుగొన్నామని డేవిడ్ తెలిపారు. “MH370 అదృశ్యం కావడానికి ముందు ఆ శిధిలాలు అక్కడ లేవు. సదరు శిధిలాలు ఖచ్చితంగా MH370 కి చెందినవే అయి ఉంటాయని మేము చెప్పడం లేదు. కానీ అదృశ్యం అయిన విమానం కోసం జరుగుతున్న అన్వేషణలో ఇది ముఖ్యమైన లీడ్ కావచ్చని మా అభిప్రాయం” అని డేవిడ్ తెలిపారు.

జియో రెసోనాన్స్ కంపెనీ వివరాలను మలేషియా సివిల్ ఏవియేషన్ అధికారులు ధృవీకరించలేదు. కంపెనీ చెబుతున్న రికార్డులేవీ ఇంకా తమ దృష్టికి రాలేదనీ, వచ్చాక పరిశీలించి చెబుతామని మలేషియా సివిల్ ఏవియేషన్ డైరెక్టర్-జనరల్ అజారుద్దీన్ అబ్దుల్ రహ్మాన్ చెప్పారని స్టార్ న్యూస్ పత్రిక తెలిపింది.

జియో రెసోనాన్స్ కంపెనీకి చెందిన మరో ప్రతినిధి పావెల్ కుర్సా ప్రకారం కంపెనీ చెప్పిన చోట బంగాళాఖాతంలో అనేక వస్తువులను వారు కనుగొన్నారు. ఆ వస్తువులన్నీ వాణిజ్య విమానం తాలుగా వస్తువులే అని ఆయన చెప్పారు. “బోయింగ్ 777 విమానం కోసం వినియోగించే రసాయనాలు, ఇతర పదార్ధాలను మేము గుర్తించాము. అల్యూమినియం, టైటానియం, రాగి, స్టీల్ అల్లాయ్ తదితర పదార్ధాలు ఇందులో ఉన్నాయి” అని పావెల్ చెప్పారు.

మలేషియా విమానం ఆచూకీ కనిపెట్టడానికి సంవత్సరాలు కూడా పట్టవచ్చని మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వివిధ నేతలు, అధికారులు, నిపుణులు చెబుతున్న నేపధ్యంలో జియో రెసోనాన్స్ చెప్పిన శిధిలాల ఆచూకీ మళ్ళీ కొత్త ఆశల్ని చిగురింప జేసింది.

ప్రస్తుతం జరుగుతున్న అన్వేషణలో ఆస్ట్రేలియాకు మలేషియాతో పాటు చైనా, జపాన్, న్యూ జీలాండ్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికాలు సహాయం చేస్తున్నాయి. అమెరికాకు నేవీకి చెందిన సముద్ర గర్భ డ్రోన్ వాహనం బ్లూఫిన్-21 వారాల తరబడి హిందూ మహా సముద్ర గర్భంలో వెతుకులాడుతున్నా ఇంతవరకు ఫలితం దక్కలేదు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఇంకా హిందూ మహాసముద్రం లోనే తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బాట్ ఇచ్చిన వివరాల ప్రకారం తమ అన్వేషణను మరో 700 కి.మీ x 80 కి.మీ ఏరియాలో జరపడానికి నిర్ణయించారు. ఈ ప్రాంతంలో బ్లూఫిన్-21 అన్వేషణ పూర్తి కావడానికి 5 నుండి 6 నెలల సమయం పట్టవచ్చని ఆయన చెప్పారు. కానీ జియో రెసోనాన్స్ కంపెనీ ఆస్ట్రేలియా, మలేషియా ప్రభుత్వాలు సరైన చోట వెతకడం లేదని అభిప్రాయపడుతోంది. జియో రెసోనాన్స్ చెబుతున్న అంశాలు నిజం కావాలని ఆశిద్దాం. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s