అమెరికాలో మళ్ళీ టోర్నడోల భీభత్సం -ఫోటోలు


అమెరికాలో టోర్నడో (గాలివాన) ల సీజన్ మొదలయింది. శనివారం చెలరేగిన టోర్నడోల ధాటికి వేలాది ఇళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి. రెండు డజన్లకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన గాలివాన, మొత్తం 6 రాష్ట్రాలను ప్రభావితం చేసింది. ఒక్క ఆదివారమే 30కి పైగా టోర్నడోలు భీభత్సం సృష్టించగా వచ్చే రోజుల్లో మరో 100 టోర్నడోలు అమెరికాను తాకవచ్చని అమెరికా వాతావరణ విభాగం హెచ్చరించింది.

అమెరికాలో టోర్నడోగా పిలిచే గాలివాన ఇక్కడ మనం చూసే తరహావి కావు. సుడిగాలి తరహాలో ఆకాశం నుండి భూమి మీదకు నిచ్చెనలు వేసినట్లు ఏర్పడే టోర్నడోలు తాను నడిచిన దారి వెంట పెను విధ్వంసం సృష్టిస్తూ ప్రయాణిస్తాయి. వాడుక భాషలో ట్విస్టర్ గా పిలిచే టోర్నడోలు ఉత్తరార్ధ గోళంలో, ముఖ్యంగా అమెరికాలోనే ఎక్కువగా ఏర్పడతాయి. దక్షిణార్ధ గోళంలో ఇవి ఏర్పడడం చాలా తక్కువ.

ఇండియాలో మనం ఇక్కడ చూసే తీవ్ర తుఫానులు అమెరికాలో హరికేన్ అంటారు. తుఫాను అని పిలిచే గాలివాన ఒక పెద్ద ప్రాంతంపై ఏర్పడే వాతావరణ వ్యవస్ధ. ఇందులో అల్పపీడనం ఏర్పడ్డ ప్రాంతంలోకి గాలి, వాన శక్తివంతంగా గడియారం వ్యతిరేక దిశలో గుండ్రంగా, బలంగా ప్రవేశించడం తుఫాను. టోర్నడో/ట్విస్టర్ అంటే తుఫాను కంటే తక్కువ ప్రాంతంలో గాలి, ఒక నిలువు గొట్టం తరహాలో తీవ్ర వేగంతో సుడులు తిరుగుతూ ప్రయాణించడం. టోర్నడోలు ఒక్కోసారి ఊహించనలవికాని మహా విధ్వంసాన్ని సృష్టిస్తాయి. దాదాపు గంటకు 200 మైళ్ళ వేగంతో గాలి సుడులు తిరిగే టోర్నడోలు భారీ వస్తువులతో పాటు మర్రి మానులను గూడా పెకలించి వేసి తనతో కూడా పట్టుకుపోయి ఎక్కడో విసిరివేయగలవు.

ఇప్పుడు అమెరికాను వణికిస్తున్న వాతావరణం కూడా ఇలాంటి టోర్నడోలను సృష్టిస్తోంది. ఆదివారం నుండి దాదాపు 50కి పైగా టోర్నడోలు ఆరు రాష్ట్రాలలో విధ్వంసం సృష్టించాయని కొన్ని పత్రికలు చెప్పాయి. ప్రాణహాని సంఖ్య ఇప్పటికీ 28కి చేరింది. వీరిలో 17 మంది ఆదివారం (ఏప్రిల్ 27) చనిపోగా 11 మంది సోమవారం చనిపోయారని  సి.బి.సి న్యూస్ తెలిపింది. ఆదివారం ప్రధానంగా ఆర్కన్సాస్ రాష్ట్రంలోని మేఫ్లవర్, విలోనియా పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కన్సాస్, మిస్సౌరి, నార్త్ కరోలినా రాష్ట్రాలలో పలు టోర్నడోలు ఏర్పడ్డాయి.

టోర్నడోల ధాటికి అనేక వేల ఇళ్ళలో విద్యుత్ సరఫరా దెబ్బతిన్నది. వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి. వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆస్తులు, నివాసాలు కోల్పోయి అనేకమంది వీధుల్లో నిలువ నీడలేకుండా మిగిలారు. అలబామా, మిస్సిసిపీ, తెన్నేస్సే రాష్ట్రాలు సోమవారం టోర్నడోల ధాటిని ఎదుర్కొన్నాయి. టోర్నడోల తదుపరి లక్ష్యం జార్జియా రాష్ట్రం కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

మిస్సిసిపీలో సెనేటర్ గిలెస్ వార్డ్ తన భార్యతో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిపి బాత్రూమ్ లో దాక్కున్నారని ఇటుకలతో కట్టుకున్న ఆయన ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నదని పత్రికలు తెలిపాయి. కేవలం 30 సెకన్లలోనే జరిగిన నష్టం అంతా జరిగిపోయిందని గిలెస్ చెప్పారని సి.బి.సి న్యూస్ తెలిపింది. ఏప్రిల్ 27, 2011 తేదీన సంభవించిన 60కి పైగా టోర్నడోల ధాటికి అలబామా రాష్ట్రంలో 250 మందికి పైగా చనిపోయారు. ఆనాటి పరిస్ధితిని ప్రస్తుతం అనేకమంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

ఆదివారం సంభవించిన ఒక టోర్నడో అయితే 800 మీటర్ల వ్యాసంతో 128 కి.మీ దూరం ప్రయాణించి తాను నడిచిన దూరం అంతా పెను విధ్వంసం సృష్టించిందని పలు పత్రికలు తెలిపాయి. ఈ ఒక్క టోర్నడో వల్లనే 15 మంది మరణించారని తెలుస్తోంది. 2011 నాటి టోర్నడో కంటే ఈసారి సంభవించిన టోర్నడో మరింత శక్తివంతగా ఉన్నదని విలోనియా పట్టణ మేయర్ చెప్పారని బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్ తెలిపింది.

కన్సాస్, మిస్సౌరి, మిస్సిసిపీ, నెబ్రాస్కా, లోవా, టెక్సాస్, లూసియానా రాష్ట్రాలకు టోర్నడో హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే టోర్నడోలు ప్రధానంగా స్ధానిక పరిస్ధితుల ఆధారంగానే సంభవిస్తాయి. కాబట్టి టోర్నడోల రాకను వాతావరణవేత్తలు ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యపడదు. అమెరికా జాతీయ వాతావరణ సంస్ధ ఎన్.ఓ.ఎ.ఎ నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం వేడి, తేమ, గాలి ఊపు, శక్తివంతమైన తుఫానును సృష్టించే వాతావరణం ఇవన్నీ కలిసి టోర్నడో ఏర్పడడానికి మార్గం సుగమం చేస్తాయి.

ఈ కింది ఫోటోలను డెయిలీ మెయిల్, ఇండిపెండెంట్ పత్రికలు అందించాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s