నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో పోటీలు –దృశ్య కధలు


సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొందీ, అది మరింతగా ప్రజల చేతుల్లో కుప్పబడే కొద్దీ వార్తల నివేదనలోనూ కొత్త పోకడలు పొడసూపుతున్నాయి. అటువంటి కొత్త పోకడల్లో ఫోటో స్టోరీ ఒకటి. ఒకే ఒక ఫోటోలో ఒక వార్తమొత్తం చెప్పగలగడం ఒక ధోరణి అయితే, కొన్ని ఫోటోలను కలిపి ఒక వార్తా కధనం చూపడం మరొక ధోరణి. అనేక మాటలు చెప్పలేనిది ఒక్క ఫోటో చెబుతుంది అని వార్తా పండితులు చెప్పడం తెలిసిందే కదా!

ఛందోబద్ధ కవిత్వం ఒక్క భాషా పండితులకే పరిమితమైన కాలంలో శ్రీశ్రీ లాంటి మహాకవులు ఉదయించి ఛందోబద్ధ సంకెళ్ళను ఒక్క ఉదుటున తెంచేసిన ఫలితంగా ఇప్పుడు కవిత్వంతో ప్రతి ఒక్కరూ ప్రయోగం చేసే సౌలభ్యం దక్కింది. అలాగే ఫోటోగ్రఫి కూడాను. గతంలో ఫోటోగ్రఫి అన్నది నిపుణులకే పరిమితమైన కళ. కెమెరా మెడలో తగిలించుకుని రావడం ఒకప్పుడు స్టేటస్ సింబల్ కూడా.

సెల్ ఫోన్ల పుణ్యమాని ఇప్పుడది సామాన్యుడికి దాదాపుగా చేరువయింది. ఒక కళగా అది ఇంకా విస్తృతం కావడం ఇంకా మిగిలే ఉండొచ్చు. కానీ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల వలన అందుకు తగిన పునాది మాత్రం పడిందని చెప్పవచ్చు. లేదంటే ఫేస్ బుక్, ఫ్లికర్, యూ ట్యూబ్ లాంటి సామాజిక వెబ్ సైట్ల వేదికగా కుప్పలు తెప్పలుగా పోస్ట్ అవుతున్న వివిధ ఫోటోలు, వీడియోలు ఎలా సాధ్యం?

ఈ నేపధ్యంలో ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మ్యాగజైన్ వాళ్ళు నిర్వహించే ప్రపంచ స్ధాయి పోటీలు సైతం ఒక మాదిరి ఫోటో గ్రాఫర్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ మాటకొస్తే కాస్త క్లిక్ కొట్టడం నేర్చినవారు కూడా తమ ఫోటో పోటీకి పంపే స్ధాయి ఉందనుకుంటే ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ వెబ్ సైట్ కి వెళ్ళి అప్ లోడ్ చేసెయ్యొచ్చు.

2014 సం.కి గాను నేషనల్ జాగ్రఫిక్ వాళ్ళు పోటీలకు ఎంట్రీలను స్వీకరించడం మార్చి లోనే ప్రారంభించారు. జూన్ 30, 2014 వరకూ ఎంట్రీలు స్వీకరిస్తారుట. ఔత్సాహికులు ఎవరన్నా ఉంటే ప్రయత్నించవచ్చు. గత సం. పోటీల్లో ఎన్నికయిన వాటిలో హోలీ సంబరాలపై తీసిన ఫోటో కూడా ఒకటి ఉంది.

ఇప్పటివరకు వచ్చిన ఎంట్రీల్లో కొన్నింటిని ప్రచురించే అవకాశం నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ వాళ్ళు ది అట్లాంటిక్ పత్రికకు ఇచ్చారట. ఆ అవకాశం ద్వారా ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించిన ఫొటోల్లో కొన్ని ఇవి. ఈ ఎంట్రీలను చూస్తే విజేతలను ఎంపిక చేయడం నిర్వాహకులకు కత్తిమీద సాముతో సమానం అని అర్ధం అవుతుంది.

వీటిలో మొదటి ఫోటో అరిజోనాలోని వర్మీలియన్ క్లిఫ్స్ నేషనల్ మాన్యుమెంట్ వద్ద వర్షానంతరం నిలిచిన నీటిలో ప్రతిబింబిస్తున్న ట్రెక్కింగ్ ఏరియాకు సంబంధించినది. నీటికి ఇంత నిశ్చలంగా నిలిచి ఉండే లక్షణం కూడా ఉంటుందా అని ఆశ్చర్యం కలిగించే ఫోటో ఇది. ఏ మాత్రం బెసకకుండా అసలుకి, ప్రతిబింబానికి తేడా లేకుండా చేయగల మిధ్యా లక్షణం కూడాను.

ఆ తర్వాత సైబీరియాలో -30 డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచులో ఆడుకుంటున్న పిల్లాడి ఫోటో. బాప్ రే, 24 డిగ్రీల ఏ.సి లో స్ధిరంగా కూర్చోవడమే దుర్లభం అనుకుంటుంటే -30 డిగ్రీల వద్ద జీవించడం ఇంకెంత కష్టం కావాలి? అలవాటు పడితే పడి ఉండొచ్చు గానీ ఇది మాత్రం సాహస జీవనమే.

మూడో ఫోటో ఆస్ట్రియాలోనిది. ట్రాగోస్ ఆస్ట్రియాలో గ్రీన్ లేక్ కి సంబంధించినది. ఈ సరస్సు ఆకులు రాలే కాలంలో పూర్తిగా ఎండిపోతుంది. వసంత రుతువులో మంచు కరిగిన నీటితో నిండిపోతుంది. అందువల్ల ఈ సరస్సు లోపలి దృశ్యం ఒక వింత అనుభూతిని ఇస్తుంది. ‘వాటర్ వరల్డ్’ సినిమా చూసినవారికి ఆ అనుభూతి ఏమిటో కాస్త స్ఫురణకు రావచ్చు.

ఆ తర్వాత ఫోటో ఇటలీలోని సర్దినియా వద్ద ఉన్న లైట్ హౌస్. దీనికి మాంగియాబర్చే (పడవల్ని తినే) లైట్ హౌస్ గా పేరు. ఇక్కడ సముద్రం ఎప్పుడూ మహా అల్లకల్లోలంగా ఉంటుందిట. అందువల్ల పడవలు బోల్తా పడడం తరచుగా జరిగేదిట. కువైట్ లో మహా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కూడా పరిసరాలపై ఓ కన్ను వేసిన గుడ్ల గూబను ఐదో ఫోటోలో చూడవచ్చు.

ఆరవ ఫోటోలోని పడవ పేరు ‘ద క్వీన్ మేరీ 2’. ఓషన్ లైనర్ పడవల్లో ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పడవ అని తెలుస్తోంది. క్రూయిజ్ లైనర్ లలో దీనికంటే కాస్త పెద్దవి ఉన్నా ఓషన్ లైనర్ లలో మాత్రం ఇదే పెద్దది. (ఒక పోర్టు నుండి మరో పోర్టు కు ప్రయాణీకులని చేరవేసేది ఓషన్ లైనర్. ఒక పోర్టు నుండి జనాన్ని సముద్రంలోకి విహార యాత్రకు తీసుకెళ్లి మళ్ళీ అదే పోర్టుకి తిరిగి తెచ్చేది క్రూయిజ్ లైనర్.) ఫ్రాన్స్ నిర్మించిన ఈ పడవకి యజమాని బ్రిటన్. ఈ పడవ అత్యంత పొడవైనది, ఎత్తయినది, బరువైనది కూడా. పడను నిర్మించి 10 సం.లు అయిన సందర్భంగా 2013 మేలో తీసిన ఫోటో ఇది. నౌక విల్లుపైన నిల్చున్నది దాని కెప్టెన్ కెవిన్ ఒప్రే.

ఉత్తరార్ధ గోళంలో కనిపించే రంగుల ఆకాశాన్ని అరోరా అంటారన్నది తెలిసిందే. వీటికి మరో పేరు నార్త్రన్ లైట్స్. మంచు దట్టంగా కురిసే ఉత్తరాగ్ర ప్రాంతాల్లోనే ఇవి ఏర్పడతాయి. నార్డిక్ లేదా స్కాండినేవియన్ దేశం అయిన ఐస్ లాండ్ లో కనిపించిన అరోరా దృశ్యం 7వ ఫోటోలోనిది. 8వ ఫోటోలో ఉందో లేదో అన్నట్లుగా ఉన్న మంచు గుహ నుండి పైకి తొంగి చూస్తున్న తల్లి ఎలుగుబంటిని చూడవచ్చు. ఈ ఫోటో కోసం ఫోటోగ్రాఫర్ 8 రోజులు వేచి చూశాడట. ఈ ఫోటో తీసి వెళ్లిపోయాక 10 వ రోజుకి గాని అది పూర్తిగా బైటికి రాలేదని ఫోటోగ్రాఫర్ క్రిస్టీన్ హేన్స్ రాశారు.

9వ ఫోటోలో కనిపిస్తున్నది ఆగ్రా నగరంలో స్కూలు పిల్లల్ని మోసుకెళ్తున్న మూడు చక్రాల రిక్షా. ఇది ఆటోనా లేక తోక్కే రిక్షానా అర్ధం కావడం లేదు. ముందు భాగంలో స్టీరింగ్, కూర్చునేందుకు ఉన్న సైకిల్ సీట్ ని బట్టి రిక్షా అనే అర్ధం అవుతోంది. రిక్షాకు కూడా ఇంత పకడ్బందీ రక్షణ చూడడం ఇదే మొదటిసారి.

కొండముచ్చుగా మనం పిలిచేది దీన్నేనా? మకాకే అని పత్రిక చెప్పింది. ప్యారిస్ నగరంలో తీసిన ఫోటో ఇది. చూపుల్లో ఆ తీక్షణత చూస్తే చూపుల్లోనే పేగులు లెక్కబెట్టేట్లు కనిపిస్తోంది. ‘ఏంట్రా వెధవా, పక్కకి ఫో’ అని కాస్త పెద్దరికం నటిస్తున్నట్లుగానూ ఉంది. ఆ తర్వాత ఫోటో ఐస్ లాండ్ లోని ఒక ఐస్ గుహ. చలికాలంలో ఇలాంటి గుహలు ఏర్పడడం ఇక్కడ సాధారణమేనట.

చిన్నప్పుడు నాలుగో తరగతిలోనో ఐదో తరగతిలోనో తిలక్ గురించి చెప్పే ఒక పాఠం ‘మాండలే జైలులో’. తిలక్ ని అరెస్టు చేసి బర్మా లోని మాండలే జైలులో వేశారని ఆ పాఠం చెబుతుంది. ఈ బ్రిడ్జి కూడా అక్కడిదే. పూర్తిగా టేకు కలపతో నిర్మించిన వంతెనపైన స్ధానికులైన బౌద్ధ సాధువులు, పిల్లలు, టూరిస్టులు ‘యు బీన్’ వంతెనపై నడుస్తుండగా ఈ ఫోటో తీశారు. వెలుతురు బ్యాక్ గ్రౌండ్ తో నీడలోంచి తీసే ఫోటోలు ఇలాగే ఉంటాయి. ఒక సమూహంలో ఎవరి పనిలో వారు ఉండగా తీయడం వలన ఈ ఫోటోకి ఒక ప్రత్యేకత వచ్చి చేరింది.

13వ ఫోటో ఉషోదయాన టచ్ డౌన్! జపాన్ లో ష్రిటోకో హోక్కైడో వద్ద ఐస్ గడ్డ పైన గద్ద వాలుతున్న క్షణాల్లో కాపు గాచి తీసిన ఫోటో. ఎంతో అప్రమత్తత, గంటల తరబడిన ఎదురు చూపులు భరిస్తే గానీ ఇలాంటి దృశ్యాలు చిక్కవు. ఆ తర్వాత ఫోటో ఫ్రాన్స్ లో మౌంట్ బ్లాంక్ అనే పర్వతం శిఖరాగ్రం పైన 4,810 మీటర్ల ఎత్తున తీసిన ఫోటో.

15వ ఫోటో అల్జీరియాలోని సహారా ఎడారి. ఇసుక తుఫాను చూసే భాగ్యం కొందరికే దక్కుతుంది. అందంగా పేర్చినట్లున్న ఇసుక కుప్పల వెనుక దూరంగా అంతెత్తున పొడుచుకువచ్చినట్లు ఉన్నది తుఫాను ధాటికి ఎగసిపడిన ఇసుక అని ఫోటోగ్రాఫర్ చెబుతున్నారు. నమ్మడం తప్ప మరొక దారి లేదు మనకి. ఇసుక తుఫాను సృష్టించిన భవంతిగా ఆయన దీన్ని పేర్కొన్నాడు.

మొజాంబిక్ లో వంట చెరుకు కోసం అడవిలో ఓ చెట్టును నరుకుతున్న ఒక పౌరుడిని ఆ తర్వాత ఫోటోలో చూడవచ్చు. ఒక యాబ్ స్ట్రాక్ట్ లాంటి దృశ్యాన్ని మన ముందు నిలిపిన 17వ ఫోటో స్లావ్ బర్డ్ ద్వీపంలోనిది. గ్రీన్ లాండ్ ద్వీప కల్పానికి సమీపంలో ఉండే మరో చిన్న ద్వీపం స్లావ్ బర్డ్. అత్యంత ఎత్తున నిట్ట నిలువగా నిలబడి ఉన్న ఈ కొండలు సముద్రపు ఒడ్డుకి ఆనుకుని ఉండడం ఒక విశేషం.

ఆరిజోనాలో రాష్ట్రం (అమెరికా) లోని గ్రాండ్ కాన్యాన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిట్ట నిలువు కొండ-లోయల వరుస. ఇక్కడ ఆకాశం నూండి నేలకు వంతెన వేసిన ఈ మెరుపులను ఫోటోలో బంధించడానికి ఫోగోగ్రాఫర్ 4 గంటలు వేచి చూశారట. వరి పొలాల్లో చేపల వేట సాగిస్తున్న వింత దృశ్యం 19వ ఫోటో. చైనాలో ఇలాంటి దృశ్యాలు సాధారణమే. కొండలపైన మెట్ల వలె నిర్మించే పొలాల్లో మాగాణి వరి సేద్యం చేయడమే ఒక వింతయితే అందులో చేపలు పట్టడం మరో వింత.

నార్వేలో కొండ రాళ్లపై నిర్మించుకున్న ఈ నగరం ఒక అబ్బురం. మాస్కెనెస్ మునిసిపాలిటీలో ఒక భాగం అయిన ఈ ఇళ్లకు పునాదులంటూ ఏమీ లేవు. కేవలం పందిళ్లపై నిర్మించినట్లు కనిపిస్తున్న ఈ ఇళ్ళు నివాస యోగ్యం కాగలిగినంత గట్టిగా ఎలా నిలబడ్డాయో ఆశ్చర్యం.

One thought on “నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో పోటీలు –దృశ్య కధలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s