కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -2


Elections 2014

3. ప్రయివేటీకరణ: నవరత్నాలుగా పేరు గాంచిన వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లను తెగనమ్మాలని పశ్చిమ కంపెనీలు పోరు పెడుతున్నాయి. అనగా ప్రభుత్వ్బ రంగ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రైవేటీకరణకు కావలసిన తాత్విక భూమికను పాలకవర్గాలు ఇప్పటికే ఏర్పరుచుకున్నాయి. లాభాలు వచ్చే పబ్లిక్ కంపెనీలను ఎందుకు అమ్మేస్తున్నారని అడిగేవారు ఇప్పుడు లేరు. ఆ వాటాలు తెగనమ్ముతుంటే ఎగబడి కొనుక్కునే ధనికవర్గాలే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి షేర్ల మెతుకుల కోసం ఎదురు చూసే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు దేశంలో తయారై ఉన్నారు. వారిపైన బడి మేసే షేర్ బ్రోకర్లు, చిన్నా చితకా కంపెనీలు ఉన్నాయి. వారికి కూడా ప్రయివేటీకరణ కావాలి. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపుతుంటే ఒక వార పొంచి ఉండే కాకులు వీళ్ళు.

భారత ప్రభుత్వ కోశాగార లోటును అదుపులో పెట్టాలంటే ప్రభుత్వ కంపెనీలని తెగనమ్మాలని ఐ.ఏం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు ఏనాడో బోధించాయి. ఆ కారణాన్ని ఇప్పటికీ మన పాలకులు చెబుతున్నారు. ఉన్న ఆస్తులు అమ్మేసి లోటు పూడ్చితే భవిష్యత్తులో లోటు ఎవరు పూడ్చాలో చెప్పేవారు లేరు. చేపలని పట్టి ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పడం ఆకలికి శాశ్వత పరిష్కారం అన్న సూత్రం అందరికి తెలిసిందే. బహుశా ఈ సూత్రాన్ని పాలకులు మరో కోణంలో పాటిస్తున్నారని భావించాలి. వారి దృష్టిలో ఆకలిగొన్నవారు భారత ప్రజలు కాదు, సంక్షోభాల్లో కూరుకుపోయిన పశ్చిమ బహుళజాతి కంపెనీలు. ఆ కంపెనీల కోసం భారత ప్రజలను అనాదిగా పోషిస్తున్న ప్రభుత్వ కంపెనీలను తెగనమ్మేయాలని సామ్రాజ్యవాదులు శతపోరుతుండగా దానికి మన పాలకులు తలలూపుతున్నారు. దానికి జి.డి.పి వృద్ధి అనీ, కోశాగార లోటు అనీ సాకులు చూపుతున్నారు. రాయిటర్స్ కూడా సరిగ్గా ఇదే కారణాలతో ప్రయివేటీకరణ వేగం చేయాలని కోరుతోంది.

2013-14లో ప్రభుత్వ కంపెనీల షేర్ల అమ్మకం ద్వారా 3 బిలియన్ డాలర్లు భారత ప్రభుత్వం సంపాదించింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న మొత్తంలో ఇది మూడో వంతు మాత్రమే. కాబట్టి మరింత వేగంగా ప్రభుత్వ కంపెనీలని అమ్మేసే ప్రభుత్వం రావాలని పశ్చిమ కంపెనీల కోరిక. 2014-15 సం.కి గాను 9.3 బిలియన్ డాలర్లు (రు. 57 వేల కోట్లు) ప్రభుత్వ కంపెనీల అమ్మకం ద్వారా సంపాదించాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఈ లక్ష్యాన్ని కొత్త ప్రభుత్వం మరింత పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. అలా చేస్తే కోశాగార లోటును జి.డి.పిలో 4 శాతానికి తగ్గించే లక్ష్యం సులువుగా నెరవేరుతుందని రాయిటర్స్ ఆశపెడుతోంది. ప్రభుత్వ కంపెనీల అమ్మకం కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన చరిత్ర బి.జె.పి-ఎన్.డి.ఏ కి ఉంది. కాబట్టి మోడి ప్రభుత్వం వస్తే, కంపెనీల కోరిక నెరవేరుతుందనడంలో సందేహం లేదు.

4. సబ్సిడీలు: భారత ప్రభుత్వాలు భారత ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను పెద్ద తలనొప్పిగా పశ్చిమ దేశాలు, వారి కంపెనీలు భావిస్తాయి. అలాగని వారు సబ్సిడీలు ఇవ్వరా అంటే అదేమీ లేదు. ప్రపంచ దేశాల్లో అత్యధిక సబ్సిడీలు ఇచ్చేదీ అమెరికా, ఐరోపా దేశాలే. అటు కంపెనీలతో పాటు ఇటు ప్రజలకు కూడా వివిధ రూపాల్లో అవి సబ్సిడీలు చెల్లిస్తాయి. అయితే ఆర్ధిక సంక్షోభం ఫలితంగా ప్రజల సబ్సిడీలను ఒక్కొక్కటీ తగ్గించివేస్తున్నాయి. కంపెనీల సబ్సిడీలను మాత్రం యధాతధంగా కొనసాగిస్తున్నాయి. సంక్షోభం సాకు చూపి పెద్ద మొత్తంలో కంపెనీలకు మేపిన బెయిలౌట్లు (Troubled Assets Relief Programme – 1, & 2, QE – 1, 2 & 3, దాదాపు జీరో వడ్డీ రేటు మొదలయినవన్నీ అమెరికా ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లే) వాటికి అదనం. తమ కంపెనీలకు ఇలా భారీ సబ్సిడీలు ఇచ్చే అమెరికా, ఐరోపాలు భారత ప్రజలకు మాత్రం ఒక్కపైసా కూడా ఇవ్వకూడదని ఆంక్షలు విధిస్తాయి.

కోశాగార లోటును అదుపు చెయ్యాలన్నా, పశ్చిమ రేటింగ్ కంపెనీలు (ఎస్ & పి, ఫిచ్, మూడీస్) మన దేశ సార్వభౌమ ఋణపత్రాల రేటింగ్ ను తగ్గించకుండా ఉండాలన్నా సబ్సిడీలు తగ్గించాల్సిందేనని రాయిటర్స్ బోధిస్తోంది. 2013-14లో భారత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ జి.డి.పిలో 2.2 శాతం మాత్రమే. ఇదీ ఎక్కువే అని రాయిటర్స్ కుండబద్దలు కొట్టింది. ఈ సబ్సిడీలు ప్రధానంగా ఆహారం, ఎరువులు, ఇంధనం (గ్యాస్, కిరోసిన్, డీజిల్) లకు ఇస్తారు. వీటిల్లో కూడా అత్యధికం వెళ్ళేది ధనికవర్గాలకే. ఆహార సబ్సిడీ పేరుతో పంపిణీ చేసే చౌక దుకాణం సరుకులు ఎవరికి చేరేది జనానికి తెలిసిన విషయమే. సబ్సిడీ ఎరువులను దారి మళ్లించి కాంప్లెక్స్ ఎరువులుగా మార్చి అమ్ముకున్న వై.ఎస్.ఆర్ బంధువు దురాగతం ఇటీవలిదే. గ్యాస్ తదితర ఇంధనం సబ్సిడీ వల్ల అధిక లబ్ది పొందుతున్నది కూడా హోటళ్లు, లాడ్జిలు తదితర పరిశ్రమల వర్గాలే. వారందరు వాడుకోగా ప్రజలకు అందేది చాలా తక్కువ. ఇది కూడా తగ్గిస్తూ కాంగ్రెస్ చట్టాలు చేసింది.

అవసరమైన సబ్సిడీలను మాత్రమే కొనసాగిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా, అభివృద్ధికి నిధులు అందుబాటులో లేకుండా చేసే ఏ ఖర్చునూ అనుమతించబోమని బి.జె.పి చెప్పింది. వేరు వేరు మాటల్లో ఈ రెండు పార్టీలు చెప్పింది ఒకటే. జనానికి ఇచ్చే సబ్సిడీలు తగ్గించేసి ఉన్న దబ్బంతా అవసరం, అభివృద్ధి పేరుతో కంపెనీలకు తరలించడం. ఈ సబ్స్డీల తొలగింపు ద్వారా ఖాళీ అయ్యే మార్కెట్ ను పశ్చిమ బహుళజాతి కంపెనీలు ఆక్రమించడం దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం. చౌకధరల దుకాణాలు లేకుండా చేస్తే జనం ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మోర్, రిలయన్స్ ఫ్రెష్, వాల్ మార్ట్, కేరేఫర్, టెస్కో లాంటి కంపెనీల దుకాణాలకి వెళ్ళాలి. ఈ కంపెనీల సరుకుల సేకరణ విదేశాల నుండే జరుగుతుంది తప్ప భారత దేశం నుండి కాదు. ఆ విధంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పంటలు కూడా మార్కెట్ లేక వ్యవసాయం ఇంకా కుంటుపడుతుంది.

5. కార్మిక చట్టాలు: భారత దేశంలో కార్మిక చట్టాలను సాధ్యమైనంత నీరు గార్చేశారు మన పాలకులు. ఒకటీ ఆరా ఏమన్నా మిగిలి ఉంటే అవి జీవచ్ఛవాలతో సమానం. ఉనికిలో ఉన్నా ప్రాణం ఏ మాత్రం లేని కార్మిక చట్టాలను కూడా తొలగించాలని పశ్చిమ దేశాలు, కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల సంఖ్యను తగ్గించాలంటే అలా చేయకుండా యాజమానుల చేతుల్ని ఈ చట్టాలు కట్టిపడేస్తున్నాయని రాయిటర్స్ వాపోయింది. విచిత్రం ఏమిటంటే కోట్లాది ఉద్యోగాలను సృష్టించాలంటే ఈ చట్టాలని తొలగించాలని చెప్పడం. ఉన్నవారిని తీసేయాలంటే చట్టాలు ఆటంకంగా ఉన్నాయని ఒకపక్క చెబుతూ ఇంకా కోట్లాది ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ చట్టాలు తొలగించాలని చెప్పడం అబద్ధాలు పదే పదే చెప్పి నిజం చేయడంలో ఆరితేరిన పశ్చిమ పత్రికలకే సాధ్యం అవుతుంది. సామెత కోసం పాపం గోబెల్స్ ని ఇంకా వాడుకుంటున్నాం గానీ గోబెల్స్ ని ఎప్పుడో మించిపోయాయి అమెరికా, ఐరోపాల కార్పొరేట్ వార్తా సంస్ధలు.

కఠినమైన కార్మిక చట్టాల వలన కంపెనీలు ఎక్కువగా కాంట్రాక్ట్ కార్మికులను తీసుకోవాల్సి వస్తున్నదనీ దాని ఫలితంగా కార్మికులకు అతి తక్కువ వేతనాలు లభించి ఆదాయ అంతరాలు పెరిగిపోతున్నాయని రాయిటర్స్ ఓ వితండవాదం చేసింది. వేతనాలు ఎక్కువ ఇవ్వాలనుకుంటే కాంట్రాక్టీకరణ తో పనేముంది? కాంట్రాక్టు కార్మికులను తీసుకోకుండా సరిపడా వేతనాలు ఇచ్చి తీసుకోవచ్చు గదా? కనీస తర్కానికి కూడా అందని ఈ కుతర్కాల ఏకైక లక్ష్యం పశ్చిమ బహుళజాతి కంపెనీలకు మేలు చేయడమే అన్నది స్పష్టమే.

కార్మిక చట్టాలను సవరిస్తామని కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ వాగ్దానాలు ఇచ్చాయి. లక్ష్యాలూ పెట్టుకున్నాయి. ఉద్యోగులకు, కార్మికులకు, యాజమాన్యాలకూ అందరికీ న్యాయం చేసే విధంగా కార్మిక చట్టాలు సవరిస్తామని రెండు పార్టీలు వాగ్దానం ఇచ్చాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండే రెండు వర్గాలకూ ప్రయోజనం చేయడం ఎలాగూ కుదరనిపని. వారు చేసేది ఒకే ఒక్కటి: కార్మిక చట్టాలను మరింత నీరుగార్చి లేదా రద్దు చేసి కంపెనీల విచక్షణారహిత దోపిడీకి గేట్లు తెరవడం. కార్మికుల అసమ్మతిని ప్రకటించకుండా చేసే విధంగా నిర్బంధ, నల్ల చట్టాలను మరిన్ని తేవడం. సామ్రాజ్యవాద సంక్షోభం తీవ్రం అవుతున్న నేపధ్యంలో నిర్బంధ, నల్ల చట్టాల అవసరం కూడా స్వదేశీ, విదేశీ పాలకవర్గాలకు పెరుగుతోంది. రాయిటర్స్ డిమాండ్ల జాబితాలోని కార్మిక చట్టాలు ఈ అవసరాన్ని తీర్చడానికి ఉద్దేశించినది మాత్రమే.

6. రక్షణ రంగం: భారత దేశ రక్షణ రంగాన్ని మరింతగా ప్రైవేటీకరించి విదేశీ కంపెనీల పెట్టుబడులకు అనువుగా మార్చాలని అమెరికా, ఐరోపాలు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నాయి. విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇస్తే ఇక ఇండియా విదేశీ ఆయుధాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, ఎంచక్కా అన్నీ దేశంలోనే తయారు చేసుకోవచ్చని పశ్చిమ కంపెనీలు ఊరిస్తున్నాయి. రక్షణరంగంలో  విదేశీ పెట్టుబడుల వలన దిగుమతులు తగ్గించుకుని, ఆధునీకరణ చేపట్టడం సులువు అవుతుందని అవి చెబుతున్నాయి.

ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు ఇండియాయే అని ఒక అంచనా. రక్షణ రంగంలో 26 శాతం విదేశీ యాజమాన్యానికి ప్రభుత్వాలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇమిడి ఉన్న ఆయుధ పరిశ్రమలయితే 26 శాతం కంటే ఎక్కువ విదేశీ పెట్టుబడులకు కూడా అనుమతి ఇస్తామని మన పాలకులు ప్రకటించారు. కానీ అనుభవం చెప్పిన విషయం ఏమిటంటే ఆయుధ పరిజ్ఞానాన్ని అమెరికా ఎవరికీ ఇవ్వదు. ఇటీవల 125 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు కోసం ఇండియా టెండర్లు వేయగా అమెరికా బదులు ఫ్రాన్స్ జెట్ లవైపు ఇండియా మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇదే. ఫ్రాన్స్ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా అప్పజెప్పదు. ఏమన్నా సమస్య వస్తే మళ్ళీ ఫ్రాన్స్ కంపెనీనే అడగాలి.

కాబట్టి విదేశీ రక్షణరంగంలో పెట్టుబడుల అనుమతిని కోరడం వెనుక భారత రక్షణ అవసరాల పట్ల ప్రేమ ఉండి కాదు. తద్వారా భారత రక్షణ రంగాన్ని కూడా తమ అదుపులోకి తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు ఆశిస్తున్నాయి. పెట్టుబడులు ఎంత ఎక్కువగా చొచ్చుకుని వస్తే రక్షణ వ్యూహాల కోసం అంత ఎక్కువగా విదేశాలపై ఆధారపడాలి. చైనా ప్రమాదాన్ని నిలువరించడానికి ఇండియాపై ఆధారపడాలని అమెరికా ఆశీస్తోంది. అమెరికా ఒక దేశంపై ఆధారపడదలుచుకున్నది అంటే అర్ధం, ఆ దేశాన్ని అన్నివిధాలుగా అదుపులోకి తీసుకోవడం అనే. ఆఫ్ఘన్ యుద్ధం కోసం పాక్ పై ఆధారపడినా, సిరియా దురాక్రమణ కోసం జోర్డాన్, సౌదీలపై ఆధారపడినా, ఉక్రెయిన్ అడుపుకోసం పోలాండ్ పై ఆధారపడినా అమెరికా చేసింది ఇదే. కాబట్టి చైనా బూచి చూపే భారత పాలకులు వాస్తవంలో అమెరికాకు ప్రయోజనం చేస్తున్నారు తప్ప దేశానికి కాదు.

చైనా బూచి చూపడంలో హిందూత్వ శక్తులకు అమిత ఆసక్తి. అమెరికాను విమర్శించినప్పుడల్లా హిందూత్వ వాదులు దానిని చైనాకు సమర్ధనగా చెప్పుకోవడం ఇష్టం. 1962 చైనా యుద్ధం వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండే బూటకపు కారణం. ఆ పేరుతో అమెరికాతో అంటకాగడం వారి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి బి.జె.పి సిద్ధం. తాము అధికారంలోకి వస్తే రక్షణ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తామని బి.జె.పి తన మేనిఫెస్టోలో చెప్పింది. కాంగ్రెస్ మాత్రం ప్రాధామ్యాల వారీగా విదేశీ పెట్టుబడుల అవసరాన్ని నిర్ణయిస్తామని చెప్పింది. మొదటి ప్రాధాన్యం ప్రభుత్వ రంగ కంపెనీలకే ఇస్తామని చెప్పింది. పబ్లిక్ సెక్టార్ రక్షణ కంపెనీలపై ఆధారపడిన నిరంకుశ బూర్జువా, బ్యూరోక్రటిక్ వర్గాల మేలు కోసమే కాంగ్రెస్ వాగ్దానం లక్ష్యంగా పెట్టుకుంది. అది మినహా విదేశీ పెట్టుబడులకు కాంగ్రెస్ కి కూడా అభ్యంతరం ఉండబోదు.

7. భీమా రంగం: జీవిత భీమా, సాధారణ భీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులపై ఉన్న పరిమితిని పూర్తిగా ఎత్తివేయాలన్నది పశ్చిమ కంపెనీల డిమాండ్. ప్రస్తుతం 26 శాతం మేర విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. 74 శాతం వాటా స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు ఇస్తూ మిగిలింది విదేశీ కంపెనీలు పెట్టవచ్చు. ఈ పరిమితిని 49 శాతానికి పెంచుతూ యు.పి.ఏ బిల్లును ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందగా లోక్ సభలో ఆమోదం పొందవలసి ఉంది. ఇతర బిల్లులపై రగడ చెలరేగడంతో భీమా బిల్లుకు వీలు లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం దీనిని ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది. విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం కంటే పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

భారత భీమా రంగం 2012 నాటికి 72 బిలియన్ డాలర్ల (రు. 4.32 ల. కోట్లు) విలువ కలిగినదని, ఇది 2020 నాటికి 280 (రు. 17 ల.కోట్లు) బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఒక అంచనా. ఇంత భారీ మార్కెట్ ను ఆక్రమించుకోవడం కోసం పశ్చిమ ఫైనాన్స్ కంపెనీలు గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్నాయి. జీవిత భీమా రంగంలో ఎల్.ఐ.సి, ఎస్.బి.ఐ లు ఇప్పటికీ 75 శాతం వాటా కలిగి ఉన్నాయి. క్లయిమ్ ల పరిష్కారంలో ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా ఎల్.ఐ.సి కి పేరుంది.

మరోవైపు పశ్చిమ భీమా కంపెనీలు నష్టాలకు పెట్టింది పేరు. క్లయిమ్ లు ఎగవేయడంలో అవి దిట్ట. అమెరికాలోని అత్యంత భారీ భీమా కంపెనీ ఏ.ఐ.జి నిలువునా కుప్ప కూలిన చరిత్ర ఇటీవలిదే (2008). అలాంటి విఫల, నష్టజాతక కంపెనీలకు భారత దేశ భీమా రంగాన్ని ఇచ్చేయాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి భారత పాలకులు ఓ.కె చెప్పేస్తున్నారు. భీమా రంగంలోని కార్మికవర్గం ప్రతిఘటన వల్లనే ఇన్నాళ్లూ భారత ప్రభుత్వ భీమా రంగం నిలబడింది. యూనియన్ లు క్రమంగా బలహీనపడుతున్న నేపధ్యంలో దానిని విదేశీ కంపెనీలకు అప్పజెప్పడం ఇక సమస్య కాదు. ఆ మంత్రసాని పనికి ఎవరు పూనుకుంటారన్నదే మిగిలిన సమస్య. కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ ఆ పనికి సిద్ధంగా ఉన్నాయి.

8. బ్యాంకింగ్: బ్యాంకింగ్ రంగాన్ని కూడా పూర్తి స్ధాయిలో తమకు ఇచ్చేయాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. మందగిస్తున్న ఆర్ధిక వృద్ధిని పరుగులు పెట్టించాలన్నా, మొండి అప్పులు పేరుకుపోకుండా ఉండాలన్నా పూర్తిస్ధాయి ప్రయివేటీకరణ చేయాలని కోరుతున్నాయి. ఎంత పరిహాసం అంటే అమెరికాయే స్వయంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి బైటికి రాలేక సతమతం అవుతోంది. బిలియన్ల కొద్దీ బెయిలౌట్లు పంచి పెడుతూ కృత్రిమంగా వృద్ధిని నమోదు చేస్తోంది. అది కూడా 1 శాతం కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడానికే అమెరికా అష్ట కష్టాలు పడుతోంది. ఇండియా కనీసం 4.5 శాతం వృద్ధికి తగ్గలేదు. కాబట్టి పశ్చిమ బ్యాంకింగ్ కంపెనీల అవసరం ఇండియా కంటే అమెరికాకే ఎక్కువగా ఉంది. ఐరోపా దేశాలు కూడా ప్రతికూల (నెగిటివ్) వృద్ధి రేటును ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాయి. కనుక ఐరోపా దేశాలకు కూడా వాటి సేవలు ఎక్కువ అవసరం కాదా?

వాస్తవం ఏమిటంటే అమెరికా, ఐరోపాలలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వలన పశ్చిమ ఫైనాన్స్ కంపెనీల లాభ దాహాన్ని అక్కడి మార్కెట్ తీర్చలేకపోతోంది. దానితో వారి ఫైనాన్స్ పెట్టుబడి, పెట్టుబడిగా రియలైజ్ అయ్యే మార్గాలు కుచించుకుపోతున్నాయి. ఫలితంగా ఇండియా లాంటి దేశాల ఫైనాన్స్ వనరులను కొల్లగొట్టడానికి అవి ఎదురు చూస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ తో సహా బ్యాంకింగ్, భీమా, పోర్ట్ ఫోలియో తదితర రంగాల్లో పరిమితంగా ప్రవేశించినందుకే అక్కడ జలుబు చేస్తే ఇక్కడ పడీ పడీ తుమ్ముతున్న పరిస్ధితి. ఇంకా చొరబడితే దేశ ఆర్ధిక వ్యవస్ధ కనీసంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండదు. కానీ బ్యాంకింగ్ రంగంలో మరింత దూకుడుగా సంస్కరణలు అమలు చేయడానికి కాంగ్రెస్, బి.జె.పి ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.

2008లో ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం వచ్చిందే వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్) లలోని బ్యాంకుల వల్ల. అలాంటి బ్యాంకులు ఇండియాను ఏ విధంగా ఉద్ధరిస్తాయో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

ఇంకా బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇవ్వడం పెంచాలనీ, విద్యుత్ పంపిణీని కూడా పూర్తిగా ప్రైవేటీకరించాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేస్తే బొగ్గు గనుల తవ్వకంలో అవినీతికి తావు ఉండదని రాయిటర్స్ ఒక వింత వాదన చేసింది. యు.పి.ఏ II హయాంలో వెల్లడి అయిన బొగ్గు కుంభకోణం కేవలం ప్రైవేటు కంపెనీల వల్ల జరిగినదే. అంత జరిగినా ప్రైవేటు కంపెనీల వల్ల అవినీతి తగ్గుతుందని చెప్పాలంటే ఎంత సాహసం కావాలి?

ఢిల్లీలో విద్యుత్ పంపిణీని రిలయన్స్, టాటా తదితర ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం వలన ప్రజలకు ఎంత నష్టం జరిగిందో, ఛార్జీలు ఎంతగా పెరిగిపోయాయో, ఎంత అవినీతి చోటు చేసుకుందో నెల రోజుల ఎఎపి పాలన వెల్లడి చేసింది. విదేశీ కంపెనీలకు కూడా ఇందులో చోటిస్తే ఛార్జీలు ఇక ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యే లేదు. గుజరాత్ నమూనా వల్ల 24 గంటలు విద్యుత్ సరఫరా అయిందనీ, పలు ప్రశంసలు పోందిందని రాయిటర్స్ మురిసిపోయింది. కానీ వాస్తవం ఏమిటంటే అక్కడ రైతులకు విద్యుత్ అందింది కేవలం 5 నుండి 8 గంటలు మాత్రమే. అది కూడా రాత్రి సమయాల్లో.

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రకారం గుజరాత్ లో 11 లక్షల ఇళ్లకు ఇంకా విద్యుత్ సౌకర్యమే లేదు. వాటిలో 15 శాతం పట్టణాల్లో ఉన్న ఇళ్లే. 9 లక్షల ఇళ్ళల్లో కిరోసిన్ దీపమే వెలుగు ఇస్తోంది. కంపెనీలకు మాత్రం 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతోంది. గుజరాత్ లో విద్యుత్ ఛార్జీలు యూనిట్ కి 8 రూపాయల పైమాటే అనీ అంత ధర ఇస్తున్నందునే కంపెనీలు పోటీపడి అక్కడ కంపెనీలు నెలకొల్పాయని ఎఎపి నాయకులు వెల్లడించిన నిజం. ప్రజలను చీకటిలో ఉంచుతూ ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకోవడం గుజరాత్ సాధించిన మోడల్. కంపెనీలకు మాత్రమే మేలు చేసే ఈ మోడల్ ను పశ్చిమ పత్రికలు ఆకాశానికి ఎత్తడం సహజమే.

పశ్చిమ దేశాల కోర్కెలు తీర్చడానికి భారత దేశంలోని ప్రధాన స్రవంతి పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుండి మహా రాష్ట్ర వరకూ, కాశ్మీర్ నుండి తమిళనాడు వారకూ ఎ రాష్ట్రంలో ప్రభుత్వం చూసినా ఈ విధానాలనే అమలు చేస్తున్నాయి. ఇక ప్రజలకి దారేది?

11 thoughts on “కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -2

  1. 1990 వరకు దేశంలో ఉన్న వనరులలో ప్రస్తుతం ఉన్నవనరులు(కోల్పోయినవి) ఎన్ని? వివరాలు ఉంటే అందించగలరు!

  2. భీమా, బ్యాంకింగ్ రంగాలు ప్రైవేటైపోతే మనం డబ్బుని ఇంటి పెరట్లో గోతులుతీసి అందులో దాచుకోవడం ఉత్తమమేమో! (చిన్నప్పుడు చదివిన కధలోలా)
    రక్షణరంగం ప్రైవేటంటే బ్రిటీష్వారు ప్రవేశ పెట్టిన ఒకప్పుడు సైన్య సహకార పధ్ధతి మళ్ళీ రావడంకాదూ!

    న్యాయాన్నీ, ప్రభుత్వాన్నీ మాత్రం ఎందుకు వదిలిపెట్టాలో అర్ధం కావడంలేదు. Of course న్యాయం, ప్రభుత్వం అంగట్లోకి వచ్చి చానారోజులే అయ్యిందనుకోండి (ఎన్నికలు ఆతంతే కదా) విదేశీ కంపెనీలుకూడా ఈరెందింటినీ కొనుక్కోగల్గేరోజు మరీ దూరంకాదన్నమాట.

  3. నిజమే కదా విశేషజ్ఞ గారు. ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తే పీడా పోతుంది.
    విశేఖర్ గారు మీరు వివరించిన విషయాలు చూస్తే ఒళ్లు గగుర్పొడచడమే కాదు, ఒక రకమైన షాక్ కలుగుతోంది. పరిస్థితి ఇంత దారుణమని తెలిసి కూడా జనం నిజం గ్రహించడం లేదు.

  4. .ఈ రెండు ఆర్టికల్స్ చదవటం వలన కొత్త విషయాలు తెలుస్తాయి. చైనా యుద్దంలో మనదేశానికి నేతృత్వం వహించిన థాపర్ గారు, మీడీయాలో డేవిల్స్ అడ్వొకేట్ పోగ్రాం నిర్వహించే కరణ్ థాపర్ తండ్రి. http://telugu.greatandhra.com/articles/mbs/mbs-news-views-reviews-52098.html
    http://telugu.greatandhra.com/articles/mohana-makaranadam/mohana-makarandam-44-52051.html

  5. bima rangam gurinchi chepthu LIC and SBI okkate annatluga rasaru. SBI private bima ranga company cardiff ane videshi company vata 26% untundi.FDI parimithi perigithe tana vatanu cardiff penchukovacchu. LIC dadapu 16 lakshala kotla asthulu kalgi prajalandariki chendina samstha.licni rakshiknchukovadamante desha arthika svavalambanani rakshikovadamanntte.

  6. వేణుగోపాల్ గారూ మీరు చెప్పింది నిజమే. ఫ్రాన్స్ కంపెనీ కార్డిఫ్ ఎస్.ఏ కి ఎస్.బి.ఐ లైఫ్ లో వాటా ఉంది. బిల్లు పాసయితే ఆ వాటా పెంచుకోకుండా అది ఊరుకోదు. ఆ లెక్కన అది సగం ప్రైవేటు కంపెనీ అయిపోతుంది.

    లోప సవరణకు ధన్యవాదాలు.

  7. పి.యస్.యు. (నవరత్నాలు) లను . రిటైల్ లో యఫ్.డి.ఐ. కను వ్యతిరేకించిన బిజెపి, రేపు అధికారం లో కి వచ్చిన తరువాత కూడ అదే పాలసి ని కొనసాగిస్తామని ప్రకటించారు.

  8. పి.యస్.యు. (నవరత్నాలు) లను ప్రైవేటికరించరు . రిటైల్ లో యఫ్.డి.ఐ. కను వ్యతిరేకించిన బిజెపి, రేపు అధికారం లో కి వచ్చిన తరువాత కూడ అదే పాలసి ని కొనసాగిస్తామని ప్రరరకటించru

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s