
Polling officers with electronic voting machines (EVM) along with Indian security personnel travel in a boat to reach polling stations ahead of the sixth phase of the general election in Assam April 23, 2014. REUTERS/Utpal Baruah
భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు.
పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి ఎలాగూ ఎదురు చూపులు తప్పవు. వాటితో పాటు ఫలితాల కోసం ఎదురు చూసేదీ వ్యాపార, భూస్వామ్య, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వర్గాలు. వీరిలో కూడా అందరికంటే ఎక్కువగా ఆత్రపడుతున్నది సామ్రాజ్యవాదులే. అనగా అమెరికా, ఐరోపా దేశాల బహుళజాతి కంపెనీలు వారి భారతీయ ఏజెంట్లూను. వినడానికి కాస్త కఠినంగా ఉన్నప్పటికీ నిజం అదే మరి.
నిజానికి ఈ నాలుగు వర్గాలు అంతగా ఆత్రపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా లబ్ది పొందేది వారే. కానీ ఈసారి పరిస్ధితి వారిని ఆత్రపడేలా చేస్తోంది. దానికి కారణం తమ వాళ్ళే అనుకున్నప్పటికీ 10 యేళ్ళు పాలించిన యు.పి.ఏ వారి ఆశలకు తగినట్లుగా వ్యవహరించలేదన్నది వారి ఫీలింగ్. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యు.పి.ఏ నూతన ఆర్ధిక విధానాలను పక్కాగా అమలు చేసింది.
వాటి ఫలితాన్ని పైన చెప్పిన నాలుగు వర్గాలు చక్కగా అనుభవించారు అనేందుకు వరుసగా వెల్లడయిన లక్షల కోట్ల భారీ కుంభకోణాలే సాక్ష్యం. కానీ పశ్చిమ బహుళ జాతి కంపెనీలకు యు.పి.ఏ సంస్కరణల వేగం సరిపోలేదు. మధ్య మధ్యలో ఆహార భద్రత అనీ, ఉపాధి హామీ పధకం అనీ జనం సొమ్ముని కాస్తయినా తిరిగి వారికే చెల్లించడం స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు సుతారాము నచ్చలేదు. పైగా ప్రతి సంస్కరణకి మీన మేషాలు లెక్కించడం, దానికి కూటమి ధర్మం అని సాకులు చెప్పడమూ వారికి నచ్చలేదు.
2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం తదితర కుంభకోణాలు వెల్లడి అయ్యాక ఏర్పడ్డ పరిస్ధితిని చక్కదిద్ది యధావిధిగా సంస్కరణలను అమలు చేయడంలో యు.పి.ఏ విఫలం అయిందని మన పాలకుల విదేశీ యాజమానుల అభిప్రాయం. ఆ కోపంతోనే మన్మోహన్ కి వ్యతిరేకంగా టైమ్ లాంటి పత్రికలు అసమర్ధ ప్రధాని అని బిరుదులు ఇచ్చి మరీ తిట్టిపోశాయి. భారత ప్రభుత్వానికి విధానపరమైన పక్షపాతం (policy paralysis) వచ్చిందని నిరసించాయి. పనిలో పనిగా అవినీతిమయం అని అభివర్ణిస్తూ భారత ప్రజల పక్షం ఉన్నట్లు నటించాయి కూడాను.
ఇప్పుడు స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు (సింపుల్ గా ‘కంపెనీలు’ అందాం) మహా వీరుడయిన రాజకీయ నాయకుడు కావాలి. ఆ నాయకుడు అసమ్మతి అనేదే లేకుండా చేయగలగాలి. స్వపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అసమ్మతిని, భేదాభిప్రాయాన్ని తొక్కిపారేయ్యాలి. అలా తోక్కెయ్యడానికి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. బీహార్ బి.జె.పి నేత గిరిరాజ కిషోర్ అలాంటి సాంపుల్ ఒకటి ఎన్నికల ముందే రుచి చూపించారు. మోడి విమర్శకులు పాకిస్ధాన్ సమర్ధకులే అనీ, కాబట్టి మోడిని విమర్శించేవారంతా పాక్ వెళ్లిపోవడం మేలని ఆయన సూచించారు.
ఇతర పార్టీలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా కూడా ఆయన తన మాటల్ని వెనక్కి తీసుకోకపోగా మళ్ళీ అవే మాటల్ని బహిరంగంగా చెప్పారు. ఆయన కోసం పోలీసులు వెతకడం, ఆయన దొరక్కపోవడం… ఇవన్నీ మామూలు విషయాలు. వాటివల్ల గిరిరాజ్ గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మోడి లాంటి నాయకుడు అధికారంలోకి వస్తే అసమ్మతి, విమర్శ, ఆందోళన… లాంటివి ఏ విధంగా అణచివేతకు గురవుతాయో గిరిరాజ్ ముందే ఒక నమూనా చూపారు.
కంపెనీలకు కావలసింది కూడా సరిగ్గా ఇలాంటి నాయకులే. అమెరికా, ఐరోపాల ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు అంత తీవ్రంగా ఉన్నాయి మరి. ఒకవైపు పొదుపు విధానాలతో ప్రజల కొనుగోలు శక్తికి కోతపెడుతూ మరోవైపు పన్నులు పెంచుతూ పోతుంటే కంపెనీల ఉత్పత్తులకు అక్కడ మార్కెట్ పడిపోయింది. కాబట్టి వారి సరుకుల కోసం మరింత మార్కెట్ (కొనుగోలుదారులు) కావాలి. భారత దేశంలో చూస్తేనేమో, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సాంప్రదాయక గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు ఇత్యాది దేశీయ ఉత్పత్తిదారుల ఆధీనంలో ఉన్న మార్కెట్ కు రక్షణగా అనేక భారతీయ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను ఇంకా ఇంకా నీరుగార్చాలి. అసలు రద్దు చేసేస్తే ఇంకా మేలు.
‘నవరత్న’ అనీ, గాడిద గుడ్డు అనీ బ్రహ్మాండమైన ఉత్పాదక సామర్ధ్యం కలిగిన ప్రభుత్వ పరిశ్రమలు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎల్.ఐ.సి, జి.ఐ.సి లాంటి ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు భారత దేశ ఫైనాన్స్ మార్కెట్ కు పట్టుగొమ్మగా ఉన్నాయి. వీటితో పోటీ పడడం విదేశీ బహుళజాతి కంపెనీల వల్ల కావడం లేదు. ఎన్ని ప్రతికూల పరిస్ధితులు కల్పించినా అవి తమపై భారత ప్రజలు పెట్టుకున్న నమ్మకమే పెట్టుబడిగా నిలబడ్డాయి.
ఇలాంటి కంపెనీలని కూల్చేస్తే పశ్చిమ కంపెనీలకు బోలెడు మార్కెట్. వారు తమకు అనుకూలమైన మార్కెట్ పరిస్ధితులను సృష్టించుకోవాలంటే నమ్మకమైన, దూకుడుగా వ్యవహరించగల, ప్రజల ఆందోళనలను కర్కశంగా అణచివేయగల నాయకులు, అధికార వ్యవస్ధ కంపెనీలకు కావాలి. భారత నాయకుల వేలితోనే భారత ప్రజల కళ్ళు పొడవాలి. ఈ లక్షణాలన్నీ మోడీ, ఆయన వెనుక ఉన్న హిందూత్వ గణాలు కలిగి ఉన్నాయని కంపెనీలు భావిస్తున్నాయి. ఆ ఆశతోనే మోడి చుట్టూ అభివృద్ధి, ఉద్యోగాలు అనే ఒక మాయా పొరను కష్టపడి నిర్మించుకున్నాయి. వారి ప్రయత్నం సఫలం అయితే తమ ఆశలు ఈడేరినట్లేనని కంపెనీలు భావిస్తున్నాయి. ఆ ఆశతోనే పశ్చిమ కార్పొరేట్ మీడియా ద్వారా తమ డిమాండ్ లను ముందే వెల్లడి చేస్తున్నాయి.
బ్రిటిష్ వాణిజ్య, రాజకీయ వార్తా సంస్ధ రాయిటర్స్ పశ్చిమ బహుళజాతి కంపెనీల తరపున ఒక డిమాండ్ల జాబితా తయారు చేసి ప్రచురించింది. అనగా కంపెనీల డిమాండ్లను భారత రాజకీయ పార్టీల ముందు ఉంచింది. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ డిమాండ్లు నెరవేర్చవలసిందే. తామూ మోడితో పాటుగా సంస్కరణలు అమలు చేయగలమని కాంగ్రెస్ కూటమి, సో కాల్డ్ ధర్డ్ ఫ్రంట్ (లేదా ఆల్టర్నెట్ ఫ్రంట్) లు కూడా వివిధ రూపాల్లో చెప్పాయి కూడా. రాయిటర్స్ తయారు చేసిన డిమాండ్ల జాబితా ఇలా ఉంది:
1. జి.ఎస్.టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్): ఇప్పుడు ఉన్న వివిధ పన్నుల వ్యవస్ధలన్నీ రద్దు చేసి ఒకే ఒక పన్నుల వ్యవస్ధను ప్రవేశపెట్టాలని కంపెనీలు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నాయి. యు.పి.ఏ I, II ప్రభుత్వాలు రెండూ దీనిని అమలు చేయడానికి కోడ్ రాసి పెట్టాయి. కానీ రాష్ట్రాల అభ్యంతరాల వల్ల కుదరలేదు. కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు అని ప్రత్యేకంగా లేకుండా ఒకే యాజమాన్యంలో పన్నులు వసూలు చేసే పద్ధతిని జి.ఎస్.టి ప్రవేశపెడుతుంది. దీనివల్ల రాష్ట్రాల ఆర్ధిక వనరులు కుచించుకుపోతాయని, కేంద్రం పెత్తనం పెరుగుతుందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవాయే నడుస్తోంది. ఆ పార్టీల వెనుక పాలకవర్గాలు తమ వాటా తగ్గిపోతుందని సహజంగానే భావిస్తున్నారు. వారి అభ్యంతరాలను పక్కకు నెట్టేసి జి.ఎస్.టి అమలు చేయాలని కంపెనీలు కోరుతున్నాయి.
జి.ఎస్.టి తెస్తే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి కనీసం 2 శాతం పెరుగుతుందని సామ్రాజ్యవాదులు నమ్మబలుకుతున్నారు. ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది, అదే సమయంలో వ్యాపార లావాదేవీల ఖర్చు తగ్గిపోతుందని రాయిటర్స్ చెబుతోంది. ఒకవైపు జి.డి.పి వృద్ధి, ఆదాయం పెరుగుతూ మరోవైపు వ్యాపారులకు ఖర్చు ఎలా తగ్గుతుంది? జనంపై పన్నుల భారం పెరగడం, వ్యాపారులకు మేలు చేసే పన్నుల వ్యవస్ధను ప్రవేశపెట్టడం జరక్కుండా ఈ రెండు పనులు ఒకే చర్యతో జరగడం ఎలా సాధ్యం? నిజానికి జి.ఎస్.టి ని వ్యతిరేకించిన రాష్ట్రాల్లో బి.జె.పి పాలిత రాష్ట్రాలూ ఉన్నాయి. కానీ బి.జె.పి తన మేనిఫెస్టోలో మాత్రం రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరిస్తూ నిర్దిష్ట కాల వ్యవధిలో జి.ఎస్.టి ని అమలు చేస్తానని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అయితే అధికారంలోకి వస్తే 1 సం.లో జి.ఎస్.టి అమలు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
2. ఆర్.బి.ఐ చట్టం: ఆర్.బి.ఐ నియమించిన కమిటీ ఒకటి గత జనవరిలో కొన్ని సిఫారసులు చేసింది. ఆరి.బి.ఐ విత్త విధానం (మానిటరీ పాలసీ) కు వినియోగదారి ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఉండేలా చట్టం మార్చాలని ఈ కమిటీ సిఫారసుల్లో ఒకటి. అలాగే విత్త విధానానికి ఆర్.బి.ఐ గవర్నర్ ఒక్కరే కాకుండా ఒక కమిటీ బాధ్యత వహించాలని చెప్పింది. ఆ విధంగా ఆర్.బి.ఐ గవర్నర్ పై భారం తగ్గుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సిఫారసును వ్యతిరేకించింది. ఎప్పటి లాగానే టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణమే విత్త విధానానికి లక్ష్యంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం. ద్రవ్యోల్బణంతో పాటు ఆర్ధిక వృద్ధి (జి.డి.పి గ్రోత్) కూడా ఆర్.బి.ఐ విత్త విధానానికి లక్ష్యంగా ఉండాలని కాంగ్రెస్ అభిలాష.
బి.జె.పి ఈ విషయంలో ఇంకా ఏమీ చెప్పలేదు. కానీ బి.జె.పి కోశాధికారి గోయల్ మొదలుకుని సుబ్రమణ్య స్వామి వరకు ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చర్యలను తీవ్రంగా విమర్శించారు. జి.డి.పి వృద్ధి పడిపోతుంటే వడ్డీ రేటు తగ్గించి మరిన్ని నిధులు వ్యాపారులకు, పెట్టుబడిదారులకు ఇవ్వడం మానేసి ద్రవ్యోల్బణం సాకుగా చూపుతూ మూడుసార్లు వడ్డీ రేటు పెంచడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఒకరిద్దరు నాయకులైతే రఘురాం రాజన్ ను తొలగిస్తామని కూడా చెప్పారు.
కాబట్టి ఆర్.బి.ఐ కమిటీ సిఫారసులు కొండెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జి.డి.పి వృద్ధిని లక్ష్యంగా చేసుకుంటే ఇక ఆర్.బి.ఐ పలుదఫాలుగా ప్రకటించే విత్త విధానం ధరలను పట్టించుకోవడం మానేస్తుంది. అనగా ధరలు ఒకపక్క పెరుగుతున్నప్పటికీ (అనగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ) ఆర్ధిక వృద్ధి పేరుతో మరింత డబ్బును వ్యాపారులకు, కంపెనీలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా వడ్డీ రేట్లు తగ్గిస్తుంది. ఇది ఒక నష్టం. మరొక నష్టం ఏమిటంటే ప్రజలకు వాస్తవంగా అనుభవంలోకి వచ్చే ధరలు వినియోగదారీ ధరలే తప్ప టోకు (wholesale) ధరలు కాదు. కాబట్టి వినియోగదారీ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంను లక్ష్యంగా చేసుకుని విత్త విధానం రూపొందిస్తే అది ప్రజలకు మరింత దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తనకు అది ఇష్టం లేదని ప్రత్యక్షంగా చెప్పగా బి.జె.పి పరోక్షంగా చెప్పింది. ఏ రాయితో పళ్ళు ఊడగొట్టుకోవాలో నిర్ణయించుకోవలసిన అవస్ధ జనానిది.
ఆర్.బి.ఐ చట్ట సవరణలో కొన్ని ప్రజలకు మేలు చేసే చర్యలు ఉండగా ఆ పేరుతో ప్రజలకు కీడు చేసే అవకాశమూ పొంచి ఉంది. అలాగే వ్యాపార, కంపెనీ వర్గాలకు మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు కలిగే లాభం పిడికెడు కాగా ధనికులకు కలిగే మేలు బారెడు. అందుకే ఆర్.బి.ఐ చట్టం సవరించాలని రాయిటర్స్ కోరుతోంది.
చైతన్యవంతులైన ఐరొపావాసులు పోరాటాలవలన భూస్వామ్యవ్యవస్థను కూల్చి పెట్టుబడిదారివ్యవస్థలోకి వెళ్ళినట్టు, పెట్టుబడిదారివ్యవస్థను కూల్చి తదుపరి వ్యవస్థలోకి వెళ్ళడానికి పరిస్థుతులు అనుకూలంగా ఉన్నయనుకొంటున్నారా?
మూల గారూ, ఎక్కడ అని మీ ఉద్దేశ్యం, ఇండియానా లేక ఐరోపా దేశాలా? ఇండియాలో పెట్టుబడిదారీ వ్యవస్ధ పూర్తిగా రాలేదు. మనకు కనపడుతున్న పెట్టుబడిదారులు సామ్రాజ్యవాద దేశాల ప్రాపకంలో ఉన్నవారు. వారు స్వతంత్రులు కారు. కాబట్టి భారత భూస్వామ్య వ్యవస్ధను కూల్చగల కోరిక, చొరవ వారికి ఉండదు. ఇక సామ్రాజ్యవాదులకేమో భూస్వామ్య సంబంధాలను అలా ఉంచితేనే ఉపయోగం. స్వతంత్ర పెట్టుబడిదారులుగా భారత పెట్టుబడిదారులు అవతరించి స్వతంత్రంగా వ్యవహరిస్తే సామ్రాజ్యవాద పెట్టుబడిని దేశంలోకి రానివ్వరు. ఇక్కడ ఏ విప్లవమూ సక్రమంగా జరగలేదు. చివరికి జాతీయ స్వతంత్రం కూడా. అధికార మార్పిడి ద్వారా తమ అనుయాయులను గద్దెపై కూర్చోబెట్టి బ్రిటిష్ వాడు పక్కకు తప్పుకున్నాడు. అధికారం చేపట్టిన భారతీయ భూస్వాములు, పెట్టుబడిదారులు, బ్యూరోక్రట్లు ఆ అధికారాన్ని సామ్రాజ్యవాద కంపెనీల సేవకు ఉపయోగపెడుతున్నారు.
ఐరోపా దేశాల్లోనైతే పెట్టుబడిదారీ వ్యవస్ధ పరిపక్వ దశకు చేరుకుంది. అక్కడ సోషలిస్టు విప్లవానికి తగిన పరిస్ధితులు ఉన్నాయి. కానీ సామ్రాజ్యవాద గొలుసు కట్టు బలంగా ఉంది. ఆ గొలుసు బలహీనపడడంతో పాటు, స్ధానికంగా ప్రజలు (కార్మికవర్గం) చైతన్యవంతులై తిరుగుబాటు చేస్తే సోషలిస్టు విప్లవాలు అక్కడ సాధ్యం. కానీ పరిస్ధితులు ఉన్నంత మాత్రానే సరిపోదు. స్వీయాత్మక పరిస్ధితులు (ప్రజల చైతన్యం) గానీ, బాహ్య పరిస్ధితులు (గొలుసు బలహీనపడడం) గానీ తదనుగుణంగా మారకుండా విప్లవాలు రావు.
శేఖర్ గారు,ఎక్కడైతే పెట్టుబడిదారి వ్యవస్థ(ఐరోపా) అంథ్యదశకు చేరుకుందో అక్కడి పరిస్థితిగూర్చే నేనడిగా! మీ సమాదానానికి సంతోషం.సామ్రాజ్యవాదగొలుసుకట్టు గూర్చి వివరించగలరు.
పెట్టుబడిదారీ వ్యవస్ధ అత్యున్నత దశ సామ్రాజ్యవాదం. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు తమలో తాము పోటీపడుతూ కూడా పరస్పరం సహకరించుకుంటాయి. ఈ సహకార సంబంధమే గొలుసుకట్టు. సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు తీవ్రమై తమలో తాము తీవ్రంగా పోట్లాడుకున్నపుడు ఈ గొలుసు కట్టు కొన్నిచోట్ల బలహీనపడుతుంది. అనగా కొన్ని పెట్టుబడిదారీ దేశాల్లో వివిధ సామ్రాజ్యవాద కంపెనీలు సహకరించుకోవడం కంటే శత్రువులుగా పోట్లాడడమే ఎక్కువై బలహీనపడతారు. అప్పుడు అక్కడి కార్మికవర్గం అప్రమత్తంగా, ఐక్యంగా, చైతన్యవంతులై, ఒకే రాజకీయ సంస్ధ కింద సమీకృతులై ఉంటే స్ధానిక పెట్టుబడిదారీ వ్యవస్ధను కూల్చివేసి సోషలిస్టు వ్యవస్ధను స్ధాపించుకోగలుగుతారు.
మూల గారూ, మీ ప్రశ్నలు సందర్భ సహితం, ఉపయోగకరం.
శేఖర్ గారు, సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు తీవ్రమై తమలో తాము తీవ్రంగా పోట్లాడుకున్నపుడు ఈ గొలుసు కట్టు కొన్నిచోట్ల బలహీనపడుతుంది- అని తెలుపారుకదా! ఈ పరిస్థితులు రష్యాకు,మిగతా ఐరోపా దేశాలకు మధ్యగల సంబందాలలో పోల్చుకోవచ్చా? ఒకవేళ అలా జరిగినట్లయితే మీరుపేర్కొన్న విప్లవం రష్యాలో సంభవిస్తుందా? లేక ఐరోపాలో సంభవిన్స్తుందా? ఊహాజనితమైన ఈ ప్రశ్నకు సమాధానమేమైనా ఉన్నదా?
ఈ ప్రశ్నకు సమాధానం పైనే ఉంది.
“కానీ పరిస్ధితులు ఉన్నంత మాత్రానే సరిపోదు. స్వీయాత్మక పరిస్ధితులు (ప్రజల చైతన్యం) గానీ, బాహ్య పరిస్ధితులు (గొలుసు బలహీనపడడం) గానీ తదనుగుణంగా మారకుండా విప్లవాలు రావు.”
గొలుసు బలహీనపడడం, బలహీనపడినట్లు కనిపించడం రెండూ వేరు వేరు. రష్యా-అమెరికా+ఐరోపాల మధ్య సంబంధాలు ఇంకా శత్రు సంబంధాలుగా మారలేదు. అవి సర్దుబాటు చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా జర్మనీ (ఇ.యు కి ఇదే ఆర్ధిక నాయకుడు) రష్యాతో కయ్యానికి విముఖంగా ఉంది. కనీసం ఆంక్షలకు కూడా సిద్ధంగా లేదు. (పైకి మాత్రం గంభీరంగా ప్రకటనలు ఇస్తోంది.) దానికి కారణం రష్యాలో జర్మనీ కంపెనీలు చాలా పెట్టుబడులు పెట్టాయి. పైగా తక్కువ ధరకు వచ్చే రష్యా గ్యాస్ దానికి అవసరం.
జర్మనీ, ఇ.యు ల అవసరాలను తీర్చడానికి అమెరికా ఫ్రాకింగ్ గ్యాస్ ఉత్పత్తిని పెంచుతోంది. పెరగనున్న గ్యాస్ ఉత్పత్తికి మార్కెట్ పెరగాలన్నా రష్యా-యూరప్ ల మధ్య దూరం పెరగడం అమెరికాకి అవసరం. అందుకు ఉక్రెయిన్ సంక్షోభం అమెరికాకి కలిసి వచ్చింది. ఇవన్నీ సామ్రాజ్యవాద దేశాల మధ్య ఐక్యతా, ఘర్షణల వ్యక్తీకరణలే.
1917 లో రష్యాలో సోషలిస్టు విప్లవం వచ్చినపుడు కూడా ఇలాగే సామ్రాజ్యవాద గొలుసు రష్యాలో బలహీనపడింది. దానితో పాటు అక్కడ బోల్షివిక్ పార్టీ ప్రజలను ఐక్యం చేసి ఆర్గనైజ్ చేసింది. ఈ రెండు పరిస్ధితులు తోడై అక్కడ విప్లవం వచ్చింది. అలాగే 1949 నాటికి జపాన్ సామ్రాజ్యవాదం చైనాలో బలహీనపడి ఓడిపోయింది. అదే సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రజలను ఆర్గనైజ్ చేసి 20 యేళ్లపాటు సాయుధ పోరాటం చేసి జపాన్ వ్యతిరేక జాతీయోద్యమం, దేశీయ భూస్వామ్య+పెట్టుబడిదారీ వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవం లను విజవంతం చేయగలిగింది.
ఒక విప్లవం విజయవంతం కావాలంటే అంతర్గత పరిస్ధితులు పరిపక్వ స్ధితికి చేరుకోవడం మొదటి షరతు. దానికి బాహ్య పరిస్ధితులు కూడా చేయూత నివ్వడం రెండవ షరతు. ఈ రెండూ జతకలిస్తేనే విప్లవం సాధ్యం. ఏ ఒక్కటి మిస్ అయినా విప్లవం విఫలం అవుతుంది.