ఉక్రెయిన్: అమెరికాకు తా చేసింది ప్రజాస్వామ్యం


Victoria Nuland

‘తా వలచింది రంభ, తా మునిగింది గంగ’ అని మూర్ఖుల ధోరణిని వర్ణిస్తుంది ఒక సామెత. మనం చెప్పుకునేది మూర్ఖుల గురించి కాదు. ‘ఉంటే నాతో ఉండు. లేదంటే శత్రువుతో ఉన్నట్లే’ అని ప్రపంచ దేశాల్ని శాసించే అమెరికా గురించి. తాను చెప్పిందే నీతి. తన మాటే శాసనంగా చెలాయించుకునే అమెరికా ఏక నీతికి తాజా తార్కాణం ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో విక్టోరియా నూలంద్ వదరిన వాక్కులు!

విక్టోరియా నూలంద్ అమెరికాకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. అనగా ఉప విదేశాంగ మంత్రి. ఈమె ఐరోపాకు సంబంధించిన విదేశీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మకంగా కూలదోయడానికి రైట్ సెక్టార్, స్వోబోడా లాంటి మితవాద, నయా నాజీ సంస్ధలు ఆందోళన చేస్తుండగా స్వయంగా కీవ్ వెళ్ళి వారికి కుకీలు పంచి పెట్టి ప్రోత్సహించిన వీరనారి విక్టోరియా నూలంద్.

అమెరికా, ఇ.యు లు ఏ తరహా ఆందోళనలైతే ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోత్సహించారో సరిగ్గా అదే తరహా ఆందోళనలు ఇప్పుడు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కాకపోతే అప్పుడు యనుకోవిచ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీవ్ లో ఆందోళనలు జరిగితే ఇప్పుడు పశ్చిమ దేశాలు నిలిపిన మితవాద, నయా నాజీ పక్షాలు భాగస్వామ్యం వహిస్తున్న పశ్చిమ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా దోనెత్స్క్, ఖార్కివ్, స్లావియాన్స్క్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

విక్టర్ యనుకోవిచ్ రష్యా అనుకూలుడు అని ఇ.యు, అమెరికాలు చెబుతాయి. కానీ వాస్తవం అది కాదు. ఉక్రెయిన్ లోని సాంప్రదాయక ధనిక వర్గాల ప్రయోజనాల కోసమే యనుకోవిచ్ నిలబడ్డాడు. ఇ.యు చేరిక వలన, ఐ.ఏం.ఎఫ్ విధించే పొదుపు విధానాల వలన ఆ వర్గాల ప్రయోజనాలకు భంగం కలగదన్న హామీ ఇవ్వాలని యనుకోవిచ్ ఆయన వెనుక ఉన్న ధనిక వర్గాలు కోరగా ఆ హామీని ఇ.యు, అమెరికాలు ఇవ్వలేదు. ఇ.యు ప్రతిపాదించిన ‘అసోసియేటెడ్ అగ్రిమెంట్’ ఒప్పందమే ఉక్రెయిన్ మార్కెట్ ను ఇ.యు, అమెరికాలకు పాదాక్రాంతం చేయడానికి. అలాంటప్పుడు ఉక్రెయిన్ ధనిక వర్గాలకు ఏమీ కాదని హామీ ఎలా ఇస్తాయి? దానితో అగ్రిమెంట్ ను యనుకోవిచ్ వాయిదా వెయ్యడం, ఉన్నట్లుండి కీవ్ లో ఆందోళనలు ప్రారంభం కావడం జరిగిపోయింది. ఇది ఇటీవలి చరిత్ర.

ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ ప్రాంతాలు గానీ, క్రిమియా గానీ ఒకప్పుడు రష్యాలో భాగంగా ఉన్నవే. అక్కడ మెజారిటీ ప్రజలు రష్యన్ భాషను మాట్లాడుతారు. సాంస్కృతికంగా రష్యాకు దగ్గరగా ఉంటారు. ఆ ప్రాంతాళ్ళో రష్యన్ భాష రెండవ అధికార భాష. ఉక్రెయిన్ లో అధికారంలోకి వచ్చిన పశ్చిమ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రష్యన్ భాషను అధికార భాషగా రద్దు చేసేశారు. ప్రాంతాల (రాష్ట్రాల) అధికారాల్లో కోత పెడుతూ డిక్రీలు జారీ చేశారు. దానితో అక్కడ సహజంగానే ఉక్రెయిన్ నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ, రష్యాకు అనుకూలంగానూ ఆందోళనలు మొదలయ్యాయి. నాటోను ప్రమాదకరంగా రష్యా సరిహద్దుల వరకు విస్తరిస్తున్న నేపధ్యంలో అబధ్రతకు గురవుతున్న రష్యా సహజంగానే ఈ ఆందోళనలకు పరోక్ష మద్దతు ఇస్తుండవచ్చు. కానీ రష్యా మద్దతు గురించి ఉక్రెయిన్ ఆరోపణలు చెయ్యడమే గానీ ఇంతవరకూ గట్టి సాక్ష్యం ఏదీ వెల్లడి కాలేదు.

కీవ్ లో రైట్ సెక్టార్, స్వోబోడా సంస్ధలు చేసినట్లుగానే తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాల్లోనూ రష్యా అనుకూల ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. వాటి చుట్టూ టైర్ లతో బ్యారీకేడ్లు నిర్మించి ఉక్రెయిన్ పంపిన బలగాలను తిప్పి పంపేస్తున్నారు. కీవ్ పంపుతున్న బలగాల్లో కొందరు ఆందోళనకారులతో చేరిపోవడం ఒక విశేషం. ‘టెర్రరిస్టులను పారద్రోలాడానికి యుద్ధం’ అంటూ తమ బలగాలను కీవ్ పంపుతోంది. అయితే ఆ బలగాలు అక్కడికి వెళ్ళాక తాము తలపడవలసింది ప్రజలతోనే అని తెలియడంతో వెనక్కి రావడమో ఆందోళనకారులతో కలిసిపోవడమో చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో విక్టోరియా నూలంద్ కీవ్ ఆందోళనలను, తూర్పు, దక్షిణ ప్రాంతాల ఆందోళనలతో పోల్చలేమని చెబుతూ విచిత్ర వ్యాఖ్యానాలు, నీతులు వల్లిస్తోంది. “కీవ్ లో పరిస్ధితిని (తూర్పు ప్రాంత ఆందోళనలతో) పోల్చడానికి వీలు లేదు. కీవ్ లో నిరసనకారులు ఇప్పటికీ ప్రభుత్వ భవనాలను ఆక్రమించి ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ ల ద్వారానే వారాపని చేస్తున్నారు. రాడా (ఉక్రెయిన్ పార్లమెంటు) అనుమతి వారికి ఉంది. ప్రభుత్వ అనుమతి ఉంది. భవనాల యజమానులు వారికి లీజు కూడా ఇచ్చారు” అని నూలంద్ సి.ఎన్.ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయుధ కీవ్ ఆందోళనకారులను వెనకేసుకొచ్చారు.

అంటే, ప్రభుత్వాల అనుమతితో ప్రభుత్వ పాలనా భవనాలను సాయుధంగా ఆక్రమించుకోవచ్చని నూలంద్ చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే కీవ్ ఆందోళనకారులు గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అనుమతులు, లీజులు లేకుండా ఆక్రమణలకు, ఆందోళనలకు, దాడులకు దిగారు తప్ప అనుమతులు తీసుకుని కాదు. వారిని ఖాళీ చేయించలేక కొత్త ప్రభుత్వం ఆక్రమణలకు అనుగుణంగా చట్టం మార్చుకుని అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. దీనిని అమెరికా ప్రజాస్వామ్య నేతలు సమర్ధించడం ఒక వింత. కాగా అదే పని చేస్తున్న తూర్పు ప్రాంతాల రష్యా అనుకూల ఆందోళనకారులను టెర్రరిస్టులుగా చెప్పడం మరో వింత.

నూలంద్ ఇంకా ఇలా అంటున్నారు. “కీవ్ పరిస్ధితిని తూర్పు ఉక్రెయిన్ లో జరుగుతున్న సంఘటనలతో పోల్చలేము. వారు సాయుధ వేర్పాటువాదులు. వారు బలక్లావా ఆయుధాలను ధరించి ఉన్నారు. భారీ మందుగుండు కలిగి ఉన్నారు. ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకున్నారు. పరిశీలకులను లోపలికి అనుమతించడం లేదు. విలేఖరులను కూడా అనుమతించడం లేదు” అని ఆమె సి.ఎన్.ఎన్ తో మాట్లాడుతూ అన్నారు.

కీవ్ ఆందోళనకారులు గత సంవత్సరం అక్టోబర్ నుండి చేసింది కూడా సరిగ్గా ఇదే. పైగా వారిని భవనాలనుండి ఖాళీ చేయిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని దాన్ని ఉల్లంఘించారు. దేశాధ్యక్షుడిని దేశం విడిచి పారిపోయేలా మారణకాండకు తెగబడ్డారు. ఇప్పుడు కూడా తూర్పు, దక్షిణ ప్రాంతాల ఆందోళనకారులను ఖాళీ చేయించడానికి జెనీవా లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్, ఇ.యు, అమెరికా, రష్యాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యత రష్యాపైన ఉన్నదని అమెరికా వాదిస్తోంది. కీవ్ ఆందోళనకారులను ఖాళీ చేయించడానికీ, పరిస్ధితిని మామూలు స్ధితికి తేవడానికి జరిగిన ఒప్పందాన్ని అప్పటి ఆందోళనకారులు, అమెరికా, ఇ.యులు చర్యలు తీసుకోకుండా దానికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఇప్పుడు తూర్పు రాష్ట్రాల్లో అలా జరుగుతుందని ఎలా ఆశించగలరు?

తాను చేస్తే ప్రజాస్వామ్యం, ప్రత్యర్ధి చేస్తే టెర్రరిజం. ఇరు పక్షాలు కలిసి ఉక్రెయిన్ ప్రజల రోజువారీ జీవనాన్ని నరకప్రాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ రష్యాకు ప్రజామోదం ఉండగా అమెరికా, ఇ.యు లకు అది లేదు. అందుకే అవి బలవంతంగా తమకు కావలసిన పరిణామాలను ఉక్రెయిన్ పై రుద్దుతున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s