ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం పడవేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు భారత పాలకులు మద్దతు ఇవ్వగా రష్యా అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది. రష్యాతో శక్తి వనరుల వాణిజ్యాన్ని 2018 నాటికి మూడు రెట్లు పెంచే ఒప్పందాన్ని చైనా చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ రోజు (ఏప్రిల్ 22) ఉక్రెయిన్ సందర్శించి నాజీ పాలకులకు మద్దతు ప్రకటించాడు. సోవియట్ రష్యా పతనం తర్వాత తన మిలట్రీ ఖర్చును బాగా తగ్గించుకున్న స్వీడన్ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చెబుతూ దానిని బాగా పెంచనున్నట్లు ప్రకటించడం తాజా పరిణామం.
సెంట్రిస్టు పార్టీలు, మితవాద పార్టీలు నాలుగు కలిసి స్వీడన్ లో ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి. తమ మిలట్రీ ఖర్చును పెంచడానికి నిర్ణయించుకున్నామని ఈ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తమ నిర్ణయానికి కారణం ఉక్రెయిన్ లో జరుగుతున్న పరిణామాలే అని ఆ ప్రభుత్వం చెప్పింది. రానున్న పది సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరం 5.5 బిలియన్ల స్వీడిష్ క్రోనార్ ల చొప్పున రక్షణ కోసం ఖర్చు చేస్తామని స్వీడన్ ప్రభుత్వం తెలిపింది. అనగా పది సంవత్సరాలలో 55 బిలియన్ల క్రోనార్లు. ఇది 8.3 బిలియన్ల అమెరికన్ డాలర్లకు సమానం.
రానున్న సంవత్సరాల్లో మరో 10 ఫైటర్ జెట్ విమానాలు కొనుగోలు చేస్తామని స్వీడన్ ప్రభుత్వం తెలిపింది. మరో 2 సబ్ మెరైన్లు కూడా కొనుగోలు చేస్తామని తద్వారా బాల్టిక్ సముద్రంలో తమ రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకుంటామని తెలిపింది. బాల్టిక్ సముద్రంలోని గోట్లాండ్ ద్వీపం స్వీడన్ కి చెందినదే. ఈ ద్వీపం వద్ద రక్షణ పెంచుకోవడానికి జలాంతర్గాములను వినియోగిస్తామని తెలిపింది.
సోవియట్ యూనియన్ 1991లో కూలిపోయిన అనంతరం స్వీడన్ తమ రక్షణ వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. మిలట్రీ బడ్జెట్ ను బాగా తగ్గించేస్తున్నామనీ, తమ సైనికులను కూడా అంతర్జాతీయ శాంతి పరిరక్షక పనులకు మాత్రమే కేటాయిస్తామని తెలిపింది. చెప్పడానికి శాంతి పరిరక్షణ అని చెప్పినప్పటికీ ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల దురాక్రమణకు సైన్యాన్ని పంపిన దేశాల్లో స్వీడన్ కూడా ఒకటి. అయితే తమ సైనికులు క్రియాశీలక పాత్ర కాకుండా పరోక్ష పాత్ర మాత్రమే నిర్వహిస్తారని చెప్పుకుంది.
ఇప్పుడు తమ మిలట్రీ సామర్ధ్యం అవసరానికి తగిన విధంగా లేదని స్వీడన్ భావిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో తమ రక్షణ సామర్ధ్యం పెంచుకోవలసిన అగత్యం ఏర్పడిందని భావిస్తోంది. ఈ విషయంలో పాలక పక్షంతో పాటు వామపక్ష భావాలకు దగ్గరగా ఉంటాయని భావించే ప్రతిపక్షాలు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ది హిందు తెలిపింది.
ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ ప్రకారం ఈ సంవత్సరం స్వీడన్ రక్షణ బడ్జెట్ 4.7 బిలియన్ క్రోనార్లు. దీనిని క్రమంగా పెంచుతూ 2024 నాటికి 5.5 బిలియన్లకు చేర్చుతామని స్వీడిష్ ప్రభుత్వం ప్రకటించింది. అసోసియేటెడ్ ప్రెస్ సంస్ధ ప్రకారం సంవత్సరానికి 5.5 బిలియన్ల చొప్పున వచ్చే పదేళ్లపాటు స్వీడన్ రక్షణ కోసం ఖర్చు పెట్టనుంది.
“ఉక్రెయిన్ లోనూ, దాని చుట్టుపక్కలా తీవ్రమైన అస్ధిరకర మార్పులు చోటు చేసుకున్నాయి. సార్వభౌమ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది” అని స్వీడన్ తన ప్రకటనలో పేర్కొంది. స్వీడన్ నాటో సభ్య దేశం కానప్పటికీ ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలకు సైన్యాన్ని పంపింది. ఇప్పటికే 60 ఫైటర్ జెట్ లను కలిగి ఉన్న స్వీడన్ తాజా కొనుగోళ్లతో 70 కి పెంచుకోనుంది. మూడు సబ్ మెరైన్లకు తోడు మరో 2 సబ్ మెరైన్లను కొనుగోలు చేయనుందని ఏ.ఎఫ్.పి తెలిపింది.
పర్యావరణం, అణు విద్యుత్ నిర్వహణల విషయంలో రష్యాకు ఇస్తున్న సహకారాన్ని ఇకనుండి నిలిపివేస్తామని స్వీడన్ తెలిపింది. రష్యాకు వ్యతిరేకంగా ఇంకా పలు ఇతర చర్యలను స్వీడన్ ప్రకటించిందని ఎ.ఎఫ్.పి తెలిపింది.
తమను తాము తటస్ధ దేశాలుగా చెప్పుకునే నార్డిక్ దేశాలు ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు.