గృహిణి హత్యకు దారితీసిన ఫేస్ బుక్ స్నేహం


facebook

ఎలా అర్ధం చేసుకోవాలో, ఎవరిని తప్పు పట్టాలో తెలియని వికృత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేస్ బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్లు సృష్టిస్తున్న సామాజిక సంక్షోభం అంతా ఇంతా కాదు. వయసు లేదు, విలువ లేదు, పద్ధతి లేదు, ఎవల్యూషన్ అసలే లేదు. పరిచయం చూస్తేనేమో ఫేస్ బుక్ లాంటి వర్చువల్ ప్రపంచంలో. దాని వాస్తవ పరిణామాలేమో నిజ ప్రపంచం పైన!

43 సంవత్సరాల ఒక గృహిణి 22 సంవత్సరాల యువకుడితో (సోకాల్డ్) ప్రేమలో పడిపోయింది. అదీ ఫేస్ బుక్ వేదికగా. ఆమె తన వయసు ఎంతో ముందే (ఫేస్ బుక్ లోనే) వెల్లడి చేసి ఉంటే ఎలా ఉండేదో గానీ, తీరా తనతో స్నేహం చేసింది 43 యేళ్ళ గృహిణి అని కలుసుకున్నాక తెలియడంతో ఆమెను కాల్చి చంపేశాడు ఉత్తర ప్రదేశ్ లోని ఒక యువకుడు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నదికి చెందిన ధువంధార్ ఫాల్స్ వద్ద జరిగిందీ దారుణం. జబల్ పూర్ సమీపంలోని భేదా ఘాట్ మార్బుల్ కొండల మధ్య 43 యేళ్ళ మహిళ శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 యేళ్ళ యువకుడు వినీత్ కుమార్ ఆమెను నాటు తుపాకితో కాల్చి చంపాడని పోలీసుల విచారణలో తేలింది.

ముజఫర్ నగర్ కి చెందిన వినీత్ కుమార్ ఫేస్ బుక్ ద్వారా జబల్ పూర్ కి చెందిన మహిళతో స్నేహం చేశాడని తెలిసింది. ఫేస్ బుక్ లో వివిధ పేర్లతో ఖాతాలు ఉన్న ఆ మహిళ ఏ ఖాతాలోను తన వయసు ఎంతో చెప్పలేదుట. బహుశా వాటర్ ఫాల్స్ వద్ద కలుసుకోవాలని అనుకున్నారేమో, అక్కడ తాను ఇష్టపడిన వ్యక్తిని వినీత్ కలిశాడని తెలుస్తోంది.

జబల్ పూర్ ఎస్.పి హరి నారాయణాచారి మిశ్రా ప్రకారం స్ధానికులు రాత్రి 8 గంటల సమయంలో తుపాకి గాయంతో రక్తం కారుతుండగా వాటర్ ఫాల్ వద్ద పడి ఉన్న వినీత్ ను కనుగొన్నారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన డాక్టర్లకు, తాను ఒక మహిళతో వాటర్ ఫాల్ వద్ద ఉన్నాననీ ఆమెను తాను ఫేస్ బుక్ లో కలిశానని, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసిందని చెప్పాడు.

“అతను పదే పదే ఈ విషయం చెబుతూ ఉన్నాడు. ఆమెపైన కాల్పులు జరిపావా అని ప్రశ్నిస్తే ఏం చెప్పలేదు. ఆ తర్వాత స్పృహ కోల్పోయాడు. ఆ రాత్రికే ఆయన చనిపోయాడు” అని డాక్టర్ మిశ్రా చెప్పారని ది హిందు తెలిపింది. ఆమెను నీటిపారుదల శాఖలో గుమస్తాగా పని చేస్తున్న వ్యక్తి భార్యగా పోలీసులు గుర్తించారు. ఆమె పెద్ద కూతురు వయసు 22 సం.లు. మార్బుల్ బండలపై చనిపోయి ఉన్న ఆమె శరీరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్కడే ఒక చోట పడి ఉన్న పిస్తోలును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ కు పంపామని పోలీసులు చెప్పారు. ఇద్దరికీ ఒకే తుపాకికి చెందిన బులెట్ గాయాలు తగిలాయని, అతి సమీపం నుండి కాల్చడం, గుండెకు తగలడం… ఈ కారణాల వల్ల ఇద్దరూ చనిపోయారని తెలుస్తోంది. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రేమించుకునే జంటలు ఇలా తుపాకి ధరించడం మామూలేనని, బంధువుల నుండి రక్షణ కోసం వారిలా చేస్తారని ది హిందు పత్రిక చెబుతోంది.

పంజాబ్, ఢిల్లీల్లో ఉద్యోగం చూసుకోవడానికి వెళ్తున్నట్లు యువకుడు తన ఇంట్లో చెప్పగా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నానని మహిళ తన ఇంట్లో చెప్పి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు కూడా జబల్ పూర్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్ లో ఇద్దరూ కలుసుకుని వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తమ పరిశోధన ఇంతవరకు ఏ విషయమూ తేల్చలేదని అన్నీ కోణాలనూ తాము పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఉన్న పరిస్ధితులను బట్టి వినీత్ కాల్పులు జరిపాడని తాము భావిస్తున్నామని తెలిపారు. “మహిళ అనేక ఫేస్ బుక్ ప్రొఫెల్స్ నిర్వహిస్తోంది. వేటిలోనూ ఆమె తన వయసు గురించి చెప్పలేదు” అని పోలీసులు చెప్పారు.

ఫేస్ బుక్ ప్రవేశపెడుతున్న సంక్షోభాలకు పరిష్కారం వెతుక్కోవాల్సిన భారం ఇప్పుడు సమాజాలపై పడుతోంది.

20 thoughts on “గృహిణి హత్యకు దారితీసిన ఫేస్ బుక్ స్నేహం

 1. సమస్య ఉన్నది ఫేస్ బుక్ లో కాదు. మనవాళ్ళ మెంటాలిటీలో ! మనకు ప్రతి కొత్త టెక్నాలజీ కావాలి. కానీ అది ఇచ్చే స్వేచ్ఛ మాత్రం ఉండకూడదు. మనది ఒక hopelessly conservative society. మనుషులు నోరెత్తితే భరించలేని, క్షమించలేని సొసైటీ. మనది గుంపులకే తప్ప వ్యక్తుల స్వేచ్ఛకీ, మానవహక్కులకీ విలువివ్వని సొసైటీ. ఈ బుద్ధులు గల సమాజానికి ఫేస్ బుక్కే కాదు, సెల్ ఫోన్లూ, కంప్యూటర్లూ మొదలైన ఏ టెక్నాలజీ అయినా వేస్టే. ఇహపోతే ఈ వార్తలో ఆ అబ్బాయే ఆమెని చంపాడనడానికి ఆధారం కనిపించడం లేదు.

 2. @ మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రేమించుకునే జంటలు ఇలా తుపాకి ధరించడం మామూలేనని, బంధువుల నుండి రక్షణ కోసం వారిలా చేస్తారని ది హిందు పత్రిక చెబుతోంది.
  మన దేశం ఆయుధాల దిగమతిలో అగ్రస్థానంలో ఉందంటే ఆ ఆయుధాలన్నీ ఏమైపోతున్నాయా అనుకున్నా…అవన్నీ, యూపి, ఎంపీ లకు సరఫరా అవుతున్నాయన్న మాట.

  ఐనా ప్రేమ జంటలకు తుపాకులేమిటండీ…తుపాకీలు అంత సులువుగా దొరుకుతాయా…?

 3. Uttaram… గారూ, ఫేస్ బుక్ లాంటివి నిజ జీవితానికి ప్రతిబింబాలే గానీ అవి నిజ జీవితం కాదు. వర్చువల్ జీవితం. వర్చువల్ లోకానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను గుర్తెరుగుతూ ఆయా వ్యక్తులు స్నేహాలు లాంటివి చేయాలి. లేనట్లయితే ఇదిగో, ఇలాంటి విపరీత పరిణామాలు తప్పవు.

  స్వేచ్ఛకీ ఫేస్ బుక్ కీ ముడి పెట్టుకుని బాధపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నిజ సమాజంలోని లేని స్వేచ్ఛ ఫేస్ బుక్ లో మాత్రం ఎక్కడినుండి వస్తుంది. ఫేస్ బుక్ అనేది మౌలికంగా ఒక పెట్టుబడి-లాభాల కంపెనీ. ప్రజల సామాజిక సంబంధాలు ఆ కంపెనీకి ఖర్చులేని పెట్టుబడి. ఆయాచితంగా వచ్చిన పెట్టుబడి. అందులో కంపెనీకి లాభం తప్ప ఖర్చు లేదు.

  ఆ లాభం కోసం కంపెనీ ఎంతటి నీచానికైనా దిగజారుతుంది. మనుషుల మధ్య సంబంధాలను షేర్ మార్కెట్ విలువగా మార్చుకోగలిగిన కంపెనీకి మన జీవితాలనూ, భావోద్వేగాలనూ, జీవన సంబంధాలనూ అప్పజెప్పడం మన తెలివితక్కువతనం. టెక్నాలజీ మనిషి జీవితాన్ని మరింత సుఖమయం చేయాలి. ఫేస్ బుక్ కంపెనీ దానికి బదులుగా లాభం కోసం కష్టాలమయం చేస్తోంది. మొత్తం జీవితాల్ని ఫేస్ బుక్ లో ఆరబెట్టుకోవడం మానుకుని ఉపయోగపడినంతవరకు ఉపయోగపెట్టుకోవడమే వినియోగదారులు చేయాలి.

  వ్యక్తుల స్వేచ్ఛ స్వయంభవి కాదు. అది సమాజంతో ముడిపడి ఉంటుంది. అలా లేకపోతే వ్యక్తిగా బ్రతకడం కూడా దుర్లభం అవుతుంది.

 4. సమాజం ఒక భ్రాంతి. వాస్తవంగా ఉనికిలో ఉన్నది వ్యక్తులే. వారి మీద పెత్తనం చెలాయించే కొద్దిమంది వ్యక్తుల్నీ, వారి సంకుచిత భావజాలాల్నీ మనం సమాజమని పిలుస్తున్నాం. ఆర్గనైజ్ కాగలిగినవాళ్ళంతా సమాజమని పిలవబడతారు. అలా కాలేనివాళ్ళు వాళ్ళకి బలైపోతూంటారు. వ్యక్తికి మంచి చెయ్యాలన్నప్పుడు సమాజం ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించదు. అతనికి కీడు చేయడం కోసం మాత్రం అది హఠాత్తుగా ప్రత్యక్షమవుతుంది. ప్రతివ్యక్తీ తనవంటూ కొన్ని సొంత విలువలతో బ్రతకాలి. సమాజమంటూ ఏమీ లేదు గనక సామాజిక విలువలు కూడా ఒక భ్రాంతి. అంతిమంగా వ్యక్తే ప్రధానం.

 5. మన మధ్య జరుగుతున్న ఈ చర్చే సమాజం ఉనికికి ఒక సాక్ష్యం. భ్రాంతి అంటే లేకపోయినా ఉన్నట్లు కనిపించడం. వ్యక్తి, ఆ వ్యక్తికి కుటుంబం, ఆ కుటుంబానికి తోడుగా మరిన్ని కుటుంబాలు, ఊళ్లు, పట్టణాలు, నగరాలు, పల్లె జీవనం, నగర జీవనం…. ఇవన్నీ కళ్లెదుట కనిపిస్తుండగా భ్రాంతి ఎలా అవుతుంది?

  భ్రాంతి భాష స్వాములకు నప్పుతుందేమో గానీ టెక్నాలజీని వాడుకుని మాట్లాడుకుంటున్న మనకి అస్సలు నప్పదు ఉత్తర…. గారూ.

  ఇంతకీ మీ పేరుకి అర్ధం ఏమిటి?

 6. ఆర్యా ! మీరు ఉదాహరించిన కుటుంబాలూ, ఊళ్ళూ అన్నీ వ్యక్తుల సమూహాలు. మెదడూ, జీర్ణకోశమూ గల వ్యక్తుల మొత్తాలు అవి. సమాజానికి తనదంటూ మెదడేమీ లేదు. తనవంటూ అవసరాలేమీ లేవు. తనవంటూ ఆలోచనలేమీ లేవు. వ్యక్తుల అవసరాలే దాని అవసరాలు. వ్యక్తుల ఆలోచనలే దాని ఆలోచనలు. అందుచేత దానికంటూ ఒక వ్యక్తిత్వమేమీ లేదు. వ్యక్తి సమాజం కంటే తెలివైనవాడు. అందువల్ల కొద్దిమంది వ్యక్తులే సమాజాన్ని మార్చగలిగారు. సమాజం ఎంత పెద్దదైనా దానికి వ్యక్తుల్ని మార్చే శక్తి లేదు. ఎందుకంటే దాని ఉనికే ఒక భ్రమ కనుక. సమాజం అనేది ఉంటే గింటే ఆచరణాత్మకంగా అది మన సన్నిహితుల సమూహమే. కనుక ఎవరి సమాజం వారికుంది. అందరికీ వర్తించే సమాజం మాత్రం ఎక్కడా లేదు. కనుక అందరికీ వర్తించే సామాజిక విలువలు కూడా ఎక్కడా లేవు. మన సన్నిహితుల్ని మనం ఒప్పించగలిగితే సమాజాన్ని ఒప్పించినట్లే.

  BTW ఇవి రెండు పుస్తకాల పేర్లు.

 7. Uttaramnayam గారు చెప్పేది కంఫ్యూజింగ్‌గా ఉంది. మనిషి పుట్టినప్పుడు అతనికి ఏమీ తెలియదు. మూఢనమ్మకాలైనా, అభివృద్ధికర భావాలైనా అతను సమాజాన్ని చూసే నేర్చుకుంటాడు.
  http://content.janavijayam.in/2014/04/blog-post_2.html

 8. ఉత్తరం నయం గారు మీరు చెబుతుంది….కొంచెం గందరగోళంగా ఉంది.

  @ కుటుంబాలూ, ఊళ్ళూ అన్నీ వ్యక్తుల సమూహాలు. మెదడూ, జీర్ణకోశమూ గల వ్యక్తుల మొత్తాలు అవి.

  – దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనషులోయ్..అని గురజాడ ఎన్నడో చాటి చెప్పారు కదా. సమాజం అన్నా, దేశం అన్నా మనుషులే కావచ్చు, కానీ ఏ ఒక్క మనిషో….లేదా ఏ ఒక్క కుటుంబమో లేదా…, కొంతమంది వ్యక్తులో కాదు. కొన్నికోట్లమందిని కలిపి ఒక దేశంగా చెప్పుకుంటాం. వాళ్లందరినీ కలిపి ఉంచేవి ఏమిటి…వాళ్ల సామూహిక అవసరాలు, భావజాలాలే కదా.
  సమాజం అంటే గిరి గీసినట్లు ఇక్కడికే అని ఉండదు కదా. సముద్రంలో నీళ్ల లాగా మనకు ఎంత చేతనైతే అంత చేతుల్లోకి తీసుకుని ఇదే సమాజం అనుకోలేం, మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే వ్యక్తులే మన సమాజం అనుకోలేం. మనమెన్నడూ చూడని వ్యక్తులు, మనకు సంబంధం లేని వ్యక్తులు కూడా మనల్ని ప్రభావితం చేస్తారు.

  –అందరికీ వర్తించే సామాజిక విలువలేమీ లేవా..? మీ దృష్టిలో సామాజిక విలువలంటే…? ఉదాహరణకు మహిళలల్ని గౌరవించాలి అనేది ఒక సామాజిక విలువ…. సత్యం పలకాలి. హింస చేయరాదు…..ఇలాంటివి అనేక విలువలున్నాయి కదా. వీటిని ప్రపంచంలో ఏ సమాజమైనా కాదంటుందా..? కాబట్టి మనకు కనపడకున్నా సమాజం అనేది ఒకటుంది. అది మనకు తెలియకుండానే మనల్ని ప్రభావితం చేస్తుంది.

  @ కొద్ది మంది వ్యక్తులే సమాజాన్ని ప్రభావితం చేస్తారు.
  మీరు అసలు సమాజమే లేదన్నారు. మళ్లీ కొద్దిమందే మారుస్తారంటున్నారు. వాళ్లు మార్చేది ఏ సమాజాన్ని…? పోనీ ఏదో ఒక సమాజం ఐతే ఉంది కదా

 9. Uttaramnayam Swastyayanam గారితో ఏకీభవిస్తున్నాను. వ్యక్తులు సమాజానికి మూలస్థంభాలు. సమాజమంటే మనుషులమీద అజమాయిషీచేసి, వాణ్ణి సంతోషానికి దూరంచేసి శాడిజపు ఆనందాన్ని (schadenfreude) పొందడానికి ఉత్సాహంచూపించే ఆర్గనైజ్‌డ్ మంద. ఒకడు తిండిలేక అల్లాడుతున్నప్పుడు ఏ’సమాజమూ’ దగ్గరికి చేరదీయదు. అదే వ్యక్తి కష్టపడి పైకొస్తేమాత్రం వాడి విజయంలో వాటాలు పంచుకోవడానికి ఈసోకాల్డు సమాజం (అనగా ఆపేరుతో పెత్తనం చలాయించే పనిదొంగలు ముందుకొస్తారు) ముందుకొస్తుంది. ఈ ‘సమాజం’ కొద్ది సోమరిపోతుల, విలువల వరుస తల్లక్రిందులైన ఛాందసుల, ‘సమాజం’నుండి ఎప్పుడూ తీసుకోవడమేగానీ, దానికి ఏవిధమైన చేర్పాటునూ చేయని కొద్దిబుధ్ధుల పెద్దల గుంపు.

 10. మీరు అసలు సమాజమే లేదన్నారు. మళ్లీ కొద్దిమందే మారుస్తారంటున్నారు.
  చందూ తులసి మీరు పదాలా గారడిలో పడి భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారేమో! ఆ కొద్ది మంది పని గట్టుకొని మేధావుల్లా సమాజం మారుస్తామని పోరు,అటువంటి వారిని చూసినపుడు మనలోనే మార్పు వస్తుంది. ఆ మార్పు ముందు నీ నుంచి మొదలై, కుటుంబం, మిత్రులు ఎంతో కొంత ప్రభావితం అవుతారు. అదలా చైన్ రియాక్షన్ మాదిరి గా సమాజం మీద పని చేస్తుంది.

  మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ వెబ్ సైట్లో “మైండ్ ఇస్ మిత్” అనే పుస్తకం చదవండి. యు జి కృష్ణమూర్తి ని పరిచయం చేయటం చాలా కష్టం. గుడిపాటి వెంకట చలం బంధువు. ఆయన్ని చాలామంది శాస్రవేత్తలు,రచయితలు,హింది సినేమా రంగం వారు, గవర్నర్లు కలుసుకొన్నారు. చదివే వారికి చిన్న హెచ్చరిక. ఆయన భావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆయన మంత్రి నుంచి సామాన్య మనిషి వరకు ఒకటేగా చూసేవారు.

  http://www.well.com/~jct/

  U. G. Krishnamurti – You are a computer

 11. Uttaramnayam గారు సమాజాన్నీ, మనిషినీ వేరు చేసే అర్థాలు వచ్చే వాక్యాలని ఉపయోగించారు. Human beings are guided by self-interest అని ఆదం స్మిత్ చెప్పిన మాట నిజమే. నువ్వు నీ అవసరం కోసం రైలు ప్రయాణం చేస్తావు కానీ రైల్వే కంపెనీవాడు బతుకుతాడని రైలు ప్రయాణం చెయ్యవు. కానీ నువ్వు ticket లేకుండా ప్రయాణిస్తే నిన్ను ఆదర్శంగా తీసుకుని మరి కొంత మంది అలాగే చేస్తారు. అప్పుడు రైల్వే కంపెనీవాడికి నష్టం వచ్చి తన రైల్వే లైన్ మూసేస్తాడు. సమాజం నడవాలంటే నియమాలు పాటించాల్సిందే.

  ఇందియా కంటే అమెరికా సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ 20 ఏళ్ళ యువకుడు 50 ఏళ్ళ మధ్య వయస్కురాలిని పెళ్ళి చేసుకున్నా దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. జబల్‌పుర్ ఘటన విషయంలో జరిగిన విచిత్రమేమిటంటే ఆ యువకుడు సెక్స్ చాటింగ్ చేసేటప్పుడు ఆ స్త్రీ వయసు తెలుసుకోవాలనుకోలేదు, లేచిపోయేటప్పుడు మాత్రం అతనికి వయసు గుర్తొచ్చింది. మన దేశంలో మగవాళ్ళ మనస్తత్వం మారలేదనడానికి ఇదొక ఉదాహరణ.

 12. ఆ స్త్రీ వయసు తెలుసుకోవాలనుకోలేదు, లేచిపోయేటప్పుడు మాత్రం …మగవాళ్ళ మనస్తత్వం మారలేదనడానికి ఇదొక ఉదాహరణ.

  చాటింగ్ లో నిజాలు చెపుతారాని ఎవరైనా నమ్ముతారా? చాటింగ్ వేరు వేరు డేటింగ్ వేరు. చాటింగ్ ఊహాలోకం. అక్కడ అబద్దాలు చెపితే ఎవ్వరు నిలదీయరు. డేటింగ్ వాస్తవ లోకం.ప్రేమించుకునే వారు ఏ పార్క్ లో ఏ రోజు, ఎన్నిగంటలకు కలసుకోవాలి మొదలైన విషయాలలో అనుకొన్నత తరువాత మాట మీద నిలబడితేనే ఆ ప్రేమ వ్యవహరం ముందుకు సాగుతుంది. లేకపొతే ఇరువైపుల వారికి అపనమ్మకం పెరిగి గుడ్ బై చెప్పేస్తారు. మగవాళ్ల మనస్తత్వం మారలేదు అని అంట్టున్నావు. ఎవరైనా 20 ఏళ్ల వాడు, 40 సం|| పిల్లల తల్లిని ప్రేమించి పేళ్లి చేసుకోవాలని ఊహించుకొంటాడా? ఈ ప్రేమ వ్యవహారంలో ఆమే చాటింగ్ లో వాళ్లు మాట్లాడుకొన్నదానికి వాళ్లు కలసి నప్పుడు జరిగిన వ్యవహారానికి అసలికి పొతన ఉండిఉండదు. అందువలన అతను అంత వయోలెంట్ గా రియాక్ట్ అయ్యాడు.

 13. అబద్దం చెప్పినంతమాత్రాన మర్దర్ చెయ్యాలా? Cougar relations అమెరికా లాంటి దేశాలలో సాధారణమే కానీ ఇందియాలో మాత్రం అసాధారణం. అంతమాత్రాన cougar relation కోరుకున్న స్త్రీని మర్దర్ చెయ్యక్కరలేదు.

 14. విశేషజ్ఞ గారు,

  మీ వాదం ఎట్లా ఉన్నదంటే విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లుగా ఉంది. వ్యక్తుల వల్ల సమాజం వచ్చిందా లేక సమాజం వల్ల వ్యక్తి ఉన్నాడా? ఈ సమస్యకు సమాధానం కావాలంటే ఇక్కడ ‘హేగలియన్’ ఇచ్చిన లింక్ సమాచారం చెపుతుంది. మనం పెద్దగా తత్వ శాస్త్రాలలోకి పోనక్కరలేదు. చిన్న ఉదా: సమాజానికి వ్యక్తి దూరంగ ఉండలేడు. అలా కొంతమంది కొన్ని ఎక్స్‌పర్‌మెంట్లు కూడా చేసి చూశారు. ఈ మధ్య టి.వి. 9 లో చూశాం. ఒక పిల్లవాడ్ని పుట్టగానే తోడేళ్ల తోటి వదిలిపొతే అతను ఆ తోడేళ్ల లాగానే నడవటం, తినటం నేర్చు కున్నాడు. మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఇద్దరు బెంగాల్ అమ్మాయిలు పసిబిడ్డలుగా తప్పిపోగా వాళ్లు జంతువులలాగానే బ్రతకడం అరవడం నేర్చుకున్నారు. భాష లేదు. మాటలు రావు. మనిషి, వ్యక్తి గా ఎప్పుడూ ఉండడు. పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్కటి సమాజం నుండే నేర్చుకుంటాడు. ఒక భాష, మాట్లాడటం, నాగరికత, సంస్కౄతి అన్నీ సమాజం నుండే వస్తాయి. సమాజం వినా వ్యక్తి లేడు. వ్యక్తి ముందా సమాజం ముందా అనేది పరిష్కారం ఇవ్వబడిన ఒక తాత్విక సమస్య. మీరు ప్రపంచ తత్వశాస్త్రాల పరిచయం చదవాలంటే నండూరి రాంమొహన్ గారి విశ్వదర్శనం చదవండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s