నౌక ఖాళీ చేయమని ఆదేశాలిస్తే పిల్లలు అంత చలిలో చల్లటి నీళ్ళకు తట్టుకోలేక చనిపోతారని భావించానని దక్షిణ కొరియాలో ప్రమాదానికి గురయిన ‘సెవొల్’ కెప్టెన్ కోర్టుకు తెలిపాడు. అందుకే వారిని వెంటనే పడవ ఖాళీ చేయాలని ఆదేశాలివ్వడానికి తటపటాయించానని కెప్టెన్ లీ జూన్-సియోక్ చెప్పారు. పడవ ఖాళీ చేయాలని కోరడంలో 40 ని.లు ఆలస్యం కావడంతో ఎక్కువమంది తప్పించుకోలేక నౌకలోనే చిక్కుకుపోయారు. 32 మంది మరణాలను దక్షిణ కొరియా ప్రభుత్వం ధృవీకరించగా ఇంకా 273 మంది జాడ తెలియాల్సి ఉంది.
కెప్టెన్ లీ ని కొరియా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఆయన తన చర్యను సమర్ధించుకున్నారని బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్ తెలిపింది. సముద్ర ప్రయాణ చట్టాల ప్రకారం వివిధ నేరాలని ఆయనపై మోపారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఫెర్రీ పక్కకు ఒరిగిపోతుండగా వీరు ముగ్గురూ సముద్రంలోకి దూకేసారని, తమ విధులను నిర్వర్తించలేదని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
ఇలా ఉండగా పడవను వెలుపలికి తీసే ప్రయత్నాలు ఇంకా మొదలు కాలేదు. ఫెర్రీ లోపలికి ప్రవేశించడానికి డైవర్లు చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావడం లేదు. సముద్రంలో బలమైన ప్రవాహాలు కొనసాగుతున్నాయని వాటికి ఎదురీదుతూ పడవ అడుగుకు చేరడం కష్టంగా ఉందని అధికారులు చెప్పారు. డైవర్లు కెమెరాలు ధరించి నీటిలోకి దూకడంతో ఆ కెమెరాల దృశ్యాన్ని టి.వీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు వీటిని సమీపంలోని ఒక ద్వీపంలో ఉన్న జీమ్నాజియమ్ లో కూర్చుని తిలకించారు.
అయితే పడవ లోపలకు ప్రవేశించడానికి డైవర్లకు ఎలాంటి మార్గము చిక్కలేదు. దానితో కిటికీల నుండే వారు లోపలికి చూడడానికి ప్రయత్నించారు. మూడు మృత దేహాలను తాము చూశామని వారు చెప్పారు. అయితే ఇంకా 273 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇప్పటికే మూడు రోజులు గడిచిపోవడంతో లోపల ఉన్నవారు బతికి బైటపడడానికి ఎలాంటి అవకాశము లేకుండా పోయింది. ఇప్పటివరకు 32 మంది మరణాలను ధృవీకరించగా వారందరూ నీటిలో తేలినవారే తప్ప ప్రయత్నించి వెలుపలికి తీసినవారు కాదు.
మిగిలిన మృత దేహాలను బైటికి తీయాలంటే పడవను తిరిగి వెల్లకిలా తిప్పడం తప్ప మరో మార్గం లేదు. ఆ ప్రయత్నాలు ఇంకా మొదలు కాలేదని పత్రికలు చెబుతున్నాయి. జాడ తెలియనివారి బంధువులు దుర్వార్తకు ఇప్పటికే సిద్ధం అయ్యారని పత్రికలు తెలిపాయి.
ఇదిలా ఉండగా విహార హాత్రలో ఉన్న విద్యార్ధుల పాఠశాల టీచర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పడవ ప్రమాదం నుండి బతికి బైటపడిన సదరు టీచర్ సమీపంలోని ద్వీపంలో ఉండగా ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డారు. పిల్లలందరూ చనిపోగా తాను ఒక్కడినే బతికి ఉండడం తనకు దుర్భరంగా ఉన్నదని, అందుకే ఈ చర్యకు లాల్పడుతున్నానని ఆయన ఆత్మహత్య లేఖ రాశారని పత్రికలు తెలిపాయి. “మృత దేహాలు ఇంకా లభించని విద్యార్ధుల కోసం నేను మళ్ళీ వచ్చే జన్మలో ఉపాధ్యాయుడిగా జన్మిస్తాను” అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
కాపాడాల్సిన బాధ్యత ఉన్న పడవ కెప్టెన్, సిబ్బంది దూకి తప్పించుకోగా, ఏ బాధ్యతా లేకపోయినా నైతిక బాధ్యతతో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం మానవ జీవితాల్లోని వైరుధ్య పరిస్ధితులకు, ఆ పరిస్ధితుల నుండే జనించే వైరుధ్య భావాలకు ఒక ప్రతీక!
Reblogged this on ugiridharaprasad.
నైతిక భాధ్యతతో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? మానసిక సంఘర్షణలో సెన్స్ కోల్పోయిప్రాణాలు తీసుకున్నడు!