కాశ్మీర్ వేర్పాటువాది జిలానీకి మోడి రాయబారం


Syed Ali Shah

జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయాలన్నది సంఘ్ పరివార్ చిరకాల డిమాండ్. సంఘ్ పరివార్ సంస్ధల్లోనూ, కేడర్ లోనూ హిందూత్వ హార్డ్ లైనర్ గా ప్రసిద్ధి చెందిన నరేంద్ర మోడి కాశ్మీరు వేర్పాటు వాదులతో అందునా హార్డ్ లైనర్ నేతలతో రాయబారం నడుపుతారని ఊహించగలమా? ఊహించలేం. కానీ మోడి ఆ పని చేశారని కాశ్మీరు వేర్పాటువాద నేతల్లో హార్డ్ లైనర్ గా పేరు పొందిన సయ్యద్ ఆలీ షా జిలానీ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది.

బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి తన వద్దకు ఇద్దరు రాయబారులను పంపారని జిలానీ ఈ రోజు పత్రికలకు వెల్లడించారు. మార్చి 22 తేదీన వారు తనను కలిశారని మోడీకి అనుకూలంగా ప్రకటన ఇవ్వాలని వారు కోరారని జిలానీ తెలిపారు. తాను ఆ రోజు చికిత్స నిమిత్తం ఢిల్లీలో ఉన్నానని తాను వారి ఆఫర్ ని తిరస్కరించానని జిలానీ వెల్లడి చేశారు. “ఆయన పార్టీ విధానం ఏమిటో మాకు తెలుసు. అందుకే నేను అంగీకరించలేదు” అని జిలానీ తెలిపారు. మూడు వారాల పాటు ఢిల్లీలో గడిపిన అనంతరం శ్రీనగర్ వెళ్ళిపోయిన జిలానీ అక్కడ విలేఖరులకు ఈ విషయం తెలిపారు.

నేను నరేంద్ర మోడీ వద్దకు వెళ్ళి కాశ్మీరు విషయంలో తగిన హామీ పొందాలని సదరు రాయబారులు తనను కోరారనీ, అలా చేస్తే ప్రధాని పదవి అధిష్టించిన అనంతరం కాశ్మీరు విషయంలో మెతక వైఖరి అవలంబిస్తామని ఆశ చూపారని జిలానీ తెలిపారు. మోడీని కలిసి “కాశ్మీరు సమస్య పరిష్కారానికి తగిన హామీ పొందాలని వారు నన్ను కోరారు” అని జిలానీ తెలిపారు.

ఇతర కాశ్మీరీ వేర్పాటువాద గ్రూపుల నాయకుల వద్దకు కూడా మోడి తన రాయబారులను పంపారని జిలానీ చెప్పడం విశేషం. “మోడి ప్రధాన మంత్రి అయ్యాక కాశ్మీరు విషయంలో ఆయన అనుసరించే విధానం మెతకగా (soft) ఉంటుందని కొందరు కాశ్మీరీ నేతలు ప్రకటించారు. మోడి ప్రధాన మంత్రి అవడం వల్ల కాశ్మీరుకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నామని మరికొందరు ప్రకటించారు. వారందరినీ కాశ్మీర్ లోనే మోడి రాయబారులు కలిశారు” అని జిలానీ వెల్లడించారు.

హమ్మ మోడీ! ఒకపక్క వేర్పాటువాదం పేరుతో కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను వ్యతిరేకిస్తూ, మరోపక్క వేర్పాటువాదులతోనే రాయబారాలా? జిలానీ చెప్పింది నిజమే అయితే, ఇది కాశ్మీర్ ప్రజలను మోసం చేయడం మాత్రమే కాదు. ఆయన పెద్ద హిందూత్వ వాది అని నమ్ముతున్న సంఘ్ పరివార్ కార్యకర్తలను మోసం చేయడం కూడా.

మోడరేట్ వేర్పాటువాద గ్రూపు నాయకుడిగా పేరు పొందిన మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మరియు జమాత్-ఎ-ఇస్లామి నేత మహమ్మద్ అబ్దుల్లా వని లు మోడీకి అనుకూలంగా చేసిన ప్రకటనలను జిలానీ గుర్తు చేస్తున్నారు. “కాశ్మీరు సమస్యకు సంబంధించి మోడీ పైన ఆశలు పెట్టుకున్నాం” అని మీర్వాయిజ్ ప్రకటించారు. మోడి అధికారంలోకి వస్తే కాశ్మీర్ పట్ల మెతకవైఖరి అవలంబిస్తారన్న ఆశలు తమకు ఉన్నాయని అబ్దుల్లా వని ప్రకటించారు. మోడి రాయబారులు వారిని కలిసిన తర్వాతనే వారు అలా ప్రకటించారని జిలానీ వెల్లడి ద్వారా అర్ధం అవుతోంది.

జిలానీ షా కాశ్మీర్ లో జరిగే ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. “ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలకు హక్కు ఉన్నట్లే ఆ ఎన్నికలను బహిష్కరించే హక్కు కూడా వారికి ఉంటుంది” అని జిలానీ చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. ఎన్నికల సందర్భంగా కాశ్మీర్ లో సైన్యం ఉక్కుపాదం మోపుతోందని, ప్రజలను వేధిస్తున్నదని జిలానీ ఆరోపించారు. ఏప్రిల్ 24, ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో కాశ్మీర్ లోయలోని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా ఆ రోజుల్లోనే రోజంతా కర్ఫ్యూ విధించారని జిలానీ తెలిపారు. కాశ్మీర్ వేర్పాటువాద నాయకులను, యువకులను నిర్బంధం లోకి తీసుకున్నారని తెలిపారు. వారిని విడుదల చేయాలని కోరుతూ ఆయన సోమవారం బంద్ కి పిలుపు ఇచ్చారు.

ఎన్నికల బహిష్కరణ కోరుతూ ప్రచారం చేస్తున్న తమ కార్యకర్తలను అరెస్టు చేసి నిర్బంధించారని తమ గొంతు నొక్కి వేస్తున్నారని జిలానీ ఆరోపించారు. “కాశ్మీర్ లో ఎన్నికల వ్యవహారాలని నిజంగా నిర్వహిస్తున్నది సైన్యమే. పుల్వామా జిల్లాలోని సైనిక శిబిరాలు ప్రజలను వోటింగ్ లో పాల్గొనాలంటూ భయపెడుతున్నారని మాకు సమాచారం ఉంది. అక్కడ అనేకమంది యువకులను ఈ విషయంలో అరెస్టు చేశారు” అని జిలానీ తెలిపారు. కాశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు కల్పించేంతవరకు ఉపఖండంలో శాంతి దుర్లభం అని జిలానీ స్పష్టం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడుల నుండి వివిధ సినిమా నటులు వరుస పెట్టి గుజరాత్ పయనమై వెళ్ళడం వెనుక ఎవరు కారణమో జిలానీ వెల్లడి చేసిన అంశం తెలియజేస్తోంది. తెలుగు సినీ నటుడు నాగార్జున స్వయంగా గుజరాత్ వెళ్ళి మోడిని కలిసి గుజరాత్ అభివృద్ధి గురించి ప్రశంసలు జారీ చేశారు. మోడి హైదరాబాద్ వచ్చినపుడు సైతం బాలకృష్ణతో సహా అనేకమంది సినిమా నటులు ఆయన్ని కలిసి ప్రసన్నం చేసుకున్నారు. ఇక రజనీ కాంత్ పెద్ద నటుడు కాబట్టి మోడీయే స్వయంగా వచ్చి కలవాల్సి వచ్చింది. సినిమా వాళ్ళు సినిమా పని చేసుకోకుండా జనాన్ని వెర్రి వాళ్ళని చేసేందుకు ప్రయత్నించడం ఖండనార్హం. కాగా నరేంద్ర మోడి తమ ప్రకటిత సిద్ధాంతాలకు, విధానాలకు విరుద్ధంగా తెరవెనుక వ్యవహరించడం సంఘ్ పరివార్ కార్యకర్తలకు సరికొత్త సమాచారం ఇస్తోంది. ఆ సమాచారాన్ని గ్రహించే పరిస్ధితిలో కార్యకర్తలు ఉన్నారా లేదా అన్నదే అనుమానం.

3 thoughts on “కాశ్మీర్ వేర్పాటువాది జిలానీకి మోడి రాయబారం

 1. సినీ నటులు మోడిని కలవడం వెనక అందరికీ కలిపి ఒకటే కారణం ఉండదు. నాగార్జునకు తన వ్యాపారాలు ఇతర ప్రయోజనాలు కారణమై ఉంటాయి. రాజశేఖర్-జీవితలు కలవడం వెనక తమకు ఏ ఎంపీయో, ఎమ్మెల్యే సీటో దక్కదా అన్న ఆశ, బాలకృష్ణ కలవడం వెనక తెలుగుదేశంతో పొత్తు ఇలా ఒక్కో నటునికి ఒక్కో కారణం ఉంటుంది. ఐతే ఎక్కువ మంది అటే ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే….నాకు తెలిసి సినిమా నటులకు సాధారణ జనంతో పరిచయాలు కానీ, కింది స్థాయి రాజకీయ పరిస్థితులు తెలిసే అవకాశం చాలా తక్కువ. మీడియాలో దేశమంతటా మోడి గాలి వీస్తోంది కాబట్టి….మనం కూడా ఆయనకు మద్దతు తెలిపితే భవిష్యత్ లో ఏదన్నా ఉపయోగపడకపోదు అన్న ఆశ. ఐతే ఇది వాళ్లకు వ్యక్తిగతమైన అంశం. అది కాక ఇక మోడి నుంచి చూస్తే మోడి అండ్ కో కు బలమైన ప్రచార బృందం ఉంది. అది గత సంవత్సర కాలంగా మీడియాలో మోడి గురించి విస్తృతంగా ప్రచారమయ్యేలా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ఖర్చు వ్యాపార వర్గాల వారు భరిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. మీడియాకు కావాల్సింది డబ్బే కాబట్టి…డబ్బులిస్తే ఎవరి గురించైనా ప్రచారం చేస్తుంది. అలా మోడి బృందం వివిధ రాష్ట్రాల్లోని సినీ నటులను కూడా కలుస్తూ…మోడికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వాళ్లు మద్దతు తెలిపితే తిరిగి మీడియాలో భారీ ఎత్తున కవరయ్యేలా చూసుకుంటున్నారు. ఇలా మోడి గాలి వెనక చాలా రహస్యాలున్నాయి.

  ఐతే సినీనటులు ఫలానా వారికి ఓటు వెయ్యండి అని చెప్పినంత మాత్రాన ఓటర్లు ప్రభావితమవుతారా అనేది మరో అంశం. ప్రచార మాధ్యమాల ప్రభావం పెద్దగా లేని రోజుల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి నేతలు ఓటర్లకు కొన్ని భ్రమలు కల్పించి నెట్టుకొచ్చారు. అది ఒక్కసారికే పనికొచ్చింది. ఆ తర్వాత వాళ్లు కూడా పాలనా విధానాలనే నమ్ముకున్నారు.
  గతంలో 2004 లో చంద్రబాబు పాలన అద్భుతం.., ఆహా, ఓహో అంటూ ఇలాగే తెలుగు పరిశ్రమ మొత్తం కట్టకట్టుకుని ప్రచారం చేసినా, వైఎస్ గెలిచారు. టీవీ, ఇంటర్నెట్, సెల్ ఫోన్…ఇలా రకరకాల ప్రసార మాధ్యమాలు విస్తృతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సినీ నటుల ప్రభావం చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు.
  చివరగా ఇంకో పెద్ద జోక్ ఏమిటంటే…జనాలను ఫలానా పార్టీకే ఓటు వెయ్యండి అని చెప్పే సినిమా నటుల్లో తొంభై శాతం మంది అసలు ఓటే వెయ్యరు. ( పోలింగ్ బూత్ లో గంట సేపు క్యూ లో నిలబడడం నా వల్ల కాదు అని రాంగోపాల్ వర్మ బహిరంగంగానే ఒప్పుకున్నారు కదా)

  కాబట్టి వాళ్లు జనాన్ని వెర్రివాళ్లను చేయకుండా తమ పని తాము చేసుకోవడం ఉత్తమం.

 2. //చివరగా ఇంకో పెద్ద జోక్ ఏమిటంటే…జనాలను ఫలానా పార్టీకే ఓటు వెయ్యండి అని చెప్పే సినిమా నటుల్లో తొంభై శాతం మంది అసలు ఓటే వెయ్యరు//
  ఓటు వేయడం కాదు ఓటు వేపించడం లేదా ఓటు వేయకుండ చూడటం వారి పని. ఎవరి ఓటు వారు వెసుకో అక్కర్లేదు వేసే వాళ్లు వేస్తుంటారు. పట్టు పని పిడికెడు మంది కూడా లేని వారి గురించి మీరు మాట్లాడేది. మిగతా వారి గురించే ఇప్పుడు సమస్య. యువతని ఆకర్షించడానికే నాగార్జునులు, పవన్‌ కుమార్లు,రజనీ కాంతులు, విజయ్‌ లను బుక్‌ చేసుకొనేది- అదీ నయాన్నొ భయాన్నో లేక స్వచ్చందంగానో. సినీ హీరోలు ఒక రాజకీయ లాభి. వారు వద్దన్నా పక్కకు తొలగలేరు. ఈ లింకుల లాబిని ఎక్కడ తుంచెయ్యలేరు. అన్ని ప్రపంచ బ్యాంకుకో, కార్పోరెట్‌ శక్తులకో కట్టి పడేసినవి.అవి అంత ఈజీగా విడిపించుకోలేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s